వరద సాయం రూ.2 వేల కోట్లు ఇవ్వండి

by srinivas |
వరద సాయం రూ.2 వేల కోట్లు ఇవ్వండి
X

దిశ, ఏపీ బ్యూరో: పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలు, వరదలకు దెబ్బతిన్న రైతులను ఆదుకునేందుకు రూ.2 వేల కోట్ల సాయం అందించాలని రైతు సంఘాల నేతలు కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశాయి. మంగళవారం తాడేపల్లిగూడెం మండలం నందమూరు అక్విడెక్ట్​వద్ద రైతు సంఘ నేతలు కేంద్ర బృందాన్ని కలిశారు. ఎకరా వరి పంట నష్టపోయిన వారికి రూ.25 వేలు, ఉద్యాన పంటల రైతులకు రూ.50 చొప్పున సాయం చేయాలని విన్నవించారు. గోదావరి, ఎర్ర కాలువ, తమ్మిలేరు, గుండేరు, యనమదుర్రు, తాడిపూడి కాలువలకు గండ్లు పూడ్చడంతోపాటు వరద మళ్లింపునకు శాశ్వత చర్యలు తీసుకోవాలని సూచించారు.

వరి, పత్తి, కూరగాయలు, మిర్చి, అపరాలు, అరటి, ఇతర ఉద్యాన పంటలు, ఆక్వా చెరువులు దెబ్బతిని రైతులు కుదేలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన అన్ని పంటల రైతులు, కౌలు రైతులకు వెంటనే ఇన్ పుట్ సబ్సిడీ, బీమా పరిహారం అందించాలని కోరారు. పరిహారం చెల్లింపులో భూపేంద్ర సింగ్ హుడా కమిటీ సిఫార్సులను పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రాప్​లో కేవలం భూ యజమానుల పేర్లు మాత్రమే నమోదు చేసినందువల్ల వాస్తవంగా సాగు చేసిన కౌలుదారునికి పరిహారం అందే అవకాశాల్లేవని బృందం దృష్టికి తీసుకెళ్లారు. వాస్తవ సాగుదారులకు పరిహారం అందించాలని కోరారు. కేంద్ర బృందంతోపాటు జాయింట్ కలెక్టర్ కె.వెంకట రమణారెడ్డికి వినతి పత్రాలు సమర్పించారు.

Advertisement

Next Story

Most Viewed