- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ గ్రామాలకు శాపంగా మారిన అన్నారం ప్రాజెక్టు.. మూడేళ్లుగా మురిగిపోతున్న పంటలు
దిశ, కాటారం : టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అన్నారం ప్రాజెక్ట్ ఆ గ్రామాల పాలిట శాపంగా మారింది. కాటారం మహదేవ్పూర్ మండలంలోని సుమారు 10 గ్రామాల ప్రజలు పంటలు పండక పరిహారం అందక నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకుంటుందని ఎదురుచూసి వారి కళ్లు కాయలు కాస్తున్నాయి. జూన్ మాసం మొదలు కాగానే ఆ రైతులు తమకున్న భూముల్లో వరి పత్తి పంట సాగు చేయడం.. అది కాస్తా ఎదగడం.. ఆ తర్వాత సెప్టెంబర్, అక్టోబర్ మాసాలు రాగానే భారీవర్షాలు కురవడంతో ప్రాజెక్టుకు చెందిన బ్యాక్ వాటర్ పంట పొలాల్లోకి చేరడంతో ఆ పంటలు కాస్తా మురిగిపోతున్నాయి. గత మూడేళ్లుగా రైతులకు ఇదే పరిస్థితి కొనసాగుతోంది. తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయింది. మూడేళ్లుగా ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్న రైతులను పట్టించుకునేవారు లేరు.
అన్నారం ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌తో గంగారం, విలాసాగార్, దామరకుంట, లక్ష్మీపురం, గంగపురి, గుండ్రాతి పల్లి గ్రామాలకు చెందిన సుమారు 1,250 ఎకరాల భూములు ముంపునకు గురవుతున్నట్లు ప్రాథమిక అంచనా. భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులో నీరు బాగా చేరినపుడు వేసిన పంటలు నీట మునిగిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అధికారులు ప్రాజెక్టు నిర్మించే సమయంలో సరైన డిజైన్ చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ప్రతియేటా పంటలు ముంపునకు గురవుతూనే ఉన్నాయి. ఈ విషయమై రెవెన్యూ యంత్రాంగం చేత సర్వే చేయించి పరిహారం చెల్లించాల్సి ఉండగా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ప్రతియేటా రైతులు ఎకరానికి సుమారు 50 వేల రూపాయల వరకు నష్టపోతున్నారు.
గ్రామాలను సురక్షిత ప్రాంతానికి తరలించాలి..
ముంపునకు గురవుతున్న గ్రామాలను వేరే ప్రాంతాలకు తరలించి ఆ గ్రామాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని ఎన్నోసార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ గ్రామాల్లో మిగిలిన భూములను ప్రభుత్వం తీసుకుని నిర్మించిన ఇళ్లకు పరిహారం ఇచ్చుకుంటూ, గ్రామాలను వేరే ప్రాంతాలకు తరలించి ఇళ్ల స్థలాలు కేటాయించాలని విజ్ఞప్తి చేసినప్పటికీ చెవిటి వాని ముందు శంఖం ఊదినట్టు అయ్యింది. వ్యవసాయ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్న ఈ గ్రామాల రైతులు వర్షాకాలం ప్రారంభంలోనే పత్తి, వరితో పాటు వివిధ రకాల పంటలు వేస్తూనే ఉన్నారు. భారీ వర్షాలు కురిస్తే అన్నారం ప్రాజెక్టు వెనుక భాగంలో నేటికీ పంటలు మునిగిపోతున్నాయి.
గత మూడేళ్లుగా పంటలు నష్టపోతున్న రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేయడంతో పాటు కలెక్టర్, ఎమ్మెల్యేకు ఎన్నో విధాలుగా మొరపెట్టుకున్నప్పటికీ రైతుల గోడు అరణ్య రోదనగానే మిగిలిపోయింది. పంటలు మునిగినప్పుడు అధికారులు పర్యటించి సర్వే చేస్తాం, పరిహారం అందిస్తామని చెబుతున్న ఓదార్పు మాటలు కార్యరూపం దాల్చడం లేదు. ఈనెల మొదటి వారంలో కురిసిన భారీ వర్షాల మూలంగా బ్యాక్ వాటర్‌తో దెబ్బతిన్న పంటలు, ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలించిన మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య పరిశీలించారు. నష్టపోయిన పంటలు ముంపు ప్రాంతంపై పూర్తి స్థాయిలో సర్వే జరిపి బాధితులకు పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చినా.. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని రైతులు ఆరోపించారు.