డెంగీ రాకున్నా వచ్చిందని.. వృద్ధురాలికి రూ.10 వేలు బిల్లు

by Shyam |   ( Updated:2021-10-25 10:59:51.0  )
డెంగీ రాకున్నా వచ్చిందని.. వృద్ధురాలికి రూ.10 వేలు బిల్లు
X

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మున్సిపల్ కేంద్రంలో ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు డెంగీ వ్యాధి లేకపోయినా తప్పుడు పరీక్షలు చేసి రోగులను భయభ్రాంతులకు గురి చేసిన ఘటన చోటు చేసుకుంది. బాధితురాలి బంధువులు అనుమానం వచ్చి మరో ప్రైవేటు ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించగా డెంగీ నెగిటివ్‌గా రావడంతో సోమవారం తప్పుడు పరీక్షలు చేసిన అచ్చంపేట పట్టణంలోని సీన్స్ ప్రవేటు ఆస్పత్రి ముందు రోగి బంధువులు ఆందోళన చేపట్టారు.

ఏం జరిగిందంటే..

అచ్చంపేట మండల పరిధిలోని ఉప్పర పల్లి గ్రామానికి చెందిన గంగమ్మ జ్వరంతో బాధపడుతున్నది. ఈ సందర్భంగా ఆమె బంధువులు అచ్చంపేట పట్టణంలోని ప్రైవేటు వైద్య ఆస్పత్రిలో డాక్టర్ మూడవ బిక్కు నాయక్‌కు ఆదివారం చూపించామని అల్లుడు విశ్వేశ్వర, కొడుకు తెలిపారు. డాక్టర్ రక్త పరీక్షల అనంతరం డెంగీ వ్యాధి సోకిందని, పరిస్థితి విషమంగా ఉందని, రోజుకు సుమారు 10 నుంచి రూ.15 వేలు ఖర్చవుతుందని, లేనియెడల వెంటనే హైదరాబాద్‌కు తరలించి వైద్య సేవలు అందించాలని డాక్టర్ సూచించాడు.

అనుమానంతో మరోచోట పరీక్షలు…

సీన్స్ ఆస్పత్రిలో గంగమ్మకు డెంగ్యూ వ్యాధి అని తేలింది. అనుమానం వచ్చిన బంధువులు పట్టణంలోని వేరే ఆస్పత్రిలో పరీక్షలు చేయించగా అందులో నెగిటివ్‌లో వచ్చింది. దీంతో సోమవారం బాధితురాలి బంధువులు ఆస్పత్రి వద్దకు వచ్చి తప్పుడు నివేదికలతో ప్రజలను భయభ్రాంతులకు చేయడం వైద్యులకు తగునా అని ప్రశ్నించారు. తప్పుడు రిపోర్టులు ఇచ్చి వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గంగమ్మకు పరీక్షలు చేసి రూ.10 వేల ఫీజు తీసుకున్నారని, రూ. 150 రూపాయలు తక్కువ ఉన్నాయని చెప్పిన అక్కడి వైద్యులు ససేమిరా అన్నారని బాధితులు వాపోయారు. వ్యాధుల పేరు చెప్పి వేలకు వేలు ఫీజులు దండుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

కఠిన చర్యలు తీసుకోవాలి..

మోసపూరిత పరీక్షలు చేస్తూ వేలకు వేలు ఫీజులు దండుకునే ప్రైవేటు వైద్య కేంద్రాలపై అధికార యంత్రాంగం కేసులు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సీన్స్ ఆస్పత్రిని సీజ్ చేసి, డాక్టర్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని బాధితురాలి బంధువులు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకొని ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు డాక్టర్ బి. కులాలు పై కేసు నమోదు చేశామని అచ్చంపేట పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story