పులివెందులలో మళ్లీ ఫ్యాక్షన్ గొడవలు.. ఇద్దరు మృతి

by srinivas |   ( Updated:2021-06-15 00:13:48.0  )
Two killed
X

దిశ, వెబ్‌డెస్క్ : కడప జిల్లాలో మళ్లీ పగలు, ప్రతికారాలు చెలరేగాయి. పాతకక్షలతో కత్తులు, తుపాకీతో దాడులు చేసుకుని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మంగళవారం ఉదయం పులివెందుల మండలంలో జరిగిందీ ఘటన. మృతులు ఇద్దరు కూడా అధికార పార్టీకి చెందిన వారే కావడం గమనార్హం.

పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లికి చెందిన పార్థసారధి రెడ్డి (48), ప్రసాద్ రెడ్డి ( 62 ) ఇరువురు బంధువులు. వీరి కుటుంబాల మధ్య గత కొన్నాళ్లుగా పాత కక్షలు ఉన్నాయి. ఆస్తి తగాదాలతో పలుమార్లు పంచాయితీలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం పార్థసారధి రెడ్డి కత్తి తీసుకుని ప్రసాద్ రెడ్డి ఇంటిపైకి వెళ్లి దాడి చేయబోయాడు. దీంతో తనను చంపుతాడని ఆందోళన చెందిన ప్రసాద్ రెడ్డి తన దగ్గర ఉన్న లైసెన్స్ తుపాకీతో పార్థసారధి రెడ్డిపై కాల్పులు జరిపాడు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు.

పార్థసారధి రెడ్డి రక్తపు మడుగులో పడి మృతిచెందగానే తీవ్రభయాందోళన చెందిన ప్రసాద్ రెడ్డి అదే తుపాకీతో తనకుతాను కాల్చకుని ఆత్మహత్య చేసుకున్నాడు. క్షణికావేశంలో ఇద్దరు చేసిన పనికి రెండు కుటుంబాలు విషాదంలో మునిగాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గ్రామంలో శాంతి భద్రతలు చేయిదాటకుండా పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేశారు.

Advertisement

Next Story