కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడింది : మాజీ ఎంపీ వివేక్

by Sridhar Babu |
Vivek Venkataswamy
X

దిశ, హుజురాబాద్: తెలంగాణ బీజేపీ కోర్ కమిటీ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ముఖ్యమంత్రి కుటుంబంపై సంచలన ఆరోపణలు చేశారు. శుక్రవారం మాజీ మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా వివేక్ మీడియాతో మాట్లాడుతూ.. హుజూరాబాద్ నియోజకవర్గంలో తిరుగుతూ కొందరు ముఖ్యమంత్రి చెంచాగాళ్లు హామీలు ఇస్తుంటే నవ్వొస్తోందని ఎద్దేవా చేశారు. నియోజకవర్గాన్ని ఈటల రాజేందర్ ఎంతో అభివృద్ధి చేశారని, హుజురాబాద్ నుంచి పరకాల వరకు ఫోర్ లైన్ రోడ్డు, ఎస్సీ, బీసీ హాస్టళ్లు, కాలేజీలు ఈటల తీసుకొచ్చారని అన్నారు. కొందరు ఇతర ప్రాంత ఎమ్మెల్యేలు ఇక్కడ అభివృద్ధి జరగలేదని చెబుతున్నారు.. వాళ్ల నియోజకవర్గంలో ఇలాంటి అభివృద్ధి జరిగిందా? అని ప్రశ్నించారు.

విమర్శలు చేస్తున్నవాళ్లు ఆయా నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని, ఈటల చేసిన అభివృద్ధి ఎంత? మీరు చేసిందెంత అని ప్రజల ముందు ఉంచాలని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మోసగాడు అని విమర్శించారు. టీఆర్ఎస్ గెలిస్తే ముఖ్యమంత్రి చేస్తా అని ఒకసారి మోసం చేసింది చాలక, ఇప్పుడు దళిత ఎంపవర్‌మెంట్ అంటూ మరో మోసానికి పూనుకున్నాడని వెల్లడించారు. టీఆర్ఎస్‌లో ఉన్న బాల్కసుమన్, కొప్పుల ఈశ్వర్, రాజయ్య, కడియం శ్రీహరి లాంటివాళ్లు ఉండగా ముఖ్యమంత్రిని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.

Advertisement

Next Story