సీఎం కేసీఆర్ టూర్‌కు అంతా రెడీ..

by Sridhar Babu |   ( Updated:2021-08-01 22:12:09.0  )
CM KCR Haliya sabha
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మరికొద్ది గంటల్లో పర్యటించనున్నారు. సాగర్ ఉప ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఈరోజు నియోజకవర్గంలో పర్యటించి అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి సమీక్ష చేయనున్నారు. ఈ మేరకు నియోజకవర్గ కేంద్రమైన హాలియలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రగతి సమీక్ష సభను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి నియోజకవర్గంలోని 110 గ్రామాలకు చెందిన వార్డు మెంబర్లు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపాలిటీల కౌన్సిలర్లు, చైర్మన్లు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలను ఆహ్వానించారు. వారందరికి ప్రత్యేకంగా పాస్‌లను జారీ చేశారు. సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌ను భారీ మెజారిటీతో గెలిపించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆరే హామీల అమలుకు నియోజకవర్గానికి వస్తుండటంతో నియోజకవర్గ వ్యాప్తంగా సందడి నెలకొంది.

తమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఘనంగా స్వాగతం పలికేందుకు సాగర్ నియోజకవర్గ ప్రజలు హాలియకు చేరుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్ కు ఇరు వైపులా నిల్చొని పూలతో, డప్పు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందు కోసం అధికారులు సీఎం కాన్వాయ్ వెళ్లే రహదారికి ఇరు వైపులా ప్రజలు నిలుచొని ఉండేలా బారి ఖేడ్స్ ఏర్పాటు చేశారు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ ఉదయం 10.40 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో హాలియకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ప్రగతి సమీక్ష సమావేశానికి చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్నం 1 గంట వరకు అధికారులు, ప్రజాప్రతినిధులతో నియోజకవర్గ ముఖ్య నాయకులతో ప్రగతి సమీక్ష నిర్వహిస్తారు. ఇప్పటికే నియోజకవర్గంలో కొనసాగుతున్న నెల్లికల్ లిఫ్ట్, కుంకుడు చెట్టు తండా లిఫ్ట్‌ల పనుల పురోగతిపై ప్రత్యేకంగా చర్చిస్తారు.

ఇక వీటితో పాటు మిర్యాలగూడ, దేవరకొండ, హుజుర్నగర్, కోదాడ, సూర్యపేట, నకేరేకల్, తుంగతుర్తి నియోజకవర్గల్లో నిర్మిస్తున్న మరో 12 లిఫ్ట్‌ల పనులపై కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇరిగేషన్ అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకొని, నియోజకవర్గ అభివృద్ధిపై, లిఫ్ట్‌ల నిర్మాణలపై అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇక సాగర్ నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ భవన నిర్మాణం, చెక్ డ్యామ్‌లు, బ్రిడ్జిలు, నాగార్జున సాగర్ లోని ఇళ్ల స్థలాల కేటాయింపు, గ్రామాలకు మంజూరు చేసిన స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ వినియోగం, బుద్ధవనం ఇలా అన్ని అంశాలపై కూలంకషంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష చేయనున్నారు. అందుకు సంబంధించి జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్ రావు, ఎమ్మెల్యే భగత్ ఏర్పాట్లు దగ్గరుండి పూర్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed