- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
7 నోటిఫికేషన్లు ఇచ్చినా.. ఎవ్వరొస్తలేరు
“నర్సులు, డాక్టర్లు, లెక్చరర్లు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో ఏండ్ల తరబడి అర్ధాకలితో పని చేస్తున్నారు. గత కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాల దుష్ట సంప్రదాయం ఇది. దీన్ని రూపుమాపుతాం. పర్మినెంట్ ఉద్యోగాల కోసం ఔట్‌సోర్సింగ్ రిక్రూట్‌మెంట్ బంద్ చేస్తున్నాం. ఎమ్మెల్యేలు, అధికారులతో కమిటీ వేసి తేలుస్తాం” అని ముఖ్యమంత్రి కేసీఆర్ 2017 అక్టోబర్ 27న నిండు అసెంబ్లీలో హామీ ఇచ్చారు. కానీ నేడు వాస్తవంలో అందుకు పూర్తి భిన్నంగా జరుగుతోంది.
దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్టాఫ్‌నర్సుల పోస్టులేవీ భర్తీ కాలేదు. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న నర్సుల క్రమబద్ధీకరణా జరగలేదు. రాష్ట్రంలో ఏటా సుమారు పన్నెండు వేల మంది బీఎస్సీ, జనరల్ నర్సింగ్ విద్యార్థులు క్వాలిఫై అవుతున్నావారిని వైద్యారోగ్య శాఖలో భర్తీ చేయడం లేదు. తాజా ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రం మొత్తం మీద నర్సింగ్ సూపరింటెండెంట్ మొదలు స్టాఫ్‌నర్స్ వరకు 9,270 పోస్టులు ఉంటే అందులో సగానికి పైగా ఖాళీయే. ఆసుపత్రుల్లో బెడ్‌ల సంఖ్య పెరుగుతున్నా నర్సుల రిక్రూట్‌మెంట్ మాత్రం ఆగిపోయింది.
ఖాళీ పోస్టులే అధికం
రాష్ట్ర ప్రభుత్వం సమాచార హక్కు చట్టం కింద వెలువరించిన లెక్కల ప్రకారం తెలంగాణ వైద్య విధాన పరిషత్ విభాగం కింద ఉన్నఆసుపత్రుల్లో 2,271 స్టాఫ్‌నర్సు పోస్టులు మంజూరైతే కేవలం 1,113 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మిగిలిన 1,158 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ప్రజారోగ్య విభాగంలో 1,116 పోస్టులు ఉంటే 213 ఖాళీగా ఉన్నాయి. వైద్య విద్య విభాగంలో 3,614 పోస్టులకుగాను 1,703 ఖాళీగానే ఉన్నాయి. నర్సులు మాత్రమే కాకుండా డాక్టర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, పారా మెడికల్ సిబ్బంది పోస్టుల విషయంలోనూ భారీ స్థాయిలో ఖాళీలు ఉన్నాయి. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానంలో ఏండ్ల తరబడి నర్సులు పనిచేస్తున్నా వారి క్రమబద్ధీకరణ జరగలేదు. కొత్తగా నియామకాలూ లేవు.
కరోనా రిక్రూట్‌మెంట్‌లో కూడా..
ఇప్పుడు కరోనా పరిస్థితుల్లో నర్సుల కొరతను గుర్తించిన ప్రభుత్వం రిక్రూట్‌మెంట్‌పై దృష్టి పెట్టింది. ‘టిమ్స్’ ఆసుపత్రిలో స్టాఫ్‌నర్సుల రిక్రూట్‌మెంట్ కోసం ఇచ్చిన నోటిఫికేషన్‌లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ అని పేర్కొందే తప్ప రెగ్యులర్ అనే మాటే లేదు. దీంతో నర్సులు చేరడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. పైగా కరోనా పరిస్థితులు ఉన్నంతవరకే అనే షరతు పెట్టడంతో ఆ తర్వాత రోడ్డుమీద పడడం ఖాయమని నర్సులు చేరడానికి ఉత్సాహం చూపడంలేదు. అందుకే ఆశించిన స్థాయిలో రిక్రూట్‌మెంట్ జరగడంలేదు. దీంతో ప్రభుత్వం ఏకంగా ఏడు నోటిఫికేషన్లు ఇవ్వాల్సి వచ్చింది. కొన్ని జిల్లాల్లో వైద్య సిబ్బంది లేకపోవడంతో తాత్కాలికంగా ఒకటి రెండు రోజులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మూతపడాల్సి వచ్చింది. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్‌మెంట్‌లే ఉండవని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ ఇప్పుడు దానికి పూర్తి విరుద్ధమైన తీరులో నియామక ప్రక్రియను చేపడుతున్నారు. కరోనా వారియర్లుగా గుర్తించి వారిపై ప్రశంసలు కురిపిస్తున్న ప్రభుత్వం వారికి సరైన జీతాలు అందడం లేదు. గాంధీ ఆసుపత్రి మొదలు ఉస్మానియా వరకు నర్సులు తీవ్ర అసంతృప్తి నడుమ పనిచేస్తూ నిరసనలు, ధర్నాలు చేస్తుండడమే ఇందుకు నిదర్శనం. కరోనా పాజిటివ్ పేషెంట్లు పెరుగుతుండడంతో బెడ్‌ల సంఖ్యను ప్రభుత్వం పెంచుతున్నా దానికి తగిన నిష్పత్తిలో వైద్య సిబ్బందిని నియమించడంలో మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది.
ఏటా పన్నెండు వేల మంది క్వాలిఫై
రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఎనిమిది కాలేజ్ ఆఫ్ నర్సింగ్ (బీఎస్సీ నర్సింగ్ కోర్సు) విద్యాసంస్థల నుంచి ఏటా 320 మంది క్వాలిఫై అవుతున్నారు. ప్రైవేటు రంగంలోని 78 నర్సింగ్ కళాశాలల నుంచి 3,120 మంది క్వాలిఫై అవుతున్నారు. ఆరు ప్రభుత్వ నర్సింగ్ స్కూళ్ల నుంచి 270 మంది, ప్రైవేటు రంగంలోని 150 నర్సింగ్ స్కూళ్ల నుంచి 6,750 మంది, ఇతర విద్యాసంస్థల నుంచి మొత్తం పన్నెండు వేల మంది క్వాలిఫై అవుతున్నారు. కానీ ఆరేండ్లుగా రాష్ట్రంలో రెగ్యులర్ నియామకాలు లేకపోవడంతో ప్రైవేటు, కార్పొరేటు ఆసుపత్రుల్లో పనిచేస్తున్నారు. కరోనా కాలంలో తీవ్ర స్థాయిలో నర్సుల కొరత ఉన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయాలని నర్సింగ్ అభ్యర్థుల నుంచి వత్తిడి వస్తున్నా ప్రభుత్వం మాత్రం కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ వైపే దృష్టి పెడుతోంది.
కోర్టు వివాదంలో 3,311 పోస్టులు
రాష్ట్రంలో 3,311 నర్సు పోస్టుల భర్తీకి తెలంగాణ ఏర్పడిన తర్వాత 2017-18లో ఒక నోటిఫికేషన్ వెలువడింది. సుమారు 22 వేల మంది ఈ పరీక్షలు రాశారు. నియామకానికి అంతా సిద్ధమైన సమయంలో హైకోర్టుకు చేరింది. కాంట్రాక్టు నర్సులకు 30% వెయిటేజీ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం పెట్టిన నిబంధనను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. గతేడాది డిసెంబరు నాటికి విచారణ పూర్తయ్యి తీర్పు రిజర్వులో ఉంది. కానీ ఇప్పటి పరిస్థితులకు తగినట్లుగా ప్రభుత్వం చొరవ తీసుకుని పరిష్కారం చేయడంలో నిర్లక్ష్యంగా ఉందని ఆ పరీక్ష రాసిన విద్యార్థులు విమర్శిస్తున్నారు.