వర్క్ ఫ్రం హోం వద్దు.. ఆఫీసే ముద్దు..!

by Anukaran |   ( Updated:2021-03-22 10:59:38.0  )
వర్క్ ఫ్రం హోం వద్దు.. ఆఫీసే ముద్దు..!
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: కరోనాతో ఎంతో మంది ఉద్యోగులు వర్క్​ఫ్రం హోం ద్వారా విధులు నిర్వర్తిస్తున్నారు. కార్పొరేట్​ కంపెనీలు సైతం ఉద్యోగులకు వెసులు బాటు కల్పించాయి. ఏడాది కాలంగా ఇంటి నుంచే ఆఫీసు పనులను చక్కబెడుతున్నారు. మొదట్లో సంతోషంగా పనులు చేసిన ఉద్యోగులు క్రమంగా ఇబ్బంది పడుతున్నారు. వర్క్​ఫ్రం హోంలో పనిగంటలు పెరగడం, గంటల తరబడి కదలకుండా కంప్యూటర్​తో కుస్తీ పట్టడంతో మానసిక, ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. వెన్ను, మెడ నొప్పి, ఊబకాయంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. 29 శాతం మంది భోజన విరామం కూడా తీసుకోవడం లేదని, 47 శాతం మంది మానసిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, 36 శాతం మంది అధిక గంటలు పనిచేస్తున్నట్లు తేలింది.

ఇక తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతుండడం వర్క్ ఫ్రం హోం పనిచేసే ఉద్యోగులను ఆందోళనలకు గురి చేస్తోంది. కరోనా మొదలైన అనంతరం పలు సంస్థలు ఉద్యోగులను ఇంటి వద్ద నుంచే పని చేయాలని ఆదేశించాయి. దీంతో ఏడాది కాలంగా వారు ఇంటి వద్ద నుంచే విధులు నిర్వహిస్తున్నారు. ప్రారంభంలో వర్క్ ఫ్రం హోంతో ఉద్యోగులు సంతోషపడినా, ప్రస్తుతం అనేక మంది ఉద్యోగులు దీనిపై అనాసక్తి కనబరుస్తున్నారు. వర్క్ ఫ్రం హోం విధానంలో పని గంటలు పెరగడం, ఇంటి వాతావరణంలో పనిచేయలేక పోవడం, మునుపెన్నడూ లేనంతగా కంప్యూటర్ ముందు ఎక్కువ కాలం గడపడంతో ఉద్యోగుల్లో ఒత్తిడితోపాటు శారీరక సమస్యలు ఎదురవుతున్నాయి. సాధ్యమైనంత మేర విశ్రాంతి తీసుకోవడం, పనితో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలోనే ఇంటి నుంచి పనిచేసేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు.

మెడ, వెన్నుముక సమస్యలు..

గంటల సమయం ఒకే పొజిషన్​లో కూర్చోవడంతో వెన్నెముక సమస్యలు తలెత్తుతున్నాయి. పని మధ్య విరామం తీసుకోకపోవడంతో వెన్నెముక కండరాలు అలసిపోయి నొప్పికి దారితీస్తున్నాయని పలువురు వాపోతున్నారు. వర్క్ ఫ్రం హోం ఉద్యోగుల్లో 39.4 శాతం మంది మెడనొప్పి, 53.13 శాతం నడుం నొప్పి, 44.28 శాతం శారీరక సమస్యలతో బాధ పడుతున్నారు. దీనికి తోడు ఇంటి వద్ద నుంచి పనిచేసే సమయంలో కుటుంబ సభ్యులతో సమస్యలు ఏర్పడుతున్నాయి. పాఠశాలల్లో చదివే పిల్లలకు కూడా ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తుండడంతో వారు కూడా ఇంట్లో నుంచే తరగతులు వింటున్నారు. దీంతో పిల్లలు డిస్ట్రబ్ చేయడం పరిపాటిగా మారి పనిలో ఏకాగ్రత కోల్పోతున్నారు. అధికారుల నుంచి మందలింపులు పెరుగుతున్నాయని వాపోతున్నారు.

ఆరోగ్య సమస్యలు..

వర్క్ ఫ్రం హోం చేసే వారిలో గతంలో కార్యాలయంలో పనిచేసే సమయంలో కంటే ఇప్పుడు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. కార్యాలయానికి వెళ్లడానికి కిలో మీటర్ల దూరం ప్రయాణించడం, నడవడంతో పాటు సహచర ఉద్యోగులతో పని విషయంలో చర్చించడం వంటి అంశాలు వారిని రోజంతా ఉల్లాసంగా ఉంచి పని చురుకుగా చేసేందుకు దోహద పడేవి. వర్క్ ఫ్రం హోం సమయంలో ఇవన్నీ లోపించడంతో పనిపై ఏకాగ్రత కోల్పోతున్నారు. అంతేకాకుండా శారీరక వ్యాయామం లేకపోవడంతో ఊబకాయం బారిన పడుతున్నారు. వర్క్ ఫ్రం హోం సమయంలో కొన్ని కుటుంబాల్లో గొడవలు సైతం చోటు చేసుకుంటున్నాయి.

అంతేకాకుండా ఇంటికి వచ్చే బంధువులతోనూ సమస్యలు ఎదురవుతున్నాయి. అధికారుల ఒత్తిడితో బంధువులతో మాట్లాడకపోతే బంధుత్వాలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఆఫీస్​కు వెళ్లే సమయంలో బంధువులు వచ్చినా ఇటువంటి ఇబ్బందులు ఉండేవి కావని వర్క్ ఫ్రం హోం ఉద్యోగులు తమ మనసులోని మాటను బయట పెడుతున్నారు.

మళ్లీ కేసులు పెరుగుతుండడంతో..

రాష్ట్రంలో కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరిగిపోతుండడంతో వర్క్ ఫ్రం హోం పనిచేసే ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం, వేసవిలో వైరస్ వ్యాప్తి అంతగా ఉండదని ప్రచారం జరిగింది. దీంతో కార్యాలయాలకు వెళ్ల వచ్చని భావించారు. అయితే వేసవి మొదలయ్యాకనే కరోనా కేసులు పెరుగుతుండడం వారిని ఆందోళనలకు గురి చేస్తోంది. ఆఫీసులకు వెళ్లలేక, ఇంటి నుండి పని చేయలేక ఉద్యోగులు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా మారాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story