టీఆర్ఎస్‌ పార్టీకి తలనొప్పిగా మారిన ఎన్నికలు

by Shyam |   ( Updated:2021-09-08 07:15:11.0  )
TRS kodad
X

దిశ, అనంతగిరి: గ్రామ కమిటీల ఎంపిక టీఆర్ఎస్ పార్టీకి కొత్త తలనొప్పిగా మారింది. అన్ని గ్రామాల్లో ఏకాభిప్రాయంతో కమిటీలను నియమించాలన్న ఉద్దేశంతో పార్టీ మండలాలకు ఇన్‌చార్జీలను నియమించింది. ఇందులో భాగంగా కోదాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గ్రామ, మండల కమిటీల ఎంపికకు ఇన్‌చార్జీలను నియమించారు. అయితే పార్టీ అనుకున్న మేరకు కమిటీల ఎంపిక జరగడం లేదు. ప్రతి గ్రామంలో నాయకుల నుంచి పోటీ పెరగడంతో ఎక్కడా ఏకాభిప్రాయం రావడం లేదు. కొన్ని గ్రామాల్లో నాయకులు తిరుగుబావుట ఎగురవేస్తున్నారు. తమల్ని నియమించకపోతే పార్టీ సైతం మారుతామని హెచ్చరిస్తున్నారు.

ఒక్క పదవికి 20 మంది పోటీ

కోదాడ నియోజకవర్గం, అనంతగిరి మండలంలోని 19 గ్రామ పంచాయతీలకు గ్రామ కమిటీల నియామకాన్ని ప్రారంభించారు. ఈనెల 4వ తేదీ నుంచి అనంతగిరి, నడిగూడెం మండల ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో నూతన గ్రామ కమిటీ ఎంపిక ప్రారంభమైంది. కాగా, అనంతగిరి మండలంలో నాలుగు రోజులుగా ప్రతి గ్రామంలో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ గ్రామాల్లో గ్రామ అధ్యక్ష పదవికి నాయకులు పోటాపోటీగా ముందుకు రావడంతో ఏకాభిప్రాయం కుదరడం లేదు. దీంతో పార్టీ ఇన్‌చార్జ్‌లు పోటీలో ఉన్న వారి పేర్లను నమోదు చేసుకుంటున్నారు. అయితే 19 గ్రామాల్లో ఇప్పటి వరకు రెండు గ్రామాల్లోనే ఏకాభిప్రాయం వచ్చింది. మరో 17 గ్రామాల్లో నువ్వా నేనా అంటూ నాయకులు పోటీ పడుతున్నారు. అమీనాబాద్ గ్రామంలో ఏకంగా 15 నుంచి 20 మంది పోటీలో ఉన్నారు. మిగతా గ్రామాల్లో నాలుగు నుంచి ఐదుగురు అధ్యక్ష పదవికి పోటీలో ఉండటంతో సెలక్షన్ కమిటీకి గ్రామ కమిటీల ఎంపిక తలనొప్పిగా మారింది. మరోవైపు పోటీలో ఉన్న నాయకులు జిల్లా స్థాయి లీడర్లతో మండల ఇన్‌చార్జీలపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.

సెలక్షన్ కమిటీకి షాక్

మరోవైపు గోండ్రియాల గ్రామంలో సెలక్షన్ కమిటీకి షాకిచ్చారు అక్కడి నాయకులు. గ్రామ కమిటీ ఎంపిక చేస్తున్నట్లు ఒక్క రోజు ముందే కరపత్రంతో సమాచారం అందించారని, ఇలా హడావుడిగా, సమాచారం లేకుండా ఎలా చేస్తారని ఆ గ్రామ సర్పంచ్ భర్త, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు బాబురావు, పీఏసీఎస్ డైరెక్టర్ మాగి యాకూబ్, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. అధ్యక్షపదవికి పేర్లు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో కమిటీ నియామకాన్ని వాయిదా వేశారు.

పార్టీ మరెందుకు సిద్ధం…?

ఒకవేళ గ్రామ శాఖ అధ్యక్ష ఎన్నికల్లో పార్టీకి అనుకూలమైన వారిని ఎన్నుకోకపోతే పార్టీ మారేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని పోటీలో ఉన్న నాయకులు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. మండల నాయకులు తమ అనుచరులకే గ్రామ శాఖ అధ్యక్ష పదవులు కట్టబెడితే పార్టీ కోసం అహర్నిశలు కష్టపడే వారికి అన్యాయం జరుగుతుందని టీఆర్ఎస్ పార్టీ క్రియాశీలక కార్యకర్తలు సైతం వాపోతున్నారు. పార్టీ కోసం పనిచేసే వారికే గ్రామ శాఖ అధ్యక్ష పదవులు ఇవ్వాలని, ఆర్థికంగా ఉన్న వారికి పదవులు ఇస్తే గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతం కాదని హెచ్చరిస్తున్నారు. మరి గ్రామ శాఖ అధ్యక్షులు ఎంపికలో పారదర్శకంగా వ్యవహరిస్తారా, అనుకూల వర్గాలకే పదవులు కట్టబెడతారా అనేది వేచి చూడాల్సిందే..!

Advertisement

Next Story

Most Viewed