మూడో శతాబ్దం నాటి బ్రాహ్మీ లిపిపై పట్టు సాధించిన 8ఏళ్ల చిన్నారి

by Shyam |   ( Updated:2021-08-30 03:13:04.0  )
మూడో శతాబ్దం నాటి బ్రాహ్మీ లిపిపై పట్టు సాధించిన 8ఏళ్ల చిన్నారి
X

దిశ, ఫీచర్స్:మాతృ భాష నేర్చుకోవడం తేలికే.. కానీ కొత్త భాష నేర్చుకోవడం అంతా సులువు కాదు. భాషలు నేర్చుకోవడం వల్ల విజ్ఞానం పెరగడంతో పాటు, మెదడు కూడా చురుకుగా పనిచేస్తుందని తెలిసిన విషయమే. ఈ క్రమంలోనే ఇంటర్నేషనల్ స్కూళ్లలో పిల్లలకు ఫ్రెంచ్, స్పానిష్, జపనీస్ భాషలు నేర్పిస్తున్నారు. అయితే తమిళనాడుకు చెందిన ఎనిమిదేళ్ల మోషిక పూర్వకాలం నాటి తమిళ-బ్రాహ్మీ లిపిని నేర్చుకోవడం విశేషం. తమిళ ప్రాచీన రూపాన్ని చదవడంతో పాటు రాయడంలోనూ ఆమె ప్రావీణ్యం సంపాదించింది.

తమిళ-బ్రాహ్మీ లిపి క్రీస్తుపూర్వం మూడో శతాబ్దం నుంచి క్రీ.శ మొదటి శతాబ్దం వరకు చలామణిలో ఉంది. ఇది బ్రాహ్మీ లిపి వైవిధ్యాన్ని అందించడంతో పాటు పురాతన శాసనాలు సృష్టించడానికి ఉపయోగించబడింది. ఈ పురాతన లిపిని నాలుగో తరగతి చదువుతున్న చిన్నారి మోషిక నేర్చుకోవడమే కాకుండా, తమిళ్-బ్రాహ్మీ లిపిలో ఆతిచూడి, మూతురై, నన్నాల్‌ అనే హ్యాండ్‌బుక్‌ను రూపొందించింది. సెప్టెంబర్ 2020లో తమిళం, ఇంగ్లీష్, హిందీ, మలయాళం, బ్రాహ్మీ అక్షరాలను మిర్రర్ లెటర్స్‌గా రాసినందుకు యంగ్ అచీవర్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌ సాధించింది మోషిక. ఆమె సాధించిన విజయాలను ప్రశంసిస్తూ కోయంబత్తూర్ సిటీ మునిసిపల్ కార్పొరేషన్ (CCMC) ఇటీవల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మోషికకు స్మార్ట్ టాబ్లెట్‌ని బహుకరించింది.

ఒక దేవాలయంలో రాళ్లపై రాసిన పురాతన లిపిని చూశాను. దాని గురించి అమ్మనాన్న అడిగితే చెప్పారు. అప్పటినుంచి ఆ భాష నేర్చుకోవాలనే ఆసక్తి పెరిగింది. ప్రాచీన లిపిపై ఆసక్తిని గుర్తించిన మా పేరెంట్స్ ఇంటర్నెట్ సహాయంతో స్క్రిప్ట్ నేర్చుకోవడానికి మార్గనిర్దేశం చేశారు. మా అమ్మ తమిళ అక్షరాల పక్కన తమిళ-బ్రాహ్మీ అక్షరాలు రాసేది. వాటిని చూస్తూ ప్రాక్టీస్ చేసిన తర్వాత, సులభంగా బ్రాహ్మీ అక్షరాలపై పట్టు సాధించాను– మోషిక

ఆరేళ్ల వయసులో మా అమ్మాయికి బ్రాహ్మీ లిపిపై ఆసక్తి పెరిగింది. మేము నేర్పించాలని నిర్ణయించుకున్నాం. ఈ స్క్రిప్ట్‌ గురించి తెలుసుకోవడానికి అనేక వెబ్‌సైట్స్, యూట్యూబ్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఆమె ఇప్పుడు నిపుణుడిలా బ్రాహ్మీ అక్షరాలు రాయగలదు. ప్రస్తుతం బ్రాహ్మీ స్క్రిప్ట్ వేరియంట్ అయిన వట్టెలుట్టు లిపిని అభ్యసిస్తోంది – జీవిత, మోషిక తల్లి

Advertisement

Next Story

Most Viewed