- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జనవరి 18 నుంచి కాలేజీలు రీఓపెన్?
దిశ, తెలంగాణ బ్యూరో : జూనియర్, డిగ్రీ కాలేజీలను ఈ నెల 18 నుంచి రీఓపెన్ చేయాలని విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో సోమవారం జరిగే సమావేశంలో విద్యారంగానికి సంబంధించిన చర్చ జరగనుంది. ఇందులో పాఠశాలలు, కళాశాలలు తెరవడం, ఫిజికల్ క్లాసెస్ నిర్వహించడం, ప్రైవేటు హాస్టళ్లను తెరవడం, సిలబస్‌ను ఖరారు చేయడం, పరీక్షల నిర్వహణ, ప్రశ్నా పత్రాల మార్పులు చేర్పులు, వేసవి సెలవుల ఖరారు తదితర అంశాలు ప్రస్తావనకు వస్తాయని భావిస్తున్నారు. తర్వాత ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకోనుంది. ‘టెట్’ టీఆర్‌టీ, ఉపాధ్యాయుల పదోన్నతులను కూడా విద్యాశాఖ ప్రతిపాదించింది.
కరోనా కారణంగా మార్చి 14 నుంచి మూసేసిన విద్యా సంస్థలు ఇప్పటికీ తెరుచుకోలేదు. పరీక్షలు అర్ధంతరంగా వాయిదా పడ్డాయి. సర్కారు నిర్ణయంతో అందరూ పాసయ్యారు. అన్‌లాక్‌లు వచ్చినా స్కూళ్లు, కాలేజీలకు మోక్షం లభించలేదు. వార్షిక పరీక్షలు దగ్గర పడుతుండడంతో ఫిజికల్ క్లాసెస్ నిర్వహించాలని విద్యాశాఖ భావించింది. బ్రిటన్‌లో కరోనా స్ట్రెయిన్ ఉనికిలోకి రావడంతో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అప్రమత్తమైంది. సంక్రాంతి వరకూ విద్యా సంస్థలు తెరవకపోవడం మంచిదని అభిప్రాయపడింది. ఈనెల 16వ తేదీ నుంచి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుండడంతో 18 లేదా 22వ తేదీ నుంచి జూనియర్, డిగ్రీ కాలేజీలను రీఓపెన్ చేయాలని ప్రభుత్వానికి విద్యాశాఖ సవరించిన ప్రతిపాదనలు పంపింది.
తొమ్మిదో తరగతి వరకు లేనట్టే
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మంత్రి కేటీఆర్ తదితరులు వివిధ సందర్భాలలో ప్రజల మధ్యకు వెళ్లినప్పుడు స్కూళ్లు, కాలేజీలు ఎప్పుడు తెరుస్తారనే ప్రశ్నలు తల్లిదండ్రుల నుంచి వచ్చాయి. పిల్లల్ని స్కూళ్లకు పంపడంపై తల్లిదండ్రుల అభిప్రాయాలను కూడా వారు అడిగి తెలుసుకున్నారు. తొమ్మిదో తరగతి వరకు పిల్లల్ని పంపడానికి సుముఖంగా లేరని తేలింది. పదో తరగతికి మాత్రం పబ్లిక్ పరీక్షలు కావడంతో ఫిజికల్ క్లాసులు నిర్వహించాలన్న అభిప్రాయాలు వచ్చాయి. తొమ్మిదో తరగతికి కూడా ఫిజికల్ క్లాసులు నిర్వహించడం ఉత్తమమని విద్యాశాఖ భావిస్తోంది.
దీంతో సంక్రాంతి తర్వాత కాలేజీలను రీఓపెన్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే సిలబస్‌లో 30% తగ్గించినందున, మిగిలిన సిలబస్‌ను పూర్తి చేయడానికి ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోనుంది. గతేడాదిలాగానే ఈసారి కూడా తొమ్మిదో తరగతి వరకు అందరినీ పాస్ చేసే అవకాశాలున్నాయి. పదో తరగతికి ఈసారి ఒక పేపర్‌కే పరిమితం చేయాలని విద్యాశాఖ భావిస్తున్నట్లు తెలిసింది. పరీక్షలకు ముందు కనీసంగా 90 రోజుల పాటు ఫిజికల్ తరగతులు నిర్వహిస్తే బాగుంటుందనేది ఆలోచన.
ఏప్రిల్‌లో పరీక్షలు?
సెంట్రల్ బోర్డు సిలబస్ విద్యార్థులకు మే నెల నాలుగు నుంచి పరీక్షల షెడ్యూలు ఇప్పటికే ఖరారైనందున రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ సిలబస్ విద్యార్థులకు అప్పటికల్లా పరీక్షలను పూర్తి చేయాలని ఆలోచించే అవకాశం ఉంది. మే నెలలో ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని సీబీఎస్ఈ పరీక్షల కంటే ముందే నిర్వహించే అవకాశముంది. మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలను ఎక్కువగా ఇచ్చి, లఘు ప్రశ్నలతోనే సరిపెడతారని అంటున్నారు. కేంద్ర హెచ్ఆర్‌డీ మంత్రిత్వశాఖ సైతం జేఈఈ లాంటి ప్రవేశ పరీక్షలు, అనంతరం జరిగే ప్రవేశాల విషయంలో నిబంధనలను సడలించింది. ఆ ప్రవేశ పరీక్షలకు కూడా రాష్ట్ర విద్యార్థులు పోటీపడేలా, ప్రిపేర్ అయ్యేలా, తగినంత సమయం ఉండేలా ఇక్కడ వార్షిక పరీక్షలను నిర్వహించడం, అనంతరం వేసవి సెలవులను ఖరారు చేయడం లాంటి అంశాలపై ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే సమావేశంలో నిర్ణయం జరిగే అవకాశం ఉంది.
ప్రైవేటు కాలేజీ హాస్టళ్లు ఓపెన్?
సంక్రాంతి తర్వాత విద్యా సంస్థలను తెరవడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇవ్వొచ్చన్న ఉద్దేశంతో ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు రెడీ అవుతున్నాయి. రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీలలో ఉన్న హాస్టళ్లను తెరవడానికి సన్నాహాలు చేసుకుంటున్నాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాయి. వార్డెన్‌లను కూడా రెడీగా ఉండాల్సిందిగా అప్రమత్తం చేశాయి. ప్రభుత్వ గురుకుల పాఠశాలలు కూడా తెరవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలిసింది. కొన్ని ప్రభుత్వ గురుకులాలో ఇప్పటికే హాస్టళ్లు పనిచేస్తున్నాయి. ఫిజికల్ క్లాసులు జరుగుతున్నాయి. వైరస్ బారిన పడకుండా అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
రెండు షిప్టుల్లో తరగతులు?
ఫిజికల్ క్లాసులను ఎలా జరపాలనేదానిపై కూడా విద్యాశాఖ ప్రతిపాదనలను సిద్దం చేసింది. ఉదయం, మధ్యాహ్నం రెండు షిప్టుల్లో నిర్వహించాలనేది ఒక ప్రతిపాదన. రోజుమార్చి రోజు సాధారణ తరహాలోనే తరగతులను నిర్వహించాలనేది రెండో ప్రతిపాదన. దీని గురించి కూడా చర్చ అనంతరం నిర్ణయం జరిగే అవకాశం ఉంది. ఇంతకాలం విద్యార్థుల తల్లిదండ్రులు వైరస్ కారణంగా ఫిజికల్ తరగతులు లేకపోతే మంచిదనే అభిప్రాయంతో ఉన్నారు. పరీక్షలు దగ్గర పడుతుండడంతో ప్రిపేర్ కావడానికి బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఒక షిప్టు, మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 5.30 వరకు మరో షిప్టు తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ ఆలోచిస్తోంది.
‘టెట్’, ‘టీఆర్‌టీ’, పదోన్నతులు కూడా
విద్యాశాఖకు సంబంధించి కేవలం సిలబస్, విద్యా సంవత్సరం, పరీక్షలు, వేసవి సెలవులు, విద్యా సంస్థలను తెరవడం లాంటి అంశాలు మాత్రమే కాక ముఖ్యమంత్రి ఇటీవల ప్రకటించినట్లుగా ఉపాధ్యాయుల రిక్రూట్‌మెంట్ కోసం ‘టెట్’, ‘టీఆర్‌టీ’ పరీక్షలను నిర్వహించడంపై కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలను విద్యాశాఖ సిద్ధం చేసింది. ఈ రెండు పరీక్షలనూ ఒకేసారి నిర్వహించాలా లేక విడివిడిగా నిర్వహించాలా అనేది ప్రభుత్వం నిర్ణయించనున్నా విద్యాశాఖ తన అభిప్రాయాలను కూడా వెల్లడించినట్లు సమాచారం. రిక్రూట్‌మెంట్ ఉమ్మడి పది జిల్లాల ఆధారంగానే జరిగేలా ప్రతిపాదనలలో పేర్కొన్నట్లు తెలిసింది. ఉపాధ్యాయులకు దీర్ఘకాలంగా హెచ్ఎం, మండల విద్యాధికారి లాంటి పదోన్నతులు లేకపోవడంతో వాటి గురించి కూడా చర్చించే అవకాశం ఉంది.