వివేకా కేసు... చిక్కుముడి వీడేనా!?

by Ravi |   ( Updated:2023-04-18 14:58:22.0  )
వివేకా కేసు... చిక్కుముడి వీడేనా!?
X

నిజాలను చెరిపివేసి అబద్ధాలను వండివారిస్తూ ఎదురుదాడి చేస్తున్నారు. బతుకంతా బుకాయింపులేనా? రక్త చరిత్రకు నాలుగేళ్లు నిండాయి. ఈ నాలుగు సంవత్సరాల్లో ఆరు కథలు చెప్పారు. ఇంకా ఎన్ని కొత్త కథలు వినిపిస్తారోనని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా కథను తలపిస్తూ అనేక మలుపులు తిరుగుతోంది. మార్చి 15, 2019న వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారని తొలుత విజయసాయిరెడ్డి ప్రకటించారు.... కాదు కాదు.. అది గొడ్డలిపోటే.. చంద్రబాబే హత్య చేశారని, ఇది నారాసుర రక్తచరిత్ర అని ప్రచారం చేశారు. తాజాగా సునీల్ యాదవ్ తల్లి పట్ల అసభ్యంగా ప్రవర్తించారనే కక్షతో చంపినట్లుగా తెలంగాణ హైకోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి అఫిడవిట్ దాఖలు చేశారు. దీనికి ముందు ఆయన కొడుకు అవినాష్ రెడ్డి.. కూతురు సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి కలిపి చంపారనీ.. వివేకాకు, ముస్లిం మహిళకు పుట్టిన సంతానానికి ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని.. దస్తగిరితో హత్య చేయించినట్లుగా తెలంగాణ హైకోర్టులో అభియోగాలు మోపారు.

అప్పుడా మాట.. ఇప్పుడీ మాట...!

ఆంధ్రా పోలీసులపై మాకు నమ్మకం లేదు.. సీబీఐతో దర్యాప్తు జరిపించాలి అని చెప్పినవారు అధికారంలోకి రాగానే సీబీఐ విచారణ అవసరం లేదు, రాష్ట్ర పోలీసులే విచారణ చేస్తారని చెప్పి కేసుని మూసివేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ హత్య కేసును తప్పుదారి పట్టించేందుకు ఆడిన నాటకాలు, చెబుతున్న అబద్ధాలు అత్యంత హేయంగా ఉన్నాయి. ప్రజలను చాలా తక్కువగా అంచనా వేస్తూ, అమాయకులుగా భావిస్తూ ఇష్టానుసారంగా కథలు అల్లడం వారికే చెల్లింది. వివేకా హత్య కేసులో జగన్నాటకాలు బట్టబయలవుతున్నాయి. సీబీఐ, సిట్, హైకోర్టు, సుప్రీంకోర్టు, సునీత, షర్మిల, ప్రజల చూపులన్నీ జగన్ వైపే చూస్తున్నాయి. అయినా ఇంతవరకు ముఖ్యమంత్రి నోరు విప్పకపోవడం, సమాధానం చెప్పకపోవడం దేనికి సంకేతం? నిజం నిలకడ మీద తెలుస్తుందనే నానుడి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రుజువు కాబోతోంది. సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరగడంతో గూగుల్ టేక్ అవుట్ ద్వారా సూత్రధారుల ముసుగును సీబీఐ తొలగించింది. అసలు దోషులను బోనులో నిలబెట్టేందుకు సీబీఐ విచారణ కావాలని వివేకా కుమార్తె సునీత న్యాయస్థానాలను ఆశ్రయించారు. చివరకు ఆమెపైనే నిందలు మోపుతున్నారు. నాలుగేళ్లుగా నోరుమెదపకుండా సునీతపై తాజా ఆరోపణలు చేయడం వెనుక ఉద్దేశం ఏమిటి? తన తండ్రిని చంపిన హంతకులను ప్రజల ముందు నిలబెట్టడానికి సునీత చేస్తున్న పోరాటం మహిళా లోకానికి స్ఫూర్తిగా నిలిచింది. దోషులను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని, బాధితులను ముద్దాయిలుగా మార్చే కుట్ర జరుగుతున్నదని ఆమె తన అఫిడవిట్ లో పేర్కొంది. దర్యాప్తుకు సహకరించకుండా అనేక అడ్డంకులు సృష్టిస్తూ కేసు విచారణలో జాప్యం జరిగేలా చూస్తున్నారు.

విచారణకు ఇన్ని ఆటంకాలా?

రాష్ట్రంలో అత్యంత సంచలనం రేపిన హత్య కేసు విచారణ జరుగుతున్న తీరు రాష్ట్ర ప్రజానీకాన్నీ విస్మయపరుస్తోంది. అనేక సాక్ష్యాధారాలతో అవినాష్ రెడ్డిని, భాస్కర్ రెడ్డిని దోషులుగా తేల్చి, వారిని అరెస్ట్ చేస్తున్నట్లు తెలంగాణ హైకోర్టుకు సీబీఐ తెలిపింది. అవినాష్ రెడ్డి సైతం అరెస్ట్ కు భయపడి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ పెట్టుకున్నారు. అనంతరం జరిగిన పరిణామాలతో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. వివేకా హత్య కేసు తేలకపోతే రాజ్యాంగ వ్యవస్థలపై ఉన్న నమ్మకం పూర్తిగా పోతుంది. ఇన్నాళ్లు గడిచినా ఇప్పటివరకు ఈ కేసు ఒక కొలిక్కి రాలేదు. కొంత పురోగతి కనిపిస్తున్న దశలో కేసు తిరిగి మొదటికొచ్చింది. హత్య కేసు విచారణ జాప్యం కావడానికి విచారణ అధికారి రామ్ సింగ్‌ను బాధ్యుడిని చేస్తూ తప్పించారు. ముద్దాయిలే న్యాయస్థానాల్లో పదేపదే పిటిషన్లు వేస్తూ అడుగడుగునా ఆటంకాలు సృష్టించారు. చివరకు ఏప్రిల్ 30 లోగా విచారణ పూర్తిచేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అప్పటికైనా చిక్కుముడి వీడుతుందా అయితే ఇది జరిగి రెండు వారాలు దాటింది. అవినాష్ రెడ్డి అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేయడం ద్వారా మరిన్ని అరెస్ట్‌లు జరగొచ్చేమోనని భావిస్తున్నారు. ఈ ఆదివారం భాస్కర్ రెడ్డిని అరెస్టు చేయడం కొసమెరుపు.

ప్రభుత్వమే ఎదురు కేసులు పెడితే..

రాష్ట్రంలో అత్యంత సంచలమైన రెండు కేసులపై సీబీఐ విచారణ జరుపుతోంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ప్రత్యక్షంగా ఒక కేసులో, పరోక్షంగా మరో కేసులో ప్రమేయం ఉండటమే విశేషం. ఒకటి క్విడ్ ప్రో కో ద్వారా అక్రమాస్తులు సంపాదించారనే అభియోగం, రెండోది సొంత బాబాయి వివేకానందరెడ్డి హత్య కేసు. రాష్ట్రంలో గత నాలుగేళ్లలో సీబీఐ అరడజను కేసులకు పైగా విచారణ చేపట్టింది. కానీ ఒక్కటి కూడా కొలిక్కి వచ్చిన దాఖలాలు లేవు. కొన్ని కేసులు ఏళ్ల తరబడి కొనసాగుతున్నాయి. ఇంతటి జాప్యం కారణంగా సాక్ష్యాలు మాయమవుతున్నాయి, ఆధారాలు ధ్వంసమవుతున్నాయి. సాక్షులు చనిపోవడమో, అంతమొందించడమో, బెదిరించడమో, ప్రలోభాలకు గురిచేయడమో జరుగుతోంది. వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన దర్యాప్తులో రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోగా.. అడ్డంకులు సృష్టించింది, బెదిరించింది, కేసులు పెట్టింది.

అవినాష్ రెడ్డి మా తమ్ముడు... వివేకానందరెడ్డి మా సొంత చిన్నాన్న.. ఒక కన్ను ఇంకొక కన్నును ఎందుకు పొడుస్తుంది.. మా చిన్నాన్నను మేం ఎలా చంపుకుంటాం అని శాసనసభ సాక్షిగా 2021 నవంబర్ 19వ తేదీన ఆయన చెప్పిన రెండు కళ్ల సిద్ధాంతం. ఆ నంగనాచి కబుర్లకు ఇప్పుడేం సమాధానం చెబుతారు? వివేకా హత్య కేసులో ప్రధాన కుట్రదారుగా ఉన్న వ్యక్తులకు క్లీన్ చిట్ ఇచ్చిన ముఖ్యమంత్రి నైతిక బాధ్యత వహించాలి కదా. హత్యను కప్పిపుచ్చడానికి అవినాష్ రెడ్డి సమక్షంలో సాక్ష్యాలను చెరిపేశారు. హత్యకు రూ.40 కోట్లు సమకూర్చింది, హంతకులకు రక్షణ కల్పిస్తున్నది అవినాష్ రెడ్డేనని సునీత తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలు లేకుండా సీబీఐ అధికారిపై రాష్ట్ర పోలీసులు కేసు పెట్టగలరా? స్వయానా బాబాయ్ హత్య కేసే తేల్చలేని ముఖ్యమంత్రి సామాన్య ప్రజలకు రక్షణ ఏ విధంగా కల్పిస్తారు? ఇక్కడ న్యాయం జరగదు, నా తండ్రి హత్య కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని సుప్రీంకోర్టుకు సునీత మొరపెట్టుకున్నారు. వివేకా హత్యకేసులో పోలీసులు నేరస్థులతో కుమ్మక్కయ్యారని, వారికి రక్షణ కల్పిస్తున్నారని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ నిష్పాక్షికతను ప్రశ్నార్థకం చేశాయి. ఈ వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డికి చెంపపెట్టు కాదా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో న్యాయవాదులే ఈ హత్య కేసులో నిందితుల తరపున వాదిస్తున్నారు. దీనిని బట్టి నేరస్థులకు ముఖ్యమంత్రి ఆశీస్సులు ఉన్నాయనేది స్పష్టమవుతోంది.

బెయిల్ కోసం ప్రలోభాలు...

మానవత్వాన్ని, మానవ సంబంధాలను హననం చేసిన చరిత్ర రక్తాక్షరాలతో లిఖితమవుతుంది. ఫ్యాక్షనిజం పడగనీడలో అధికార దాహం, అరాచకం దావానంలా వ్యాపించి బంధుత్వాలను, తండ్రి కొడుకుల, అన్నా చెల్లెళ్ల అనుబంధాలను దహించివేసింది. సూత్రధారులు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా వారిని అరెస్ట్ చేసి బోనులో నిలబెట్టకపోతే సమాజంలో వ్యవస్థలపై నమ్మకం పోతుంది. ఈ హత్య కేసులో బెయిల్ కోసం న్యాయమూర్తులను సైతం ప్రలోభాలకు గురిచేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి రాజకీయ ప్రేరేపిత కేసులో నేర పరిశోధనా సంస్థలు జాప్యం చేయకూడదు. సీబీఐ ఒత్తిళ్లకు, ప్రలోభాలకు లొంగకుండా మరింత బాధ్యతగా వ్యవహరించాలి. అధికారంలో ఉన్నవారి రాజకీయ అవసరాలకు అస్త్రంగా సీబీఐ మారిందనే అపవాదును తొలగించుకోవాలి. రాజ్యాంగ వ్యవస్థలు చచ్చుపడితే నేరస్థులకు స్వర్గధామంగా మారుతుంది. రామ్ సింగ్ లాగా నిజాయతీగా, నిష్పక్షపాతంగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తే వ్యవస్థలపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి:

అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణ రేపటికి వాయిదా

సీబీఐ కస్టడీకీ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి

మన్నవ సుబ్బారావు

గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్

99497 77727

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672

Advertisement

Next Story