‘సంక్షేమం’ టీడీపీని గద్దెనెక్కిస్తదా?

by Ravi |   ( Updated:2023-05-30 05:30:07.0  )
‘సంక్షేమం’ టీడీపీని గద్దెనెక్కిస్తదా?
X

ఎవరి భవిష్యత్తుకు భరోసా? తన రాజకీయ భవిష్యత్తును పదిలపరుస్తాయని ఆశిస్తున్న తాయిలాలను మహానాడు వేదిక నుంచి తెలుగుదేశం ప్రకటించింది. ఇవే ‘ప్రజల భవిష్యత్తుకు తమ గ్యారెంటీ’ అని పేర్కొంది. పార్టీ రెండు రోజుల ‘మహానాడు’ ముగిసింది. ఇప్పుడున్న ప్రభుత్వం మారినా...ప్రజల సంక్షేమ ‘నగదు బదిలీ’కి డోకా లేదనే విశ్వాసం కలిగించే ప్రయాసే తప్ప అభివృద్దికి నిర్దిష్ట హామీ ఇవ్వలేదు. పాక్షిక మేనిఫెస్టోని ముందే ప్రకటించింది. రాజకీయ పంథాలో ఏ స్పష్టత లేకుండానే ఎన్నికలకు పది నెలల ముందరి మహానాడును తెలుగుదేశం ముగించింది. విపక్షం ఓట్లు చీలకుండా.... జనసేనతోనో మరొకరితోనో పొత్తుల సంగతీ మాట్లాడలేదు. కార్యకర్తలకు సంస్థాగత నడతకు సంబంధించిన ఏ కొత్త సందేశమూ ఇవ్వలేదు. గత ఓటమికి కారణాలను సమీక్షించలేదు, నేటి పరిస్థితిని విశ్లేషించలేదు. రేపటి గెలుపుకోసం ఎలా ప్రజావిశ్వాసం చూరగొనాలో కార్యాచరణనూ ప్రస్తావించలేదు.

తెలుగుదేశం నాయక, కార్యకర్తల శ్రేణులు గత కొంత కాలంగా నిరీక్షిస్తున్న పార్టీ పండుగ ‘మహానాడు’ ముగిసింది. వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు శతజయంతి రోజున ఈ సంస్థాగత వేడుక రాజమహేంద్రవరం (రాజమండ్రి) శివారుల్లో బహిరంగ సభతో అంగరంగ వైభవంగా ముగిసింది. ఎప్పట్లాగే పార్టీ అధినేత చంద్రబాబు పలు అంశాలు ప్రస్తావిస్తూ ప్రసంగించారు. ఎన్నికల మేనిఫెస్టో కొంత భాగాన్ని ప్రకటించారు. ‘బటన్‌ నొక్కుతాను’ అనలేదే కానీ, దాదాపు అన్నీ అటువంటివే పలు సంక్షేమ కార్యక్రమాలను స్త్రీలు, యువత, రైతాంగం, పేదల్ని లక్ష్యంగా చేసుకొని వెల్ల‌డించారు. ప్రత్యామ్నాయ సామాజికార్థిక ఎజెండా గానీ, నిర్దిష్ట అభివృద్ధి నమూనా గానీ ఆయన ప్రకటించలేదు.

స్పష్టతకు జడుపు

ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, కేంద్రంతో నడుచుకునే విధానం, ద్రవ్యోల్బణ నియంత్రణ, ఇతర విపక్షాలతో రాజకీయ పంథా.... తదితర కీలకాంశాల విషయంలో మహానాడు వేదిక మౌనంగానే ఉంది. సందేహాలను నివృత్తి చేసే ఏ స్పష్టతా రాలేదు. 2019 ఎన్నికల ముందు, ఆయా అంశాల్లో మోదీని, కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని అంత నిశితంగా విమర్శించి... ఇప్పుడు మౌనం వహించడం దేనికి సంకేతం? నిజానికి వెనక్కి వెళ్ళడానికి కూడా లేదు. అటువంటిది, ఏపీలో పాలకపక్షాన్ని నిత్యం విమర్శిస్తూ, మళ్లీ అధికారం ఇమ్మని ప్రజాతీర్పు కోసం జన క్షేత్రంలోకి వెళ్లేటప్పుడు అంతటి కీలక విషయాల్లో స్పష్టత అవసరం. మహానాడు వేదిక నుంచి తీర్మానాల రూపంలోనో, ప్రసంగాల ద్వారానో తమ రాజకీయ-పాలనా విధానాలను ప్రకటించాల్సిన సందర్భమిది. చూడబోతే, దేనికో జడుస్తున్న సంకేతాలు స్పష్టంగా కనిపించాయి. కుల వివాదాలు రగులుతున్న వేళ, తమపై ఉన్న ‘కుల పక్షపాత’ ముద్రను తొలగించుకునేందుకు మహానాడును టీడీపీ నాయకత్వం, వ్యూహకర్తలు ఉపయోగించుకోలేదు. ఇప్పటికీ అదే ధోరణితో, ఒక కులానికే పెద్దపీట! బీసీ, ఎస్సీ, మైనారిటీ, రెడ్డీ, కాపులకూ తగు ప్రాధాన్యత ఇస్తున్న సంకేతాలే లేవు. అవునన్నా, కాదన్నా... అందులో కొన్ని సామాజిక వర్గాలు ఏపీ రాజకీయాల్లో ఒక ప్రబల శక్తి అన్న గ్రహింపు మహానాడులో లోపించింది.

కొనసాగింపు, కొంత పెంపు...

తాము తిరిగి అధికారంలోకి వస్తే... సంక్షేమం విషయమై అయిదారు నిర్దిష్ట హామీలతో ‘భవిష్యత్తుకు భరోసా’ ఇచ్చే ప్రయత్నం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ ‘అయిదంశాల’ ప్రచారంతో వెళ్లి గెలిచిందనో ఏమో మహాశక్తి, యువగళం, అన్నదాత, బీసీకి రక్షణ చట్టం, ఇంటింటికీ తాగునీరు, పేదల్ని సంపన్నులు చేయడం.... ఇలా ఆరు అంశాలు ప్రకటించారు. మహిళ కేంద్రకంగా రెండు నగదు బదిలీలతో కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటామన్నారు. ప్రస్తుత సర్కారు ఇచ్చే పథకంలోనే అర్హత వయసును కుదించి, ఇంట్లో ఎందరున్నా ప్రతి మహిళకు నగదు బదిలీ వర్తింపజేస్తామన్నారు. ఇంకో పథకాన్ని పేరు మార్చి మరో రూపంలో ఇస్తామన్నారు. ఉచితంగా బస్సు ప్రయాణం, దీపం పేరిట ఏటా మూడు సిలెండర్ల వంటగ్యాస్‌ ఉచితంగా ఇస్తామన్నారు. యువతకు ఉద్యోగాలిచ్చే వరకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. రైతు కుటుంబానికి ఏటా ఇంత మొత్తం నగదును, పెట్టుబడి వ్యయం కోసం ఇచ్చే విధానం చెప్పారు. ఇవన్నీ కూడా ప్రస్తుత సర్కారు ఇచ్చే సంక్షేమ (నగదు బదిలీ) పథకాలకు మెరుగో, పేరు మార్చడమో, మరొకటో... అన్నట్టున్నాయి తప్ప కొత్త సంచలనమేమీ కాదు. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలకు, నగదు బదిలీ పథకాలకు ఆర్థిక వనరులు ఎక్కడ్నుంచి వస్తాయో చెప్పలేదు. పాలకపక్షం వైసీపీని అప్పుల విషయంలో గట్టిగా విమర్శిస్తూ, ఏపీని మరో శ్రీలంక చేస్తున్నారని ఆరోపించిన టీడీపీ, అప్పులు కాకుండా తమ ప్రత్యామ్నాయ ఆర్థిక విధానమేంటో పేర్కొనలేదు.

జనం నాడి పట్టినట్టు లేదు

ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కాదని గద్దె దింపి, ప్రజలు తమకు తిరిగి పట్టం కట్టాలని టీడీపీ ఆశిస్తోంది. అందుకు, ప్రజా క్షేత్రాన్ని పరిశీలించి జనం నాడిని పట్టే ప్రయత్నమే చేసినట్టు లేదు. సమాజం పై అంతస్తుల్లోని కొన్ని వర్గాలు మినహా.... సంక్షేమ పథకాల లబ్ధి దారులంతా, ఇతర మహిళలూ, మధ్యతరగతి తమతోనే ఉందన్నది పాలకపక్షమైన వైసీపీ వాదన. కాదని ప్రతివాదన చేసే టీడీపీ, తానూ అవే పథకాలు ఇవ్వడం వల్ల ప్రజలు తన వైపు మళ్లుతారని ఎలా భావిస్తోంది? పైగా, 2019 ఎన్నికలప్పుడు తాను ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా, పసుపుకుంకుమలతో సహా బోలెడు నగదు బదిలీలు జరిపించినా... జనం దారుణంగా తిరస్కరించారనే చేదు నిజాన్ని అప్పుడే మరిచిపోతే ఎలా? ఎంతిచ్చినా.... ‘నగదు బదిలీ’ పథకాల పట్ల అధిక శాతం జనం గొప్ప సానుకూలంగా లేరనే వాస్తవాన్ని ఇద్దరూ గ్రహిస్తున్నట్టు లేదు. కూర్చోబెట్టి నగదు ఇవ్వడం ద్వారా సోమరులను చేస్తున్నారనో, ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో అధిక ధరలతో లాగుతున్నారనో, మా డబ్బులే తిరిగి మాకు ఇస్తున్నారనో.... రకరకాల భావనలు కలిగిన జనం భిన్నాభిప్రాయంతో ఉన్నారని ‘పీపుల్స్‌ పల్స్‌’ జరిపిన పలు క్షేత్ర సర్వేల్లో తరచూ వెల్లడవుతోంది. లబ్ధి పొందుతూ సానుకూలంగా ఉన్నవారిలోనూ, ఈ ప్రభుత్వం పోయి ఇంకొకరు వస్తే ఈ పథకాలన్నీ ఆగిపోతాయేమో అన్న భయం కూడా లేదు. ‘అధికారంలోకి ఎవరొచ్చినా, ఇవన్నీ ఇచ్చి తీరాల్సిందే’ అన్న బలమైన అభిప్రాయం సాధారణ ప్రజానీకంలో ఉంది. కొత్తగా ఎవరి మనసులు గెలవటానికి టీడీపీ ఈ కసరత్తు చేస్తుందో అర్థం కాదు. నగదు బదిలీ హామీలు, అనుచిత ఉచితాలు ఓటేసే జనం మెదళ్లను పెద్దగా ప్రభావితం చేయలేదని కర్ణాటకలో సీఎస్డీఎస్‌-లోక్‌నీతి చేసిన ‘పోస్ట్ పోల్‌’ సర్వేలో తేలింది.

ఇక ‘గోల్‌పోస్ట్‌’లు మారతాయా?

నిలకడైన, నిర్దిష్ట రాజకీయ ఎజెండా లేకపోవడమే ఇటీవలి కాలంలో టీడీపీ సమస్య! కేవలం సంక్షేమం-ఉచితాలు అభివృద్ధికి ప్రత్యామ్నాయం కావని, అభివృద్దికి తాను రోల్‌మాడల్‌ అని తనకు తాను ప్రచారం చేసుకునే చంద్రబాబునాయుడు ప్రత్యర్థుల రాజకీయ ట్రాప్‌లో పడ్డట్టుంది. ఉచితాలు ప్రకటించేశారు. తాను, తన అనుకూల పచ్చమీడియా ఇన్నాళ్లూ వ్యతిరేకించిన ఫక్తు నగదు బదిలీ పథకాలనే తాను ప్రకటించాల్సి వచ్చింది. ఏపీలో రాజకీయ పక్షాలైనా, మీడియా అయినా... ‘పచ్చ’, ‘నీలి’ గ్రూపులుగా నిలువునా చీలి ఉన్నాయి. ఫుట్‌బాల్‌లోనో, హాకీలోనో.... ఆట మధ్య విరామం నుంచి టీమ్‌ల గోల్‌పోస్ట్‌లు మారతాయి. ఇప్పుడలా ఆయా టీమ్‌లు, తమ గోల్‌ పోస్ట్‌లు మార్చుకుంటాయా? ఇన్నాళ్లు విమర్శించినవే ఇప్పుడు సమర్ధిస్తూనో, సమర్ధించిన వాటినే ఎండగడుతూనో ముందుకు వెళతారేమో చూడాలి. చెప్పే మాట ఏదైనా.... ఎటు తిరిగి, ఆయా పార్టీలకు, వాటిని నడిపే నాయకులకుండే విశ్వసనీయతే ఓటర్ల నిర్ణయానికి ప్రాతిపదిక అవుతుంది. పేరేదైనా, ఏదో రూపంలో నగదు బదిలీ(ల)లు, సంక్షేమ పథకాలతోనే దేశంలోని అన్ని చోట్లా రాజకీయ పార్టీలు నెట్టుకొస్తున్నాయి. ఇతరేతర అంశాలతో కలిసి అవి క్లిక్‌ అవడమో, వికటించడమో జరుగుతోంది. ప్రస్తుత వైసీపీ సర్కారు నవరత్నాలపై ఎవరికీ పేచీ లేదు. వారి నడత, వ్యవహారశైలి, స్థానిక నాయకత్వ ధోరణులు... ఇవే వారికి ఇబ్బంది కలిగిస్తున్న అంశాలు. వాటి విషయంలో టీడీపీ ట్రాక్‌రికార్డును కూడా జనం పరిశీలిస్తారు. ‘ఏ ఇజమూ లేదు, టూరిజం తప్ప’ అని, ప్రపంచ బ్యాంకు జీతగాడని పేరుబడి 2004లో ఓడిపోయి చతికిల పడ్డ బాబును ప్రజలు అవశేషాంధ్రప్రదేశ్‌కు తొలి సీఎంగా 2014లో గెలిపించుకున్నారు. 2019లో దారుణంగా ఓడించారు. కేవలం సంక్షేమ పథకాలే పార్టీలను గట్టెక్కిచ్చిన చరిత్ర చాలా మసకమసగ్గానే ఉంది. ఇందుకు ఉదాహరణలు కోకొల్లలు. ఎవరేం చెప్పినా.... అంతిమంగా ప్రజలు ఏ మాటను ఎంతమేర తీసుకున్నారు, నమ్మారు, వారిని కోరుకున్నారు అన్నదే ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారం అప్పగించడానికి కొలమానం!

-దిలీప్‌రెడ్డి,

పొలిటికల్‌ అనలిస్ట్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ,

[email protected],

9949099802

Also Read: రాజధానిలో పేదలకు ఇళ్లు ఉండొద్దా?

Advertisement

Next Story