- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మార్పెందుకైంది - ఎ పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్
ఎలక్షన్ కు పది రోజుల ముందు పెయిడ్ ఆర్టిస్టులతో కింద కూర్చొని మాట్లాడితే అన్నీ మర్చిపోయి ఓట్లు ఏస్తారని ఎట్లా అనుకున్నారు సారు.. వాళ్లే కాక, వాళ్ళ తల్లిదండ్రులు, అవ్వ తాతలని కూడా మీకు ఓటేయనిస్తారా సార్.. లాజిక్కులు బాగా మాట్లాడే మీరు ఇంత చిన్న లాజిక్ ని ఎట్లా మిస్ అయ్యారు సార్.. ఎన్ని రోజులు రోడ్ల మీదికి వచ్చారు జీతాల కోసం.. ఇంకా ఏమని ఓటేస్తారు సార్ వాళ్ళు మీకు..
మన తెలంగాణల మూడో తాప ఓట్ల పందేరం ఒడిసింది. పేపరోళ్ళు పెద్ద పెద్ద టీవీ లోళ్లు కూడా అటా, ఇటా అన్నట్టే చెప్పిండ్రు. కానీ.., కొంచెం అటే అన్నరు. కానీ ఈ ఓట్ల పందెరంలో చెయ్యి మీదికి లేసింది, కారు తొవ్వ తప్పింది, పువ్వు రెక్కలు ఎక్కువైనయి, గాలిపటం గక్కన్నే ఆగింది, కంకి కొడవలి నేనింకా ఉన్నా అని సెప్పింది, ఏనుగు ఎరుకలేకుంట అయింది.
ఇగ తెలంగాణ కోసం చావు నోట్లె తలకాయ పెట్టిన మన బాపును జనాలు ఎందుకు గిట్ల ఆగం చేసిండ్రు అని బాగా సోచాయించిన. ఎనకటికి పోయి అన్ని తవ్వుకుంట అత్తే కొన్ని ఇషయాలు నాకు సమజయినయ్. గవ్వే ముచ్చట్లు గిక్కడ జెప్తా. గా వేణు స్వామి లెక్క జ్యోతిష్యం సెప్పుడు నానుంచైతే కాదు. డాక్టర్ను కదా రోగమెరిగి మందు రాస్తా. సచ్చిన బాడీని కోసి మొత్తం చెకప్ చేసి ఎందుకు సచ్చిందో పోస్ట్ మార్టం రిపోర్ట్ ల చెప్తాం కదా, గట్లన్నట్టు. అయితే గిది జర ముఖ్యమైన & కిరికిరి కేసు కదా మొత్తం సెకింగు చెయ్యలే గందుకనే ప్రాథమిక రిపోర్టు ఎప్పుడో రాసిన గానీ ఫైనల్ రిపోర్ట్ జర ఆలస్యమైంది అన్నట్టు.
ముందుగాల నీళ్ల ముచ్చటకత్తే..
మిషన్ కాకతీయ తోటి చెరువులు, మిషన్ భగీరథతోని మంచినీళ్లు, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం తోటి సాగునీళ్లు బాగానే చేసిండ్రు. ముందుగాల అంతా మంచిగనే కొట్టింది. కానీ.., రాను రానే జర తేడాగ తోసింది. భగీరథలో శానా ఊళ్ళళ్ళ పైపులేసినా,నీల్లయితే కొన్ని జాగల్లనే అత్తన్నయి. కాకతీయ కింద చెరువులైతే మంచిగ చేసినా, అసలు కంటే కొసరు ఎక్కువ అన్నట్టు కొట్టింది. ఇగ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అయితే పెద్ద పుస్తకమే రాయచ్చు. మొదటి కాంచి లొల్లే అది. డిజైన్ మార్చుకుంటా మార్చుకుంటా ఖర్చు తడిసి మోపెడు అయింది అన్నారు. చేసిన అప్పు, దాని మీద వడ్డీ కట్టడానికే నడ్డి విరిగిపోయినట్లు అనిపిస్తుంది. మొత్తం అయ్యాక అద్భుత ఇంజనీరింగ్ కట్టడం అన్నారు. అందుకనే మొదలైన కొత్తల బస్సులు పెట్టి మరీ తీసుకపోయి సూయించిండ్రు. ఆ సొరంగాలు, బాహుబలి మోటార్లు చూసిన జనాలు ఆహా ఓహో అని నోరెళ్లబెట్టారు. ఒక్కసారి గట్టి వానలు పడంగనే మొత్తం ఉల్టా పుల్టా అయింది. ఏం అర్థం కాలే. మొన్న మొన్న మేడిగడ్డ కుంగిపోతే చిన్న ముచ్చట అని తీసిపారేసి పట్టించుకోలేదు. అప్పుడు బస్సులలో తీసుకెళ్లినోళ్ళు ఇప్పుడు పోయి ఏమైందో చూద్దామంటే పేపరు టీవీలోల్లను కూడా పోనీయకుండా పోలీసులను పెట్టి గెదిమిండ్రు.
పైసల లొల్లి సూద్దా..
ఇచ్చుకపోయేటప్పుడు ఫుల్లుగా పైసలు ఉన్న రాష్ట్రమని అందరం సంకలు గుద్దుకున్నం. ఇప్పుడేమో లక్షల కోట్ల అప్పు ఉంది అంటున్నారు. నా నెత్తి మీద కూడా లక్ష రూపాయలు మీదనే అప్పుందట. నీ యవ్వ.. నేను చేసిన అప్పులే కట్టుకోలేక సత్తాంటే ఇదేంది మల్ల.. ఈ అప్పును ఎవడు, ఎట్లా, ఎప్పుడు కట్టాలి.. వాళ్ళ జాగలు, బంగళాలు అయితే అమ్మి కట్టరు గదా.. ఆంధ్రోళ్ల తోటి కలిసున్నప్పుడు వాళ్లే ఎక్కువ పైసలు గుంజుక పోతాండ్రు, మనకు ఇత్తలేరు అని కాగితాల మీద లెక్కలు చూపించుకుంటా అసెంబ్లీలో లొల్లి లొల్లి జేత్తిరి. మరి ఇప్పుడేమయ్యింది చింతమడకల కడపకు 10 లక్షలు అనెవరకు మా పాణం పాయె. కొడుకు, అల్లుని ఊళ్ళకే అంతా ఇచ్చి పక్కనున్న వాళ్ళను పట్టించుకోబోతిరి. ఇగ మీకు ఆంధ్రోళ్లకు తేడా ఏంది సారు.. ఊరుకొక రాష్ట్రం కావాలని కొట్లాడాల్నా ఏంది అభివృద్ధి కావాలంటే.. మీ ముగ్గురు నలుగురి నియోజకవర్గాలు కాదు కదా రాష్ట్రం అభివృద్ధి అంటే.
ఇప్పుడు అసలు ముచ్చట నౌకర్లు
అసలు అని ఎందుకన్నా అంటే లక్షల మంది పోరగాండ్లు తెలంగాణా వత్తే తమ బతుకులు మారుతాయి అని రోడ్లెక్కి లొల్లి చేసింది, వందలాది మంది ప్రాణం తీసుకుంది ఈ నౌకర్ల కోసమే కదా. అసలు వాళ్ల ప్రాణాలు తీసుకోకుంటే ఉద్యమం ఉధృతం అయ్యేది కాదు. కేంద్రం వెన్నుల వణుకు వచ్చేది కాదు, ఇయ్యాల్ల ఈ తెలంగాణ సూసెటోల్లం గాదు. మరి అసొంటి పిల్లలకు నౌకర్లు సరిగ్గా ఇచ్చి, అమరవీరులు కుటుంబాలకు అసలైన న్యాయం చేసి, అమరులకు నిజమైన నివాళి ఇవ్వాలి కదా..! తొమ్మిదిన్నరేండ్లల్ల ఎన్ని నోటిఫికేషన్లు పడ్డాయి ఎన్ని పరీక్షలు పెట్టిండ్రు, ఎన్ని రిజల్ట్స్ ఇచిండ్రు.. ఎప్పుడన్నా చూసిండ్రా ఇంత ఘోరం.. లక్షల మంది పిల్లలు కోచింగ్‌ల కోసం అప్పు సప్పు చేసి చదువుకుంటూ, ఎంతోమంది ఆడపడుచులు తమ భర్తలు, పిల్లలను వదిలి, మొగోళ్ళు తమ భార్య పిల్లల్ని వదిలి నిద్రాహారాలు మాని చదివి, పరీక్ష రాత్తే, రెండుసార్లు ఆ పరీక్షలు రద్దు చేస్తే ఆ తప్పు ఎవరిది.. శిక్ష ఎవరికి.. టీఎస్‌పీఎస్‌సీతో మాకు సంబంధం ఏంటి అనే మాట బాధ్యతారాహిత్యమా.. నిర్లక్ష్యమా.. కనీసం రెండోసారి రద్దయినప్పుడన్నా ఆ కమిషన్ ప్రక్షాళన దిశగా ఒక్క పనైనా చేసిండ్రా.. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని పాత చింతకాయ పచ్చడి డైలాగులు చెప్తారా.. ప్రభుత్వంతో టీఎస్‌పీఎస్‌సీకి ఎందుకు సంబంధం లేదు. మీరు పెట్టిన సభ్యులు కాదా మీరు పెట్టిన చైర్మన్ కాదా డైరెక్ట్ గా పైనుంచి ఊడి పడ్డారా ఎంత ఘోరం.. మాట్లాడితే లక్షల ఉద్యోగాలు ఇచ్చినం అని చెప్పే మీరు అవి కాంట్రాక్టువా, ఔట్సోర్సింగ్‌వా అని ఎందుకు చెప్పరు.. వేలమంది అవుట్సోర్సింగ్ వాళ్ళు జీతాలు లేక అలమటిస్తున్నారు. ఆ కాంట్రాక్టర్లు కూడా మీ బినామీలైతే ఇంకెంత దారుణం.. ఎన్ని రోజులు రోడ్ల మీదికి వచ్చారు జీతాల కోసం.. ఇంకా ఏమని ఓటేస్తారు సార్ వాళ్ళు మీకు..
ఉద్యమంల పెద్దమనుషులు..
ఇగ ఉద్యమంల పెద్ద మనుషుల తానకి వద్దాం. అసలు ప్రో!! కోదండరాం సార్ సేసిన పాపం ఏందో ఇప్పటికీ ఎవ్వలకీ ఎరుకయిత లేదు. గప్పట్ల ఎగిలివారంగా తలుపులు తన్ని ఎత్తుకొని పోయిండ్రు పోలీసోళ్లు. మొన్ననేమో ఉద్యోగులంతా భుజాల మీదికి ఎత్తుకుని ఎగురవట్టిండ్రు. గాదె ఇన్నయ్య సారు ఆవేశంగా మాట్లాడుతుంటే ఆయనకు ఆనంద బాష్పాలు వచ్చినయ్. పాశం యాదగిరి సార్, అందెశ్రీ గారు వీళ్ళంతా మాట్లాడుతుంటే వచ్చింది అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్సా లేక తెలంగాణకి స్వాతంత్ర్యమా అనిపిచ్చింది..! ఒకప్పుడు వీళ్ళందరే కదా ఈ తెలంగాణ గడ్డ కోసం కొట్లాడింది, ముందట నిల్చున్నది. కరెంట్ జేఏసీ రఘు లాంటి ఎంతో మంది తెలంగాణ పోరులో మీతో కలిసి నడిచిన వాళ్ళు తర్వాత ఎందుకు కంటికి కనబడలేదు.. ఇంకా ఆ పెద్ద సారు, ప్రొఫెసర్ జయశంకర్ సారు ఉండి ఉంటే... వామ్మో ఊహకి కూడా అందడం లేదు దేవుడా..! సర్కారు నౌకరోళ్లకు కరువు భత్యాలు (DA), PRC లు పక్కకు వెడితే.., పస్టు తారిఖే జీతాలు ఇత్తం అని ఎలక్షన్ హామీల పెట్టే కాడికి ఈ రాష్ట్రం ఎందుకు దిగజారింది.. గివ్వటినుంచెలి మార్పు కోరుకున్నరు జనాలు. అందుకే మార్పయింది. ఆ మార్పు మంచికా చెడుకా అనేది కాలం నిర్ణయిస్తుంది.
డా. విజయ్ కుమార్ చల్లూరి. ఎండీ
పిల్లల వైద్య నిపుణులు
90323 57877