విద్యారంగం మారేది ఎప్పుడు...?

by Ravi |   ( Updated:2024-12-12 01:01:00.0  )
విద్యారంగం మారేది ఎప్పుడు...?
X

ప్రజా ప్రభుత్వం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం పూర్తయింది. ఈ ఏడాదిలో మెగా డీఎస్సీతో ఉపాధ్యాయుల‌ నియామ‌కం, వ‌స‌తి గృహ విద్యార్థుల‌కు డైట్‌ ఛార్జీల పెంపు నిర్ణయం హర్షణీయం. అయితే రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల నుండి పెండింగ్‌లో ఎనిమిది వేల కోట్లపైగా ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు ఉన్నాయి. వీటిని విడుదల చేయడంలో ప్రభుత్వం ఇప్పటికైనా శ్రద్ధ తీసుకోవాలి. విద్యార్థి సంఘాలు, విద్యార్థులు ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు రోడ్లమీదకి ఎక్కినా ప్రభుత్వంలో పెద్దగా చలనం లేదు.

విద్యారంగంలో ఏడాదిలోనే ఇంటిగ్రేటెడ్ రెసి డెన్షియ‌ల్ స్కూళ్ల‌కు ఉన్నత విద్యా కమిషన్ ఏర్పాటు, రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో తీసుకొచ్చిన ముఖ్యమైన మార్పులు. కానీ ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్యారంగం వరకు తీసుకురావాల్సిన సంస్కరణల గురించి ప్రభుత్వ విజన్‌లో మరింత స్పష్టత కనిపించాలి.

ఫీజు నియంత్రణ చట్టం తేవాలి!

గురుకులాలు, పాఠశాలలో, సంక్షేమ వసతి గృహాలలో విద్యాసంస్థల్లో వరుసగా ఫుడ్ పాయిజన్ సంఘటనలతో విద్యార్థులు చనిపోయే పరిస్థితి దాపురించింది. సంక్షేమ వసతిగృహాలు, గురుకులాలుల, ఆశ్రమ పాఠశాలలో ప్రధానం గా ట్రైబల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం, మెనూ పాటించాలి. బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్ధుల ఆత్మహత్యలు ఆగటం లేదు. నాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రేవంత్ రెడ్డి బాసర సమస్యలపై ఆనాడు మాట్లాడిన మాటలు నేడు ఆచరణకు నోచుకోవాలి. మౌలిక సౌకర్యాల కొరత కనబడుతుంది. ప్రధానంగా ఫీజుల నియంత్రణ చట్టం తీసుకొస్తామని ప్రభుత్వం చెప్పిన మాటలు ఆచరణ రూపం దాల్చలేదు. విద్యాసంవత్సరం ప్రారంభం కాకముందే కార్పొ రేట్ విద్యాసంస్థలు అడ్మిషన్లు నిర్వహిస్తున్నా అధికారులు తమకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇంజనీరింగ్, మెడిసిన్ అడ్మిషన్లలో డొనేషన్ పేరు మీద లక్షల రూపాయలు వసూలు చేస్తుంటే కూడా అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తుండడం ఏంటి? కొన్ని కార్పొరేట్ విద్యాసంస్థలు 2025-26 విద్యా సంవత్సరానికి ఇప్పుడే అడ్మిషన్ ప్రక్రియ కూడా చేపడుతున్నాయి.

వర్సిటీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి!

ప్రభుత్వం ఉన్నత విద్యారంగానికి ఉన్నత విద్యా మండలి చైర్మన్, వైస్ చైర్మన్ యూనివర్సిటీలకు వి.సీలను నియమించింది తప్ప అక్కడ ఉన్న సమస్యలపై పెద్దగా దృష్టి పెట్టినట్టు కనబడటం లేదు. స్కిల్ యూనివర్సిటీ మీద ఉన్న శ్రద్ధ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల మీద ఉన్నట్టు లేదు. ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో ఉన్న ప్రధానమైన సమస్యలను తీర్చాలి. పరిశోధనను, ప్రోత్సహించే విధంగా ప్రభుత్వ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించే దిశగా చర్యలు చేపట్టాలి. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు ప్రభుత్వం సమూల మార్పులు తీసుకురావాలి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొత్త కోర్సులను ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ విద్యాలయాల్లో ఉన్నటువంటి ఖాళీలు అన్నింటికి తక్షణమే నోటిఫికేషన్ విడు దల చేసి భర్తీ చేయాలి. విద్యారంగానికి గత ప్రభుత్వానికంటే ఎక్కువ నిధులు కేటాయించారు.. కానీ ఇవి సరిపోవు. రాష్ట్ర బడ్జెట్లో కనీసం విద్యారంగానికి 20 శాతం నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాల హక్కులను హరిస్తున్న నూతన జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలి. విద్యారంగం పైనే భవిష్యత్ తెలంగాణ అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తెరిగి ముందుకు నడవాలి.

ఆర్.ఎల్.మూర్తి

ఎస్ ఎఫ్ ఐ రాష్ట్ర అధ్యక్షులు

82476 72658

Advertisement

Next Story