- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
జీవించే హక్కు అంటే.. పశు ప్రాయంగా బతకడం కాదు!

"బోగీల సామర్థ్యాన్ని మించి టిక్కెట్లు ఎందుకు అమ్మారు?" అన్న ప్రశ్నతో, ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట వ్యాజ్యం విచారిస్తున్న ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం, దేశ ప్రజలందరినీ బట్టలూడదీసి నిలబెట్టింది. "రూపాయి విలువ లేని రోజు రేపు వస్తుందట" అన్న కవి దాశరథి కల నిజం కాబోదు కానీ, ప్రాణానికి విలువ లేని అలగా జనం కథ కొనసాగుతూనే ఉంది.
దేశంలో అడపాదడపా సామాన్యుల మృత్యు ఘంటికలు మ్రోగుతూనే ఉన్నాయి. ఆటోలు మొదలుకుని వివిధ ప్రయాణ సాధనాలలో, చివరికి వ్యక్తుల సొంత వాహనాలలో, అనుమతికి మించి ఉన్న ప్రయాణికులుంటే నేరం. సామర్థ్యానికి మించి వస్తు రవాణా చేస్తే అదీ నేరమే. అలా జరగకుండా చూడడానికి ప్రత్యేక యంత్రాంగాలు ఉన్నాయి. కానీ రైల్వే విషయానికి వస్తే, రైల్వే చట్టం సెక్షన్ 147 అక్రమంగా ప్రయాణికులు రైల్వే బోగీలలో ఎక్కడం లేదా?
సాధారణ టికెట్లకు పరిమితి లేదా?
చట్టబద్ధమైన హక్కు ప్రకారం టికెట్ కొని రైలు ఎక్కి, రైల్వే ఆస్తిని దుర్వినియోగం చేయడం చేస్తే, అది నేరమని, అందుకు ఆరు నెలలకు మించని జైలు శిక్ష, వెయ్యి రూపాయల వరకు జరిమానా లేదా రెండూ విధించవచ్చని, ప్రత్యేక పరిస్థితులలో, తగు కారణాలు ఉత్తర్వులలో పేర్కొంటూ, ఐదు వందలు దాటని జరిమానాతో సరి పెట్టవచ్చని మాత్రమే నిర్దేశిస్తుంది. దానర్థం బోగీల సామర్థ్యంతో నిమిత్తం లేకుండా ఎన్ని టికెట్లయినా రైల్వే అమ్ముకోవచ్చు. అంత్యోదయ ఎక్స్ ప్రెస్ రూట్స్‌లో కూర్చుని సుఖంగా ప్రయాణించడానికి సౌకర్యాలున్న, రిజర్వేషన్ సదుపాయం లేని, అన్నీ సాధారణ బోగీలే ఉన్న రైళ్లు కూడా కొన్ని ఇప్పుడున్నాయి. కానీ, ప్రయాణికుల సంఖ్యను నియంత్రించే విధానం వీటిల్లోనూ లేదు. ఆదిలోనే, నిలబడటానికి కూడా అంగుళం స్థలం లేదని తెలిసినప్పటికీ, రిజర్వ్ చేయని సాధారణ టిక్కెట్ల జారీపై రైల్వే ఎటువంటి పరిమితిని విధించదు. అదే రిజర్వ్ చేసిన బోగీల విషయంలో వెయిటింగ్ జాబితా నిండిన తర్వాత టిక్కెట్లు ఇవ్వబడవు!
రెండు రకాల ప్రయాణికులతో..
నిజానికి రైలు ప్రయాణికులలో అత్యధికులు ప్రయాణించేది సాధారణ బోగీల్లోనే! మంది పడే ఇబ్బంది మనలాంటి వాళ్లకు ఏర్పడకుండా మాత్రం విధి విధానాలు ఉన్నాయి. ముందుగా ప్రయాణంలో బెర్తులు ఖరారు చేసుకున్న వారికే ఆ బోగీలలో ప్రవేశం. వేరెఎవరైనా బోగీలో ప్రవేశిస్తే, మనం ఫిర్యాదు చేయవచ్చు. తనిఖీల్లో పట్టుబడితే, బోగీ నుండి దింపేయవచ్చు. జరిమానాలు విధించవచ్చు. అంతేనా తగు మొత్తం చెల్లిస్తే మనం బజ్జోడానికి మెత్తలు పరిచిన బెర్తులు ఆహ్వానిస్తాయి. ఇంకొంచెం ఖర్చు పెట్టగలిగితే, ఎంచక్కా ఏ.సి. సౌకర్యంతో ప్రయాణించవచ్చు. తాజాగా ఉతికి ఇస్త్రీ చేసిన దుప్పట్లు, తలగడలు అమరుతాయి. అందులోనూ మళ్లీ పిండి కొద్దీ రొట్టె లాగా, మూడు, రెండు, ఒకటి తరగతులుంటాయి. అస్మదీయులకి అసౌకర్యం కలగకుండా చూడడానికి, ప్రత్యేకంగా మనతో పాటే ప్రయాణించే ఉద్యోగి కూడా ఉంటారు. అదే సయమంలో మనిషి కదలలేనంత కిక్కిరిసిన బోగీలలో, పాయిఖానాలలో, సామాన్లు భద్రపరచడానికి ఉద్దేశించిన పైనుండే చెక్క బల్లల పైన, కింద కష్టాలు పడుతూ, పిల్లలూ, వృద్ధులూ, రోగులు, గర్భిణీలూ సహా " దేవుడా నీవే దిక్కు" అనుకుంటూ రైలు ప్రయాణం చేస్తుంటే, కొండొకచో రైలు పెట్టెల కప్పు పైన లేదా గుమ‌్మాలకు వ్రేలా డుతూ ప్రమాదాలకు తావిస్తుంటే, సభ్య సమాజానికి చీమకుట్టినట్టేనా ఉండడం లేదు. వార్తా పత్రికలలో, వార్తా చానళ్లలో పతాక శీర్షికలూ, బ్రేకింగ్ న్యూస్‌లూ చదివీ, వినీ నిట్టూర్చడం, లేదా "తెల్లారి లేస్తే చావు కబుర్లే" అని విసుక్కోవడం తప్ప, "ఇదేం న్యాయం" అని ప్రశ్నించే బలమైన గొంతులే వినబడడం లేదు.
మనకు చీమకుట్టినట్టేనా ఉండదు!
బెంగళూరులోని ఒక సినిమా హాలు 30 నిమిషాలపాటు వాణిజ్య ప్రకటనలు ప్రదర్శించి, ప్రేక్షకుల సమయాన్ని వృధా చేసిందని, అది అసమంజస వ్యాపార పద్ధతని ఒకరు ఫిర్యాదు చేస్తే, సంబంధిత జిల్లా వినియోగదారుల పరిష్కార కమిషన్, ఫిర్యాదీ మానసిక వేదనకు పరిహారంగా ₹.20,000/-, చట్టపరమైన ఖర్చులకు గాను మరో ₹.8,000/, శిక్షాపరమైన నష్టపరిహారం కింద లక్ష రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. మరి వినియోగదారుల పరిరక్షణ చట్టం సెక్షన్ 2(42) ప్రకారం తన ప్రయాణ నిమిత్తం రైల్వే టికెట్ ఉన్న ప్రయాణికుడు వినియోగదారుడుగానే పరిగణించబడతాడు. రైలు ప్రయాణికుల క్షోభ ముందు, ఈ ప్రేక్షకుని మానసిక వేదన ఏ పాటి? అయినా అదంతా చూసిన, తెలిసిన మనకి చీమకుట్టినట్టేనా ఉండదు! అనేక తీర్పులలో భారత సర్వోన్నత న్యాయస్థానం రాజ్యాంగం ఆర్టికల్ 21 భారత పౌరులకు ప్రసాదించిన జీవించే హక్కు కేవలం పశు ప్రాయంగా బతకడం కాదని, అంతకంటే ఎంతో అధికమని, అది ప్రాథమిక హక్కు అని పలుసార్లు ప్రకటించింది. జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛకు హామీ ఇచ్చే రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఖైదీలకు కూడా వర్తిస్తుందని, అంటే వారు ఖైదు చేయబడినప్పటికీ ప్రాథమిక మానవ గౌరవానికి అర్హులని భారత సర్వోన్నత న్యాయస్థానం తేల్చింది. మరి సాధారణ బోగీల ప్రయాణికులు ఇందుకు నోచుకోకపోయినా మనకు పట్టదు.
గౌరవ జీవనానికి భంగం కలగకుండా..
మన ఈ ఉదాసీనతకు, వారూ మన సాటివారు కాకపోయినా, మన తోటివారన్న స్పృహ లేనందుకు, అందరం సిగ్గుతో తలదించుకోవాలి. ఇప్పటికైనా పౌర హక్కుల సంఘాలు, దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే వినియోగదారుల సలహా సంఘాలు, శాసన కర్తలు, ఈ విషయమై తక్షణమే దృష్టి పెట్టాలి. నిర్దిష్ట కాలపరిమితితో సాధారణ బోగీలలోనూ రాజ్యాంగం నిర్దేశించిన గౌరవ జీవనానికి భంగం కలగకుండా ప్రయాణించే హక్కు ఆచరణ రూపం దాల్చాలి. అప్పుడే ఈ మూక(గ) జీవాలకు ముక్తి లభిస్తుంది.
- మల్లాప్రగడ రామారావు
9989863398