Collegium: కొలీజియం అంటే ఏంటి? కేంద్ర ప్రభుత్వానికి, న్యాయవ్యవస్థ ఘర్షణకు కారణాలేంటి?

by Ravi |   ( Updated:2022-12-21 01:55:39.0  )
Collegium: కొలీజియం అంటే ఏంటి? కేంద్ర ప్రభుత్వానికి, న్యాయవ్యవస్థ ఘర్షణకు కారణాలేంటి?
X

అభివృద్ధి చెందిన అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ లాంటి దేశాలలో న్యాయమూర్తులను పాలకులే నియమిస్తారు. కానీ, ఈ దేశాలు పూర్తిగా భిన్నమైనవి. వీటిని ఆదర్శంగా తీసుకోవచ్చా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది? మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో రాజకీయ జోక్యం వ్యవస్థలను నాశనం చేసే అవకాశం లేకపోలేదు. కొలీజియం వ్యవస్థపై పున: సమీక్ష చేయాలని కోరుతూ 2019లో సుప్రీంకోర్టు అడ్వకేట్స్‌తో పాటు ఇతరులు కేసు వేశారు. కానీ, సుప్రీంకోర్టు దానిని తోసిపుచ్చింది. తిరిగి ఈ మధ్యనే కేంద్ర న్యాయ శాఖ మంత్రి రిజిజు కొలీజియం పద్ధతిపై మార్పులు, చేర్పులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ ఒక అవగాహనకు రాకపోతే ఇబ్బందే.

న దేశ రాజ్యాంగం ప్రకారం న్యాయవ్యవస్థకు స్వయం ప్రతిపత్తి కల్పించబడింది. రాజ్యాంగంలోని 50వ అధికరణం ప్రకారంగానే శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలను వర్గీకరించారని న్యాయ కోవిదుడు మాన్ టెక్యూ వివరించారు. అయితే, కొన్ని నెలలుగా కొలీజియం మీద దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకు, కేంద్ర ప్రభుత్వానికి, న్యాయ వ్యవస్థకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. ఇటీవల రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ శ్రీ రాజీవ్ శుక్లా తో పాటు పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు(kiran rijiju) సమాధానమిస్తూ కొలీజియం వ్యవస్థ ద్వారా న్యాయమూర్తుల నియామక విధానం మారనంత కాలం అత్యున్నత న్యాయ వ్యవస్థలో ఖాళీలు తప్పవని అన్నారు. ఈ నెల తొమ్మిది వరకు 25 హైకోర్టులలో 1,108 న్యాయమూర్తుల పోస్టులు మంజూరు అయి ఉంటే, 777 మంది న్యాయమూర్తులు పని చేస్తున్నారని చెప్పారు. ఇంకా 331 ఖాళీలు ఉన్నాయని వివరించారు.

రాజ్యాంగం ప్రకారం న్యాయమూర్తుల నియామకం 1993 వరకు ప్రభుత్వం చేతిలో ఉండేదని, 1993 తర్వాత ఈ పరిస్థితి మారిందని తెలిపారు. 2014లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (National Judicial Appointments Commission) చట్టాన్ని పునరుద్ధరించే ఆలోచన ఉందా? అని అడగగా సూటిగా జవాబివ్వలేదు. అయితే, పార్లమెంట్ ఉభయసభలు ఎన్‌జేఏసీ(NJAC) చట్టాన్ని ఏర్పాటు చేయాలని నాడు ఏకగ్రీవంగా నిర్ణయించాయంటూ, ఈ చట్టాన్ని మూడింట రెండోవంతు రాష్ట్రాలు కూడా ఆమోదించాయని ప్రకటించారు.

పారదర్శకత, జవాబుదారీతనం కోసం

కొలీజియం వ్యవస్థలో ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సమూహం ఉంటుంది. దేశ ప్రధాన న్యాయమూర్తి చైర్మన్‌గా, మరో నలుగురు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు సభ్యులుగా ఉంటారు. కానీ, మన రాజ్యాంగంలో కొలిజీయం వ్యవస్థ(collegium system) గురించి ఎక్కడా చెప్పబడలేదు. ఇది కేవలం సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా ఏర్పడింది. ప్రభుత్వానికి ఇందులో పరిమిత పాత్రే ఉంటుంది. న్యాయమూర్తుల నియామకంపై ప్రభుత్వం అభ్యంతరం తెలపవచ్చు. కానీ, కొలీజియం మరోసారి అదే పేరును సిఫారసు చేస్తే ఆమోదించడం తప్ప వేరే మార్గం లేదు. న్యాయమూర్తులను న్యాయమూర్తులే నియమించుకోవడం ఊమిటనేది ఇందులో ఉన్న ప్రధాన ప్రశ్న. పారదర్శకత లేకుండా, ఎలాంటి రికార్డు లేకుండా, రహస్యంగా న్యాయమూర్తులను నియమిస్తున్నారనేది ప్రధాన విమర్శ. అందుకే, కొలీజియం విసృతంగా, పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఉండేలా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2014లో 'జాతీయ న్యాయ నియామకాల కమిషన్' చట్టాన్ని తీసుకొచ్చింది.

ఈ చట్ట ప్రకారం న్యాయమూర్తుల బదిలీలను ఈ కమిషన్ చూసుకుంటుంది. ఈ కమిషన్‌లోనూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు సభ్యులుగా ఉంటారు. వీరితో పాటు కేంద్ర న్యాయ శాఖ మంత్రి, ఇద్దరు సీనీయర్ న్యాయ నిపుణులు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారు. వీరిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రి, లోక్ సభలో విపక్ష నేతతో కూడిన కమిటీ ఎంపిక చేస్తుంది. ఈ ప్రతిపాదనను 2015 అక్టోబర్ లో ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం 4:1 తేడాతో కొట్టివేసింది. ఈ చట్టం నేరుగా రాజ్యాంగ ఉల్లంఘనే అని వ్యాఖ్యానించింది. రాజ్యాంగానికి తీసుకొచ్చిన ఈ 99వ సవరణ చెల్లనేరదని స్పష్టం చేసింది. ప్రస్తుతం మన దేశానికి కొలీజియం వ్యవస్థే సరైనదంటూ తీర్పునిచ్చింది.

ప్రజాతీర్పు శిరోధార్యం

ప్రపంచంలో ఎక్కడా కొలిజీయం పద్ధతి ద్వారా న్యాయమూర్తుల నియామకం జరగడం లేదు. ఫోర్త్ జడ్జెస్ కేసులో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అనిల్ దవే, జస్టిస్ మదన్ లోకూర్, జస్టిస్ కురియన్ జోసస్, జస్టిస్ ఏకే గోయల్, జస్టిస్ చలమేశ్వర్‌తో కూడిన బెంచ్‌లో జస్టిస్ చలమేశ్వర్ మాత్రమే ఈ కొలీజియం వ్యవస్థపై విముఖత చూపారు. మిగిలిన న్యాయమూర్తులు మాత్రం 'రాజ్యాంగ అధికరణ లేకపోయినా, న్యాయవ్యవస్థకు స్వయం ప్రతిపత్తి ఇవ్వబడిందని, న్యాయమూర్తుల నియామకంలో రాజకీయ నాయకుల ప్రమేయం ఉంటే అది వ్యవస్థకు హాని కలుగుతుందని' చరిత్రత్మాక తీర్పును వెలువరించారు. నిజానికి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాతీర్పు శిరోధార్యం. ప్రజలచే ఎన్నుకోబడిన పాలకులు వ్యవస్థలను ప్రజల అభిప్రాయానుసారంగా ఉపయోగించవచ్చు. వారు ప్రజలకు జవాబుదారీగా ఉంటారు. అభివృద్ధి చెందిన అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ లాంటి దేశాలలో న్యాయమూర్తులను పాలకులే నియమిస్తారు. కానీ, ఈ దేశాలు పూర్తిగా భిన్నమైనవి. వీటిని ఆదర్శంగా తీసుకోవచ్చా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది?మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో రాజకీయ జోక్యం వ్యవస్థలను నాశనం చేసే అవకాశం లేకపోలేదు.

కొలీజియం వ్యవస్థపై పున: సమీక్ష చేయాలని కోరుతూ 2019లో సుప్రీంకోర్టు అడ్వకేట్స్‌తో పాటు ఇతరులు కేసు వేశారు. కానీ, సుప్రీంకోర్టు దానిని తోసిపుచ్చింది. తిరిగి ఈ మధ్యనే కేంద్ర న్యాయ శాఖ మంత్రి రిజిజు కొలీజియం పద్ధతిపై మార్పులు, చేర్పులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ ఒక అవగాహనకు రాకపోతే ఇబ్బందే. ఇప్పటికే వివిధ న్యాయస్థానాలలో దాదాపు 4 కోట్ల 30 లక్షల కేసులు పేరుకుపోయాయి. దీంతో ప్రజలలో న్యాయ వ్యవస్థ మీద పూర్తిగా నమ్మకం కోల్పోయే ప్రమాదం లేకపోలేదు.


డా. జట్లింగ్ ఎల్లోసా

న్యాయశాస్త్ర సహ ఆచార్యులు

టీయూ, నిజామాబాద్

83094 74145


పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672.

Also Read... .

Revanth Reddy: ఒరిజినల్ కాంగ్రెస్ వర్సెస్ వలస కాంగ్రెస్! రేవంత్ పరిస్థితేంటి?

Advertisement

Next Story

Most Viewed