జల సంరక్షణే... భవిష్యత్ రక్షణ

by Ravi |   ( Updated:2024-06-20 00:46:02.0  )
జల సంరక్షణే... భవిష్యత్ రక్షణ
X

నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం 2030 నాటికి దేశంలో తాగునీటి సరఫరా కంటే అవసరం రెండింతలు ఉంటుందని, నీటి కొరత కారణంగా దేశ స్థూల దేశీయోత్పత్తిలో 6 శాతం తగ్గుదల నమోదు కావొచ్చని కూడా అంచనా వేసింది. ప్రపంచ జనాభాలో 18 శాతం ఉన్న భారతదేశం వాటా మంచి నీటి వనరుల్లో నాలుగు శాతం మాత్రమేనన్న సత్యాన్ని గమనించాలి. 2018లో నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో సుమారు 60 కోట్ల మంది తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. దేశంలోని 24 రాష్ట్రాల్లో పరిశీలన జరిపి నీతి ఆయోగ్ ఈ విషయం వెల్లడించింది. అంతేకాదు 21 నగరాలు తాగునీటి విషయంలో పెను ప్రమాదం అంచున ఉన్నాయని హెచ్చరించింది. ఆయా నగరాల్లో తాగునీటి అవసరాలు రోజురోజుకు పెరుగుతుండగా అక్కడి భూగర్భ జలాలు మాత్రం అంతకంటే వేగంగా అడుగంటుతున్నాయని తేల్చింది.

సంక్షోభం అంచున భారత్!

సెంట్రల్ వాటర్ కమిషన్ నిర్వహించిన అధ్యయనం ఆధారంగా, 2021 మరియు 2031 సంవత్సరాల్లో సగటు వార్షిక తలసరి నీటి లభ్యత వరుసగా 1486 క్యూబిక్ మీటర్లు. 1367 క్యూబిక్ మీటర్లుగా అంచనా వేయబడింది. 1700 క్యూబిక్ మీటర్ల కంటే తక్కువ వార్షిక తలసరి నీటి లభ్యత ఉంటే అది నీటి ఒత్తిడి పరిస్థితిగా పరిగణించబడుతుంది. జనాభా పెరుగుదల కారణంగా దేశంలో తలసరి నీటి లభ్యత తగ్గుతోంది. పారిశుధ్యం, తాగునీటి పురోగతిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), యూనిసెఫ్ కలిసి అధ్యయనం చేసి విడుదల చేసిన నివేదిక సైతం భవిష్యత్తులో తీవ్రస్థాయి జల సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. నీతి ఆయోగ్ జల యాజమాన్య సూచిలో గుజరాత్ ప్రథమ స్థానంలో నిలవగా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. జల యాజమాన్యం విషయంలో అట్టడుగున ఉన్న ఉత్తర్‌ప్రదేశ్, హర్యానా, బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లోనే దేశ జనాభాలో సుమారు సగం మంది నివసిస్తుండడం ఆందోళనకర అంశం. అంతేకాదు, వ్యవసాయ ఉత్పాదకత ఈ రాష్ట్రాల్లోనే ఎక్కువ. ఇలాంటి రాష్ట్రాలు జల యాజమాన్యంలో వెనుకబడడం ఆందోళనకరం. గత ఖరీఫ్ సీజన్లో మొత్తం సాగు భూమిలో 25 శాతం కరువు బారిన పడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు, రాజస్థాన్, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు జిల్లాలలో తాగునీటి కటకట ఏర్పడింది. దేశంలోని 150 జలాశయాల్లో నీటి నిల్వ సామర్థ్యం 17,900 కోట్ల ఘనపు మీటర్లు కాగా ప్రస్తుతం 5,040 కోట్ల ఘనపు మీటర్ల మేరకే నీటి లభ్యత ఉంది. నీటి నిల్వలు గత పదేళ్ల సగటు కంటే తక్కువకు పడిపోయాయి.

నీటి సంరక్షణలో విఫలం ...

రుతుపవనాల అపసవ్యత వలన ఒకసారి అతివృష్టి, మరోసారి అనావృష్టి ఏర్పడుతోంది. వాతావరణ శాఖ వెలువరించిన గణాంకాలను పరిశీలిస్తే గత నలభై ఏళ్లుగా దేశంలో సగటు వర్షపాతంలో హెచ్చుతగ్గులు ఉంటున్నాయి తప్పితే వర్షపాతంలో క్షీణత లేదన్నది స్పష్టం అవుతోంది. గత ఏడాది జూన్‌లో సాధారణంగా, ఆగష్టు డిసెంబర్ మాసాల్లో భారీగా వానలు పడి ప్రాజెక్టులు నిండినా, ఏడాది గడవక ముందే జలాశయాలు అడుగంటి నీటి ఎద్దడి ఏర్పడింది. ఒకేడాది వరద తాకిడికి గురైన రాష్ట్రాలు మరుసటి ఏడాది నీటి ఎద్దడి ఎదుర్కుంటున్నాయంటే దానికి కారణం జల వనరుల నిర్వహణలో ప్రభుత్వాల వైఫల్యమే. జలాశయాలు నిండుతున్నప్పటికి ప్రాజెక్టుల నిర్వహణ లోపం, కట్టలు దెబ్బతినడం వల్ల చాలా నీరు సముద్రం పాలై రబీ పంటకు అవసరమైన నీరు అందించలేని పరిస్థితి. అలాగే లీకేజీ వలన, విద్యుదుత్పత్తి, పరిశ్రమల అవసరాల కోసం నీటి వినియోగం పెరుగుతోంది. విదేశీ వాతావరణ సంస్థలతో పాటు మన దేశానికి చెందిన స్కైమెట్ సంస్థ కూడా ఎల్ నినో ప్రభావం తగ్గటం వలన భారత్‌లో ఈసారి నైరుతి రుతుపవనాలతో సాధారణ వర్షపాతం నమోదు అవుతుందన్న అంచనాలు వెలువరించాయి. భారతదేశం వ్యవసాయ ప్రాధ్యాన్య దేశం. దేశంలో లభ్యమవుతున్న నీటి వనరులలో 85 శాతం పంటల సాగుకి, ఆ తర్వాత గృహావసరాలు, పారిశ్రామిక రంగాలు నీటిని అత్యధికంగా వినియోగించుకుంటున్నాయి. దేశంలో ప్రస్తుతం నీటి కొరత పెరగడానికి తోడవుతున్న అంశాల్లో సాగునీటి రంగం పాత్ర కీలకంగా ఉందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

బహుముఖ చర్యలు అవసరం

తరుముకొస్తున్న నీటి ఎద్దడిని అరికట్టాలంటే స్వల్పకాలిక, దీర్ఘకాలిక జల రక్షణ వ్యూహాలను అనుసరించాలి. నీటిపారుదల వ్యవస్థలను బలోపేతం చేయాలి, ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పటిష్టీకరించుకోవాలి. వాననీటి సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రభుత్వ పరంగా వ్యవసాయ రంగాన్ని సాగునీటిని తక్కువగా వినియోగించుకునే పంటలవైపు మళ్లించడం, రాయితీలు ఇచ్చి సూక్ష్మ నీటి సేద్యం, తుంపర, బిందు సేద్యం వంటి ఆధునిక పద్ధతులు అనుసరించేలా రైతులను ప్రోత్సహించడం చేయాలి. నగరాలు, పట్టణాల్లో చిన్న నీటి వనరులను పునరుద్ధరించడంతో పాటు, అంతర్ధానం అవుతున్న సరస్సులు, చెరువులు, కుంటలను సంరక్షించాలి. స్థానిక నీటి వనరులను పునరుద్ధరించుకోవాలి, చిన్న చిన్న ఆనకట్టలు, చెక్ డ్యాంలు నిర్మించి స్థానికంగా భూగర్భ జల మట్టాలను పెంచాలి. వర్షాకాలంలో కురిసే ప్రతి నీటి బొట్టునూ భూమిలోకి ఇంకెలా జాగ్రత్త పడాలి. నీటి వనరులను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజం సమన్వయంతో కదలి నీటి సంరక్షణ, పొదుపు తక్షణావసరమన్న విషయాన్ని ప్రజలకు వివరించాలి. నీటిని పొదుపుగా వాడటం, వ్యర్ధ జలాలను పునర్వినియోగం, ప్రతి వర్షపు బొట్టును సంరక్షించడం, బిందు సేద్యం వంటి బహుముఖ చర్యలతో జల సంక్షోభాన్ని అధిగమించవచ్చు.

- లింగమనేని శివరామ ప్రసాద్

7981320543

Advertisement

Next Story

Most Viewed