సామాజిక సంక్షేమానికి తగ్గిన కేటాయింపులు

by Ravi |   ( Updated:2025-02-05 00:46:03.0  )
సామాజిక సంక్షేమానికి తగ్గిన కేటాయింపులు
X

ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్‌లో పేదరిక నిర్మూలన, రైతులు, మహిళల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు ప్రకటించారు. కానీ వాస్తవ స్థితి అందుకు విరుద్ధంగా ఉంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో, కొవిడ్-19 ప్రభావంతో సామాజిక రంగానికి భారీగా 30% వ్యయం కేటాయించబడగా, జీడీపీలో 5.3% వాటా ఉండేది. కానీ, కొవిడ్ ప్రభావం తగ్గిన తర్వాత ఈ వాటాలు క్రమంగా తగ్గుముఖం పట్టి 2023-24 నాటికి స్థిరంగా కొనసాగుతున్నాయి. 2025-26 బడ్జెట్ ప్రకారం, సామాజిక రంగం వ్యయం ప్రభుత్వ మొత్తం ఖర్చులో 19%గా ఉండగా, జీడీపీలో ఇది 2.6% మాత్రమే ఉంది. ఇది ప్రపంచ స్థాయిలో సామాజిక రంగ ఖర్చు తక్కువగా ఉన్న దేశాల జాబితాలో మన స్థితిని ప్రతిబింబిస్తుంది.

కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ప్రవేశపెట్టే యూనియన్ బడ్జెట్, దేశ పౌరుల జీవితాలను ప్రత్యక్షంగా ప్రభావితం చేసే కీలక ఆర్థిక పత్రం. బడ్జెట్‌లోని ప్రతి నిర్ణయం - ఉపాధి హామీ చట్టం, ఆహార భద్రతా చట్టం, సామాజిక భద్రతా పెన్షన్లు మొదలైన వాటికి కేటాయించే నిధులు - ప్రజల దైనందిన జీ వితాలపై గణనీయమైన ప్రభావం చూపుతా యి. ప్రజలు బడ్జెట్‌ను అర్థం చేసుకోవడం ద్వారా ప్రభుత్వ ఖర్చులో పారదర్శకతను పరిశీలించి, తమ హక్కులను కాపాడుకోగలరు.

ఉపాధి హామీ పథకం

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేదరిక నిర్మూలనలో కీలక పాత్ర పోషిస్తోంది. అయితే, యూనియన్ బడ్జెట్‌లో గత సంవత్సరంలో కేటాయించిన ₹86,000 కోట్లను పెంచలేదు. జీడీపీలో భాగంగా చూస్తే, గత ఆర్థిక సంవత్సరంలో ఇది 0.26% ఉండగా, ఈసారి 0.24%కి తగ్గిపోయింది, ఇది గత ఐదేళ్లలో అతి తక్కువ స్థాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన నిధులు ఇప్పటికే పూర్తిగా ఖర్చయ్యాయి, అయినప్పటికీ అదనపు కేటాయింపులు చేయలేదు. జనవరి 27 నాటికి ఉన్న డేటా ప్రకారం, ఉపాధి హామీ బకాయిలు రూ.11,423 కోట్లకు చేరుకున్నాయి. ఇంకా ఆర్థిక సంవత్సరం ముగియడానికి రెండు నెలలు మిగిలి ఉండటంతో, ఈ బకాయిలు మరింత పెరిగే అవకాశం ఉంది. 2025-26 కోసం కేటాయించిన రూ.86,000 కోట్లలో దాదాపు 15-20%ను 2024-25 బకాయిలు తీర్చడానికే వినియోగించాల్సి ఉంటుంది. దీంతో 2025-26కి అందుబాటులో ఉండే నికర కేటాయింపు రూ.70,000 కోట్లకు పరిమితం కావచ్చు. ఈ తక్కువ బడ్జెట్ ఉపాధి హక్కుకు ఆటంకం ఏర్పడటమే కాకుండా, పని డిమాండ్‌ను కూడా దెబ్బతీస్తుంది. ఇది వేతన చెల్లింపుల్లో ఆలస్యానికి దారితీసి, గ్రామీణ కార్మికుల ఆర్థిక పరిస్థితిని మరింత కష్టతరం చేస్తుంది.

ఆహార భద్రతా చట్టం

2021లో జరగాల్సిన జన గణన జరగకపోవడంతో, ఆహార భద్రతా చట్టం అమలు నుండి దేశవ్యాప్తంగా దాదాపు 10 కోట్ల మంది దూరమయ్యారని ‘రైట్ టు ఫుడ్ క్యాంపెయిన్’ అంచనా వేసింది. ఈ నేపథ్యం లో, ఆహార భద్రతా చట్టం కేటాయింపులు పెంచాలని పౌర సమాజం నిరంతరం డిమాండ్ చేస్తూ వస్తోంది. అయితే, ప్రభుత్వం పెంచకపోవడం దురదృష్టకరం.

పీఎం జన్‌మన్ పథకం

అత్యంత వెనుకబడి ఉన్న ఆదిమ గిరిజన సముదాయాల కోసం కేంద్ర ప్రభుత్వం 2023 నవంబరులో ‘పీఎం జన్మన్’ పథకం ప్రకటించినప్పుడు, వారి జనాభా 28 లక్షలుగా అంచనా వేసింది. అయితే, 2024 జూలై నాటికి ఈ సంఖ్య 44.71 లక్షలకు పెరిగింది. అందువల్ల, ఈ బడ్జెట్‌లో ఆ మేరకు పథకం కేటాయింపులు పెరుగుతాయని ఆశించారు. కానీ, ఊహించిన విధంగా కేటాయింపుల్లో మార్పు జరగలేదు. 2025-26 కేటాయింపు గత సంవత్సరంతో పోల్చితే రెట్టింపు అయినట్లు కనిపించినా, పథకం ప్రకటించినప్పుడు కేటాయించిన రూ.24,000 కోట్లకు లోబడే కేటాయింపు జరిగింది.

సామాజిక భద్రతా పెన్షన్లు

కేంద్ర బడ్జెట్‌లో సామాజిక భద్రత పెన్షన్లకు కేటాయించిన నిధులు గత ఏడాదితో పోలిస్తే పెరగకపోవడం నిరాశాజనకంగా ఉంది. దేశం మొత్తానికి కేవలం రూ.9,600 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇది ఆంధ్రప్రదేశ్ పెన్షన్ బడ్జెట్‌లో మూడవ వంతు కంటే, అలాగే తెలంగాణ బడ్జెట్ కంటే కూడా తక్కువ. సామాజిక భద్రత పెన్షన్లకు మరింత నిధులు కేటాయించాల్సిన అవ సరం స్పష్టంగా ఉన్నా, కేంద్ర ప్రభుత్వం దీనిపై నిర్లక్ష్యం చూపడం బాధాకరం.

బడ్జెట్‍లో మెరుగైన అంశాలివి

ఐతే ఈ బడ్జెట్‌లో సంక్షేమానికి సంబం ధించి చెప్పుకోదగిన అంశాలు లేకపోలేదు. గిగ్ వర్కర్లను ఇప్పుడు పీఎం జన ఆరోగ్య యోజన పరిధిలోకి తీసుకువచ్చారు. దానివలన దాదాపు 1 కోటి మంది కార్మికులు ప్రయోజనం పొందనున్నారు. అలాగే, స్టార్టప్‌లకు, మొదటిసారి వ్యాపారాన్ని ప్రారంభిస్తున్న వారికి మద్దతుగా రూ.10,000 కోట్ల నిధిని ఏర్పాటు చేశారు. దానివలన స్వయం ఉపాధి కోరుకున్న వారికి మంచి వార్త. మొత్తంగా చూస్తే, ఈ బడ్జెట్‌లో కొన్ని సానుకూల మార్పులున్నప్పటికీ, ప్రాథమిక సంక్షేమ రంగాలకు అవసరమైన ప్రాధాన్యత లభించలేదు. ముఖ్యంగా ఉపాధి హామీ, ఆహార భద్రత, సామాజిక భద్రతా పెన్షన్ రంగాల్లో తగిన నిధుల కొరత గ్రామీణ పేద ప్రజల జీవనోపాధిపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. భవిష్యత్తులో మరింత సమతుల్యమైన బడ్జెట్ రూపకల్పన కోసం ప్రభుత్వ ఖర్చులను పారదర్శకంగా సమీక్షించడం, ప్రజా ఒత్తిడిని పెంచడం అవసరం.

చక్రధర్ బుద్ధ

సీనియర్ పరిశోధకులు

92465 22344

Next Story