అనాలోచితంతోనే అనర్థం

by Viswanth |   ( Updated:2022-09-03 15:23:20.0  )
అనాలోచితంతోనే అనర్థం
X

తాజాగా అగ్నిపథ్ విషయాన్నే తీసుకుంటే, లోతైన అధ్యయనం జరిపి దాని గురించి ప్రజలకు అర్థం చేయించి ఆ తర్వాత అమలులోకి తెచ్చినట్లయితే అనేక రాష్ట్రాలలో హింసాత్మక చర్యలు జరిగేవే కాదు. యువతలో అశాంతిని, సమాజంలో హింసను నివారించి ఉండొచ్చు. కోట్లాది ఉద్యోగాలిస్తామని హామీలిచ్చి గాలికి వదిలేసిన ప్రభుత్వంపై యూత్ ఆగ్రహంతో ఉన్నారు. కరోనా తర్వాత ఉపాధి అవకాశాలూ సన్నగిల్లాయి. రక్షణ శాఖలో రిక్రూట్‌మెంట్‌పై గంపెడాశలు పెట్టుకున్న యువతను అగ్నిపథ్ నిర్ణయం దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆశల్ని వమ్ము చేసిందనే ఆగ్రహం వారిని రోడ్డెక్కించింది. నిరుద్యోగ తీవ్రత ఏ స్థాయిలో ఉన్నదో ఈ ఆందోళనలు అద్దం పడుతున్నాయి. ఆర్మీలోకి ఉత్తరాది నుంచే ఎక్కువ రిక్రూట్‌మెంట్లు జరుగుతుంటాయి. సహజంగానే ఆందోళనకు ఆ రాష్ట్రాలు కేంద్ర బిందువులుగా మారాయి.

ధికారంలో ఉన్న రాజకీయ పార్టీలకు అహంకారం పెరుగుతున్నది. కేంద్రంలోనూ, రాష్ట్రాలలోనూ అధికార పార్టీలకు ఇది ఒక లక్షణంగానే అలవడింది. సంఖ్యా బలం ఉన్నది కాబట్టి ఏది చేసినా చెల్లుబాటు అవుతుందనే ధోరణి పెరిగిపోయింది. ఏకపక్ష నిర్ణయాలు అలవాటుగా మారడంతో అనర్ధాలకు కారణమవుతున్నాయి. ఫలితంగా పర్యవసానాలను అనుభవిస్తున్నాయి. అందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. జాతీయ స్థాయిలో నోట్ల రద్దు మొదలు అగ్నిపథ్ వరకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు బెడిసికొట్టాయి. ప్రజల ఆగ్రహాన్ని చవిచూడక తప్పలేదు.

రాష్ట్రస్థాయిలోనూ ధరణి, భూసేకరణలో నిర్లక్ష్యం అధికార టీఆర్ఎస్ పార్టీకి సంకటంగా మారింది. అధికారంలోకి రాగానే ప్రజలిచ్చిన తీర్పు మరింత బాధ్యతను పెంచిందంటూ పార్టీలు గొప్పగా చెప్పుకుంటుంటాయి. అహంకారం అసలే పనికిరాదని, ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలని వల్లె వేస్తుంటాయి. కానీ, అది మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలిపోతుంది. ఐదేళ్ల వరకు ఢోకా లేదని విర్రవీగుతుంటాయి. ఇష్టారాజ్యంగా పాలన సాగిస్తుంటాయి. అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. చివరకు అవి బెడిసికొట్టి ప్రజల ఆగ్రహాన్ని చవిచూస్తున్నాయి. అందుకే ఈ మధ్య చాలా పార్టీలు రెండుసార్లకు మించి అధికారంలో కొనసాగలేకపోతున్నాయి. తమిళనాడు లాంటి కొన్నిచోట్ల ఒక్కసారికే గద్దె దిగాల్సి వస్తున్నది.

వివాదాస్పద నిర్ణయాలు

నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత తీసుకున్న పలు నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. తొలుత నిర్ణయాలు తీసుకోవడం, ఆ తర్వాత ప్రజల వ్యతిరేకతకు అనుగుణంగా సవరణలు చేయడం రెగ్యులర్ ప్రాక్టీసుగా మారింది. 'చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న' చందంగా తయారైంది. నోట్ల రద్దు, జీఎస్టీ, సీఏఏ, లాక్‌‌డౌన్, వ్యవసాయ చట్టాలు, అగ్నిపథ్ లాంటి అనేక నిర్ణయాలు ఆ కోవకు చెందినవే. ఆ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చాయి. ప్రజాగ్రహం పెల్లుబుకడంతో కొన్నింటిని ప్రభుత్వం రద్దు చేసుకున్నది. మరికొన్నింటిని తాత్కాలికంగా కోల్డ్ స్టోరేజీలో పెట్టింది. ఇంకొన్నింటికి సవరణలు చేయాల్సి వచ్చింది.

నిర్ణయం తీసుకునే ముందు లోతుగా అధ్యయనం చేయకపోవడం, పర్యావసనాల గురించి అంచనా వేయలేకపోవడం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. సంబంధితవర్గాలతో సంప్రదింపులు జరపకపోవడం, వారిని భాగస్వాములను చేయకపోవడంతో ఈ పరిణామాలు తప్పడం లేదు. దీంతో అవి సమాజంలో అశాంతికి కారణమవుతున్నాయి. కనీసం ప్రతిపక్షాలతో చర్చలు జరిపి సూచనలు, సలహాలు, అభిప్రాయాలను తీసుకునే సంప్రదాయాన్నీ పార్టీలు మర్చిపోయాయి. చట్టసభలలో బిల్లులపై అర్థవంతమైన చర్చలు జరపకుండా 'నామ్ కే వాస్తే' ఆమోదంతో చట్టాలుగా మారుతున్నాయి.

బాధ్యతారాహిత్యంతో

ప్రజల జీవితాలతో ముడిపడిన కీలకమైన అంశాలలో పార్టీలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నాయి. నోట్ల రద్దు నిర్ణయం ఎలాంటి కష్టాలను కలిగిస్తుందో ఆర్థికవేత్తలతో లోతుగా చర్చించలేదు. నల్లధనాన్ని అరికట్టడానికే అంటూ గొప్పలు చెప్పుకున్న ప్రధాని మోడీ 'ఆశించిన ఫలితాలు ఇవ్వకపోతే బహిరంగంగా శిక్షించండి' అని గంభీర ప్రకటన చేశారు. నల్లధనం లెక్కలు తేలుతాయని, ప్రతీ ఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు పడేంత స్థాయిలో వెనక్కి వస్తుందని సెలవిచ్చారు. కానీ, ఆయన చెప్పినవేమీ జరగలేదు. అందుకే ఆర్థికవేత్త అయిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సహా పలువురు ఈ నిర్ణయాన్ని చారిత్రక తప్పిదంగా అభివర్ణించారు. ఆ అనాలోచిత నిర్ణయంతో కోట్లాది మంది నిద్రాహారాలు మాని బ్యాంకుల ముందు పడిగాపులు కాశారు. చివరకు ఆ నిర్ణయం ఫలితాన్ని ఇవ్వకపోగా ప్రజలకు కష్టాలను మిగిల్చింది.

మూడు సాగు చట్టాల విషయంలోనూ అదే జరిగింది. రైతుల బాగుకోసమేనంటూ గొప్పగా చెప్పుకొచ్చింది కేంద్ర సర్కారు. ఈ చట్టాలు వారిపై ఎలాంటి ప్రభావాన్ని కలిగిస్తాయో చర్చించలేదు. అంచనా వేయలేదు. చివరకు ఆ రైతుల విశ్వాసాన్ని చూరగొనలేకపోయింది. ఏడాదికి పైగా ఢిల్లీ సరిహద్దుల్లో ఉత్తరాది రాష్ట్రాల రైతులు ఆందోళనలు నిర్వహించారు. చివరకు బహిరంగంగా రైతులకు క్షమాపణ చెప్పిన మోడీ వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. సీఏఏ (సిటిజెన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్) విషయంలోనూ ప్రతిష్టకు పోయిన కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా కోల్డ్ స్టోరేజీలో పెట్టాల్సి వచ్చింది. ఇవన్నీ చాలక ఇప్పుడు అగ్నిపథ్ నిర్ణయాన్ని తీసుకున్నది. అది కూడా బెడిసికొట్టింది.

చివరకు సవరణలు

అనేక రాష్ట్రాలలో యువత ఆందోళనలకు దిగడంతో ఆ స్కీమ్‌కు కొన్ని సవరణలు చేయక తప్పలేదు. ఒక విధాన నిర్ణయం తీసుకునే ముందు దాని గురించి లోతుగా అధ్యయనం చేయడం, సమాజంపై పడే ప్రభావాన్ని అంచనా వేయడం, ప్రజాస్వామ్య పద్ధతిలో విపక్షాల సలహాలు, సూచనలు, అభిప్రాయాలను తెలుసుకునే కనీస బాధ్యతను విస్మరించింది. గతంలో రైల్వే రిక్రూట్‌మెంట్ విషయంలోనూ యువత నుంచి పెద్ద యెత్తున నిరసనలు వచ్చాయి. యువత చేతిలోనే భవిత అని గొప్పగా వ్యాఖ్యానిస్తున్నా ఆచరణలో మాత్రం బేఖాతరు ధోరణే కొనసాగుతున్నది. గత అనుభవాల నుంచి గుణపాఠాలనూ నేర్చుకోలేదు. కాలానుగుణంగా కొన్ని మార్పులు, పరివర్తన అవసరం కావొచ్చు.

దేశ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్షాలతో, భాగస్వాములతో చర్చించడం ప్రభుత్వాల కనీస ప్రజాస్వామిక బాధ్యత. భిన్నాభిప్రాయాలుంటే అర్థం చేయించి సహకారాన్ని తీసుకోవడమూ అవసరం. కానీ, ఈ పద్ధతులను లెక్కచేయకపోవడంతో పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయో కూడా అంచనా వేయలేకపోతున్నాయి. కరోనా సమయంలో ఆకస్మికంగా తీసుకున్న లాక్‌డౌన్ నిర్ణయమూ అలాంటిదే. అనాలోచిత ధోరణి కారణంగా కోట్లాది మంది ప్రజలు బాధలు పడ్డారు. కనీసమైన ముందు జాగ్రత్తలు, తగిన ఏర్పాట్లు లేకుండా నిర్ణయాలు తీసుకోవడం, ఆ తర్వాత తేరుకోవడం పరిపాటిగా మారింది. కుహనా ప్రతిష్ట సరేసరి.

ఆశలు వమ్ము కావడంతో

తాజాగా అగ్నిపథ్ విషయాన్నే తీసుకుంటే, లోతైన అధ్యయనం జరిపి దాని గురించి ప్రజలకు అర్థం చేయించి ఆ తర్వాత అమలులోకి తెచ్చినట్లయితే అనేక రాష్ట్రాలలో హింసాత్మక చర్యలు జరిగేవే కాదు. యువతలో అశాంతిని, సమాజంలో హింసను నివారించి ఉండొచ్చు. కోట్లాది ఉద్యోగాలిస్తామని హామీలిచ్చి గాలికి వదిలేసిన ప్రభుత్వంపై యూత్ ఆగ్రహంతో ఉన్నారు. కరోనా తర్వాత ఉపాధి అవకాశాలూ సన్నగిల్లాయి. రక్షణ శాఖలో రిక్రూట్‌మెంట్‌పై గంపెడాశలు పెట్టుకున్న యువతను అగ్నిపథ్ నిర్ణయం దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆశల్ని వమ్ము చేసిందనే ఆగ్రహం వారిని రోడ్డెక్కించింది. నిరుద్యోగ తీవ్రత ఏ స్థాయిలో ఉన్నదో ఈ ఆందోళనలు అద్దం పడుతున్నాయి.

ఆర్మీలోకి ఉత్తరాది నుంచే ఎక్కువ రిక్రూట్‌మెంట్లు జరుగుతుంటాయి. సహజంగానే ఆందోళనకు ఆ రాష్ట్రాలు కేంద్ర బిందువులుగా మారాయి. ఆందోళనకు అసలు కారణం భవిష్యత్తుపై ఆశలు సన్నగిల్లుతున్నాయన్న ఆవేదనే. పొరపాటును గుర్తించాల్సిన అధికార పార్టీలు ఆ తప్పిదాన్ని రాజకీయ ప్రత్యర్థులపైకి నెడుతున్నాయి. ఉద్దేశపూర్వకంగానే యువతను రెచ్చగొట్టి ఆందోళనలకు ప్రోత్సహిస్తున్నాయనే ఆరోపణలకు దిగుతున్నాయి.

ఫెయిల్యూర్‌ను అంగీకరించలేక

కేంద్ర ప్రభుత్వమే కాదు, తెలంగాణలోనూ ఇలాంటి ధోరణే కనిపిస్తున్నది. భూ లావాదేవీలకు సింగిల్‌విండో తరహాలో 'ధరణి' పోర్టల్‌ దేశంలోనే ఒక విప్లవాత్మకమైన సంస్కరణ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా సెలవిచ్చారు. కానీ, ఆ విధానం ఇప్పుడు రైతుల జీవితాలనే ప్రశ్నార్థకం చేసింది. ప్రశాంతంగా ఉన్న అన్నదమ్ముల మధ్య పంచాయతీ పెట్టింది. కుటుంబసభ్యులలో చీలిక తెచ్చింది. ఆచరణాత్మక అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా అధికారుల స్థాయిలో నిర్ణయాలు జరగడంతో ఈ విపరీత పరిణామం చోటుచేసుకున్నది.

దీని అనర్థాలను గుర్తించినా పరువు ప్రతిష్టలకు పోయిన రాష్ట్ర సర్కారు ఇప్పటికీ భేషైన ప్రాజెక్టు అంటూ సమర్ధించుకుంటున్నది. ఫెయిల్యూర్‌ను అంగీకరించడానికి నామోషీకి పోతున్నది. దిద్దుబాటు అవసరమని భావించి క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. సవరణలను ప్రతిపాదించాలని ఆదేశించింది. లోపాల్లేవనే ధీమాతో ఉంటే ఈ కమిటీని ఎందుకు వేసినట్లు అనే ప్రశ్నకు సమాధానం లేదు. భూసేకరణ విషయంలోనూ అదే పొరపాట్లు చేస్తున్నది. రైతులకు అర్థం చేయించడానికి బదులుగా పోలీసు బలగాలను ప్రయోగిస్తున్నది. లాఠీలతో, కేసులతో నెట్టుకురావాలనుకుంటున్నది. ధర్నాలకు సైతం అవకాశం లేకుండా వ్యవహరిస్తున్నది.

అణిచివేతే పరిష్కారమా?

గౌరవెల్లి నిర్వాసితులు రోడ్డెక్కడంగానీ, సమస్యల పరిష్కారం కోసం బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు రోజుల తరబడి ఆందోళన చేయడంగానీ రాష్ట్ర సర్కారు బాధ్యతారాహిత్య ధోరణికి నిదర్శనం. మంత్రులను, అధికార పార్టీ ఎమ్మెల్యేలను ప్రజలు ఇటీవల నిలదీస్తున్నారు. మరో దారి లేనప్పుడు ఘెరావ్ చేస్తున్నారు. కాన్వాయ్‌లకు అడ్డం పడుతున్నారు. కారణాలను అన్వేషించి దిద్దుబాటు చర్యలకు బదులుగా అణచివేత, నిర్బంధమే పరిష్కారమనే ధోరణిలో ప్రభుత్వం వ్యవహరిస్తున్నది.

గెలిచామనే అహంకారం పనికిరాదంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ పదేపదే అధికార పార్టీ ఎమ్మెల్యేలకు హితబోధ చేస్తూ ఉన్నారు. కానీ ఆచరణ అందుకు విరుద్ధంగా ఉంటున్నది. అధికార, విపక్షాలు కలిస్తేనే ప్రభుత్వం, ప్రజాస్వామ్యానికి అర్థం అని గొప్పగా చెప్పుకుంటుంటాయి. కానీ, ఇది మాటలకే పరిమితమవుతున్నది. చివరకు ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి వస్తున్నది. అనాలోచితంగా తీసుకునే నిర్ణయాలు అనర్ధాలకు, అశాంతికి దారితీస్తున్నాయి.

ఎన్. విశ్వనాథ్

99714 82403

Advertisement

Next Story