ఆదివాసీల అప్పుల తిప్పలు

by Ravi |   ( Updated:2022-09-03 17:09:36.0  )
ఆదివాసీల అప్పుల తిప్పలు
X

రుణ గ్రహీతల నుంచి వడ్డీ వసూలు చేసే సమయంలో వారిని నిర్బంధాన్ని గురి చేసినా, బెదిరించినా లేదా ఆస్తులకు ఆటంకం కలిగించినా శిక్ష, జరిమానా లేదా రెండూ ఉంటాయి. రుణాలు ఇచ్చినవారు కోర్టుకు వెళ్లి తిరిగి వసూలు చేసుకునేందుకు వీలుండదు. లైసెన్స్ పొంది రుణాలు ఇచ్చేవారు ఖచ్చితంగా రాతపూర్వక ఒప్పందం చేసుకోవాలి. ఇద్దరు సాక్షుల సంతకాలు ఉండాలి. మొదటి సాక్షిగా సర్పంచ్ సంతకం తప్పనిసరి. లేకపోతే కేసును కోర్టులు విచారణకు స్వీకరించవు. వ్యాపారులు రుణ వివరాలతో కూడిన రిజిస్టరు నిర్వహించాలి. కానీ, ఇవేవీ సక్రమంగా అమలు కావడం లేదు. ప్రభుత్వం శూన్య ఆధారిత వడ్డీతో రుణాలు అమలు చేస్తే ఏజెన్సీ రైతులకు మేలు జరుగుతుంది.

గిట్టుబాటు ధర సంగతేమోగానీ, అన్నదాతలు పంటకోసం తెచ్చిన అప్పు తీర్చేందుకు నరకయాతన పడుతున్నారు. దళారులు, వ్యాపారులు వడ్డీకి వడ్డీ వసూలు చేసుకుంటూ మోసానికి పాల్పడుతుండటంతో అన్నదాతల కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. ఏడాదికి ఒకే పంట పండించే ఏజెన్సీలో అప్పు చేయని చిన్న, సన్నకారు రైతు కుటుంబమే కన్పించదు. పంట పండితేనే వారి అప్పు తీరేది. వరుణుడు కరుణించకపోతే దిగుబడి అనుమానమే. దీంతో ఆదివాసీ రైతులు దళారుల వలలో చిక్కుకొని మోసపోతూ ఆర్థికంగా నష్టపోతున్నారు.

వారు నిత్య కూలీలుగా మారడం సర్వసాధారణం అయిపోయింది. ప్రభుత్వపరంగా బ్యాంకులిచ్చే రుణాలు రైతులకు భరోసా కల్పించడం లేదు. వానాకాలం ఏజెన్సీ ప్రాంతాలలో వర్షపాతం సగటుగా ఉంటున్నప్పటికీ, పెద్ద చెరువులు, లిఫ్ట్ ఇరిగేషన్, బోర్లు, బావులు లేక, కరెంటు కనికరించక ఏడాదికి ఒకే పంటతో సరిపుచ్చుకుంటున్నారు. ఇక్కడ యాసంగి ఊసే కన్పించదు. మహబూబాబాద్ ఏజెన్సీ ప్రాంతంలో కాకతీయులు నిర్మించిన పాకాల సరస్సు, బయ్యారం పెద్ద చెరువు ఉన్నాయి. పాకాలలో చేరే వాన నీరు ఆయకట్టు కింద 28,512 ఎకరాల సాగుకు, అదీ గిరిజనేతర రైతులకే తోడ్పడుతుంది తప్ప ఒక్క ఆదివాసీ రైతుకు ఉపయోగపడటం లేదు.

వడ్డీ వ్యాపారుల ఆగడాలు

యేటా ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో వడ్డీ వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుండి ఏజెన్సీ ఏరియాకు వస్తుంటారు. స్థానిక వ్యాపారులతోపాటు వీరు కూడా విత్తనాలు, పెట్టుబడి ఇస్తామంటూ మాయమాటలు చెబుతారు. బ్యాంకు రుణం దొరకని రైతులు తప్పనిసరి పరిస్థితులలో వీరి నుంచి విత్తనాలు, ఎరువులు, అప్పు తీసుకుంటారు. పంట చేతికొచ్చే వరకు అంతా వడ్డీ వ్యాపారి కనుసన్నలలోనే సాగు పనులు నడుస్తాయి. వ్యాపారులు 10 నుంచి 15 శాతం వడ్డీ వసూలు చేస్తారు. అమ్మకాలు సైతం వారి చేతులలో ఉండాల్సిందే. దళారులను వెంట పెట్టుకొని కొందరు తక్కువ ధరకే రైతుల పంటను కల్లాల వద్దే కాంటాలు పెట్టి కొనుగోలు చేయించి, తమ పైకం తీసుకుంటారు. అప్పు చెల్లించే స్తోమత లేని రైతుల నుంచి వారి కాడెడ్లను కబేళాలకు తరలించడం, వాహనాలను, వస్తువులను స్వాధీనపర్చుకోవడం ఆనవాయితీగా మారింది.

రైతులు తమ వద్ద రుణాలు తీసుకోవాలనే షరతు విధించి, సుమారు 20 శాతం పంట డబ్బులను బయానా (అడ్వాన్స్) గా పొందడమే గాక, వడ్డీ చెల్లించకపోవడం కొసమెరుపు మోసం. తిండి గింజల కోసం ఆరుగాలం కష్టించే రైతులు ప్రత్యామ్నాయంగా పత్తి తదితర వాణిజ్య పంటలు పండించినా వారి ఆశలు నెరవేరకపోగా ఆత్మహత్యలే శరణ్యమవుతున్నాయి. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ ప్రాంతాల ఆదివాసీ రైతులు చాలామందికి అటవీ హక్కు పత్రాలు ఇవ్వకపోవడంతో బ్యాంకు రుణాలు అందటం లేదు. 2016లో గిట్టుబాటు ధర లభించని ఒక కుటుంబం (ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలోని కుంటగూడ గ్రామం) వడ్డీ వ్యాపారికి రూ.60 వేల విలువైన ఎడ్లను అమ్మివేసి, తమ పిల్లలను చదువు మాన్పించి, కూలి పనులకు కుదిరింది. వడ్డీ వ్యాపారులకు భయపడి కొందరు రాత్రి ఇల్లు చేరడం, లేదా గూడేలు వదిలి పోవడం జరుగుతోంది. ఇక రోజువారీ గిరిగిరి వ్యాపారం వర్ణించలేనిది.

అమలు కాని 1960 చట్టం

వ్యాపారుల మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఏజెన్సీలో వడ్డీ వ్యాపార నిబంధన చట్టం-1960 రూపొందించింది. దీని ప్రకారం నాము, సిరి నాము (నాము అంటే బస్తాకు రెండు బస్తాలు, సిరినాము అంటే బస్తాకు బస్తాన్నర) పేరుతో పంటల మీద వడ్డీకి అప్పులు, బంగారు ఆభరణాలు, వస్తువులు తదితర తాకట్టు పెట్టుకుని అప్పులు ఇవ్వడం నిషేధించబడింది. ఈ చట్టం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 5,948 ఏజెన్సీ ప్రాంతాలన్నింటికీ వర్తిస్తుంది.లైసెన్సు పొందకుండా రుణాలు ఇవ్వరాదు.

అనుమతి లేకుండా వ్యాపారం చేస్తే ఏడాది జైలు శిక్ష లేదా రూ.1000 వరకు జరిమానా లేదా రెండూ విధిస్తారు. రుణ గ్రహీతల నుంచి వడ్డీ వసూలు చేసే సమయంలో వారిని నిర్బంధాన్ని గురి చేసినా, బెదిరించినా లేదా ఆస్తులకు ఆటంకం కలిగించినా శిక్ష, జరిమానా లేదా రెండూ ఉంటాయి. రుణాలు ఇచ్చినవారు కోర్టుకు వెళ్లి తిరిగి వసూలు చేసుకునేందుకు వీలుండదు. లైసెన్స్ పొంది రుణాలు ఇచ్చేవారు ఖచ్చితంగా రాతపూర్వక ఒప్పందం చేసుకోవాలి. ఇద్దరు సాక్షుల సంతకాలు ఉండాలి. మొదటి సాక్షిగా సర్పంచ్ సంతకం తప్పనిసరి. లేకపోతే కేసును కోర్టులు విచారణకు స్వీకరించవు. వ్యాపారులు రుణ వివరాలతో కూడిన రిజిస్టరు నిర్వహించాలి. కానీ, ఇవేవీ సక్రమంగా అమలు కావడం లేదు. ప్రభుత్వం శూన్య ఆధారిత వడ్డీతో రుణాలు అమలు చేస్తే ఏజెన్సీ రైతులకు మేలు జరుగుతుంది.

గుమ్మడి లక్ష్మీనారాయణ

సామాజిక రచయిత

94913 18409

Advertisement

Next Story