విద్యారంగం బాగుకు ఉక్కు సంకల్పం కావాలి!

by Ravi |
విద్యారంగం బాగుకు ఉక్కు సంకల్పం కావాలి!
X

విద్యా సంవత్సరం అటు విద్యార్థులను, ఇటు ఉపాధ్యాయులను తరుముతోంది. లక్షలాదిగా పిల్లలు బడి బయటవున్నారు. అంతేస్థాయిలో విద్యార్థులు ప్రయివేటు వైపు పరుగులు తీస్తున్నారు. వెరసి ప్రభుత్వ పాఠశాలల్లో బెంచీలు ఖాళీ అవుతున్నాయి. ఉచిత పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫామ్, బూట్లు, నాణ్యమైన బోధనా,రుచికరమైన మధ్యాహ్న భోజనం, అందిస్తూ పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వ పాఠశాలలు ఎర్ర తివాచీ పరిచాయి. ఉపాధ్యాయులు విద్యార్థుల కోసం చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్నారు. కానీ విద్యార్థులు వుండూరులో సర్కారు బడి గేటు దాటి బయట పట్నం బడికి బస్సెక్కి పోతున్నారు. ఇంకా పాఠశాలల్లో సమస్యలు తిష్ట వేసి వూపిరి సలపకుండా చేస్తున్నాయి.

గత పాలకుల, అధికారుల తాలూకు విధానాల వైఫల్యాల మూలంగా ప్రభుత్వ వ్యవస్థ మొత్తం దిగజారిపోతుండగా, ప్రైవేటు రంగం గణనీయంగా పుంజుకుంటోంది. ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలకు గతం కంటే మరింత ప్రమాదకరమైనది. ఇంట్లో ఎందరు చదువుతున్నా అందరికీ ఆర్థిక సాయం అందిస్తామని హామీ కార్యరూపంలోకి వస్తే, ప్రైవేటు బడుల్లో చదివే విద్యార్థులకు మునుపటి లాగే సాయం అందిస్తే పరిస్థితి అగమ్యగోచరమే! ఈ దశలో ప్రభుత్వం స్వీయ పరిశీలన చేసుకోవలసిన అవసరం వుంది.

కీలక మార్పులు తప్పనిసరి

నూతన ప్రభుత్వంలో విద్యా మంత్రిత్వ శాఖ చాలా క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన అవసరం వుంది. జీఓ 117 రద్దు, ఉన్నత పాఠశాలల్లో తెలుగు, ఆంగ్ల సమాంతర మాధ్యమాలు కొనసాగించాల్సిన ఆవశ్యకత, ఉర్దూ పాఠశాలల్లో పోస్టుల నిర్ధారణ, కత్తి వేటుకు గురైన ప్రాధమికోన్నత పాఠశాలలకు పూర్తిస్థాయిలో పోస్టుల మంజూరు, లాంగ్వేజ్ పండిట్ పోస్టుల పునరుద్ధరణ తక్షణమే జరగాలి. ఆ నిర్ణయం వేగంగా తల్లిదండ్రులను చేరాలి. మూడో తరగతి నుంచి సబ్జెక్టు టీచర్ల చేత చదువు చెప్పిస్తున్నామనే చౌకబారు ప్రచారం నుంచి బయట పడడం, ఉపాధ్యాయులను యాప్‌ల నిర్వహణ నుంచి తొలగించడం, ఉపాధ్యాయులు తమ పని వేళల్లో బోధనా సమయం కుదింపుకు గురికాకుండా చూడడం, వనరులను సద్వినియోగం చేసుకొనే వెసులుబాటు కల్పించడం, బోధనా విషయాల్లో అధికార యంత్రాంగపు అనవసర జోక్యాన్ని, పర్యటనలను నిరోధించడం, బెదిరింపు ధోరణికి మంగళం పాడడం వంటి సాధారణ విషయాలను గురించి తక్షణ చర్చ, నిర్ణయాలు జరగాల్సి ఉంది.

జీఓ 117 రద్దు చేయాలి!

పాఠశాల విద్యారంగానికి గుదిబండగా వున్న జీఓ 117 రద్దును సర్వరోగ నివారిణిగా ఉపాధ్యాయ లోకం యావత్తూ భావిస్తోంది. జూన్, జూలై నెలలు పాఠశాలలకు చాలా కీలక సమయం. అధికార యంత్రాంగం, ఉపాధ్యాయులు క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన సమయం. ప్రభుత్వం తన తొలి ప్రాధాన్యంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియకు సంబంధించి డీఎస్సీ ప్రకటించింది. అది హర్షణీయమే అయినా, లోపభూయిష్టంగా మారి ఉపాధ్యాయులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న జీఓ 117 రద్దు మరింత ప్రాధాన్యం కలిగివుంది. ఎందుకంటే ఇది ప్రాథమిక విద్యారంగాన్ని నిలువునా కూల్చేసింది. ఉపాధ్యాయ పోస్టులు రద్దయ్యేందుకు కారణమైంది. అభం శుభం తెలియని పిల్లలకు చిక్కులు సృష్టించింది. పరోక్షంగా ప్రైవేటు విద్యారంగం పరిపుష్టికి అమ్మఒడితో సమాంతరంగా తోడైంది. గొర్రె బొచ్చు కత్తిరించి దానికే కోటు కుట్టించిన వైనం సర్వత్రా ఆవిష్కృతమైన నేపథ్యంలో ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన జీఓ 117 రద్దుపై విధానాన్ని బహిర్గత పరచాలి.

సమాంతర మాధ్యమాల పునరుద్ధరణ

రాష్ట్రం పేరే ఆంధ్రం. ఇక్కడ విద్యా బోధనా మాధ్యమం ఆంగ్లం. ఇదెక్కడి చోద్యం! మాతృ భాషలో బోధనా జరగాలనే ఆకాంక్ష ఉవ్వెత్తున ఎగిసిపడాల్సిన రాష్ట్రంలో అందుకు భిన్నమైన ఆశలు మోసులెత్తాయి. దేశంలోని అనేక రాష్ట్రాలు తమ ప్రాంతీయ భాషలను పదిలపరుచుకునేందుకు పెద్ద ఎత్తున కృషి చేస్తుంటే దురదృష్టవశాత్తూ ఇక్కడ మాతృభాషను పక్కన పడేశారు. ఆంగ్లంపై ప్రజల్లో ఉన్న మోజును దృష్టిలో ఉంచుకొని పాలకులూ అటువైపే మొగ్గారు. ఒక్కసారిగా తెలుగు ఒక సబ్జెక్టుగానే మిగిలిపోయింది. పెద్దయెత్తున విద్యార్థులు మాధ్యమం మారడం వల్ల విషయ పరిజ్ఞానం కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డారు. అవగాహన లేమితో ఉత్తీర్ణతా శాతం పడిపోయింది. ప్రభుత్వం కాగితాలపై ఎన్ని లెక్కలు చూపినా అనేకమంది డ్రాపౌట్లుగా మిగిలిపోయారు. ఆంగ్ల మాధ్యమం తెలుగును పూర్తిగా కబళించింది. భవిష్యత్తులో తెలుగు ఈ రాష్ట్రంలో నామరూపాలు కోల్పోయి అవశిష్ట భాషగా మిగిలిపోనుంది. తెలుగు ఒక జీవ భాషగా, జీవన విధానంలో అంతర్భాగంగా వుండేలా చూడాలి. అందుకోసం రాష్ట్రంలో తెలుగు మాధ్యమాన్ని సెకండరీ స్థాయి వరకు పునరుద్ధరించాలి.

ఆ ఉన్నతాధికారి కారణంగానే..

రాష్ట్రంలో విద్యావ్యవస్థ పూర్తిగా కునారిల్లడానికి ప్రథమ కారకుడు ఆ శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన ఓ అధికారి. ఆయనే ఉపాధ్యాయుల్లో అశాంతికి మూలకారకుడు. తానొక్కడే విద్యారంగాన్ని సంస్కరించడానికి కారణజన్ముడిగా, ప్రభుత్వం దృష్టిలో మార్కులు కొట్టేయడానికి ఒక ఐఏఎస్ అధికారి ఏ స్థాయికి చేరకూడదో అంత నీచ స్థాయికి దిగజారాడు. ప్రతి అధికారి బాధ్యతల్లోనూ వేలుపెట్టి వారికి కనీస గౌరవం లేకుండా చేశాడు. క్షేత్రస్థాయి పర్యటనలతో ఉపాధ్యాయుల హక్కులను కాలరాశాడు. సమాజంలో ఒక ఉపాధ్యాయుడికి ఎంత గౌరవం వుండాలో దాన్ని భూస్థాపితం చేశారు. తల్లిదండ్రుల దృష్టిలో పనిదొంగలుగా ముద్రవేసే ప్రయత్నం చేశారు. ఉపాధ్యాయులకు బ్రాందీ షాపుల వద్ద విధులు నిర్వహించాలనే దిగజారుడు విధానాలకు తెరతీశారు. కరోనా అనంతరం అనేక ప్రతికూలాంశాలను అధిగమించి విద్యార్థులను అభ్యసనం వైపు మళ్ళించి విద్యారంగానికి మూలస్తంభాలుగా నిలిచిన ఉపాధ్యాయుల్లో నైతిక స్థైర్యాన్ని దెబ్బతీశారు. అందువల్ల ప్రభుత్వం విషయ అవగాహన కలిగిన అధికారులను విద్యాశాఖకు కేటాయించాల్సిన అవసరం వుంది. దేశంలోని రాష్ట్రాలు అనేకం 2020 విద్యా విధానం అమలును పక్కన పెట్టగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే అత్యుత్సాహంతో దాని అమలుకు పూనుకొంది. దరిమిలా ఎన్నో సమస్యలు ఉత్పన్నం కావడానికి ప్రత్యక్షంగా కారణమైంది. ఆంధ్రప్రదేశ్‌లో ఆదర్శవంతమైన ప్రత్యేక విద్యా విధానం వుంటే బాగుంటుంది. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలి.

మోహన్ దాస్

ఏపీటీఎఫ్ రాష్ట్ర నాయకులు

94908 09909



Next Story