మునిగిపోతున్న వైసీపీ నావ!

by Ravi |   ( Updated:2024-10-02 01:30:46.0  )
మునిగిపోతున్న వైసీపీ నావ!
X

రాజకీయాల్లో హత్యలు ఉండవు.. అన్నీ ఆత్మహత్యలే. అడుగడుగునా జగన్ రెడ్డి చేష్టలు ఆత్మహత్యాసదృశ్యంగా మారాయి. వైసీపీ పాలనలో చోటు చేసుకున్న అనేక కుంభకోణాలు, అక్రమాలు బయటపడుతుంటే ఆయన ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో రాష్ట్రంలో ఉండలేక వారోనికోసారి కుటుంబ సమేతంగా బెంగళూరు వెళ్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాటాలు చేయకుండా, అసెంబ్లీకి వెళ్లకుండా పార్టీని ఎలా నిలబెడతారు? ఇప్పటికే పార్టీ ఉనికి ప్రమాదంలో పడింది. పాము తన పిల్లలను తానే మింగినట్లు జగన్ రెడ్డి తన పార్టీని తానే చేజేతులా సమాధి చేసుకుంటున్నారు. సొంత పార్టీ నేతలే తమ అసంతృప్తిని వివిధ రూపాల్లో వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు వైసీపీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నారని, జగన్ జైలుకు వెళ్లడం ఖాయమంటూ వార్తలు వస్తున్నాయి.

జగన్ రెడ్డిపై అక్రమాస్తులకు సంబంధించి 11 సీబీఐ కేసులు, 6 ఈడీ కేసులు ఉన్నాయి. ముఖ్యమంత్రి హోదాను అడ్డుపెట్టుకుని సీబీఐ కోర్టుకు వెళ్లకుండా ఇంత కాలం తప్పించుకు తిరిగారు. ఇప్పుడు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు. బెయిల్ రద్దు అయితే జైలుకు వెళ్లడం ఖాయం. లేదా ప్రతి శుక్రవారం కోర్టుకన్నా హాజరు కావాలి. బిహార్, జార్ఖండ్, ఢిల్లీ, హర్యానా, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులతో పోలిస్తే జగన్ రెడ్డిపై ఉన్న కేసులు చాలా తీవ్రమైనవి. ఇప్పటికే పదకొండేళ్ల నుంచి బెయిల్‌పై ఉన్నారు. దీనికి తోడు వివేకానందరెడ్డి హత్య కేసు వెంటాడుతోంది. 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు చెల్లి షర్మిల, తల్లి విజయమ్మ పార్టీని నడిపించారు. ఇప్పుడు వారు కూడా దూరమయ్యారు. ఇక మిగిలింది జైళ్లు, బెయిళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి.

తిరుమల లడ్డూ ఉరితాడైందా?

కమీషన్ల కోసమో.. లేదా కావాల్సిన వారికి టెండర్లు కట్టబెట్టడంతో తిరుమల లడ్డూ వ్యవహారం జగన్ రెడ్డికి ఉరితాడైంది. దీనికితోడు మతిభ్రమించినట్లు ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి. ఇదేమి హిందుత్వం, ఇదేమి దేశం అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేకెత్తించాయి. దేశవ్యాప్తంగా ఉన్న హిందుత్వ వాదులు ఛీ కొడుతున్నారు. సున్నితమైన మతసాంప్రదాయాలపై పరిపక్వత లేని మాటలు సొంత పార్టీ వాళ్లను సైతం ఆశ్చర్యానికి గురిచేశాయి. డిక్లరేషన్ ఇచ్చే అంశంపై రాద్ధాంతం చేసి దర్శనానికి వెళ్లకుండా ఆంక్షల పేరుతో అడ్డుకున్నారని ఎదురుదాడి చేసే ప్రయత్నం చేశారు. జగన్ రెడ్డికి అసలు దేవుని పట్ల నమ్మకం లేదు. ఆయనకు తెలిసిందల్లా రాజకీయం చేయడమే. ప్రక్షాళన పూజలు చేయాలని జగన్ రెడ్డి పిలుపునిస్తే అసలు స్పందనే కరువైంది. ఆ పూజల్లో జగన్, భూమన, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి ఎక్కడా పాల్గొన్న దాఖలాలు లేవు.

కాదంబరి కేసులో ఐపీఎస్‌లు బుక్

దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ముంబై సినీ నటి కాదంబరి జత్వానీ వ్యవహారంలోనూ జగన్ రెడ్డి దోషిగా ప్రజల ముందు నిలబడ్డారు. తనను అక్రమంగా అరెస్ట్‌ చేశారని, రిమాండ్‌‌కి పంపడంతోపాటు తన కుటుంబం తో సహా కస్టడీలో చిత్రహింసలకు గురి చేశాడంటూ నటి జత్వానీ ఇచ్చిన ఫిర్యాదుతో అప్రతిష్ట పాలయ్యారు. జగన్‌ సర్కార్‌లో ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా పనిచేసిన పి.సీతారామాంజనేయులు, పోలీసు కమిషనర్‌ కాంతిరాణా టాటా, డీసీపీ విశాల్‌ గున్నిలు సస్పెండ్ కావాల్సి వచ్చింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన విజయారాణి సంచలన ఆరోపణలు చేశారు. తన కుమారుడి పేరుతో ఉన్న ఆస్తిని కాజేసేందుకు కొందరు హత్య చేశారు. దానిని అప్పటి కమిషనర్ కాంతిరాణ టాటా, డీసీపీ విశాల్ గున్నీ గుండెపోటుగా చిత్రీకరించారనే ఫిర్యాదుతో మరో వివాదంలో చిక్కుతున్నారు. జగన్ రెడ్డి పాలనలో సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజుపైనే సీఐడీ కస్టడియల్ టార్చర్‌కు పాల్పడింది. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో సీఐడీ ఛీఫ్‌గా ఉన్న పీవీ సునీల్ కుమార్ మరికొందరు సిబ్బందితో కలిసి రఘురామపై కస్టడీలో భౌతికంగా దాడి చేశారు. ఈ వ్యవహారం కూడా జగన్ రెడ్డి మెడకు చుట్టుకోనుంది.

ఇసుక, ఖనిజ, గనుల దోపిడీ..

గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వ పెద్దలు పెద్ద ఎత్తున ఇసుక, ఖనిజ, గనుల దోపిడీకి పాల్పడ్డారు. ఇందుకు సంబం ధించి గనుల శాఖ మాజీ డైరెక్టర్‌ వెంకటరెడ్డిని ఏసీబీ హైదరాబాద్‌లో అరెస్టు చేసింది. ఈ వ్యవహారంలో కూడా జగన్ రెడ్డి తప్పించుకోలేరు. గనుల శాఖకు సంబంధించిన టెండర్లు, ఒప్పందాలు, ఇసుక తవ్వకాల్లో అక్రమాలు, అవినీతి జరిగింది. జేపీ సంస్థ, ప్రతిమ సంస్థలకు వెంకటరెడ్డి అనుచిత లబ్ధి కలిగించారు. గత ఐదేళ్లుగా గనుల శాఖలో వెంకటరెడ్డి మాటే శాసనంగా సాగింది. గనుల శాఖలో టెండర్లు, అగ్రిమెంట్స్‌, ఏపీఎంఎంసీ రూల్స్‌ పాటించకుండా చర్యలు, ఇసుక తవ్వకాల్లో అవినీతి, అవకతవకలకు పాల్పడ్డారు. ఐదేళ్లలో ఇసుక విధానంతో రూ.2,566 కోట్లు దోచారు. బకాయిలు చెల్లించకుండానే కాంట్రాక్ట్ సంస్థల డిపాజిట్‌లను వెనక్కి ఇచ్చేశారు. గతంలో జగన్ రెడ్డికి ఆయాచితంగా లబ్ధి చేకూర్చిన అనేక మంది ఉన్నతాధికారులు జైలు జీవితం అనుభవించారు. ఇవికాక మరిన్ని కుంభకోణాలు వెలుగులోకి రాబోతున్నాయి.

పాలన కాదు.. పీడన

ఐదేళ్ల పాటు ప్రజాస్వామ్యం జగన్ విషకౌగిలిలో బందీ అయింది. పౌరుల ప్రాథమిక హక్కులన్నీ హరించివేశారు. రాష్ట్రానికి జగన్ పాలన ఓ పీడకలలా మిగిలిపోయింది. అది పాలన కాదు పీడన అనే భావనతో ఆ స్మృతులను ఇప్పటికీ ప్రజలు ఏదో సందర్భంలో గుర్తుచేసుకుంటున్నారు. ఆయన పాలనలో ఇబ్బంది పడని వర్గమంటూ ఏదీ మిగలలేదు. ప్రజలను ఉద్ధరించడానికి పాదయాత్రలు, ఓదార్పుయాత్రల పేరుతో నెలల తరబడి ప్రజల్లో తిరిగారు. ఆయన చెప్పే మాటలు, ఇచ్చే సందేశాలు విని నిజమేననుకున్నారు. మోసపోయామని ప్రజలు తెలుసుకునేప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

వైసీపీ దుకాణం బంద్ అయితే..

ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్షం ఉండాలి. పాలకపక్షం చేస్తున్న తప్పిదాలపై, ప్రజాసమస్యలపై ఎక్కడికక్కడ నిలదీయాలి. సరైన ప్రతిపక్షం లేకపోతే అధికార పార్టీ తన ఇష్టారాజ్యంగా వ్యవహరించే అవకాశం కలుగుతుంది. ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. మరోవైపు వైసీపీ నుంచి కూటమిలో చేరుతున్న ఆయారాంల వల్ల మిత్రభేదం తలెత్తే ప్రమాదం ఉంది. అధికారం ఎక్కడుంటే అక్కడ వాలిపోయే నాయకులు క్యూ కడుతున్నారు. వారిపట్ల అప్రమత్తంగా ఉండాలి. చేరేవారికి ఎటూ నైతిక విలువలు ఉండవు. అవకాశవాదమే అజెండాగా మార్చు కుని రాజకీయాలను కలుషితం చేస్తున్నారు. కనీసం చేర్చుకునే వారైనా ఆచితూచి అడుగులు వేస్తే బాగుంటుం ది. వైసీపీ దుకాణం బంద్ అయితే ఆ స్థానాన్ని ఎవర భర్తీ చేస్తారు? ప్రతిపక్షం లేకపోతే ప్రజాస్వామ్యానికి మనుగడ ఉండదు. వైసీపీ మునిగిపోతున్న నావ. ఇదంతా జగన్ స్వయంకృతాపరాధమే.

మన్నవ సుబ్బారావు

99497 77727

Advertisement

Next Story