- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అసమాన ధీరుడు ఆజాద్
నిర్బంధాలను తన జీవితంలో ఒప్పుకొని అమరవీరుడు ఆజాద్ చంద్రశేఖర్. 'మీ ఒంటిలోని రక్తం మరగకుండా ఉంటే, మీ నరాలలో ప్రవహించేది నీరు మాత్రమే, యువతలోని ఉత్తేజం మాతృదేశం కోసం ఉపయోగపడకుంటే అది నిస్తేజమే' అని నినదించిన ధీరుడు. తెల్లదొరల పాలిట సమర నినాదం ఆజాద్ చంద్రశేఖర్. హిందూ కుటుంబంలో పుట్టి, అహింసా బాటలో నడిచి, అసంతృప్తితో తుపాకీ పట్టి, భగత్ సింగ్‌తో కలిసి భారత స్వాతంత్ర పోరాటానికి ఊపునిచ్చిన వీరుడు. అసలు పేరు చంద్రశేఖర్ సీతారాం తివారి. తన పేరుకే స్వతంత్రాన్ని ప్రకటించుకొని ఆంగ్లేయులకు చిక్కననే ప్రతిజ్ఞ నిలబెట్టుకున్న అమరుడు.
న్యాయాధికారికి ఎదురు నిలిచి
అది బ్రిటిష్ ఇండియా కోర్టు హాలు. పదిహేనేళ్ల కుర్రాడు బోనులో నిల్చున్నాడు. నీ పేరేమిటి? అడిగారు న్యాయాధికారి. 'ఆజాద్' అని సమాధానం ఇచ్చాడు కుర్రాడు. తండ్రి పేరు అడిగితే 'స్వాతంత్ర్యం' అని జవాబు. నీ ఇల్లు ఎక్కడ? అని అడిగితే కారాగారం అని సమాధానం. దీంతో న్యాయమూర్తికి ఆగ్రహంతో కలిగి 15 రోజుల కారాగార శిక్ష విధించాడు. తర్వాత దానిని 15 కొరడా దెబ్బలుగా మార్చాడు. 23 జూలై 1906న అలిరాజ్ పుర్ సంస్థానంలో (ప్రస్తుత మధ్యప్రదేశ్) పండిట్ సీతారామ్ తివారి-జగరాణి దేవి దంపతులకు చంద్రశేఖర్ ఆజాద్ జన్మించాడు.
తల్లి కోరిక మేరకు ఉన్నత చదువుల కోసం సంస్కృత పాఠశాలలో చేరాడు. జలియన్ వాలాబాగ్ ఊచకోత ఘటనతో ఆగ్రహం చెంది జాతీయోద్యమంలో దూకాడు. సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నాడు 'చౌరీ-చౌరా' సంఘటన తర్వాత గాంధీజీ ఈ ఉద్యమాన్ని ఆపేయడంతో ఆజాద్ నిరాశకు గురయ్యాడు. విప్లవ మార్గం అనుసరించాడు. భగత్‌సింగ్, రాజ్‌గురులతో కలిసి పోరుకు దిగాడు. సుఖ్‌దేవ్, పండిట్ రాంప్రసాద్ బిస్మిల్, ఠాకూర్ రోషన్ సింగ్, ప్రేమ్ కిషన్ కన్నాకు విప్లవ సహచరుడిగా మారాడు.
ఆయన ఆశయాల జాడలో
సంపూర్ణ స్వరాజ్యం లక్ష్యంగా హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ స్థాపించాడు ఆజాద్. గెరిల్లా దాడులు నిర్వహించి బ్రిటిష్‌వారి గుండెలలో రైళ్లు పరిగెత్తించాడు. బ్రిటిష్ పోలీసులకు సవాల్‌గా మారడంతో ఆయనను సజీవంగా లేదా నిర్జీవంగా పట్టుకొని తీరాల్సిందేనని 1931 ఫిబ్రవరిలో ఆదేశాలు జారీ అయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఆల్ఫ్రెడ్ పార్కులో ఆజాద్ సుఖ్‌దేవ్‌తో కలిసి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో ఒక్కసారిగా చుట్టుముట్టారు. ఎదురుదాడికి దిగిన ఆజాద్ ముగ్గురు పోలీసులను కాల్చి చంపాడు. చివరకు తప్పించుకునే వీలు లేకపోవడంతో తన పిస్తోలులో ఉన్న ఆఖరి బుల్లెట్ కణతకు గురిపెట్టుకొని స్వేచ్ఛగా మృత్యదేవతను కౌగిలించుకున్నాడు. 'భారత్ మాతాకీ జై' అంటూ నేలకొరిగాడు.
దేశ జనాభా 150 కోట్లకు చేరుకుంటున్నది. దేశ ప్రజల సగటు వయస్సు 29 సంవత్సరాలకు పడిపోయింది. జనాభాలో యువత శాతం 64. అమెరికా, జపాన్, చైనా, దక్షిణ కొరియా వంటి దేశాలతో పోలిస్తే అత్యంత యువ సంపన్న దేశంగా భారత్ కళకళలాడుతోంది. యువతలో పరమత సహనం, దేశభక్తి, నైతిక విలువలు క్షీణించాయి. స్వార్థపూరిత అవసరాల కోసం వాడుకుంటున్న రాజకీయ పార్టీలు, నాయకులు, కుల సంఘాల చేతిలో యువత నలిగిపోతున్నది. జాతి, వర్ణ , వర్గ , కుల విభేదాలను అధిగమించి మానవత పరిమళాలతో 'ఉక్కు నరాలు ఇనుప కండరాలు' కలిగిన నికార్సైన యువత తయారుకావాలి. అప్పుడే చంద్రశేఖర్ ఆజాద్ ఆశయాలకు సార్థకత చేకూరుతుంది.
(నేడు ఆజాద్ చంద్రశేఖర్ జయంతి)
అంకం నరేశ్
63016 50324