సమాజ సేవ చేస్తే.. రేప్‌ చేయొచ్చా!?

by Ravi |   ( Updated:2023-06-03 00:46:04.0  )
సమాజ సేవ చేస్తే.. రేప్‌ చేయొచ్చా!?
X

మే 23న హిందీ భాషా చిత్రంగా విడుదలైన 'సిర్ఫ్ ఏక్ బందా కఫీ హై' (ఒక్క సామాన్యుడు చాలు) భారతీయ సినిమాల్లో కోర్టు రూమ్ డ్రామాకు అసలైన నిర్వచనంలా నిలిచింది. ఒక సగటు లాయర్‌, భారత న్యాయవ్యవస్థ సూక్ష్మ మెళకువల చుట్టూ తిరిగిన ఈ కోర్టు డ్రామా అత్యంత శక్తివంతమైన వ్యవస్థను ధిక్కరించి ఒక మామూలు వ్యక్తి... మార్పును, న్యాయాన్ని ఎలా సాధించగలిగాడో చూపుతుంది. ఇప్పుడిప్పుడే కంటెంట్ పరంగా జూలు విదిలిస్తున్న భారతీయ చిత్రపరిశ్రమలోని ప్రతిభను, సృజనాత్మకతను అత్యంత ప్రతిభావంతంగా ప్రదర్శించిందీ చిత్రం. ఒక మైనర్‌పై అత్యాచారం కేసు చుట్టూ తిరిగి ఈ కథ కోర్టు రూమ్‌లో నాటకీయ ప్రదర్శన ద్వారా అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని వీక్షకులకు కలిగించడంలో సక్సెస్ పొందింది. ది ఫ్యామిలీ మ్యాన్ సీరీస్ ద్వారా సంచలనం సృష్టించిన దర్శకుడు అపూర్వ సింగ్ కార్కీ, నటుడు మనోజ్ బాజ్‌పేయి మరోసారి వీక్షకులకు అద్భుతం చూపించారు.

మైనర్ బాలిక అత్యాచారంతో మొదలై..

ఆసారాం బాపూ అనే స్వయం ప్రకటిత గాడ్‌మన్ ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేసి చట్టానికి దొరికిపోయిన వైనం దశాబ్దం క్రితం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. 2013లో ఈ కేసు విచారించి అయిదేళ్లపాటు వాదనల అనంతరం ఆసారాంకు యావజ్జీవ శిక్ష విధింపచేసిన కేసులో బాధితురాలి పక్షాన వాదించిన రియల్ లైఫ్ న్యాయవాది పీసీ సోలంకి ప్రధాన పాత్రగా రూపొందిన చిత్రం 'సిర్ఫ్ ఏక్ బందా కఫీ హై'. క్లుప్తంగా దీన్ని 'బందా' అని పిలవవచ్చు. అత్యంత పలుకుబడి కలిగిన ఆసారాం బాపుకు వ్యతిరేకంగా ఒక మైనర్ బాలిక అత్యాచార ఆరోపణలు చేసినప్పుడు ఆ కేసును సవాలుగా తీసుకుని విచారించిన సామాన్య న్యాయవాది సోలంకి. ఆ పాత్రను సినిమాలో పోషించిన మనోజ్ బాజ్‌పాయ్ పరకాయ ప్రవేశం చేశాడు. ఆ మైనర్ బాలికను కాపాడడం కోసం తన వ్యక్తిగత జీవితాన్నే పణంగా పెట్టిన న్యాయవాది సోలంకి ఈ కేసులో న్యాయ సంస్థాపన కోసం అలుపెరుగని కృషి చేశాడు. ఆనాటి చరిత్రకు చిత్ర దర్శకుడు ఎంతగా న్యాయం చేశాడంటే సినిమాలోని ఒక్క సీన్ కూడా వీక్షకులు దాటిపోలేరు. ఆసారాం బాపుకు యావజ్జీవ శిక్ష పడేలా చేసిన తర్వాత మాత్రమే లాయర్ సోలంకి న్యాయస్థాపనకు అంతిమ విజయం దక్కిందంటూ ఇంటికెళ్లి సంబరాలు చేసుకోవడంతో చిత్రం ముగుస్తుంది.

న్యాయవాది సోలంకిని అడ్డుకోవడానికి, ఆసారాం కేసు నుంచి అతడిని తప్పించడానికి అధికారం, పలుకుబడి గల వర్గాలు వరుసగా జిత్తులమారి పథకాలు అల్లడం, సోలంకిని భయపెట్టడానికి కిరాయి వ్యక్తులను నియమించడం, మైనర్ తీరని బాలిక న్యూకి న్యాయం చేయకుండా అతడినే తప్పించాలని ప్రయత్నించడం ఇవేవీ ఆ కుర్ర లాయర్ సోలంకి లక్ష్యాన్ని అడ్డుకోలేవు. ఈ క్రమంలో న్యాయస్థానం లోపలా బయట సమాజంలో కూడా ప్రమాదాల బారిన పడతాడు. పలుకుబడి గల శక్తులు తనకు వ్యతిరేకమయ్యాయని తెలుస్తున్నప్పటికీ, వ్యక్తిగత ప్రమాదాలు పొంచి ఉన్నప్పటికీ పట్టువీడని లాయర్ అంతిమంగా న్యాయవ్యవస్థ గౌరవాన్ని కాపాడతాడు. లైంగిక వేధింపుల నుంచి పిల్లలను కాపాడేందుకు తీసుకొచ్చిన పోస్కో చట్టాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే న్యాయాన్ని ఎంత గొప్పగా పరిరక్షించవచ్చో 'సిర్ఫ్ ఏక్ బందా కఫి హై' సినిమా కళ్లకు కట్టినట్లు తెలిపింది. కోర్టుల గురించి, వాదోపవాదాల గురించి, విచారణల గురించి ఏమీ తెలియని వారు కూడా ఈ సినిమా చూడటం అవసరం. తొలి నుంచి చివరి వరకు అత్యంత ఉత్కంఠను రేకెత్తిస్తూ సాగిన ఆసారాం బాపు విచారణ ప్రక్రియ మన న్యాయవ్యవస్థ సమగ్రతపై కీలక ప్రశ్నలు సంధించింది. అధికారాన్ని దుర్వినియోగపర్చడం ఏ స్థాయిలో జరుగుతుందో అత్యంత వాస్తవికంగా ఈ సినిమా తేటతెల్లం చేస్తుంది.

ఆలోచింపజేసే క్లైమాక్స్!

ఈ సినిమాలో అన్ని సన్నివేశాల్లో వాదనలు ఒక ఎత్తు. క్లైమాక్స్‌లో ఆసారాం బాబా తరపు లాయర్ భావోద్వేగంతో చేసిన వాదన, దానికి బాధితురాలి లాయర్ సోలంకి (మనోజ్) చేసిన ప్రతివాదన ఒకెత్తు అని చెప్పాలి. ఈ సీన్ న్యాయస్థానాల్లో వాద ప్రతివాదాలకు పరాకాష్టగా నిలిచిపోతుంది. బాబాను సమర్థించడంలో డిఫెన్స్ కౌన్సిల్ ఎక్కడ విఫలమైంది అంటూ బాధితురాలి తరఫు లాయర్ వేసిన ప్రశ్న, ఆ సందర్భంగా అతను చేసిన వాదన న్యాయవిచారణల చరిత్రలో నిలిచిపోతుంది.

ఎంతసేపటికీ బాబా ధర్మం, బాబా విరాళం, బాబా ఆస్పుత్రులు, బాబా స్కూళ్లు, బాబా ఆహార వితరణ అంటూ వల్లెవేస్తూ ఆయనకు శిక్ష విధిస్తే సమాజంలో ధర్మమే అంతరించిపోతుందని, సమాజంలో ఇకపై పేదలకు సహాయం చేసేవారే లేకుండా పోతారని, వేలాది మందికి బాబా ఆశ్రమంలో రోజూ తిండి పెడుతున్నారని, బాబా లాయర్ చేసే వాదన ఎంత అసంబద్ధంగా ఉందో వివరించిన లాయర్ సోలంకి ఒక మౌలిక ప్రశ్న లేవదీశాడు. పాఠశాలలు, ఆసుపత్రులు కట్టించారని చెప్పి రేప్ చేయడానికి ఎవరికైనా లైసెన్స్ ఇస్తారా అంటూ కోర్టును నిలదీస్తాడు. తెలుగు సినిమా కోర్టు సీన్‌లలో లాయర్ల హీరోయిజం, వీరంగం, అతి ఏ స్థాయిలో ఉంటుందో మనకు తెలుసు. కానీ కోర్టు గౌరవానికి ఎలాంటి భంగం కలిగించని సాఫ్ట్ నటనలో తనకు ఎవరూ సాటిరారని మనోజ్ బాజ్‌పాయ్ మరోసారి నిరూపించుకున్నాడు. లీగాలిటికి వెలుపలి విషయాలను ప్రస్తావించడం ద్వారా బాబాను డిఫెండ్ చేయడంలో డిఫెన్స్ కౌన్సిల్ ఎక్కడ విఫలమైంది అంటూ మనోజ్ చేసిన వాదన కేసు విచారణను మౌలికంగానే మలుపు తిప్పింది.

విశ్వాసం పేరుతో ఆ విశ్వాసానికే కాకుండా, మీకూ, నాకు, మనందరికీ, చివరికి ఆ మహాశివుడికి కూడా ద్రోహం చేసిన నీచుడు ఈ బాబా.. ఇతడిని కఠినంగా శిక్షించండి అంటూ బాధితురాలి లాయర్ చేసిన విజ్ఞప్తి ఈ కేసులో అంతిమ తీర్పుకు ప్రాణం పోస్తుంది. భయంకరమైన నేరానికి పాల్పడి, మైనర్ బాలికను రేప్ చేయడానికి తన భక్తిముసుగును, తన పేరును ఉపయోగించుకుని ఘోర నేరాలకు పాల్పడిన క్రూరుడీ బాబా అంటూ మరణ శిక్ష మాత్రమే ఇతగాడికి సరైన శిక్ష అవుతుందని కుర్ర లాయర్ తన వాదన ముగిస్తాడు. చచ్చేంత వరకు ఇతగాడిని ఉరితీయండి అంటూ తాను చేసిన చివరి వాదన యావత్ సమాజ మనోగతానికి వంతపాడుతుంది.

దొంగ బాబాల కీచక పర్వం..

మానవ సహజ ఉద్వేగాలను అత్యంత సహజంగా వ్యక్తీకరించిన ఈ సినిమాను ఎట్టిపరిస్థితుల్లోనూ రీమేక్ చేయకుండా హిందీలో ఈ సినిమాను నిర్మించిన వారు వెంటనే అన్ని భాషల్లో డబ్బింగ్ చేస్తే బాగుంటుంది. మన తెలుగు సినిమా బడుద్దాయిల చేతిలో ఈ సినిమా పడిందంటే దాన్ని పెంటపెంట చేసి బీభత్సం సృష్టించడంలో టాలీవుడ్‌లో ఎవరూ ఎవరికీ తీసిపోరు. మన వాళ్ల హీరోయిజానికి, వెకిలితనాలకు ఈ చిత్ర కథ, నటన బలై సచ్చి ఊరుకుంటాయనడం సత్యదూరం కాదు.

చివరగా ఈ సినిమాను నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ తన విద్యార్థులకు ప్రతి ఏటా చూపించాల్సిన అరుదైన చిత్రంగా ప్రదర్శించి చూపాలి. మన చుట్టూ ఎంతమంది నిత్యానందాలు, ప్రేమానందాలు దొంగ బాబాలూ, దొంగ సన్నాసులు, దొంగ పాస్టర్లు, దొంగ ముల్లాలు హాయిగా బతికేస్తున్నారో, అలా బతకడం కుదరకపోతే దీవుల్లో కైలాసాలను సృష్టిస్తూ, వీధికో చర్చీని, వీధికో మసీదును కడుతూ మూఢభక్తులను 2023లో కూడా ఎలా నిత్యం వంచిస్తున్నారో మనందరికీ తెలుసు. నిత్యం వీళ్ల గురించి వార్త లేని పేపర్ ఉండదు. ఉత్తరాదిలో వేలాది భక్తులకు దైవసమానుడిగా రూపొంది భక్తి పేరిట ఆధ్యాత్మక సామ్రాజ్యాన్నే స్థాపించిన ఆసారాం అనే దొంగ బాబాకు మన దేశ న్యాయస్థానంలో శిక్షలు పడటమే అరుదైన విషయం.

ఎలాంటి నాటకీయత లేకుండానే భావోద్వేగాలను ఎలా పండించవచ్చో ఈ సినిమాలో కొన్ని డైలాగులు చెబుతాయి. తనపై అత్యాచారం గురించి ఆ మైనర్ బాలిక చెబుతున్నప్పుడు లాయర్ సోలంకి 'తలపై ఆ ముసుగు తీసేయమ్మా. ఇక్కడ నువ్వు దేనికీ భయపడాల్సిన పనిలేదు' అంటాడు. పోలీసులు మాత్రం ఆమెను ఆసుపత్రికి తీసుకువస్తున్నప్పుడు ముఖం కనబడకుండా దుపట్టా కప్పుకో అని సలహా ఇస్తారు. ఆ అమ్మాయి ఏదీ దాచుకోకుండా బయటపడటం అవసరమనే అంశాన్ని లాయర్ సోలంకి వ్యాఖ్య ద్వారా సింబాలిక్‌గా చూపుతారు. తర్వాత ఆమె తండ్రి మీ ఫీజు ఎంత అని అడిగినప్పుడు 'ఆ అమ్మాయి ముఖంలో చిరునవ్వును మళ్లీ తెప్పించగలిగితే చాలు. అదే నా ఫీజు' అంటాడు. డిఫెన్స్ కౌన్సిల్ ఈ కేసును ఎంత సేపటికీ ధర్మరక్షణకు కుదించాలని చూసినప్పుడు లాయర్ సోలంకి ఉద్వేగంతో వాదిస్తూ. మహా శివుడు, పార్వతిల గురించిన కథ చెబుతూ, కొన్ని నేరాలు ఎంత హీనమైనవంటే దేవుడు సైతం వాటిని క్షమించలేని వ్యాఖ్యానిస్తాడు.

చివరగా ఒక మంచి కథ, మంచి దర్శకుడు, మంచి నటీనటులు, మంచి స్క్రీన్‍‌ ప్లే కుదిరితే ఎలాంటి గ్రామర్‌కి, ఆకర్షణకు సంబంధంలేని సీరియస్ అంశాలను కూడా ఎంత అద్భుతంగా తీయవచ్చో ఈ సినిమా చెబుతుంది. సినిమా కళను వెలిగించిన అతి కొద్ది సినిమాల సరసన చేరగలిగే 'సిర్ఫ్ ఏక్ బందా కఫీ హై'ని ఎవరూ మిస్ కావద్దు. జీ5లో ఈ సినిమాను చూడవచ్చు.

కె. రాజశేఖర రాజు

7396494557

Advertisement

Next Story

Most Viewed