స్త్రీలకు దారి చూపిన కాగడా..

by Ravi |   ( Updated:2025-01-12 01:15:56.0  )
స్త్రీలకు దారి చూపిన కాగడా..
X

భారతదేశంలో స్త్రీ విద్యా విప్లవాన్ని ప్రారంభించిన సాంస్కృతిక యోధురాలు సావిత్రిబాయి ఫూలే. ఆమె మహోజ్వలమైన చరిత్ర భారతదేశంలో స్త్రీల సాధికారితకు బాటలు వేసింది. ఈనాడు స్త్రీలు విద్యలో సామాజిక, సాంస్కృతిక, సాంకేతిక రంగాల్లో అద్వితీయ పాత్ర వహించడానికి పునాది వేసింది ఆమె. ఆమె ఒక సాహసవంతురాలు చరిత్రను మలుపు తిప్పిన యోధురాలు. స్త్రీలకు విద్య కలిగితేనే వారు ప్రపంచ మానవు లుగా ఎదుగుతారని గుర్తించిన సామాజిక శాస్త్రవేత్త.

సావిత్రిబాయి ఫూలే లింగ భేదాన్ని, కుల భేదాన్ని, భాషా భేదాన్ని, జాతి భేదాన్ని, వర్ణ భేదాన్ని నిరాకరించిన గొప్ప ప్రయోక్త. స్త్రీలను అన్ని వర్ణాల వారు అణగదొక్కుతున్నారు అని తెలుసుకొని బ్రాహ్మణ వర్ణం నుండి అస్పృశ్యుల దాకా అన్ని తరగతుల స్త్రీలలో విద్యా దీపాలు వెలిగించిన మానవతా దీప్తి ఆమె. సావిత్రిబాయి ఫూలేని ఒక ఉపాధ్యాయునిగా, ఉద్యమ యోధురాలుగా తీర్చిదిద్దిన మహత్మాఫూలే ఎన్నదగిన కీర్తి గలవారు. ఆమె సహచర్యం వల్ల మహాత్మా ఫూలే ఆలోచనలు స్త్రీల వైపు మళ్లాయి. మహాత్మా పూలే అందరి స్త్రీలను శూద్రులుగానే భావించారు. ఆయన బ్రాహ్మణ స్త్రీలను వేరు చేయలేదు. బ్రాహ్మణ స్త్రీలు, బ్రాహ్మణ పురుషులచేత ఎలా అణగద్రొక్కబడుతున్నారో చాలా శాస్త్రీయమైన విశ్లేషణ చేశారు.

స్త్రీ విముక్తికి విద్యే హేతువు..

నిజానికి జ్యోతిరావ్‌ ఫూలే జీవితం, సావిత్రిబాయి ఫూలే జీవితం విడదీయరానివిగా సాగాయి. భారతదేశ చరిత్రలోనే భార్యాభర్తలు సామాజిక సేవలో ఇంత మమేకమై చేసినవారు లేరు. సావిత్రిబాయి పూలే తన భర్తలోని జ్యోతికి నూనె పోసి వెలిగించే దానిగానే కాకుండా తన క్రియాశీలకమైన కృషిలో భాగస్వామిగా ఉండేది. వీరిద్దరు కలిసి రాత్రి స్కూలుని తమ ఇంట్లో నడిపించారు. దళిత స్త్రీల విముక్తికి విద్య మూల హేతువని సావిత్రిబాయి ఫూలే అప్పుడే గుర్తించారు. వీరి మార్గంలోనే అంబేడ్కర్‌ విద్యను ప్రధాన నినాదంగాను, ఆయుధంగాను స్వీకరించాడు. 1830 వరకు శూద్ర స్త్రీలకు, దళితులకు విద్య అనేది ఊహించే పరిస్థితుల్లో భారతదేశం లేదు. ముఖ్యంగా అగ్రవర్ణ ఆధి పత్యానికి, హిందూ నియంతృత్వానికి, కంచుకోట అయిన మరాఠారాజ్యం స్త్రీలను అతి దారుణంగా అణిచింది. ఆ పరిస్థితి నుండి వీరిని లేవనెత్తడానికి మొదట్లో నడుము కట్టిన భార్యాభర్తలు సావిత్రిబాయి పూలే, మహాత్మా ఫూలే. సావిత్రిబాయి ఫూలే మొత్తం సమాజానికే గురువు అయింది. గొప్ప నిర్మాత. ఎన్నో సంస్థలను, వ్యవస్థలను నిర్మించిన విద్యాదాత.

తొలి బాలికా విద్యాలయ స్థాపకులు..

సావిత్రిబాయి ఫూలే అనేక సంస్థల నిర్మాతగా ముందుకు నడిచింది. వీరిద్దరు కలిసి 1842లో అన్ని వర్ణాల బాలికలకు విద్యాలయం ప్రారంభించారు. 1863లో సావిత్రిబాయి పూలే విధవరాండ్ల రక్షణ కోసం ఒక ఆశ్రమాన్ని ప్రారంభించారు. ఇదే కాలంలో వీరొక బ్రాహ్మణ విధవరాలి కుమారుణ్ని దత్తత చేసుకున్నారు. బ్రాహ్మణ స్త్రీలకు భర్త చనిపోతే శిరోముండనం చేసే ఆచారాన్ని సావిత్రిబాయి పూలే వ్యతిరేకించింది. దీనికోసం మంగళ్లను సమీకరించి ఈ దురాచారానికి వ్యతిరేకంగా మేము కత్తి పట్టమని శపథం చేయించారు. బ్రాహ్మణ శూద్ర, అతిశూద్ర స్త్రీలందరినీ విముక్తి చేయాలని ఫూలే దంపతులు భావించారు. నిజానికి సావిత్రిబాయి ఫూలే ఒక చరిత్రను నిర్మించింది. స్త్రీ ఒక మౌఖిక విద్యా సంపన్నురాలు. ఆమెను లిఖిత సమాజంలోకి గాని తీసు కొస్తే ఆమె ప్రపంచాన్ని వెలిగించగలిగిన స్థాయికి వెలుతుందని సావిత్రిబాయి ఫూలే నమ్మింది. అందుకే ఆమె విద్యా వ్యవస్థ నిర్మాణానికి కృషి చేసింది.

దళిత ఉద్యోగినులు లైబ్రరీలు పెట్టాలి..

ఈనాడు సావిత్రిబాయి ఫూలే జీవితం మనకు ఆదర్శం కావాలంటే దళిత ఉద్యోగులైన స్త్రీలు వందలకు వందలు వస్త్రాలకు ఖర్చుపెట్టడం మాని, పుస్తకాలు కొనాలి. ప్రతి ఇంట్లో ఒక గృహ గ్రంథాలయాన్ని రూపొందించుకోవాలి. ఇండ్లలో పుస్తకాలు లేనట్లైతే మస్తకాలు బూజుపడతాయి. ఇండ్లను చిన్న చిన్న ఆశ్రమాలుగా రూపొందించుకోవాల్సిన అవసరం వుంది. ఉద్యమకారులైన భర్తలను వేధించకుండా వారికి సహకారాన్ని అందించడంలో సావిత్రిబాయి పూలేని ఆద ర్శంగా తీసుకోవాలి. సావిత్రిబాయి ఫూలే ఒక సజీవమైన జీవన స్రవంతి. మానవతా పరిమళాన్ని వెదజల్లిన కార్యకర్త. ఆమె కరుణ శీలి. భర్తని కాపాడటంలో వీరమాత. తన భర్తను తనను చంపడానికి వచ్చిన వారిని ఎదిరించింది. స్త్రీలకు విద్యను అందించడానికి ఆమె టీచరుగా మారడమే గాక భారతదేశంలో వున్న టీచర్లకు ఆమె మార్గదర్శకమైంది.

ఆమెను ఆదర్శంగా తీసుకొని..

ఆమె కార్యశీలి. ఆమె వాచకం మృదువైంది. ఆమె పలుకులు సూత్రబద్ధమైనవి. ఆమె కోరికల్ని నిరాకరించింది. ఆమె పరిసరాల్ని సేవామయం చేసింది. ఆడంబరాల్ని తృణీకరించింది. భర్తకు దారిచూపించే కాగడాగా వెలిగింది. ఈనాడు దళిత ఉద్యోగినులు సావిత్రిబాయి పూలే దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. నిరాడంబరమైన వస్త్రధారణ, చేతిలో పుస్తకం, ముఖంలో నవ్వు, ఆమె వ్యక్తిత్వం. ఇప్పటి స్త్రీలు ఆందోళనతో కనిపిస్తున్నారు. అప్పులలో మునిగిపోయి వుంటున్నారు. కోరికలు వారిని ముసురుతున్నాయి. ఈ సందర్భంగా సావిత్రిబాయి ఫూలేని ఆద ర్శంగా తీసుకొని మన దళిత స్త్రీలు నూత్న ఉత్తేజాన్ని పొందవలసిన చారిత్రక సందర్భం ఇది. ఆమె మార్గదర్శి, ఆమె నాయకురాలు, ఆమె ఉపాధ్యాయిని, ఆమె బోధకురాలు, ఆమె వెన్నెల, ఆమె వెలుగు, సూర్యచంద్రుల్ని మమేకం చేసిన క్రాంతి గోళం. ఆమె మార్గంలో నడుద్దాం.

డాక్టర్‌ కత్తి పద్మారావు

98497 4169

Next Story

Most Viewed