- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జాతీయ సమైక్యతా వారధి.. సర్దార్ వల్లభాయ్ పటేల్
స్వాతంత్య్ర సమరయోధుడు భారత తొలి ఉప ప్రధానిగా, హోమ్ మంత్రిగా దేశ స్వాతంత్య్రానంతరం స్వదేశీ సంస్థాలను భారత యూనియన్‌లో విలీనం చేసిన ఉక్కు మనిషి, బర్డోలీ వీరుడు, ఇండియన్ బిస్మార్క్‌గా పేరు పొందిన వారు “సర్దార్ వల్లభాయ్ పటేల్”. ఈ మహనీయుని జన్మదినమైన అక్టోబర్ 31వ తేదీని భారత జాతి జాతీయ ఐక్యతా దినంగా జరుపుకుంటున్నాము.
సర్దార్ వల్లభాయ్ పటేల్ 1875 అక్టోబరు 31వ తేదీన గుజరాత్‌లోని నాడియార్లో జవారి బాయ్ పటేల్ (తండ్రి), లాడ్ (తల్లి)లకు నాలుగవ సంతానంగా జన్మించారు. చిన్న తనంలో పటేల్ అంతగా చురుకైన వాడు కాదు. 22 సం॥రాల వయస్సు (1897 సం॥)లో మాతృభాష పై గుజరాతీలో, గుజరాత్‌లోని ఎన్.కె. ఉన్నత పాఠశాలలో మెట్రిక్యులేషన్ పూర్తి చేశాడు. 1910 సం॥లో న్యాయశాస్త్రం చదవడానికి ఇంగ్లాండ్ వెళ్ళాడు. 1913 సం॥లో లండన్‌లోని Inns of Court కాలేజ్లో బారిష్టర్ పూర్తి చేసి ఇండియాకి తిరిగి వచ్చి అహ్మదాబాద్‌లో న్యాయవాద వృత్తిని చేపట్టాడు. అహ్మదాబాద్‌లో న్యాయవాదిగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు.
స్వాతంత్య్రోద్యమంలో పటేల్ పాత్ర..
పటేల్ స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనడానికి ముందు గాంధీజీ సిద్ధాంతం పట్ల పెద్దగా నమ్మకం లేని వ్యక్తి. గాంధీజీ 1915 సం॥లో అహ్మదాబాద్ సభలో గాంధీ మాటలకు ప్రభావితుడైనాడు. ఆ తర్వాత 1917లో గుజరాత్ లోని ఖేడా జిల్లాలో గాంధీ నడిపిన ఉద్యమంలో పటేల్ స్వయంగా పాల్గొన్నాడు. గుజరాత్‌లో ప్లేగు వ్యాధి వ్యాపించి వందలాది మంది మృత్యువాత పడ్డారు. దీనికి తోడు కరువు సంభవించింది. ప్రజలను ఆదుకోవాల్సింది పోయి రైతులను పన్నులు కట్టమని బ్రిటిష్ ప్రభుత్వం బలవంత పెట్టింది. ఈ అమానుష సంఘటనకు వ్యతిరేకంగా, రైతులకు మద్దతుగా గాంధీ పిలుపు మేరకు పటేల్ కాలినడకన గ్రామాలన్ని తిరిగి రైతులకు మద్దతుగా నిలిచారు. ఈ సంఘటన తర్వాత పటేల్ గుజరాత్ రాష్ట్ర శాసనసభ కార్యదర్శి అయ్యారు. ఈ ఉద్యమంలోనే పటేల్‌ను “సర్దార్” అని పిలిచారు. 1928లో బార్డోలీ రైతులను పన్ను కట్టమని బ్రిటిష్ వారు బలవంత పెట్టారు. పన్నులు చెల్లించలేని రైతుల భూములను బ్రిటీష్ వారు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉద్యమం సుమారు 6 నెలలుగా నడిచింది. చివరగా పటేల్ పోరాటంతో బ్రిటీషు వారు రైతుల నుంచి అదనంగా వసూలు చేసిన పన్నులు తిరిగి రైతులకు చెల్లించారు. బోర్డోలి ఉద్యమం పటేల్‌ని గుజరాత్‌కు తిరుగులేని గొప్ప నాయకుణ్ణి చేసింది.
1930 సం॥లో గాంధీజీ నడిపిన ఉప్పు సత్యాగ్రహాన్ని విజయవంతంగా చేయటంలో పటేల్ కీలక పాత్ర పోషించాడు. పటేల్ ఉప్పు సత్యాగ్రహంలో గ్రామాలన్నీ తిరిగి 3 లక్షల మంది సభ్యులతో 15 లక్షల రూపాయల విరాళాలు సేకరించాడు. తన ఉపన్యాసాలతో ప్రజలను స్వాతంత్య్రం పట్ల ఉత్తేజితులను చేశాడు. విదేశీ వస్తు బహిష్కరణలో భాగంగా పటేల్ తన వద్ద ఉన్న విదేశీ వస్తువులను, దుస్తులను తగలబెట్టాడు. 1931 సం॥లో కరాచీలో జరిగిన సమావేశంలో పటేల్‌ని జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. అదే సమయంలో లండన్‌లో జరిగిన 2వ రౌండ్ టేబుల్ సమావేశం విఫలం కావడంతో గాంధీ సహాయ నిరాకరణోద్యమానికి నడిపించాడు. బ్రిటీషు వారు గాంధీని, పటేల్‌ని ఎరవాడ జైళ్లో బంధించారు. జైలులో ఉన్న పటేల్‌కి సోదరుడు విఠల్ బాయ్ మరణ వార్త తెలిసింది. పటేల్ మనోధైర్యాన్ని కోల్పోలేదు. దేశవిముక్తి ఆశయంగా గాంధీ ఇచ్చిన స్పూర్తి పటేల్‌ని ముందుకు నడిపింది. 1942 ఆగస్టులో గాంధీజీ సారధ్యంలో నడిచిన క్విట్ ఇండియా ఉద్యమాన్ని, గాంధీజీకి అనేక మంది సమకాలీన జాతీయ నాయకులు విమర్శించారు. కానీ పటేల్ మాత్రం గాంధీజీకి పూర్తి మద్దతు తెలిపారు. పటేల్ తన ప్రసంగాలతో ఉద్యమ అజెండాలను ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారు. ఈ ఉద్యమంలో గాంధీజీతో పాటు పటేల్ అరెస్టయి 1945 వరకు జైలు జీవితం అనుభవించారు.
1946 లో భారత జాతీయ కాంగ్రెస్ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 18 ప్రావిన్షియల్ కాంగ్రెస్ కమిటిలో 3-నెహ్రును, 12 కమిటీలు పటేల్‌ని పార్టీ అధ్యక్షునిగా కోరుకున్నాయి. కానీ గాంధీజీ పటేల్‌ని అధ్యక్ష బరిలోంచి తప్పుకోమన్నారు. దీనికి పటేల్ సరే అన్నారు. నిజానికి నెహ్రూ, పటేల్‌లు ఇద్దరూ గాంధీజీకి ప్రియ శిష్యులే. పటేల్ గాంధీని పెద్దన్నగా భావించేవారు. ఎక్కువ మంది కాంగ్రెస్ నాయకులు కూడా పటేల్ అభ్యర్థిత్వాన్ని సమర్ధించారు. కానీ గాంధీ పట్టుబట్టి నెహ్రుని కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిని చేశాడు. పార్టీ అధ్యక్షుడు, తదుపరి భావి ప్రధాన మంత్రి అయ్యే అవకాశం ఉన్నప్పటికీ గాంధీజీని గౌరవించి “పదవి కాదు. ముఖ్యం దేశ స్వాతంత్య్రం, దేశ సమైక్యత ముఖ్యం" అని భావించి పదవులను తృణప్రాయంగా వదులుకున్న గొప్ప వ్యక్తిత్వం పటేల్‌ది.
భారత తొలి ఉప ప్రధానిగా, హోం మంత్రిగా పటేల్:
స్వాతంత్ర్యానంతరం భారత తొలి ప్రధాని యైన జవహర్ లాల్ నెహ్రూ మంత్రిమండలిలో సర్దార్ పటేల్ హోంమంత్రిగా, ఉప ప్రధానిగా, రాజ్యాంగ రచన సమయంలో ప్రాధమిక హక్కుల కమిటీ చైర్మన్‌గా వ్యవహరించారు. పార్లమెంట్‌కు రాష్ట్రపతి ఆంగ్లో ఇండియన్లను నామినేట్ చేయు అధికారాన్ని పటేల్ ప్రతిపాదించాడు. స్వాతంత్ర్యం తరువాత దేశం అనేక సవాళ్ళను ఎదుర్కొంది. ఇందులో ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ దేశాలు రెండూ మత పరంగా విభజన జరగటంతో అనేక అల్లర్లు చెలరేగాయి. స్వాతంత్య్ర సమయంలో లార్డ్ మౌంట్ బాటెన్ తన ప్రసంగంలో ఇండియా, పాక్ రెండు దేశాలకు స్వాతంత్య్రం ఇస్తున్నామని చెప్పి మత ప్రాతిపదికన విభజన చేసి, మత ఘర్షణ చిచ్చు పెట్టాడు. మత పరంగా దేశాన్ని రెండుగా (ఇండియా-పాక్) చేయడానికి కాంగ్రెస్ ఏ మాత్రం సుముఖంగా లేదు. కాని మత పరంగా ఈ విభజన తప్పలేదు. కానీ పటేల్ మాత్రం విభజనకు సుముఖంగా ఉన్నారు.
పది లక్షల ప్రాణాలు హరీ..
విభజన సమయంలో భారత్ నుంచి సుమారు 76 లక్షల 26 వేల మంది ముస్లింలు పాకిస్తాన్‌కి. పాకిస్తాన్ నుండి 72 లక్షల 49 వేల నుండి భారత్‌కు తరలివచ్చారు. ఈ సమయంలోనే సుమారుగా 10 లక్షల మంది భారత్ పాక్ మత ఘర్షణలో హత్యకు గురయ్యారు. 200 సం॥రాలకు పైగా బ్రిటిష్ వ్యతిరేక పోరాటంలో కూడా ఇంత మంది ప్రాణాలు కోల్పోలేదు. ఆనాడు బ్రిటిష్ వారు రగిలించిన మత ఘర్షణలు పటేల్ తీవ్రంగా కలచివేశాయి. స్వయంగా పటేల్ సరిహద్దు గ్రామాల్లో పర్యటించి అల్లర్లు పెద్దవి కాకుండా చూశారు. “శరణార్థులను చంపటం ఇదేం మానవత్వం. ధర్మం'' అంటూ ప్రశ్నించాడు. ఈ మత ఘర్షణలను గురించి ఉర్దూ కవి ఫైజ్ అహ్మద్ “రాత్రి కోరల్లో చిక్కిన ఉదయం, మసక మసక వెలుతురు. ఇన్నాళ్లు మనం ఎదురు చూసింది ఈ గమ్యం కోసమా” అని ఆవేదన వ్యక్తం చేశాడు. సంస్థానాల విలీనంలో నెహ్రూ శాంతి కాముక పద్ధతిని అవలంభించాలని పేర్కొంటే పటేల్ మాత్రం సైనిక, బల ప్రయోగం ద్వారా సంస్థానాలను భారత్‌లో విలీనం చేశారు.
జాతీయ సమైక్యతా వారధి పటేల్..
1947 నాటికి దేశంలో 565 స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి. వీటిలో కాశ్మీర్, జునాగడ, హైదరాబాద్ మినహా మిగిలినవి పటేల్ కృషితో బేషరతుగా ఇండియన్ యూనియన్లో అంతర్భాగమయ్యాయి. మిగతా మూడు సంస్థానాలను భారత్ లో విలీనం చేయడానికి పటేల్ పట్టుదలతో వ్యవహరించారు. వీటిలో ముఖ్యమైనది హైదరాబాద్ సంస్థానం. ప్రపంచంలో అత్యంత ధనవంతులలో ఒకడిగా పేరొందిన ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ సంస్థానాన్ని ముస్లిం రాజ్యాంగ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. తమ సంస్థానానికి సొంత కరెన్సీ, రైల్వే, సైనిక వ్యవస్థలు ఉండటంతో హైదరాబాద్ స్వతంత్య్ర రాజ్యాంగ ఉంచాలనే ఆలోచన నిజాంది. మరికొంత కాలం వేచి చూసిన తర్వాత భారత యూనియన్ లో హైదరాబాద్ విలీనం చేస్తానని నిజాం ప్రతిపాదించారు. నిజాం వైఖరి పట్ల అనుమానం ఉన్న పటేల్ దానికి ఒప్పుకోలేదు. మరో పక్క స్వతంత్య్ర దేశంగా ఉండేందుకు నిజాం ఐక్యరాజ్య సమితిని సంప్రదించారు. నిజాం సంస్థానంలో రజాకార్లు మత కల్లోలన్నీ సృష్టించి ఆ ప్రాంతంలోని ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు.
1948 ఆగస్టు 9వ తేదిన టైమ్స్ ఆఫ్ లండన్‌లో వచ్చిన వార్త ప్రకారం హైదరాబాద్ 40,000 సైన్యాన్ని, ఆయుధాలను సమకూర్చుకుంది. భారత ప్రభుత్వాన్ని ఎదుర్కొవడానికి లక్ష మంది సైన్యంతో సిద్ధంగా ఉందని, బొంబాయి పై బాంబులు వెయ్యడానికి సౌదీ అరేబియా కూడా సిద్ధంగా ఉందని హైదరాబాద్ ప్రధాన మంత్రి లాయిక్ అలీ ప్రకటించారు. పటేల్ ఇండియన్ ఆర్మీని “ఆపరేషన్ పోలో” పేరులో హైదరాబాద్‌కు పంపారు. ఆపరేషన్ పోలోకు ముందు సర్దార్ పటేల్ సందేశమిస్తూ.. “ఆధునిక కాలంలో, స్వేచ్చా వాయువులతో తొణికిసలాడుతూనే భారతదేశానికి మధ్యలో ఒక ప్రదేశం నియంతృత్వంలో మగ్గిపోవటం సరికాదు. చుట్టూ ఉన్న ప్రజలు స్వేచ్ఛ, బాధ్యతలు అనుభవిస్తున్న వేళ ఇక్కడి ప్రజలు వాటికి దూరం కావడం అమానుషం” అన్నారు. పటేల్ హైదరాబాద్ భారత్ యూనియన్లో విలీనం కాకపోవటం కడుపులో క్యాన్సర్‌గా పటేల్ భావించారు.
1948 సెప్టెంబర్ 13 నుంచి 18 వరకు హైదరాబాద్ మేజర్ జనరల్ జె.ఎన్. చౌదరి నాయకత్వంలో పోలీసు చర్య జరిగింది. ఈ 5 రోజుల యుద్ధంలో 1373 మంది రజాకార్లు మరణించగా 1647 మంది బంధీలుగా పట్టుబడ్డారు. 1948 సెప్టెంబర్ 18న నిజాం, సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు లొంగిపోయాడు. దీంతో హైదరాబాద్ భారత యూనియన్‌లో భాగమైంది. కాశ్మీర్ అంశం కూడా పటేల్‌కి నాడే అప్పగించి ఉంటే కాశ్మీర్ సమస్య ఉండేది కాదేమో అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
అఖిల భారత సర్వీసుల పితామహుడు.. పటేల్
భారత పాలన వ్యవస్థకు పటేల్ కృషి అమోఘం. దేశ స్వాతంత్రానంతరము పాలనలో ఏకరూపతను, దేశ సమైక్యతను సాధించాలనే సంకల్పంతో అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేశారు. పటేల్ కృషి ఫలితమే నేటి ఈ అఖిల భారత సర్వీసులు. అందుకే పటేల్‌ను “అఖిల భారత సివిల్ సర్వీసుల పితామహుడు” గా అభివర్ణిస్తారు. పటేల్ పేరు మీదుగా ఎన్నో సంస్థలను, స్మారక కట్టడాలను ఏర్పాటు చేశారు. “మౌంట్ అబు”లోని కేంద్ర పోలీసు శిక్షణ సంస్థను “1975 ఫిబ్రవరి మాసంలో హైదరాబాద్‌ను మారుస్తూ “సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ”గా నామకరణం చేశారు. పటేల్ పేరు మీదుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ వ్యవసాయ విశ్వవిద్యాలయం (మీరట్, యూపీ), సర్దార్ సరోవర్ డ్యామ్ (గుజరాత్), సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సూరత్), సర్దార్ పటేల్ విశ్వవిద్యాలయం (గుజరాత్), సర్దార్ పటేల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (అహ్మదాబాద్) మొదలయినవి ఏర్పాటు చేశారు. నేటి మోదీ ప్రభుత్వం పటేల్ సేవలకు గుర్తుగా తన జన్మస్థలమైన గుజరాత్లో పటేల్ విగ్రహాన్ని జాతీయ సమైక్యతకు చిహ్నంగా “స్టాట్యూ ఆఫ్ యూనిటీ” పేరుతో 2979 కోట్లతో 182 మీటర్లు ఏదైనా విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ముగింపు:
సర్దార్ వల్లభాయ్ పటేల్ పాలన దక్షతకు మారుపేరు, నీతి నిజాయితీ, దృఢసంకల్పం, వాస్తవ దృక్పధం, భవిష్యత్తు పట్ల దూరదృష్టి గలవారు పటేల్. నేటి యువతరం, రాజకీయ నాయకగణం పటేల్ భావాలు, ఆదర్శాలను పాటించి జాతీయ సమైక్యతను పటిష్టపర్చడమే మనం పటేల్ ఇచ్చే నిజమైన జయంతి కానుక. జాతి సమైక్య సారధిగా, నవభారత వారధిగా భారతదేశ చరిత్రలో పటేల్ స్థానం చిరస్మరణీయం..
డా॥ ఎ. కుమారస్వామి
ప్రభుత్వ పాలనా శాస్త్రం.
ఉస్మానియా విశ్వవిద్యాలయం.
90006 18068