- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ తీరుపై ధ్వజమెత్తిన ఆరెస్సెస్
కేంద్రంలో మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలో కొలువుతీరిన తర్వాత ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ సమకాలీన రాజకీయ పరిస్థితులపై చేసిన పలు పదునైన వ్యాఖ్యానాలు, చెప్పిన హిత వచనాలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మహారాష్ట్రలోని నాగపూర్‌లో సోమవారం ఆరెస్సెస్ ట్రైనీలను ఉద్దేశించి ప్రసంగిస్తూ మోహన్ భగవత్, ప్రజాసేవలో నాయకులు ఏతీరున వ్యవహరించాలో పలు సూచనలను భావితరానికి అందించారు. ఎన్నికల ప్రచారంలో నాయకులు పాటించాల్సిన హుందాతనాన్ని గురించి, అనేక మంచి మాటలను మోహన్ భగవత్ చెప్పారు. నిజమైన సేవకునికి అహంకారం ఉండదని, ప్రజా జీవితంలో గౌరవ మర్యాదలు పాటిస్తాడని అన్నారు. మొత్తం మీద బీజేపీ పనితీరుపై, ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోడీ వ్యవహారంపై ఆయన వ్యాఖ్యలను అభిశంసనగానే చెప్పాల్సి ఉంటుంది.
ఇటీవల ఎన్నికల్లో రాజకీయ పార్టీలు మర్యాదలు పాటించలేదని మోహన్ భగవత్ చెబుతూ నిజమైన సేవకునికి ఉండాల్సిన లక్షణాలను వివరించారు. ఎన్నికలంటే పోటీయే తప్ప యుద్ధం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరారు. రాజకీయాల్లో 'ప్రతిపక్షమే' తప్ప 'విరోధిపక్షం' ఉండదని, అందుకు అనుగుణంగానే పార్టీల వ్యవహార శైలి ఉండాలని హితవు చెప్పారు. ‘ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎన్నికలు అత్యవసరం. అంతే కాక రాజకీయ పార్టీల మధ్య పోటీ కూడా ఉంటుంది. పోటీ అంటే ఒకరు ముందుకు వెళ్ళటం. మరొకరిని వెనక్కి లాగటం కాదు. ఇలా చేయొద్దు. ప్రజలు తమ ప్రతినిధులను ఎందుకు ఎన్నుకుంటారు’ అని ఆయన ప్రశ్నించారు. అహంకార రహితంగా, సంయమనంతో ప్రజాసేవలో నిమగ్నం కావాలని ఆయన ఉద్బోధించారు.
మణిపూర్ అల్లర్లకు పరిష్కారమేది?
అత్యంత ప్రాధాన్యమైన అంశంగా మణిపూర్ అల్లర్లను గుర్తించాలని ఆరెస్సెస్ చీఫ్ సూచించారు. ‘ఏడాది కాలంగా మణిపూర్ శాంతి కోసం ఎదురుచూస్తుంది. గత పదేళ్ళుగా ఆ రాష్ట్రంలో శాంతి నెలకొనింది. కానీ అకస్మికంగా తుపాకీ సంస్కృతి మళ్లీ పెరిగింది. అది ఇంకా మంటల్లో కాలుతూనే ఉంది. ఎవరు దీనిపై దృష్టి పెడతారు దీన్ని ప్రాధాన్యమైన సమస్యగా గుర్తించి చర్చించాలి. దీన్ని కర్తవంగా భావించాలి’ అని ఆయన బీజేపీ ప్రభుత్వానికి ఒక మార్గదర్శనం చూపారు. ఆయన మాటలను పట్టించుకొని నడుచుకుంటే మోడీ ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. నిజానికి సుదీర్ఘ అనుభవంతో ఆయన చెప్పిన అమూల్యమైన సూచనలు పార్టీలకు అతీతంగా అందరూ పాటించవలసినవే.
పార్టీలమధ్య పోటీ పరస్పర యుద్ధం కాదు
పార్లమెంటులో కూర్చొని ఏకాభిప్రాయాన్ని సాధించి దేశాన్నినడిపించాలని మాత్రమే ప్రజలు కోరుకుంటున్నారు. ఏకాభిప్రాయ సాధనే మన సాంప్రదాయం. పార్లమెంటుకు వచ్చిన రెండు పక్షాల మధ్య ఏకాభిప్రాయం సాధించడం కొంత కష్టమే. అందుకే మెజార్టీని పరిగణనలోకి తీసుకుంటారు. పార్టీల మధ్య పోటీ ఉంటుందే తప్ప పరస్పర యుద్ధం కాదని భగవత్ అన్నారు. అందువల్ల ఇరుపక్షాల అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాత చర్చలు జరిపి అంగీకారానికి రావాల్సి ఉంటుంది అని చెప్పారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో అదుపుతప్పి విమర్శలు చేసుకున్న వైనాన్ని మోహన్ భగవత్ ప్రస్తావించారు.
ఎన్నికల్లో గౌరవ మర్యాదలు లేవు
ఒకరిని మరొకరు విమర్శించుకున్న తీరు... ప్రచారంలో వ్యవహరించిన విధానం సమాజంలో విభేదాలను పెంచుతాయి. సమాజాన్ని రెండు వర్గాలుగా చీల్చుతాయి. పరస్పర అవిశ్వాసాన్ని కలిగిస్తాయి. ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. దీంట్లోకి సంఘ్‌ను కూడా లాగారు. సాంకేతికతను దుర్వినియోగం చేసి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేశారు. మొత్తం అబద్ధాలనే చెప్పారు. గౌరవనీయ వ్యక్తులు ఎవరు ఇలాంటి సాంకేతికతను ఉపయోగించరు. ఎన్నికల్లో గౌరవ మర్యాదలు పాటించాలి అని ఆరెస్సెస్ అధినేత అన్నారు. ఎన్నికల వాతావరణం నుంచి బయటపడి దేశ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని కేంద్ర ప్రభుత్వానికి హితవు చెప్పారు. మోడీ ప్రభుత్వం చాలా రంగాల్లో విశేషమైన ప్రగతిని సాధించిందని ఆయన ప్రశంసిస్తూనే ..దేశం ఇంకా సవాళ్ళ నుంచి విముక్తి పొందలేదని వ్యాఖ్యానించారు.
భగవత్ సూచనలను మోడీ పాటించాలి
మోహన్ భగవత్ చేసిన ప్రసంగంపై కాంగ్రెస్, ఇతర విపక్షాలు గౌరవప్రదంగా స్పందించాయి. ఆయన సలహాలను పాటించాలని ప్రధాని మోడీకి అవి సూచించాయి. మణిపూర్ సమస్యను పార్లమెంటులోనూ, బయటా విపక్షాలు అనేకసార్లు లేవనెత్తినా మోడీ మౌనం పాటించారు. డబుల్ ఇంజెన్ సర్కార్ లోనే ఇంత ఘోరమైన దురాఘాతాలు జరుగుతుంటే హత్యలూ మానభంగాలు, చర్చీల, గృహ దహనాలు దివారాత్రాలు జరుగుతూ ఉంటే ప్రధాని హోదాలో కనీసం స్పందించక పోవడం దేశాన్ని నివ్వెరపరిచింది. పార్లమెంటులో చర్చకు అనుమతించలేదు. విపక్షాలను బహిష్కరించారు. దేశ, విదేశీ మీడియాలో పుంఖాను పుంఖాలుగా అనేక కథనాలు వెలువడ్డాయి. విదేశీ మీడియాను సంఘటనా స్థలానికి అనుమతించ లేదు. ఇంటర్నెట్‌ను నెలల తరబడి నిలిపివేశారు. ఇప్పటికీ మణిపూర్‌లో హింస, గృహదహనాలు కొనసాగుతూనే ఉన్నాయి. స్థానిక ప్రజల నిరసన దీక్షలను పోలీసులు భగ్నంచేస్తున్నారు. ఆందోళనా కారులను చెదరగొడుతున్నారు. అక్కడ నెలలతరబడి శాంతి కరువైంది. ఇతరుల మాట వినక పోయినా బీజేపీ ఎదుగుదలకు అన్నివిధాల సహకరించిన మాతృసంస్థ ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ అమూల్యమైన సలహలను ఇప్పటికైనా మోడీ పాటించాలి. ప్రధాని ఇకనైనా మణిపూర్ వెళ్లి అక్కడి పరిస్థితులను చక్కదిద్దాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జై రామ్ రమేష్ సూచించారు.
సలహాలు వినడం మోడీ డీఎన్ఏలోనే లేదు
అయితే అసలు సలహాలు వినడం మోడీ డీఎన్ఏలోనే లేదని రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబాల్ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాల మాటలు వినకపోయినా కనీసం ఆరెఎస్సెస్ చీఫ్ సూచనలైనా మోడీ పట్టించుకోవాలని సలహా ఇచ్చారు. ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ మాట్లాడుతూ 'విస్పష్టంగా కనిపిస్తున్న అహంకారం గురించి భగవత్ అనుభవపూర్వకంగా చెప్పినట్లుందని' వ్యాఖ్యానించారు. ఇంత జరుగుతున్నా మణిపూర్‌పై ప్రధాని ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని ఎన్‌సీపీ (పవార్) నాయకురాలు సుప్రియా సూలే విమర్శించారు. ఏదేమైనా, ఈ సందర్భంలో మోహన్ భగవత్ చెప్పిన హితపు మాటలపై ప్రతిపక్షాలు, దేశ ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
డాక్టర్ కోలాహలం రామ్ కిశోర్
98493 28496