ముగ్గురు సీఎంల మేళవింపు రేవంత్

by Ravi |   ( Updated:2024-01-09 01:00:02.0  )
ముగ్గురు సీఎంల మేళవింపు రేవంత్
X

నేటికి సరిగ్గా నెల రోజుల క్రితం బాధ్యతలు తీసుకున్న రేవంత్ రెడ్డి పనితీరులో భిన్నత్వం ఉంది. ఎక్కడ కూడా తొట్రుపాటు, తొందరపాటు లేకుండా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించే ప్రయత్నం చేస్తున్న పరిస్థితులు ఆయనలో కనిపిస్తున్నాయి. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి డిప్యూటీ సీఎం, మంత్రులను వెంట తీసుకువెళ్లి ప్రధాని నరేంద్ర మోడీ సహా కేంద్ర మంత్రులను కలుస్తూ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్న తీరుపై తెలంగాణలో చర్చ జరుగుతున్నది.

తెలంగాణ రెండో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తన మార్క్ పాలన చూపుతున్నారు. రాజకీయంగా మంత్రిగా పనిచేసిన అనుభవం లేకుండానే నేరుగా ముఖ్యమంత్రి అయిన రేవంత్ ఒక సుదీర్ఘ అనుభవం ఉన్న సీఎంలా ముందుకు సాగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పాలన దక్షతతో పాటు రాజకీయంగా, పార్టీ పరంగా తనదైన శైలిలో వ్యూహాత్మక అడుగులు వేస్తూ పరిణతి చెందిన రాజకీయవేత్తగా ఆయన కనిపిస్తున్నారు.

పసిగుడ్డును పట్టుకొని పాతాళం గురించి అడిగినట్టు... నెల రోజుల పాలన పూర్తికాకుండానే ప్రతిపక్షాలు, అందులోనూ... గత ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి పాలనను అడుగడుగునా నిలువరించే ప్రయత్నం చేస్తున్నది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా ఆయన కేబినెట్ సహచరులు అంతే దీటుగా జవాబు ఇస్తున్న తీరు గడిచిన నెల రోజుల్లోనే ప్రతిపక్ష పార్టీల నాలుకలు మడతపడేలా చేస్తున్నది. పంచాయతీ సంస్థల ప్రతినిధిగా, లెజిస్లేటర్‌గా, పార్లమెంటు సభ్యునిగా అనుభవం గడించిన రేవంత్ రెడ్డి అనతి కాలంలోనే ముఖ్యమంత్రిగా అనూహ్య అవకాశం పొందారు. గతంలో ఆయనకు మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా లేదు. కానీ నేటికీ సరిగ్గా నెల రోజుల క్రితం బాధ్యతలు తీసుకున్న రేవంత్ రెడ్డి పనితీరులో భిన్నత్వం ఉంది. గతంలో పనిచేసిన ముగ్గురు ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కె చంద్రశేఖర రావుల మేళవింపు కనిపిస్తున్నది. ఎక్కడ కూడా తొట్రుపాటు, తొందరపాటు లేకుండా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించే ప్రయత్నం చేస్తున్న పరిస్థితులు ఆయనలో కనిపిస్తున్నాయి.

అర్హుల ఎంపికపై కసరత్తు

రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజా పాలన పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలకు సంబంధించి అర్హుల ఎంపికతో పాటు, ఆ పథకాల కోసం రాష్ట్రంలో ఎంతమంది ఆధారపడుతున్నారన్న సమాచారం ప్రభుత్వానికి చేరింది. ఇదే కార్యక్రమం సందర్భంగా తెలంగాణలో కేసీఆర్ పాలన పోయి రేవంత్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చిందని జనంలోకి బలంగా వెళ్లడానికి మంచి అవకాశంగా మారింది. ప్రజా పాలన సభలకు వెళ్లిన సందర్భంలో రేవంత్ రెడ్డి కొత్త సంక్షేమ పథకాలపై చర్చ కనిపించింది. ఇది రేవంత్ రెడ్డి పేరు ప్రబలంగా జన బాహుళ్యంలోకి వెళ్లడంతో పాటు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలన మొదలైందని విస్తృత ప్రచారానికి వేదిక అయింది.

హామీలపైనే తొలి సంతకం

మరోవైపు పార్టీతో పాటు ప్రభుత్వంలో తనదైన ముద్ర వేసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్ తరపున చంద్రబాబును ఓడించి అధికారం చేపట్టిన వెంటనే వైఎస్ రాజశేఖరరెడ్డి ఉచిత కరెంటు ఫైలుపై సంతకం చేసినట్టుగానే, సరిగ్గా నెల రోజుల క్రితం అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో ఇచ్చిన ఆరు కీలక హామీల్లో నుండి రెండు హామీలను నెరవేరుస్తూ ఫైలుపై సంతకం చేశారు. అలాగే నిరంతరం ప్రజలు అధికారులతో కలిసి ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి వారం రెండు రోజులు ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించే విధానంతో పాటు, సంక్షేమ పథకాల అమలులో రేవంత్ రెడ్డి అడుగులు వైఎస్ అనుకరణకు దగ్గరగా ఉన్నాయి. కేబినెట్ కూర్పుతో పాటు, ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి ప్రతికూలత రాకుండా జాగ్రత్త పడుతున్నారు. మరోవైపు పార్టీ మీద కూడా పట్టు సాధించేందుకు వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నారు. పార్టీకి కార్యకర్తలే పునాది అని, వారి బాగోగులకు బాధ్యత నాది అంటూ ప్రతిసారి కార్యకర్తలకు భరోసా ఇస్తున్నారు. అలాగే కాంగ్రెస్ ఓడిపోయిన నియోజకవర్గాల్లో ఓడిన అభ్యర్థులు సైతం తమ దృష్టిలో ఎమ్మెల్యేలే అంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు పార్టీ నేతలు కార్యకర్తలు మనోస్థైర్యాన్ని నింపాయి. మరోవైపు వెళ్లిన ప్రతిసారి డిప్యూటీ సీఎం, మంత్రులను వెంట తీసుకెళ్లి ప్రధాని నరేంద్ర మోడీ సహా కేంద్ర మంత్రులను కలుస్తూ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్న తీరుపై తెలంగాణలో చర్చ జరుగుతున్నది.

దూకుడుతో బీఆర్ఎస్ షాక్

ఇక బీఆర్ఎస్‌ని గద్దె దింపి అధికారం చేపట్టిన రేవంత్ రెడ్డి ప్రతిపక్షంగా ఆ పార్టీని ఎదుర్కొనగలరా.. అనే ప్రశ్నకు అసెంబ్లీ వేదికగా ఆయన చూపిన దూకుడు నుంచి బీఆర్ఎస్ ఇంకా తేరుకోవడం లేదు. గతంలో రాజకీయ పార్టీలను కేసీఆర్ ఒక్కరే నిలువరించగలరన్న అభిప్రాయం రాజకీయ పార్టీల్లో ఉండేది. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఏది మాట్లాడినా నిక్కచ్చిగా లెక్కలతో సహా సెలవిస్తుండడంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ తల పట్టుకుంటున్నది. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల్లో భారీగా అవినీతి జరిగిందని కాళేశ్వరం సహా విద్యుత్ కొనుగోలు, మిషన్ భగీరథ, పౌరసరఫరాలు వంటి శాఖల్లో విచారణ జరిపిస్తామంటూ అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష పార్టీపై చేసిన ఎదురుదాడి అప్పటి మంత్రులు సహా పార్టీ కీలక నేతల్లో ఒత్తిడి పెంచిందనడంలో సందేహం లేదు.

- ఎస్. కృష్ణ మోహన్,

సీనియర్ జర్నలిస్టు,

94404 43554

Advertisement

Next Story

Most Viewed