- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Economic Reforms: దేశంలో ఆర్థిక సంస్కరణల ఫలితాలెలా ఉన్నాయి?
రెండు, మూడు రోజుల క్రితం కాగ్ నివేదిక ఆధారంగా కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంటులో చేసిన ప్రకటన ఆందోళనకరంగా వుంది. 2014 నుంచి కేంద్రం తీసుకున్న కొన్ని విధాన నిర్ణయాల వలన క్రమంగా దేశంలో ద్రవ్యోల్బణం పెరిగింది. వినియోగ వ్యయం, పెట్టుబడులు తగ్గాయి. ఆర్థిక వృద్ధి మందగించింది. నిరుద్యోగం బాగా పెరిగింది. క్రమంగా దేశం విదేశీ రుణ భారంలో మునిగిపోతోంది. రాష్ట్ర ప్రభుత్వాలు తమ శక్తికి మించి అప్పులు చేస్తున్నాయి. వాటి బడ్జెట్ అంచనాలు తప్పుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు నెలాఖరున జీతాలు ఇవ్వలేక, కొన్ని రోజుల పాటు వాయిదా వేస్తూ పోతున్నాయి. కేంద్రం ఆర్థిక పరిస్థితి కూడా ఏమీ మెరుగ్గా లేదు. తాను అనుసరించిన ఆర్థిక విధానాల కారణంగా దేశీయ, విదేశీ రుణాల ఊబిలో చిక్కుకుంది. 2014-15 నాటికి కేంద్రం రుణం రూ. 62 లక్షల 42 వేల 221 కోట్లు. 2020-21 నాటికి 1 కోటి 18 వేల 120.15 కోట్లు. 2021-22 నాటికి 1 కోటి 35 లక్షల 86 వేల 975.52 కోట్లకు చేరింది. ఇందులో విదేశీ రుణం 4 లక్షల 27 వేల 925 కోట్లు. మొత్తంగా భారత ప్రభుత్వ రుణం 1 కోటి 55 లక్షల కోట్లకు చేరింది.
మన దేశంలో ఆర్థిక సంస్కరణలను శాస్త్రవేత్తలు రెండు తరాలుగా వర్ణిస్తారు. మొదటి తరం సంస్కరణలు 1991-2000 మధ్య అమలు చేసినవి. రెండవ తరం సంస్కరణలు 2001 నుంచి అమలవుతున్నవి. రెండవ తరంలో ఉత్పత్తి కారకాల మార్కెట్ సంస్కరణలు ప్రధానం. విద్య, ఆరోగ్యం, రహదారులు, విద్యుత్తు, టెలికాం మొదలైనవి. వీటిలో కొన్నింటిని మూడు, నాలుగు తరాలుగా కూడా వర్గీకరించారు. ఆర్థిక సంస్కరణ ఫలితాలను పరిశీలిస్తే మనకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. 1990-91 కి ముందు 5 శాతం సమీపంలో వున్న వృద్ధి రేటు సంస్కరణల అమలు తరువాత 7-8 శాతానికి పెరిగింది. పేదరికం(Poverty) 1993లో 36 శాతం వుంటే 2004-05 నాటికి 27.5 శాతానికి తగ్గింది. కానీ, స్థూల జాతీయ ఉత్పత్తి(Gross domestic product) పెరుగుదలతో పోలిస్తే పేదరికం తగ్గుదల రేటు తక్కువే. 1990కి పూర్వం ఉద్యోగిత వార్షిక వృద్ధి రేటు 3.4 శాతం కాగా, 1990-91 నుంచి 1997-98 నాటికి ఒక్క శాతానికి తగ్గింది. సంస్కరణల కాలంలో నిరుద్యోగిత(unemployment) బాగా పెరిగింది. ఉపాధి లేని ఆర్థిక వృద్ధిగా దీనిని నిపుణులు వర్ణించారు. వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు మందగించింది. పెట్టుబడి పెద్దగా పెరగలేదు. నీటిపారుదల మీద ప్రభుత్వ పెట్టుబడి చాలా తక్కువ. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ తగ్గుముఖం పట్టింది.
సంస్కరణలకు ముందు 7.8 శాతం వుంటే 2014-15 నాటికి 5.8 శాతానికి పడిపోయింది. ప్రభుత్వ రంగ సంస్థల(Public sector organizations) పనితీరు మెరుగు పడింది. ఈ సంస్థల స్థూల లాభాలు 1993-1994 లో 11.61 శాతం నుంచి 2004-05 నాటికి 21.5 శాతానికి పెరిగాయి. నికర లాభం 2.84 శాతం నుంచి 12.1 శాతానికి పెరిగింది. టోకు ధరల సూచీ 1993-94లో 100 పాయింట్ల నుంచి 2014-15లో 181.2 పాయింట్లకు పెరిగింది. పారిశ్రామిక వినియోగ ధరల సూచీ అదే కాలంలో 267 పాయింట్ల నుంచి 1278 పాయింట్లకు పెరిగింది. టోకు ధరల సూచీ కన్నా వినియోగ ధరల సూచీ ఎక్కువగా పెరిగింది. అవస్థాపన పరిశ్రమల ఉత్పత్తి సూచీ సంస్కరణలకు ముందు 8 శాతం నుంచి 2014 -15 లో 5.9 శాతానికి పడిపోయింది. 2001-02, 2002-2003 వ్యాపార చెల్లింపులలో మిగులు ఏర్పడింది. కానీ, 2004-05, 2005-06 లో మళ్లీ లోటు ఏర్పడింది. 2007-08 లో చమురు ధరలు పెరిగి, దిగుమతుల వ్యయం పెరగటం దీనికి కారణం. సంస్కరణల కాలంలో దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ప్రాంతీయ అసమానతలు పెరిగాయి. రాష్ట్రాల మధ్య ఆర్థిక అసమానతలు పెరిగాయి. సంస్కరణలలో ప్రైవేటీకరణకు లభించిన ప్రాధాన్యత వలన సాంఘిక, ఆర్థిక లక్ష్యాలు(Financial goals) నెరవేరలేదు. ఆదాయ వ్యత్యాసాలు తీవ్రంగా పెరిగాయి.
మొదటి తరం సంస్కరణలు (1991-2000)
కేంద్రం ప్రభుత్వ రంగానికి రిజర్వ్ చేసిన పరిశ్రమలను కుదించి ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించింది. పరిశ్రమల లైసెన్సింగ్ విధానాన్ని రద్దు చేసింది. ఎంపీఆర్‌పీ సంస్థల పరిమితి తొలగించింది. ప్రభుత్వ రంగంలో పెట్టుబడులు ఉపసంహరించుకుంది. కార్పొరేటీకరణకు(privatization) ప్రాధాన్యం పెరిగింది. విదేశీ దిగుమతులపై పరిమితులు తొలగించారు. సరళమారక రేట్ల విధానాన్ని అమలు చేశారు. వర్తమాన ఖాతాలో కరెన్సీ పరివర్తనకు అనుమతించారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి పెంచారు. ఫెరా(FERA) స్థానంలో ఫెమా(FEMA) ప్రవేశపెట్టారు. బ్యాంకింగ్ సంస్కరణలు, విత్తన మార్కెట్లకు సంబంధించిన సంస్కరణలు అమలులోకి వచ్చాయి. పన్ను ప్రాతిపదిక విస్తరణ జరిగింది. రేట్ల ఆధునీకరణ, పన్ను చెల్లింపు విధానం సులభతరం చేశారు. పన్ను ఎగవేతను అరికట్టడానికి చర్యలు తీసుకున్నారు.
రెండవ తరం సంస్కరణలు (2000-01)
ఇవి ఉత్పాదక సాధనాల మార్కెటుకు సంబంధించిన సంస్కరణలు. పాలిత ధరల విధానం రద్దు చేశారు. పెట్రోలియం ఉత్పత్తులు, పంచదార, ఎరువులు, మందుల ధరలపై ప్రభుత్వ నిర్ణయాధికారాన్ని తొలగించారు. సబ్సిడీలు తగ్గించారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలు, వ్యాపార సంస్థలపై ప్రభుత్వ నియంత్రణకు బదులుగా సౌకర్యాలు కల్పించే (ఫెసిలిటేటర్) పాత్ర పోషించే విధంగా సంస్కరణలు చేపట్టారు. కాలం చెల్లిన చట్టాలను రద్దు చేశారు. కంపెనీ చట్టం, ఇండియన్ పీనల్ కోడ్(IPC), లేబర్ చట్టాలు(Labour acts), సైబర్ చట్టాలు(Cyber laws) సవరించారు. కేంద్ర పన్నుల రాబడిలో ఎక్కువ వాటా రాష్ట్రాలకు బదిలీ చేశారు. కోశ లోటు అదుపు కోసం ఎఫ్‌బీఆర్‌ఎం(FBRM) చట్టం అమలు చేశారు. టెలికాం, వ్యవసాయం, విద్యా, ఆరోగ్యం మొదలైన రంగాలలో సంస్కరణలు వేగంగా చేపట్టారు.
మూడవ, నాలుగవ తరం సంస్కరణలు (2002-07)
సమ్మిళిత వృద్ధికి సంబంధించిన చర్యలు, స్థానిక సంస్థలకు అధికార వికేంద్రీకరణ మొదలైనవి మూడవ తరం కిందికి వస్తాయి. సమాచార ప్రసార సాంకేతికత ఉపయోగిస్తూ సుపరిపాలన కోసం ప్రవేశ పెడుతున్న నూతన చర్యలను నాలుగవ తరం సంస్కరణలుగా కొంతమంది ఆర్థిక శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు. 1930లలో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆర్థిక మాంద్యం(Economic depression) ఏర్పడింది. ఆ తరువాత ఆర్థిక తిరోగమన పరిస్థితులు అప్పుడప్పుడూ ఏర్పడుతూ వచ్చాయి. 2008లో ఏర్పడిన ఆర్థిక తిరోగమనం అమెరికాలో ప్రారంభమైంది. అందుకు కారణం గృహ నిర్మాణాల కోసం విచ్చలవిడిగా చెల్లించిన సబ్ ప్రైమ్ రుణాలు. అది అతివేగంగా ఐరోపా దేశాలకు వ్యాపించింది. ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా దెబ్బతీసింది. భారతదేశంలో కూడా తీవ్ర నిరుద్యోగితకు కారణమైంది.
2008లో ప్రపంచ ఆర్థిక తిరోగమనం మొదట భారతదేశం మీద అనుకూల ప్రభావాన్నే చూపింది. భారతదేశానికి విదేశీ సంస్థాగత నిధుల ప్రభావం పెరిగింది. కానీ, వాటి ఉపసంహరణ వలన మన దేశంలో స్టాక్ మార్కెట్లు(stock markets) దెబ్బతిన్నాయి. 2008-09 ద్వితీయార్థంలో వృద్ధి రేటు క్షీణించింది. 6.7 శాతానికి పడిపోయింది. ఎగుమతులు తగ్గటంతో తయారీ రంగంపై ప్రతికూల ప్రభావం పడింది. ప్రైవేటు అంతిమ వినియోగ వ్యయం, ప్రభుత్వ వ్యయం వృద్ధి తగ్గాయి.
అది కాపాడింది
అయితే, భారతదేశంలో మార్కెట్ పెద్దది కావటం, బ్యాంకింగ్ వ్యవస్థ పటిష్టంగా ఉండటం, ప్రభుత్వ మూలధన ఖాతను సరళీకరించటంలో తొందరపడని కారణంగా 2008 ఆర్థిక తిరోగమనం భారత ఆర్థిక వ్యవస్థను(indian economy) తీవ్రంగా కుంటుపరచలేదు. అయినప్పటికీ వృద్ధి మందగించింది. నిరుద్యోగిత పెరిగింది. స్థిరాస్తి వ్యాపారం దెబ్బతింది. చాలా వరకు చిన్నతరహా పరిశ్రమలు మూతపడ్డాయి. దీంతో భారత ప్రభుత్వం 2008 డిసెంబర్ లో మూడు ఉద్దీపన ప్యాకేజీలను ప్రకటించింది. ఇందులో ప్రణాళిక వ్యయం పెంచడం, సెస్, వ్యాట్ తగ్గించడం, బాండ్ల మార్కెట్‌ను ప్రోత్సహించడం, గృహ నిర్మాణం, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రోత్సాహం అందించడం, సేవా పన్ను, కేంద్ర ఎక్సైజ్ సుంకం తగ్గించడం మొదలైన అంశాలను చేర్చారు. 2008 నుంచి 2010 వరకు ఇవి చాలా వరకు మంచి ఫలితాలనే ఇచ్చాయి. సమిష్టి డిమాండ్ పెరిగింది. ప్రైవేటు అంతిమ వినియోగం పెరిగింది. 2008-09 వృద్ధి రేటు 8.6 శాతానికి, 2009-10లో 9.3 శాతానికి పెరిగింది.
2014 నుంచి తాజా పరిస్థితి
రెండు, మూడు రోజుల క్రితం కాగ్ నివేదిక(CAG report) ఆధారంగా కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంటులో చేసిన ప్రకటన ఆందోళనకరంగా వుంది. 2014 నుంచి కేంద్రం తీసుకున్న కొన్ని విధాన నిర్ణయాల వలన క్రమంగా దేశంలో ద్రవ్యోల్బణం(Inflation) పెరిగింది. వినియోగ వ్యయం, పెట్టుబడులు తగ్గాయి. ఆర్థిక వృద్ధి మందగించింది. నిరుద్యోగం బాగా పెరిగింది. క్రమంగా దేశం విదేశీ రుణ భారంలో మునిగిపోతోంది. రాష్ట్ర ప్రభుత్వాలు తమ శక్తికి మించి అప్పులు చేస్తున్నాయి. వాటి బడ్జెట్(budjet) అంచనాలు తప్పుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు నెలాఖరున జీతాలు ఇవ్వలేక, కొన్నిరోజులపాటు వాయిదా వేస్తూ పోతున్నాయి.
కేంద్రం ఆర్థిక పరిస్థితి కూడా ఏమీ మెరుగ్గా లేదు. తాను అనుసరించిన ఆర్థిక విధానాల కారణంగా దేశీయ, విదేశీ రుణాల ఊబిలో చిక్కుకుంది. 2014-15 నాటికి కేంద్రం రుణం రూ. 62 లక్షల 42 వేల 221 కోట్లు. 2020-21 నాటికి 1 కోటి 18 వేల 120.15 కోట్లు. 2021-22 నాటికి 1 కోటి 35 లక్షల 86 వేల 975.52 కోట్లకు చేరింది. ఇందులో విదేశీ రుణం 4 లక్షల 27వేల 925 కోట్లు. మొత్తంగా భారత ప్రభుత్వ రుణం 1 కోటి 55 లక్షల కోట్లకు చేరింది. దీనికితోడు 2020లో కోవిడ్-19, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం(russia-ukraine war) కూడా కొంత వరకు కారణంగా చెప్పుకోవచ్చు. రిజర్వ్ బ్యాంక్(reserve bank) ఆర్థిక నియమాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం తన జీడీపీలో 40 శాతానికి, రాష్ట్ర ప్రభుత్వాలు తమ జీడీపీలో 20 శాతానికి మించి అప్పులు చేయకూడదు. ఆర్థిక విషయాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం నిందలు మానుకోవాలి. రాజకీయాలు పక్కన పెట్టాలి. ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోతే మన దేశం కూడా శ్రీలంక పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుంది.
డా. కోలాహలం రామ్‌కిశోర్
కేయూ, వరంగల్
98493 28496
పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672