అణగారిన వర్గాల గొంతుక టీ.ఎన్ సదాలక్ష్మీ

by Ravi |
అణగారిన వర్గాల గొంతుక టీ.ఎన్ సదాలక్ష్మీ
X

దేశంలోని నిచ్చెన మెట్ల వ్యవస్థలో అందరికంటే ఎక్కువ వివక్షకు, దోపిడీకి గురి అవుతున్నది దళితులు. అందులో మరీ ముఖ్యంగా దళిత స్త్రీలు మరిన్ని వివక్షతకు గురవుతూ బాధితులుగా మొదటి వరుసలో ఉన్నారు. అసమానత, అంటరానితనం అడుగడుగునా పేరుకుపోయిన సమాజానికి తిరుగుబాటు సంకేతంగా బాబా సాహెబ్ ప్రేరణతో జీవిత పర్యంతమూ ఉద్యమించిన నాయకురాలు టీ.ఎన్.సదాలక్ష్మి.

సదాలక్ష్మీ మెహతర్ కులంలో జన్మించారు. ఈమె కులం కారణంగా తన జీవితకాలంలో ఎదురైన ఎన్నో ప్రతికూల అంశాలను ధైర్యంగా కడు సమర్థ వంతంగా ఎదుర్కొని వాటిని తన అనుకూల నాంశాలుగా మార్చుకున్న ఉక్కు మహిళ. లింగ వివక్షత, అంటరానితనం వంటి జాడ్యాలు అమితంగా ఉన్న కాలంలోనే ఆమె గడప దాటి బయటకు వచ్చి విద్యను అభ్యసించారు. పేదరికం, అంటరానితనం పేరుతో కులవివక్ష ఎదుర్కొంటున్న సామాన్య కుటుంబం నుండి వచ్చిన ఆమె కాలేజీ చదువు పూర్తి చేయడం అరుదైన విషయం. ఆమెకు డాక్టర్ అయి ప్రజలకు మరింతగా సేవ చేయాలని ఉండేది. కానీ అనుకూలించని పరిస్థితుల కారణంగా వైద్య విద్యను అభ్యసించలేకపోయారు.

వివక్షను నిరసిస్తూ..

దళితుల హక్కుల కోసం జరుగుతున్న ఉద్యమాలలో భాగంగా సికింద్రాబాద్‌లో ఏర్పాటు చేసిన సభకు బాబాసాహెబ్ అంబేద్కర్ హాజరై ప్రసంగించారు. ఆ సభలో అంబేద్కర్ ప్రసంగం ఆమెపై తీవ్ర ప్రభావం చూపింది. ఆ ప్రభావంతో నాడు మహిళలు, దళితులు ఎదుర్కొంటున్న వివక్షను నిరసిస్తూ వారి హక్కుల కోసం ఉద్యమించారు. నాటి దళిత ఉద్యమ నాయకులైన అరిగె రామస్వామి వంటి వారికి తగిన వారసురాలుగా పేరు గడించారు. ఆ ఉద్యమాలే ఆమె రాజకీయ రంగ ప్రవేశానికి నాంది పలికాయని చెప్పవచ్చు. ఆమె మొదటగా కాంగ్రెస్ పార్టీలో చేరి 1952లో హైదరాబాద్ స్టేట్ తొలి శాసనసభ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 1957లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో.. కామారెడ్డి నియోజకవర్గం నుండి, ఆ తర్వాత 1962లో ఎల్లారెడ్డి నియోజకవర్గం నుండి గెలిచారు. నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి కేబినెట్‌లో దేవాదాయ శాఖ మంత్రిగా, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గా బాధ్యతలు నిర్వహించారు. శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా కూడా పనిచేశారు. ఆమె ఏ పదవిలో ఉన్నా నీతి, నిజాయి తీ, నిబద్ధతతో వ్యవహరిస్తూ ప్రజా సమస్యల పట్ల కచ్చితత్వాన్ని పాటిస్తూ ప్రజా శ్రేయస్సు కొరకు పని చేస్తూ ఆ పదవులకే వన్నె తెచ్చారు.

తెలంగాణ ఉద్యమంలోనూ..

సదాలక్ష్మి ఉద్యమ ప్రస్థానం సారా ఉద్యమంతో మొద లైంది. సారాకు బానిసలై చిద్రమవుతున్న పేదల బతుకులు, మహిళల అవస్థలు చూసి సారా కాంట్రాక్టర్లకు వ్యతిరేకంగా సారా ఉద్యమాన్ని నడిపారు. 1969 తెలంగాణ ఉద్యమంలో కూడా సదాలక్ష్మి క్రియాశీలకంగా పనిచేశారు. ‘తెలంగాణ ప్రజా సమితి’ వ్యవస్థాపకుల్లో ఒకరిగా ఉండి ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ ఉద్యమం విద్యార్థి ఉద్యమం నుండి రాజకీయ ఉద్యమంగా మారడంలో ప్రముఖ పాత్ర పోషించింది. టీపీఎస్‌కి అధ్యక్షుడిగా ఉన్న మర్రి చెన్నారెడ్డి లాంటి ముఖ్య నేత అరెస్టయి జైలుకు వెళ్లినప్పుడు ఈమె ముందుండి ఉద్యమాన్ని నడిపించారు. ఉద్యమ సమయంలో హైదరాబాద్‌కు విచ్చేసిన ప్రధాని ఇందిరాగాంధీని కలిసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని వివరించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ ఆహ్వానం మేరకు తెలుగుదేశం పార్టీలో చేరి పార్టీ ఉపాధ్యక్షురాలు అయ్యారు. అక్కడ అభిప్రాయభేదాలు రావ డంతో తెలుగుదేశం పార్టీని వీడారు. ఈ ప్రాంతా నికి జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక ‘తెలంగాణ కాంగ్రెస్ పార్టీ’ని స్థాపించి ఉద్యమించారు. అలాగే వర్గీకరణకై ఉద్యమించి మాదిగ హక్కుల దండోరా మోగించారు. సదాలక్ష్మీ తన ఆస్తి అంత టినీ ఒక ట్రస్ట్ రూపంలో పెట్టి మహిళల కొరకు ఒక ఇండస్ట్రియల్ స్కూల్ పెట్టాలని భావించింది. ఈమె 2004 జూలై 24న కన్నుమూశారు.

(నేడు టి.ఎన్.సదాలక్ష్మి వర్ధంతి)

- సుధాకర్. ఏ.వి

రాష్ట్ర కార్యదర్శి, STUTS

90006 74747



Next Story