పేదోళ్ల గుండె దరువు

by Ravi |   ( Updated:2025-01-31 00:45:07.0  )
పేదోళ్ల గుండె దరువు
X

గద్దర్ అనేది మూడు అక్షరాల పేరు మాత్రమే కాదు. తాడిత పీడిత ప్రజల రణ నినాదం, గరీబోళ్ల గండ్ర గొడ్డలి. వేదన నుండి వేదం, శోకం నుండి శ్లోకం పుట్టినది అని ఓ కవి అన్నట్టు ప్రజల ఆవేదన, ఆక్రందనను తన గుండెలో నింపుకొని పేద ప్రజల గొంతై బతుకంతా రోడ్డు మీద పారేసుకున్నాడు గద్దర్. తాను గొంతెత్తితే రాజ్యం ఉలిక్కిపడింది. సభలకు గద్దర్ వస్తున్నాడు అంటే చాలు తండోపతండాలుగా బార్లుతీరిన జన సందోహంతో సభలు విజయవంతంగా ముగిసేవి.

విప్లవోద్యమ కాలంలోనే గాక తెలంగాణ ఉద్యమ కాలంలో సైతం గద్దర్ ఆటపాటలతో యావత్తు తెలంగాణ ఉయ్యాలలూగింది. గద్దర్ అనేది తెలంగాణ ప్రజల భావోద్వేగం. ఏడు పదుల వయసులో కూడా తెలంగాణ కోసం కాలుకు గజ్జ భుజానికి గొంగడితో గద్దర్ కాలి గుర్తులు లేని తెలంగాణ గ్రామాలు లేవంటే అతిశయోక్తి కాదేమో..? పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అంటూ మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలు ఊగించిన సమ్మోహన శక్తి గద్దర్ పాటకుంది.

తెలంగాణను తట్టి లేపిన పాట

మలిదశ తెలంగాణ ఉద్యమం భువనగిరి సభతో ప్రారంభమైంది. భువనగిరి సభలో అమ్మ తెలంగాణమా అంటూ గద్దర్ ఆలపించిన గానం తెలంగాణను తట్టి లేపింది. లక్షలాది తెలంగాణ ఉద్యమ కారులను కవులను కళాకారులను ఏకం చేసి తెలంగాణ ఉద్యమానికి ఒక ఐకానిక్ సింబల్‌గా గద్దర్ నిలిచాడు. తెలంగాణలో చూడదగ్గ విశేషాలకు ఎంతటి విశిష్టత ఉన్నదో అల్వాల్ గద్దర్‌కు కూడా అంతటి విశిష్టత ఉన్నది. గద్దర్‌ని కలవడం కోసం సాక్షాత్తు ఈ దేశ రాష్ట్రపతి ఇంటికి వస్తా అంటే నాకే రక్షణ లేదు అని సున్నితంగా తిరస్కరించిన ఖ్యాతి గద్దర్‌ది. ఆయన మరణంపై దేశ ప్రధాని నరేంద్ర మోడీ సైతం తన సంతాప సందేశాన్ని కుటుంబ సభ్యులకు పంపారంటే ఆయన ఖ్యాతి అలాంటిది.

అరుదైన వాగ్గేయకారుడు..

జాతి యావత్తును జాగృతం చేసిన సమ్మోహన శక్తిని కలిగిన వాగ్గేయకారులు ప్రపంచంలోనే అరుదుగా ఉన్నారు. ఆ అరుదైన వ్యక్తుల్లో గద్దర్ అగ్రగణ్యుడు. తెలంగాణ జీవనాడితో ఏ సంబంధమూ లేని కొంతమంది సంకుచిత మనస్తత్వం కలిగిన నేతలు గద్దర్‌పై, ఆయనకు ఇచ్చే అవార్డులపై వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసినంత మాత్రాన గద్దర్ స్థాయికి వచ్చే ప్రమాదం ఏమీ లేదన్న విషయాన్ని ఆ నేతలు గుర్తించుకోవాలి. ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయి అంటారు. గద్దర్‌పై వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసిన ఆ నేతకు ప్రజలు ఓట్ల సమయంలోనే కర్రు కాల్చి వాత పెడతారు.

తూటాల మాల.. సమతామూర్తి పాట

నిజానికి గద్దర్ సుదీర్ఘ రాజకీయ ప్రయాణం అంతా కూడా విశేషమైనది. వాగ్గేయకారుడిగా, మార్క్సిస్టు మేధావిగా, కవిగా, రచయితగా నక్సలైటుగా, అంబేద్కర్‌గా బుద్ధిస్టుగా మానవతావాదిగా, సమతా చైతన్య శీలిగా వివిధ రూపాల్లో కనిపించే గద్దర్‌ని ఒక మూసలో ఇమిడింపచేసే శక్తి సామర్థ్యాలు మనకు ఉన్నాయా? తుపాకులకు ఎదురు నిలువరా అన్నయ్య తూటాల మాల తొడగరా అని గొంతెత్తి పాడిన విప్లవ గొంతు గద్దర్. మొండి రాముడికి అలిగిన సీతమ్మకు బంధం కట్టిన భద్రాచలం అంటూ తాత్వికతలోకి జారుకోవడం గద్దర్‌కు మాత్రమే తెలిసిన విద్య. వైష్ణవ మత సిద్ధాంతకర్త రామానుజాచార్యులపై సమతా మూర్తి పాట పాడిన గద్దర్‌ను అర్థం చేసుకోవడంలో బండి సంజయ్, ఆంధ్ర ప్రాంతానికి చెందిన విష్ణువర్ధన్ రెడ్డి లాంటి నేతలకు సాధ్య పడుతుందా? ప్రజా సాహిత్యంతో పాటు ఆధ్యాత్మికతతో కూడిన సాహిత్యం ఆలపించే గద్దర్ కంచు కంఠం బండి సంజయ్ కర్ణ బేరీలకు వినిపించకపోవడం వాళ్ల అజ్ఞానం.

జనం గోసలకు గొంతైన వాడు

తన గొంతులో సంగీతం నింపుకున్న గద్దర్ అన్న తన హావభావాలతో తను చేసే నృత్యంతో జనం గోసలకు గొంతుగా మారాడు. తెలంగాణ ప్రజా సాహిత్యానికి పెద్దన్న లాంటి గద్దర్‌ను అవమానపరిస్తే రాజకీయంగా మట్టి కొట్టుకపోవడం ఖాయం. మీ అవివేక వ్యాఖ్యానాలతో మీకు వ్యక్తిగతంగానే కాకుండా మిమ్మల్ని నమ్మి ఉన్నత పదవులు ఇచ్చిన పార్టీకి కూడా మీరు నష్టం చేసినట్టే. ఆకాశం వైపు చూసి ఉమ్మితే అది మన పైనే పడుతుంది అన్న నానుడిని నేతలు మరిచారా? పోరు దారిలో తలతెగని వాడు మా తెగ వాడు కాదు అని ఒక కవి అన్నట్టు ఆయనది కత్తులు వంతెనపై కవాతు చేసిన జీవితం. ఎన్టీఆర్ మాటల్లో చెప్పాలంటే నక్సలైట్లే దేశభక్తులు అయినప్పుడు గద్దర్‌కి మించిన దేశ భక్తుడు ఎవరు ఉంటారు? దేశభక్తి పై విమర్శ చేసే ప్రతి ఒక్కడు ముమ్మాటికి దేశద్రోహి మాత్రమే.

(నేడు జన గాయకుడు గద్దర్ జయంతి)

- దొమ్మాట వెంకటేష్,

ఫ్రీలాన్స్ జర్నలిస్ట్.

98480 57274

Advertisement
Next Story

Most Viewed