జార్జిరెడ్డి స్ఫూర్తిని నింపుకుని..

by Ravi |   ( Updated:2024-04-14 00:30:43.0  )
జార్జిరెడ్డి స్ఫూర్తిని నింపుకుని..
X

'జీవించాలంటే మరణం గురించి తెలుసుకో.... అడుగడుగున పోరాటం గురించి తెలుసుకో (జీనా హైతో మర్నా సీఖో - కదం కదం ఫర్ లడ్నా సీఖో) అనేది జార్జి రెడ్డి ఇచ్చిన నినాదం. నాటి నుండి నేటి వరకు విద్యార్థి, యువజన, ప్రజా పోరాటాలలో ఇది రణనినాదమై ఉత్తేజాన్నిస్తోంది.

1947 జనవరి 15న కేరళ రాష్ట్రంలో లీల-రఘునాథరెడ్డి దంపతులకు నాలుగవ సంతానంగా జన్మించిన జార్జి రెడ్డి కేరళలో పుట్టి మద్రాస్‌లో పెరిగి తెలుగు నేలపై హై స్కూల్ విద్య పూర్తి చేసి డాక్టర్ కావాలని సంకల్పంతో 1963 సంవత్సరంలో నిజాం కాలేజీ పీయూసీలో చేరాడు. తన చిన్నతనం నుంచే జీవితంలో ఎదురయ్యే సమస్యలను తట్టుకోవడం, ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకోవడం అలవాటు చేసుకున్నఅతను, ఆ తర్వాత జరిగిన ఉస్మానియా యూనివర్సిటీ ప్రవేశ పరీక్షల్లో సైన్స్ కాలేజీలో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో బీఎస్సీలో చేరాడు. ఉస్మానియా యూనివర్సిటీలో చేరిన జార్జి రెడ్డి జీవితం ఓ సరికొత్త మలుపు తిరిగింది. అక్కడ స్కాలర్షిప్ మీద మాత్రమే ఆధారపడి చదివే పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లల సంఖ్య చాలా ఎక్కువ. స్కాలర్షిప్ రాకపోతే చాలా ఇబ్బందులకు ఎదురయ్యే వారి బాధలను అర్థం చేసుకున్నాడు. వారి స్కాలర్షిప్స్ సాధన కోసం పిడిఎస్‌ విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీలో కొట్లాట మొదలుపెట్టారు.

ఫ్యూడల్ ప్రతిఘాతక శక్తుల కబంధ హస్తాల్లో సంఘ్ పరివార్ శక్తుల పడగనీడలో చీకట్లను అలుముకున్న ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ఎస్ఎస్, ఎబీవీపీ లాంటి గబ్బిలాలు, మతోన్మాద మూకలు యూనివర్సిటీ మొత్తం అరాచకాలు ఎదుర్కొనేవారు. వారి అరాచకాలకు అడ్డుకట్ట వేశాడు జార్జిరెడ్డి. సమస్యలు ఉన్న సమయంలో విద్యార్థులకు అండగా నిలబడ్డాడు. ప్రగతిశీల భావాలను, వాస్తవ విషయాలను విద్యార్థుల్లో, అధ్యాపకుల్లో విస్తృతంగా వెదజల్లాడు. దీంతో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో పాటు హైదరాబాదులో వివిధ సబ్ కళాశాలలో విద్యార్థులు జార్జిరెడ్డితో కలిసి వచ్చారు. దీనిని తట్టుకోలేని మతోన్మాద మూకలు సమయం కోసం ఎదురుచూసి క్యాంపస్ ఎన్నికల సందర్భంగా దూల్పేట్ గుండాల సహాయంతో పోలీసులు చూస్తుండగానే 1972 ఏప్రిల్ 14న ఇంజనీరింగ్ కళాశాల కిన్నెర హాస్టల్ వద్ద నిరాయుధుడైన జార్జిరెడ్డిని అత్యంత కిరాతకంగా, మూకుమ్మడిగా కత్తులతో పొడిచి హత్య చేసి పైశాచికానందం పొందారు. మతోన్మాదుల కత్తిపోట్లకు అమరత్వం పొందిన జార్జిరెడ్డి మరణం ప్రగతిశీల విద్యార్థుల్లో వర్గ కసిని రేపింది. ఏ లక్ష్యాన్నైతే నిర్దేశించుకొని, ఏ ఆశయాల కొరకు జార్జి పోరాడాడో ఆ బాధ్యతను విద్యార్థులు మరింత భుజానేసుకొని జార్జి స్థాపించిన పీడీఎస్‌యును బుజస్కంధాలపై వేసుకొని ముందుకు తీసుకొని పోవడానికి సిద్దమయ్యారు. ఆయన రగిలించిన స్పూర్తిని మదినిండా నింపుకొని తెలంగాణలో ప్రగతిశీల భావాలను పీడీఎస్‌యూ వెదజల్లుతూనే ఉంది. ఇదే జార్జిరెడ్డికి మనం అర్పించే నిజమైన నివాళి.

(నేడు జార్జిరెడ్డి 52వ వర్ధంతి సందర్భంగా)

పెద్దింటి రామకృష్ణ

పీడీఎస్‌యూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు

97055 18978

Advertisement

Next Story