- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కర్ణాటకలో ఫలించని నమో మంత్రం
దేశవ్యాప్తంగా అనేక ఎదురుదెబ్బలు తింటున్న కాంగ్రెస్ పార్టీకి తాజా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఊరట కలిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. రాబోయే లోక్ సభ ఎన్నికలకు ముందు ఈ విజయం కాంగ్రెస్ పార్టీకి, పార్టీ శ్రేణులకు ఉత్సాహాన్ని ఇస్తుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్ పార్టీ కొన్ని నెలల ముందు నుంచే క్షేత్రస్థాయిలో,క్రియాశీలకంగా వ్యవహరించింది కార్యకర్తలను సన్నాహపరచింది. ఎన్నికల వ్యూహాన్ని ఖచ్చితత్వంతో అమలు చేసి ఓటర్ మన్ననలు పొందింది . పార్టీ ప్రమాణాల కోసం అసాధారణంగా ఐక్యంగా పోరాడడం, కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపులో ప్రధాన పాత్ర పోషించినది పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ అనుకోవచ్చు. రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా, సమస్యలను ఎదుర్కొని శ్రమించారు.
కాంగ్రెస్ గెలుపులో ప్రధాన పాత్ర
డీకే శివకుమార్ కాంగ్రెస్‌ని వదలకుండా పట్టుదలతో కాంగ్రెస్ పార్టీని. క్షేత్రస్థాయి నుంచి తిరిగి పుంజుకునేలా చేశారు. నిరంతరం ప్రజల్లోనే ఉంటూ.. బలమైన ప్రతిపక్షంగా మార్చారు. కాంగ్రెస్ నుంచి చేజారిన చాలా మంది నేతలను తిరిగి కాంగ్రెస్ వైపు వచ్చేలా చేశారు. విభేదాలను పక్కకు పెట్టి విజయం కోసం సిద్ధరామయ్యతో కూడా కలిసి పనిచేశారు. అటు హైకమాండ్ కూడా తనపై పూర్తి నమ్మకం ఉంచేలా చేసుకున్నారు. అభ్యర్దుల ఎంపిక నుంచి ప్రచారం ఎన్నికల వ్యూహం, బూత్ మేనేజ్‌మెంట్ వరకూ అన్ని తానే తన బృందంతో కలిసి పనిచేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక లాంటి అగ్రనేతలు తమ స్థాయిలో ఎంతో ప్రచారం చేసి ఉండొచ్చు గాక... కానీ.. అల్టిమేట్‌గా ఈ విజయం వెనకున్న అసలు వ్యక్తి మాత్రం డీకే అనే చెప్పుకోవాలి.
ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత .మల్లికార్జున ఖర్గే తొలిసారిగా తన సొంత రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుండటం జరుగుతుండటంతో ఈ ఎన్నికలను ఆయనకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఆయన ఈ ఎన్నికను స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించారు. అందరినీ ఏకతాటి పైకితేవడంతో పాటు నమ్మకమైన వారికే సీట్లు ఇవ్వడం మ్యానిఫేస్టోలో కూడా ఖర్గే కీలక పాత్ర పోషించారు. 40 శాతం కమీషన్ ఆరోపణలు ఇంటింటికి చేరుకున్నాయి. ప్రజల జీవితాలను తాకిన ఐదు హామీల ద్వారా ఇది బలపడింది. వివిధ వర్గాలను స్పృశించడంతోపాటు ఓటర్లకు సందేశం పంపడం పలు జాతీయ సమస్యల కంటే స్థానిక సమస్యలే ప్రచారంలో ప్రస్తావించడం లాంటి అంశాలు కీలక పాత్ర పోషించాయి.
బీజేపీ అభాసుపాలు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజీపీకి ఒక గుణపాఠమని చెప్పాలి. మోదీ చరిష్మా కన్నడ నాట పనిచేయలేదు. బీజేపీకి దక్షిణ భారతదేశంలో ఉన్న ఒకే ఒక రాష్ట్రం కర్ణాటకను కూడా ఆ పార్టీ చేజేతులా చేజార్చుకున్నట్లయింది. మితిమీరిన విశ్వాసం, బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాలు, వికటించిన గుజరాత్ తరహా అభ్యర్థుల ఎంపిక, స్వయంకృతాపరాధం దీనికి ప్రధాన కారణమని చెబుతున్నారు. ఢిల్లీలో కూర్చుని రాష్ట్రాలను శాసించే పద్ధతికి స్వస్తి పలికి క్షేత్ర స్థాయి నాయకత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అలా ఇవ్వకపోవడం కూడా ఓటమికి ఒక కారణంగా చెప్పాల్సి ఉంటుంది. రాష్ట్రాల్లో అక్కడి నేతలే హీరోలు. అంతే తప్ప ఢిల్లీలో కూర్చుని పాలన చేసే వాళ్లు పెత్తనం చేస్తే సహించరన్నది కన్నడ ఎన్నికల ఫలితాల ద్వారా స్పష్టమయింది. ఇక బీజేపీ అంతర్గత కలహాలు కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చాయి. నందిని పాలు, పాల ఉత్పత్తులకు కన్నడనాట విశేష ఆదరణ ఉంది. అవి ప్రజల జీవనంలో భాగమయింది. ఆ రాష్ట్రంలోకి గుజరాత్ అమూల్ పాలను కర్ణాటకలో ప్రవేశపెట్టడంతో ప్రతిపక్షాల చేతికి కొత్త ఆయుధం లభించింది.
ప్రభావం చూపని జేడీఎస్ కాంగ్రెస్, బీజేపీలకు తగిన మెజారిటీ రాకుండా తనకు 30 సీట్లు లభిస్తే కింగ్ మేకర్‌గా ఉండొచ్చనుకున్న జేడీఎస్ నేత కుమారస్వామి కలలు కల్లలయ్యాయి. జేడీఎస్ శ్రేణుల్లో ఫలితాలు నిరాశను కలిగించాయి. కర్ణాటక రాజకీయాల్లో గాలి జనార్దన్ రెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. కర్ణాటకలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి గాలి జనార్దన్ రెడ్డి సోదరులు, బళ్లారి శ్రీరాములు శక్తి వంచన లేకుండా పని చేశారు. పార్టీలో సరైన గుర్తింపు లభించని కారణంగా గంగావతిలో సొంత పార్టీ పెట్టిన గాలి జనార్దన్ రెడ్డి ఆయన సత్తా చాటుకున్నారు 15 స్థానాల్లో పోటీ చేసిన కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ అన్ని స్థానాల్లోనూ బీజేపీ ఓట్లు చీల్చి కాంగ్రెస్‌కు లాభం చేకూర్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఏది ఏమైనా ప్రజాస్వామ్యంలో ఓటరు తీర్పు శిరోధార్యం. ఈ ఎన్నికల ఫలితాన్ని గుణపాఠంగా తీసుకుని ఉత్తరాది దక్షిణాది అసమానతలను చూపకుండా ఒక్క రీతిన అభివృద్ధి చెయ్యాలి. మాటలు చెప్పే బీజేపీ చేతల్లో చూపాలి. లేదంటే రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఫలితాలు ఇలానే వుంటాయి. ఒక్క రాష్ట్రం ఫలితాలు దేశం మొత్తం ప్రభావం చూపకపోయినా కొంతమేర ఉంటుందన్నది విశ్లేషకుల అభిప్రాయం. అధికారం చేపట్టబోయే కాంగ్రెస్ కూడా మరింత బాధ్యతతో వ్యవహరించాలి. హామీలు అమలు పరచాలి. కుర్చీల కుమ్ములాటలు మాని సమైక్యంగా సమర్దవంతంగా సుస్థిరమైన శాంతి భద్రతలతో కూడిన ప్రజారంజక పాలన అందించాలి.
శ్రీధర్ వాడవల్లి
99898 55445