రామగుండం కార్మికులను ఆదుకోవాలి

by Ravi |   ( Updated:2022-09-03 13:35:21.0  )
రామగుండం కార్మికులను ఆదుకోవాలి
X

న దేశంలో లంచం తీసుకోవడం పరిపాటిగా మారింది. లంచం తీసుకోవడం, ఇవ్వడం నేరమని మన చట్టాలు చెబుతున్నాయి. దానిని నిరోధించడానికి ఏసీబీ, సీబీఐ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) లాంటి సంస్థలను కూడా ఏర్పాటు చేశారు. ఢిల్లీ, పంజాబ్, ఆంధ్రప్రదేశ్‌వంటి రాష్ట్రాలు లంచంపై ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్ కూడా కేటాయించాయి. ఇంత చేసినా, మంత్రులు, ముఖ్యమంత్రులు తాము లంచానికి వ్యతిరేకం అని చెప్పినా మన దేశం గ్లోబల్ కరప్షన్ ఇండెక్స్‌-2022 నివేదికలో 180 దేశాలకుగాను 85వ స్థానంలో నిలిచింది. 2016 ఆగస్టు 7న ప్రధాని నరేంద్ర మోదీ 'రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్‌సీఎల్)ను ప్రారంభించారు. దీని అంచనా వ్యయం సుమారు రూ.6.175.51 కోట్లు.

నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (ఎన్ఎఫ్ఎల్) 26 శాతం, ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ (ఈఇఎల్) 26 శాతం, ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎఫ్‌సీఐఎల్) 11 శాతం, తెలంగాణ ప్రభుత్వం 11 శాతం, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా (గెయిల్ ఇండియా) 14.3 శాతం, హాల్దార్ టాప్స్ కన్సార్టియం (హెచ్‌టీఎఎస్) 11.7 శాతం అప్పు రూపేణా రూ. ఐదు వేల కోట్లు సమకూర్చాయి. 2018 ఆగస్టు 18న అగ్రిమెంట్ జరిగింది. ఈ ప్రాజెక్టుకు ఎల్లంపల్లి నుంచి నీరు, తెలంగాణ జెన్‌కో నుంచి కరెంటు, స్టేట్ పెట్రోనెట్ లిమిటెడ్ అనుసంధానంతో కాకినాడ నుంచి పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరా జరుగుతుంది. ఈ కంపెనీ మార్చి 2022 నుంచి 'కిసాన్ బ్రాండ్' పేరుతో ఫెర్టిలైజర్‌ తయారు చేస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వ ఫెర్టిలైజర్స్ ఆండ్ కెమికల్స్ విభాగం ఆధ్వర్యంలో నడుస్తుంది.

వారిని ప్రలోభపెట్టి

'రామగుండం ఫెర్టిలైజర్స్‌'లో కాంట్రాక్టు ఉద్యోగాలను కోట్ల రూపాయలు లంచంగా తీసుకుని అమ్ముకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నిజానికి ఈ కంపెనీలో నైపుణ్యం కలిగిన ఉద్యోగులు 600 మంది, నైపుణ్యం లేని పనుల కోసం ఔట్ సోర్సింగ్ ద్వారా 1000 మంది కాంట్రాక్టు కార్మికులను తీసుకోవడానికి అనుమతులు వచ్చాయి. శాశ్వత ఉద్యోగులను రాత పరీక్ష ద్వారా 400 మందిని నియమించుకున్నారు. 750 మందిని ఔట్ సోర్సింగ్ ద్వారా నియమించుకున్నారు. ఇందులో కూడా ఝార్ఖండ్, బిహార్ రాష్ట్రాల కార్మికులే 200 మంది ఉంటారని సమాచారం. కంపెనీకి స్థలం కేటాయించడానికి సర్వే జరిగిన సమయంలో, కంపెనీ ద్వారా ప్రభావితం అయ్యే గ్రామాలకు చెందిన వారికి కాంట్రాక్టు కార్మికులుగా అవకాశం ఇస్తామన్న హామీని బుట్ట దాఖలు చేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భవిష్యత్తులో పర్మనెంట్ అవుతాయని, సుమారు 30 వేల జీతం, పీఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్ సదుపాయాలు ఉంటాయని ప్రలోభపెట్టి ఒక్కోక్కరి దగ్గర ఆరు నుంచి ఎనిమిది లక్షలు వసూలు చేశారని తెలిసింది.

నిజానికి కార్మికులకు రూ. పది జీతం కూడా రావడం లేదని, అవి లంచంగా ఇవ్వడానికి తీసుకొచ్చిన డబ్బు వడ్డీలకు సరిపోవడం లేదని బాధితులు ఆందోళన చెందుతున్నారు. పర్మనెంట్ ఉద్యోగమంటూ మోసం చేసారని, తమ డబ్బులను తమకు ఇప్పించమని వేడుకుంటున్నారు. బాధితులు, ప్రజా సంఘాలు రాతపూర్వకంగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ప్రజాస్వామ్యంలో శాసన, చట్ట, న్యాయ వ్యవస్థలు బాధితులకు అండగా ఉండాలి. దాదాపు 400 మంది కాంట్రాక్ట్ కార్మికులు రోడ్డెక్కి తమకు న్యాయం చేయాలనే అభ్యర్థనకు స్పందించి చర్యలకు ఉపక్రమించాలి. ఆందోళనలను ప్రతిపక్ష పార్టీల రాజకీయ కుట్రలుగా, శాంతిభద్రతల సమస్య గా పరిగణించడం సమంజసం కాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి పైరవీకారులు అక్రమంగా వసూలు చేసిన కోట్ల రూపాయలను తిరిగి కార్మికులకు ఇప్పించాలని ప్రజలు కోరుకుంటున్నారు.

మేరుగు రాజయ్య

కేంద్ర కార్యదర్శి

సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ)

Advertisement

Next Story