ఈవీఎంలపైనే మాట్లాడతారా.. నీట్‌పై మాట్లాడరా..?

by Ravi |   ( Updated:2024-06-23 01:15:34.0  )
ఈవీఎంలపైనే మాట్లాడతారా.. నీట్‌పై మాట్లాడరా..?
X

'వ్యవస్థను మోసం చేసిన వ్యక్తి డాక్టర్‌ అయితే ప్రమాదకరం..' నీట్‌ అవకతవలపై పిటిషన్లను విచారించే క్రమంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య ఇది. ఈ పరీక్షపై జరిగిందేదో జరిగిపోయింది అని సర్దుకుపోయే సందర్భం కాదిది. దీనిని ఓ స్కాంగా అనుకుంటే ఆర్థిక లబ్ధి అనే కోణంలో అన్ని స్కాంల వలె మరుగున పడిపోతుంది. కానీ ఇది దేశ భవిష్యత్‌కు ముడిపడిన అంశం. భావి వైద్యులను తయారు చేసే కార్ఖానాలో ప్రవేశానికి అడ్డదారిలో అనుమతిచ్చారనే అనుమానాలు నివృత్తి చేయాల్సిన సమయం. కాబట్టే సర్వోన్నత న్యాయస్థానం ఇలా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది.

'తప్పు జరిగితే తప్పు అని చెప్పండి.. తీసుకునే చర్య గురించి చెప్పండి.. అది కనీసం మీ పనితీరు గురించి తెలియజేస్తుంది..' అంటూ నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్టీఏ)పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు మండిపడింది. అటు కేంద్ర ప్రభుత్వ ఇకనైనా మౌనం వీడాలంటూ ప్రతిపక్ష నేతలు పట్టు పడుతున్నారు. నీట్‌ 2024 పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. దాదాపు 24 లక్షల మంది పరీక్ష రాశారు. గత ఏడాది ఈ సంఖ్య దాదాపు 20 లక్షలుగా ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ నుంచి నీట్‌ పరీక్షకు ఎక్కువగా హాజరవుతున్నారు. నీట్‌ను రద్దు చేయాలంటూ కొన్ని రాష్ట్రాల నుంచి కొన్నేళ్లుగా డిమాండ్లు వినిపిస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల నోరు లేవదే?

ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌ నుంచి 66,522 మంది తెలంగాణ నుంచి 77,849 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. అయితే, నీట్ పరీక్షపై ఇంత రాద్ధాంతం జరుగుతుంటే.. తెలుగు రాష్ట్రాల నుంచి నీట్‌పై తమ గొంతుకను ఏ ప్రభుత్వమూ వినిపించలేకపోయింది. గతంలోని బీఆర్‌ఎస్‌, వైసీపీ ప్రభుత్వాలు ఎప్పుడూ గట్టిగా మాట్లాడిన దాఖాలాలు లేవు. దానికి సవాలక్ష కారణాలున్నాయని విశ్లేషకుల అభిప్రాయం. నీట్‌ పరీక్ష జాతీయ స్థాయి అంశం.. ఆచితూచి మాట్లాడాలనుకున్నా ముందుగా మన రాష్ట్ర విద్యార్థులు కూడా ఇందులో భాగస్వామ్యం అయి ఉన్నారన్న విషయం గుర్తించాలి. మన పక్కనున్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ దీనిపై స్పందించి ‘ఈ పరీక్ష పేద విద్యార్థుల ప్రయోజనాలకు, సామాజిక న్యాయాలకు విరుద్ధమని’ ట్వీట్‌ చేశారు. అలాగే నీట్‌ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండిపడ్డారు. అలాగే ఈ ఆరోపణలు దేశంలో ప్రవేశ పరీక్షల విశ్వసనీయతను ప్రభావితం చేస్తున్నాయని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ వ్యాఖ్యానించారు.

మౌనమునిగా ప్రధాని

ఎప్పటిలాగే ఈ విషయంపై ప్రధాని స్పందించాలంటూ అన్ని రాష్ట్రాల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. మౌనం వీడాలంటూ ప్రతిపక్ష నేతలు పట్టు పడుతున్నారు. ఈ దఫా కేంద్రంలో కూడా విపక్షం బలంగా ఉంది. దీనిపై వచ్చే ఉభయ సభల సమావేశాల్లో వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గట్టిగా దీనిపై తన బాణీ వినిపిస్తున్నారు. ఇప్పుడయినా ప్రధాని తన మౌనాన్ని వీడి సమాధానం చెబుతారో లేదో చూడాలి. అయితే దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్నా తెలుగు రాష్ట్ర నేతలు కనీసం దానిపై స్పందించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అదేదో మనకు సంబంధించిన అంశం కాదన్నట్లు మిన్నకుండి పోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఎన్డీయేలో భాగస్వామ్యంగా ఉంది. కాబట్టి తొందరపడి ఇటువంటి అంశాలపై మాట్లాడదు. ప్రతిపక్ష నేతకు ఏమైంది.. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలికి ఏమైంది? కాంగ్రెస్‌తో పొత్తుతో నడిచిన కమ్యూనిస్టు పార్టీల నేతలకు ఏమైంది?

దీనిపై వేగంగా స్పందించరా?

ఎక్కడో ఎలన్‌మస్క్‌ ఈవీఎంలపై ఓ ట్వీట్‌ చేయగానే, ఇక్కడ ప్రతిస్పందనలు వినిపించాయి. ఈవీఎం ఎలా హ్యాక్‌ చేస్తారో నిరూపించేందుకు మస్క్‌కు అవకాశం ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కోరారు. న్యాయం జరగడమే కాదు.. న్యాయం జరిగినట్లు కనిపించాలంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్‌ ఓ ట్వీట్‌ చేశారు. ఇంతవేగంగా ఈవీఎంలపై స్పందించిన వారు లక్షలాది మంది విద్యార్థుల ఆందోళనను ఎందుకు అర్థం చేసుకోరు? నీట్‌పై ఎందుకు స్పందించరు.. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల మనోభావాలను ఎందుకు పట్టించుకోరు?

డాక్టర్‌ కావాలని చిన్నతనంలోనే నిర్దేశించుకుని కష్టపడి చదివి, లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌లు తీసుకుని పరీక్ష రాసి.. చివరికి ఫలితంపై గందరగోళంలో ఉండటం బాధాకరం. రాజకీయ లబ్ధి పక్కన పెట్టి సీటు రాక తీవ్ర ఆందోళనలో ఉన్న వారికి కొంచెం భరోసా ఇవ్వడం అవసరం. అదే ప్రతిపక్ష నేతలు, ప్రజా సంఘాలు కూడా చేయవలసింది. ఇప్పటికైనా నీట్‌ పరీక్ష అవకతవకలపై నేతలు నోరు విప్పుతారని తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు.

- ఎస్‌.అనిల్‌కుమార్‌

94404 01495

Advertisement

Next Story