చట్టాల పేర్లు మార్చడం కాదు.. సత్వర న్యాయం కావాలి!

by Ravi |
చట్టాల పేర్లు మార్చడం కాదు.. సత్వర న్యాయం కావాలి!
X

శిక్షాస్మృతి అనగా నేరం, శిక్షతో అనుసంధానించబడిన చట్టాల వ్యవస్థ. ‘వందమంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు గానీ ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు’ అనేది న్యాయ వ్యవస్థ యొక్క ప్రాథమిక లక్ష్యంగా ఉండాలని న్యాయ కోవిదులు చెపుతారు. మరి అలాంటి న్యాయవ్యవస్థకు మూలమైన శిక్షాస్మృతుల నిర్మాణం చాలా పటిష్టంగా జరిగితే తప్ప అది సాధ్యం కాదు. అలాంటి పద్దతిలో చట్టవ్యవస్థ నిర్మాణమైతేనే ప్రజలకు న్యాయ వ్యవస్థ పైన నమ్మకం, విశ్వాసం ఏర్పడుతుంది. మన దేశంలో ఇలాంటి న్యాయ వ్యవస్థ అర్వాచీన కాలం నుండి ఉన్నట్లు కనబడుతోంది. ప్రాచీన న్యాయ వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషించింది స్మృతి సాహిత్యం. వాటిలో ముఖ్యమైనవి మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, గౌతమ స్మృతి, పరాశర స్మృతి, నారద స్మృతి. మధ్యయుగంలో తెలంగాణకు సంబంధించి సోమదేవ సూరి వ్రాసిన నీతి వాక్యామృతం కూడా ఈ కోవకే చెందింది. ఈ స్మృతి గ్రంథాలు ఆయా కాలాలలో న్యాయవ్యవస్థలు తీసుకునే నిర్ణయాలలో ప్రధాన పాత్ర పోషిస్తూ వచ్చాయి.

పాత చట్టాలకు మార్పులు చేసి..

అయితే భారతదేశానికి ఆంగ్లేయులు వచ్చిన తరువాత భారతీయ న్యాయవ్యవస్థ సమూల మార్పులకు గురైంది. ముఖ్యంగా బ్రిటిష్ వారు ఇక్కడ తమ పరిపాలన అవసరాల కోసం, ప్రజలను అదుపులో ఉంచడానికి బలమైన న్యాయ వ్యవస్థ అవసరమని భావించి అంతవరకు అమలౌతున్న న్యాయ వ్యవస్థలోని వివిధ శిక్షాస్మృతుల స్థానంలో 1860లో ఇండియన్ పీనల్ కోడ్ (ఐ.పీ.సీ) అనే పేరుతో కొత్త శిక్షాస్మృతిని అమలు చేశారు. అదే ఇప్పటికీ కొనసాగుతుంది. దీని రూపకల్పనలో భారతీయ స్మృతి గ్రంథాలలోని న్యాయ సూత్రాలు, పాశ్చాత్య దేశాలలోని న్యాయ సూత్రాలను జోడించి ఇండియన్ పీనల్ కోడ్ రచించారు. ఇందులో 23 అధ్యాయాలు 511సెక్షన్‌లు ఉన్నాయి. దీని స్థానంలో ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ‘భారతీయ న్యాయ సంహిత’ అన్న పేరుతో కొత్త శిక్షాస్మృతిని బిల్లు రూపంలో లోక్ సభలో ప్రవేశపెట్టారు. దీనిలో 19 అధ్యాయాలు 356 సెక్షన్‌లు కలవు. అయితే పాత దానిలోని 175 సెక్షన్‌లకు మార్పులు చేర్పులు చేయడం, ఇరవై రెండింటిని రీప్లేస్ చేయడం, కొత్తగా ఎనిమిదింటిని ఇందులో చేర్చడం జరిగింది.

బ్రిటిష్ వారు ఇదే కాకుండా కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ (సీ.ఆర్.పీ.సీ)అనే పేరుతో నేర శిక్షాస్మృతిని రూపొందించి 1873 నుంచి అమలు చేస్తూ వచ్చారు. దీనిని కూడా భారతీయ, పాశ్చాత్య న్యాయ సూత్రాల సమ్మేళనంగా చెప్పవచ్చు. దీనిలో 37 అధ్యాయాలు, 484 సెక్షన్‌లు కలవు. ఇప్పుడు దీని స్థానంలో ‘భారతీయ నాగరిక్ సురక్ష సంహిత’ అనే పేరుతో కొత్త కోడ్‌ను తీసుకుని వస్తున్నారు. ఇందులో 38 అధ్యాయాలు 533 సెక్షన్‌లు కలవు. వీటిలో కూడా 150 సెక్షన్‌ల వరకు పాత వాటిని సమీక్షించడం జరిగింది. ఇరవై రెండింటిని రీప్లేస్ చేయడం, తొమ్మిదింటిని కొత్తగా చేర్చడం జరిగింది.

కొత్త చట్టాల లక్ష్యమిదే!

అలాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌ను బ్రిటిష్ వారు 1872లో నుంచి అమలు చేస్తూ వచ్చారు. దీనిలో 11 అధ్యాయాలు,167 సెక్షన్‌లు కలవు. దీనికి బదులుగా ఇప్పుడు ‘భారతీయ సాక్ష్యా బిల్’ అనే బిల్ ప్రవేశపెట్టబోతున్నారు. దీనిలో 11 అధ్యాయాలు, 170 సెక్షన్‌లు కలవు. అంతకు ముందు ఉన్న వాటిలో నుంచి ఇరవై మూడింటికి సవరణలు చేయడం, ఐదింటిని తొలగించడం, ఒకటి నూతనంగా చేర్చడం జరిగింది. నూతనంగా ప్రవేశపెట్టిన బిల్లులో దేశ ద్రోహం (ఇక్కడ రాజ ద్రోహం మాత్రమే తొలగించబడింది) రద్దు చేయడం జరిగింది. కానీ దీనిని మరో రూపంలో కొనసాగిస్తున్నారు. దేశ ద్రోహానికి శిక్షా కాలాన్ని ఇందులో పెంచారు. కొత్తగా బిల్లులో ఉగ్రవాదాన్ని నిర్వచించారు. టెర్రరిస్టు చర్యలకు పాల్పడితే వారి ఆస్తులను స్వాధీనం చేసుకోవడం, వారు అందుబాటులో లేకున్నా నేర విచారణ చేయడం వంటివాటిని జోడించారు. అలాగే మైనర్ అత్యాచారంలో ఉరిశిక్ష, మూక అత్యాచారానికి ఇరవై ఏళ్ల జైలు, అలాగే మూక హత్యలకు మరణశిక్షలు సూచించడం జరిగింది. యాక్సిడెంట్స్ చేసి పారిపోతే పదేళ్ల జైలు, ఓటర్లను ప్రలోభపెడితే ఖచ్చితమైన శిక్షలు తదితర అంశాలు దీనిలో కలవు. ఏడేళ్లకు పైగా విధించిన శిక్షలను ఏ ప్రభుత్వం వెనుకకు తీసుకోకూడదనేది ఈ బిల్లులో పొందుపరిచారు. మొత్తంగా ఈ మూడు బిల్లుల రూపకల్పనలో దేశంలోని ఇరవై రెండు న్యాయ విశ్వవిద్యాలయాలు, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీలు, న్యాయవాదులు, 18 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలు, 142మంది ఎంపీలు, 270మంది ఎమ్మెల్యేలు, వేలాది మంది ప్రజల అభిప్రాయాలను సేకరించి, క్రోడీకరించారని ఇందుకోసం నాలుగు సంవత్సరాల కాలంలో 158 మీటింగ్‌లు నిర్వహించినట్లు తెలుస్తోంది. ‘నేరస్థుడికి శిక్ష వేయడం కాదు, బాధితులకు న్యాయం అందించడమే ఈ చట్టాల లక్ష్యమని’, సత్వర న్యాయం జరుగుతుందని ఈ బిల్లును లోక్ సభలో ప్రవేశపెడుతూ హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు.

లక్షల్లో సిబ్బంది ఖాళీలు..

అయితే ఇక్కడ వరకు బాగున్నా, అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది‌. అసలు సత్వర న్యాయం అందకపోవడానికి ప్రధాన కారణం ఇప్పుడు ఉన్న చట్టాల వల్ల కాదు‌. కేసులు పరిష్కరించడంలో జరిగే జాప్యమే దీనికి అసలు కారణమని తెలుస్తోంది. గణాంకాలను చూస్తే ఇది మరింత అర్థమవుతుంది. 2022 జులై నాటికి భారత దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో 72,062 కేసులు, 25 హైకోర్టుల్లో 59,55,873 కేసులు అలాగే దిగువ కోర్టులలో 4 కోట్ల 83 లక్షల సివిల్, క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని అప్పటి కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరన్ రీజిజూ లోక్‌సభలో తెలిపారు. ఈ కేసులలో దాదాపు ఆరు లక్షల వరకు ఇరవై ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నట్లుగా తెలుస్తుంది. అసలు కేసులు సత్వర పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉండటానికి ప్రధాన కారణం సిబ్బంది కొరత తప్ప ఇంకోటి కాదని తెలుసుకోవాలి. ముఖ్యంగా కోర్టులలోని పనిచేసే జడ్జిలు, న్యాయవాదులు, ఇతర ఉద్యోగుల కొరత దేశ వ్యాప్తంగా తీవ్రంగా ఉంది. దేశంలో మొత్తం కోర్టులలో ఉన్న ప్రతి నాలుగింటిలో ఒక పోస్ట్ ఖాళీగా ఉందనేది ఒక అంచనా. 2022 జూలైలో వివిధ హైకోర్టులలోని ఖాళీగా ఉన్న సిబ్బంది గణాంకాలు దానిని మరింత స్పష్టపరుస్తున్నాయి. ఆ లెక్కల ప్రకారం అలహాబాద్ హైకోర్టులో శాశ్వత అదనపు పోస్టులలో (67)ఖాళీలుగా ఉన్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. ఇది దేశం మొత్తం హైకోర్టులలోనే అత్యధిక ఖాళీలు ఉన్న కోర్టుగా గుర్తింపు పొందింది. ఆ తర్వాత బాంబే (36), పంజాబ్, హర్యానా (36), కలకత్తా (33), పాట్నా (28), ఢిల్లీ (27)లలో ఖాళీలు ఉన్నాయి. ఇక కింద కోర్టులలోని ఖాళీల సంఖ్యను కలిపితే అది లక్షల్లో ఉంటుంది. ఇలా దేశంలో, రాష్ట్రంలో ఉన్న అత్యున్నత న్యాయస్థానాలలోనే సరైన సిబ్బంది నియామకం చేయకుండా కోర్టులను నిర్వహిస్తు సత్వర న్యాయమంటూ చిలుక పలుకులు పలకడం ఏలిన వారికి చెల్లింది. అంతేగాక ఉన్న చట్టాల పేర్లు మార్చి ఏదో జరుగుతోందని ప్రజలను భ్రమింపజేయడం ఎప్పటిలాగే వారి దిగజారుడుతనానికి నిదర్శనం.

డా. సందెవేని తిరుపతి

చరిత్ర పరిరక్షణ సమితి,తెలంగాణ

98496 18116

Advertisement

Next Story