మూఢాచారాలు విడనాడాలి

by Ravi |   ( Updated:2022-09-03 13:43:20.0  )
మూఢాచారాలు విడనాడాలి
X

రామాయణ కాలంలో టెక్నాలజీ వాడారని, శివుని కాలంలో ప్లాస్టిక్ సర్జరీ జరిగిందని, దేవదూతల కాలంలోనే పుష్పక విమానాలు ఉన్నాయనే పాఠ్యంశాలను చేర్చడం వలననే మూఢనమ్మకాలు ఎక్కువయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా ప్రజలు మేల్కొని మత గురువులను ప్రశ్నించడం మొదలు పెట్టాలి. అంధ విశ్వాసాల కారణంగానే గెలీలియో, బ్రూనో వంటి ప్రపంచ మేధావులని కోల్పోయామనే వాస్తవాలు గ్రహించాలి. మూఢనమ్మకాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. మూఢనమ్మకాలు మానవుల ప్రగతి వికాసానికి అవరోధాలనే విషయం తెలుసుకోవాలి.

ధునిక ప్రపంచంలోకి వచ్చినా ప్రజలు మూఢనమ్మకాల నుంచి బయటకు రాలేకపోతున్నారు. టెక్నాలజీ యుగంలోనూ వాటిని వదలలేకపోతున్నారు. మూఢ నమ్మకాల నిర్మూలనలో ప్రభుత్వాలు కూడా పూర్తిగా విఫలం చెందాయి. సమాజం నుంచి మూఢాచారాలను తొలగించలేకపోవడానికి ప్రధాన కారణం మన విద్యా వ్యవస్థలో శాస్త్రీయ విద్యా విధానం లోపించడమే. డార్విన్ సిద్ధాంతం ప్రకారం 'అనేక జన్యు మార్పుల ద్వారా పరివర్తనం చెంది మనుషుల రూపంలోకి రాగలిగాం' అని తల్లిదండ్రులు పిల్లలకు చెప్పడం లేదు.

దేవుళ్లు, దేవతల శక్తుల ఆధారంగా మనుషులు ఆవిర్భవించేవారని చెప్పడం ద్వారా పిల్లలకు చిన్న వయసులోనే దేవుళ్లు, దెయ్యాలు అనే భావన ఏర్పడుతున్నది. సమాజంలో ప్రజల జీవన విధానం, ఆర్థిక విధానం మెరగుపడకపోవడానికి ఈ మూఢనమ్మకాలు పాత్ర ప్రధానంగా ఉంది. దీంతో పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నా ఎవరూ పట్టించుకోకుండా, నివారించకుండా ఉండటానికి రాజకీయ నాయకుల ప్రోద్బలంతో పాటు అనేక ఆర్థిక కోణాలు అందులో దాగి ఉన్నాయి.

అవే ఎక్కువగా

ప్రపంచ దేశాలలు సైన్స్‌ను నమ్ముకొని సాంకేతిక రంగంలో రాణిస్తూ అభివృద్ధి పథంలో ముందుకు వెళుతుంటే, మన దేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే పరిగణింపబడుతోంది. దీనికి కారణం శాస్త్రీయ విద్యా విధానంపై మన దేశంలో అవగాహన లేకపోవడం. ప్రపంచంలోనే ఎక్కువగా యువత ఉన్న మన దేశంలో కులం మతం కట్టుబాట్ల మూలంగా చాలామంది బయటకు రాలేని పరిస్థితి. దేశంలోని పోలీస్ స్టేషన్లలో ఉన్న కేసులను పరిశీలిస్తే కుల మత మూఢనమ్మకాల విషయంలో జరిగిన గొడవలే తొలి ఐదు స్థానాలలో ఉంటాయని అంచనా.

అందుకే ప్రభుత్వాలు మూఢనమ్మకాల నిర్మూలనకు కఠిన చట్టాలు చేయాలి. పాఠ్యపుస్తకాలలో వీటికి వ్యతిరేకంగా పాఠ్యాంశాలను జోడించాలి. పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. గత సంవత్సరం చిత్తూరు జిల్లాలో ఓ ప్రొఫెసర్ తమ పిల్లలు మళ్లీ పుడతారంటూ ఎవరో బాబా చెప్పిన మాట విని నరబలి ఇచ్చిన సంఘటన చూశాం. దొంగ బాబాలు, జాతకాల పేరుతో ప్రజల మానసిక స్థితిని అంచనా వేసి దోచుకుంటారు. దొంగ బాబాల మోసాలలో చిక్కుకుంటున్నవారిలో చదువుకున్నవారు ఉండటం ఆశ్చర్యకరం. అందుకే ఒడిశా, ఝార్ఖండ్, కర్ణాటక ప్రభుత్వాలు మూఢనమ్మకాల నిర్మూలన చట్టం అమలులోకి తెచ్చాయి. దేశం మొత్తం ఈ చట్టం అమలు చేసే విధంగా విద్యార్థులు, ప్రజలు,మేధావులు పోరాడాలి.

పాఠ్యాంశాలలో చేర్చితే

ఎప్పుడో 1925 కు ముందే బాల్య వివాహాలు, సజీవదహనం వంటి వాటికి వ్యతిరేకంగా పోరాటం చేసిన రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం లాంటి సంఘ సంస్కర్తలు నడయాడిన దేశం మనది. ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందాక కూడా ఇంకా మూఢాచారాలను నమ్మడం విచారకరం. దేశంలోని విద్యావ్యవస్థలో రామాయణ కాలంలో టెక్నాలజీ వాడారని, శివుని కాలంలో ప్లాస్టిక్ సర్జరీ జరిగిందని, దేవదూతల కాలంలోనే పుష్పక విమానాలు ఉన్నాయనే పాఠ్యంశాలను చేర్చడం వలననే మూఢనమ్మకాలు ఎక్కువయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి.

ఇప్పటికైనా ప్రజలు మేల్కొని మత గురువులను ప్రశ్నించడం మొదలు పెట్టాలి. అంధ విశ్వాసాల కారణంగానే గెలీలియో, బ్రూనో వంటి ప్రపంచ మేధావులని కోల్పోయామనే వాస్తవాలు గ్రహించాలి. మూఢనమ్మకాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. మూఢనమ్మకాలు మానవుల ప్రగతి వికాసానికి అవరోధాలనే విషయం తెలుసుకోవాలి.

బాలసాని లెనిన్

ఏఐఎస్‌ఎఫ్ స్టేట్ ఈసీ మెంబర్

95027 26430

Advertisement

Next Story