ప్రజలు విసిగిపోయారు.. సాగనంపారు!

by Ravi |   ( Updated:2024-06-06 01:15:40.0  )
ప్రజలు విసిగిపోయారు.. సాగనంపారు!
X

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలు అందరి అంచనాలను తలకిందులు చేశాయి. గడిచిన 2019 శాసనసభ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 స్థానాలను ఇచ్చిన ఓటర్లు, ఈ విడత 11 స్థానాలకు పరిమితం చేశారు. గత ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీని కూడా ఓటర్లు ఇలాగే 23 స్థానాలకు పరిమితం చేశారు. ఈ తడవ అదే ఓటర్లు ఎన్నికల ఫలితాలను తారుమారు చేశారు. రెండు విడతలుగా ఇంత భారీ తేడాతో ఈ ఫలితాలు వెలువడడాన్ని గమనిస్తే, వీరి పాలనలో ప్రజల జీవితాలు మెరుగు పడకపోగా, మరింత అధ్వాన్నంగా తయారయ్యాయనే ప్రజల అసంతృప్తి ఎన్నికల ఫలితాల రూపంలో పెల్లుబికింది.

ఏ ప్రభుత్వానికి అయినా రెండు ప్రధానమైన బాధ్యతలు ఉంటాయి. ఒకటి ప్రజల సంక్షేమం, రెండవది శాంతిభద్రతల పరిరక్షణ. సంక్షేమం పేరుతో నగదు బదిలీ ద్వారా ఎన్నికల్లో ఓటర్లను తమ వైపు తిప్పుకోవచ్చనే విధానం తెలుగుదేశం పాలనతో మొదలైంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధానాన్ని అనుసరించడంతో చేదు ఫలితాలను చవిచూడాల్సి వచ్చింది. నవరత్నాలు అనే పేరుతో సంక్షేమ పథకాలు కోసం 2.70 లక్షల కోట్ల రూపాయలను వెచ్చించారు. ఇది పూర్తిగా అనుత్పాదక వ్యయమే కాకుండా, తాత్కాలిక ఉపశమనం కూడా కాదు. దీర్ఘకాలిక ప్రయోజనాలు కల్పించే చెప్పుకోదగ్గ పథకాలను ప్రభుత్వం ఏమీ చేపట్టలేదు.

మద్యనిషేధం ఏమైంది?

2019 ఎన్నికలకు ముందు సంపూర్ణ మద్యనిషేధం అమలు చేస్తానని ఎన్నికల ముందు వైసీపీ హామీనిచ్చి గెలిచాక దశల వారీగా తగ్గిస్తానంది. కరోనా లాక్ డౌన్ సమయం వరకు అయాచితంగా లభించిన మద్య నిషేధాన్ని లాక్ డౌన్ అనంతరం ఎత్తివేసి, మళ్లీ మద్యం షాపులు తెరిచారు. ఫలితంగా అమ్మ ఒడి వంటి పథకాలకు ఇచ్చే నిధుల్లో చాలా భాగం మద్యం రూపంలో తిరిగి ప్రభుత్వ ఖజానాలోకే జమైపోయాయి. విద్య, వైద్య రంగాలను ప్రజలకు చేరువ చేస్తే కొంతలో కొంతైనా ప్రయోజనం కలుగుతుంది. చాలా మందికి తెల్ల రేషన్ కార్డులను రద్దు చేయడం వల్ల దానితో వచ్చే వైద్య సదుపాయాన్ని వారు కోల్పోయారు. బియ్యం ఉచితంగా ఇచ్చినంత మాత్రాన ఒట్టి బియ్యాన్ని తిని బతకలేరు కదా ! మిగతా సరుకుల ధరలు అమాంతంగా పెరిగిపోతుంటే దానిపైన ప్రభుత్వానికి అదుపు లేకుండా పోయింది.

ఉద్యోగులపై వ్యతిరేక ప్రచారం

పరిపాలనలో ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తారు. అలాంటి ఉద్యోగుల పట్ల అధికారంలో ఉన్న ప్రభుత్వాలు వ్యవహరించే తీరు మొత్తం ఓటర్లను ప్రభావితం చేస్తోంది. ఉద్యోగులు ఎక్కువ జీతాలు తీసుకుంటున్నారని, అది ఖజానాపై పెను భారమవుతుందని అధికార పార్టీ నాయకులు ప్రచారం మొదలు పెట్టి, ఉద్యోగుల పట్ల ప్రజల్లో ఒక వ్యతిరేక భావాన్ని కల్పించడానికి ప్రయత్నించారు. రాష్ట్ర విభజన తరువాత 2014 నుంచి 2019 వరకు సాగిన తెలుగు దేశం పాలనలో ఉద్యోగుల పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు నిరసనగా శాసనసభ ఎన్నికల ఫలితాలను వారు ప్రభావితం చేశారు. ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో కూడా వారు అదే విధంగా ఫలితాలను ప్రభావితం చేశారు. ఉద్యోగులకు ఇవ్వవలసిన డీఏ గత ఆరేళ్లుగా ఇవ్వలేదు. జీతాలు కూడా ఏ నెలకానెల ఇవ్వలేని పరిస్థితిలో పరిపాలన దిగజారింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాలను ఆపేసి, పూర్తిగా కాంట్రాక్ట్ ఉద్యోగులతో నెట్టుకొస్తున్నారు. పాఠశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో కూడా అధ్యాపకుల నియామకాలు జరగలేదు.

ఉపాధ్యాయులను వణికించిన పాలన

పాఠశాలల్లో ట్యాబ్ లిచ్చి ఉపాధ్యాయులకు ప్రత్యామ్నాయంగా చూపించడానికి ప్రయత్నించారు. ఎంత ఆధునికమైన ఎలక్ట్రానిక్ పరికరాలైనా ఉపాధ్యాయులకు ప్రత్యామ్నాయం కాజాలవు. విశ్వవిద్యాలయాలను దినకూలీలు, గంటల కూలీల వంటి అకడమిక్ కన్సల్టెంట్‌తో, హవర్లీ బేస్డ్ అధ్యాపకులతో నడిపిస్తున్నారు. ఉపాధ్యాయుల నియామకాలు లేకుండా పాఠశాలను కట్టించడం, భవనాలకు వెల్లవేయడం వల్ల విద్యారంగంలో చెప్పుకోదగ్గ ఫలితాను సాధించలేకపోయారు. పాఠశాలల భవనాల నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతను హెడ్ మాస్టర్ల పైన పెట్టి వాళ్ళను పరుగులు పెట్టించారు. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జిల్లాకొస్తున్నారంటే ఉపాధ్యాయులు, అధ్యాపకులు భయపడిపోయారు. ఆర్అండ్‌బీ శాఖ చేయాల్సిన పనులను ఉపాధ్యాయులకు అప్పగించడం వల్ల చదువులు చట్టుబండలయ్యాయి. ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఎంత భయపడితే పరిపాలన అంత గొప్పగా ఉంటుందనే భ్రమల్లో అధికారులు కొనసాగడం, ముఖ్యమంత్రి వారినే విశ్వసించడం అధికారపక్షం కొంపముంచింది.

ఇంగ్లీషులో మాట్లాడితే చదువొచ్చేసినట్లా?

అన్నిటికంటే ముఖ్యమైనది ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్‌కేజీ నుంచి ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెట్టడం. ప్రాథమిక విద్య వరకు మాతృభాషలోనే విద్యాబోధన జరపాలని రాజ్యాంగంలోని 350 ఏ అధికరణం చెపుతోంది. హైస్కూల్ వరకు మాతృభాషలోనే విద్యాబోధన జరపాలని అనేక విద్యాకమిషన్లు సూచించాయి. నూతన విద్యా విధానం- 2020 కూడా ప్రాథమిక విద్యవరకైనా మాతృభాషలోనే విద్యాబోధన జరపాలని సూచించింది. ఎంతో అనుభవంతో చెప్పిన కమిషన్లను, విద్యారంగ నిపుణుల మాటలను, చివరికి రాజ్యాంగాన్ని కూడా లెక్క చేయకుండా వైసీపీ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియంను ప్రాథమిక స్థాయి నుంచి ప్రవేశపెట్టింది. ఇది త్రిభాషా సూత్రానికి వ్యతిరేకమైనది కూడా. ఇంగ్లీషులో మాట్లాడితేనే బాగా చదువు వచ్చినట్టన్న భావనను ప్రచారం చేశారు. గ్రామాల్లో కూలినాలి చేసుకునే కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు ఇంగ్లీషులో వెనుకబడిన వారు ఆత్మన్యూనతతో బడిమానేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. బడి మానేస్తే ఏమవుతుంది? ఆడపిల్లలకు మళ్లీ బాల్య వివాహాలు మొదలవుతాయి. మగ పిల్లలు కూలీలుగా తయారవుతారు. ఈ ప్రభుత్వ విధానాలన్నీ దీర్ఘకాలంలో ఒక సంక్షోభానికి దారి తీస్తాయి.

జుగుప్సాకరమైన భాష

అన్నిటికంటే ముఖ్యం రాజకీయ నాయకులు ఉపయోగించే భాష. ఎమ్మెల్యేలే కాదు, మంత్రులు సైతం హద్దులు దాటి మాట్లాడడం, జుగుప్సాకరమైన తిట్లు ప్రయోగించడాన్ని ప్రజలు హర్షించలేకపోయారు. నెలనెలా లక్షల రూపాయలు జీతాలు, ఇతర సదుపాయాలను పొందే చాలా మందిని సలహాదారులుగా నియమించుకోవడంతో ప్రభుత్వం ఖజానాపై భారం పడడమే కాకుండా, ప్రభుత్వం అపహాస్యం పాలయ్యింది.

అధికార పార్టీని ఓడించడానికి కారణం..

‘అరయంగా కర్ణుడీల్గె ఆర్గురి చేతన్ ’ అన్నట్లు ఈ ఎన్నికల్లో వైసీపీ ఓటమికి ఈ కారణాలన్నీ దోహదం చేశాయి. ఇలాంటి మరికొన్ని కారణాలతో 2029లో ఇప్పటి ప్రభుత్వానికి ఇవే ఫలితాలు పునరావృతం కావన్న నమ్మకం ఏమీ లేదు. ఇలాంటి పాలకులతో ప్రజలు విసుగెత్తిపోయారు. వారికి ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. తమ జీవితాల్లో మౌలిక మార్పులు తీసుకొచ్చి, ఆత్మాభిమానంతో జీవించే పరిస్థితులను వారు కోరుకుంటున్నారు. కనుచూపు మేరలో అలాంటి పరిపాలన కనిపించకపోవడం వల్ల అధికారంలో ఉన్న వారిని ఓడించడమే ఏకైక మార్గంగా పెట్టుకున్నారని 2019, 2024 లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలను బట్టి అర్థమవుతోంది.

- రాఘవశర్మ

94932 26180

Advertisement

Next Story

Most Viewed