- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఏపీలో..మంటలు రేపిన ‘వారాహి’ యాత్ర
ఏపీ రాజకీయాలు ఓ సామాజిక వర్గం చుట్టూ తిరుగుతున్నాయి. అన్ని పార్టీల అజెండాలో ఇప్పుడు సామాజిక కోణం కనిపిస్తోంది.. పవన్ జనాల్లోకి వస్తే.. ఏం జరుగుద్దో మీరే చూస్తారంటూ ఆ పార్టీ నాయకులు చెప్పిన మాటలు నిజంలా కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు కలకలం ప్రారంభమయింది. ఎన్నాళ్లో వేచిన తర్వాత బయటకొచ్చిన వారాహి.. కలకలం సృష్టించింది. యాత్ర మొదలై రోజులు గడుస్తున్న కొద్ది వైసీపీ నుంచి ఆరోపణలు, కవ్వింపులు మొదలయ్యాయి. అయితే ఉరుమే లేని పిడుగులా ఒక ఊహించని అనూహ్య పరిణామం ఇందులోకి వచ్చింది. అదే ముద్రగడ.. కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం పవన్ కల్యాణ్‌ను ప్రశ్నిస్తూ.. లేఖాస్త్రం వదలడంతో కుల కలకలం మొదలైపోయింది. లేఖాస్త్రాల రగడకు తోడు ఉప్మాలంకార వ్యాఖ్యానం ఘాటైన వెటకారన్ని వెదజల్లుతోంది. మొత్తం మీద పవన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పూర్తైన వారాహి యాత్ర నేతల మాటల మంటలను రేకెత్తించింది.
‘చెప్పు’ చేతల్లో రాజకీయాలు
మన భవితని, రాబోయే తరాల భవిష్యత్‌ని ప్రభావితం చేయడమే కాక శాసించేది రాజకీయ వ్యవస్థ. కానీ నాయకులు ఈ ప్రజలకి మేము జవాబుదారీ కాము, మమ్మల్ని ప్రశ్నించే స్థాయి, అర్హత ఎవరికీ లేదు అనే ఆలోచనా విధానంలోకి వెళ్ళిపోయారు. ప్రజల్ని బలహీనులుగా, అశక్తులుగా, నిస్సహాయులుగా చేసి వారి అధికారాన్ని వినియోగించుకుంటున్నారు. అయిదేళ్లకొసారి, ఓట్లు అడిగేందుకు మేమొస్తాం, గెలిచాక చెప్పులు చూపిస్తాం. అనే ధోరణిలో స్థిరపడిపోయారు నాయకులు. కానీ అవే రాముడి కాలంలో పీఠమెక్కి రాజ్యం చేశాయి. రాముడి పాదుకలను తెచ్చి భరతుడు సింహాసనం మీద ఉంచి పద్నాలుగేళ్ళు పాలించాడు. ఆది పురాణ కాలం అలా చెప్పులు పాలించిన చరిత్ర పురాణాల్లో ఉంది. అప్పట్లో ప్రధాని పీవీ కడప సభ సందర్భంగా హాజరైన కోట్ల విజయ్‌భాస్కర్ రెడ్డిపై చెప్పులు వేయించారంటూ వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. అలాగే వైస్రాయ్ హోటల్‌లో ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించిన చంద్రబాబుపై ఆరోపణలు వచ్చాయి. ఆది గతం! కానీ ఇప్పుడు మళ్ళీ ఏపీలో చెప్పుల రాజకీయం మోత మోగిస్తోంది. కొన్ని నెలల క్రితం పవన్ కళ్యాణ్ తన పార్టీ ఆఫీసులో తనని ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతా అంటూ చెప్పు తీసి చూపించారు. అప్పట్లో అది సంచలనం కాగా, చెప్పులు తీయడమేంటి అని పవన్ మీద విమర్శలూ వచ్చాయి చేశారు వైసీపీ నాయకులు.
అయితే జూన్ 14 నుంచి వారాహిపై పవన్ కల్యాణ్ యాత్రకు శ్రీకారం చుట్టాకా, విమర్శలలో భాగంగా ఒక వైసీపీ నేత మీడియా సమావేశంలో ఏకంగా రెండు చెప్పులు చూపించారు. ఒకప్పుడు చెప్పు తీయడమేంటి అంటూ సుద్దులు చెబుతూనే నీవు ఒక చెప్పు చూపిస్తే మేము రెండు చెప్పులు చూపిస్తాం, నీవు రెండు చెప్పులు చూపిస్తే మేము నాలుగు చూపిస్తామని లెక్క కట్టి మరీ అనడంతో.. అసలు నాయకులు ఏపీ రాజకీయాన్ని ఎటు తీసుకెళ్తున్నారో అర్థం కాని పరిస్థితి. పవన్ కళ్యాణ్.. రాజకీయ అనుభవం లేని నాయకుడు, మరి దశాబ్దాల అనుభవం ఉన్న వైసీపీ నేతలు కూడా చెప్పులు చూపిస్తూ మాట్లాడడమేంటి? నాయకులు చెప్పులను చూపిస్తూ చీప్ పాలిటిక్స్ చేద్దామనుకున్నా, చెప్పులకు ఏమీ కావు.. అవి ఎపుడూ పాద రక్షలే. వాటిని మధ్యలోకి తీసుకొచ్చిన నేతలే ఏ రాజకీయ రక్షణా లేకుండా భవిష్యత్తులో ఇబ్బంది పడతారేమో జర జాగ్రత్త.
పవన్ ప్రణాళిక మారిందా?
ఇక ప్రస్తుతానికి ఏ పార్టీతో సంబంధం లేని కాపు ఉద్యమ నేత ముద్రగడ పవన్ కల్యాణ్‌ను తప్పు పడుతూ రెండు లేఖలు విడుదల చేశారు. ద్వారంపూడి చంద్రశేఖర్‌కు మద్దతుగా ముద్రగడ పవన్‌ను నిలదీయడం వెనక బలమైన వ్యూహం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పవన్ వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తే ముద్రగడ ఆయనపై పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారనే సంకేతాలు ఇచ్చారు. అందుకే బలంగా ఈ నియోజకవర్గాన్ని ప్రస్తావించారని తెలుస్తుంది. నిజానికి పిఠాపురం బలమైన కాపు కంచుకోట ఇక్కడ కాపు ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. పైగా ముద్రగడకు ఇక్కడ మద్దతుదారులు ఎక్కువే. దీంతో తన గెలుపు తథ్యమని ముద్రగడ చెప్పినట్టే అయింది. అయితే ఆయన ప్రత్యేక్ష ఎన్నికలకు పోటీ అన్నారు కానీ... ఏ పార్టీ అనేది మాత్రం చెప్పలేదు. ఆయన స్వతంత్రంగా పోటీ చేస్తారా లేదా వైసీపీలో చేరి ఆ టికెట్ పై పోటీ చేస్తారా అనేది వేచి చూడాలి.
ఏదేమైనా.. తాజాగా ముద్రగడ చేసిన సవాల్ మాత్రం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుందనేది వాస్తవం. కాపులు, బీసీలు, మైనార్టీలు పవన్ కల్యాణ్‌ను తమ భవిష్యత్ నేతగా చూస్తున్నారని.. వారాహి యాత్రలో ఇచ్చిన స్పష్టతతో ఆయన వెంట నడవడానికి సిద్ధం అవుతున్న దశలో, ముద్రగడ తీరుపై కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకుడు హరిరామ జోగయ్య తీవ్ర విమర్శలు చేయటం పరిశీలిస్తే, అ ప్రాంతంలో ఈ సామాజిక వర్గం పార్టీల పరంగా రెండు వర్గాలుగా చీలిపోయిందనేది సుస్పష్టం. మొత్తానికి వారాహి యాత్రకు వైసీపీ నేతల కౌంటర్లతో వచ్చిన బజ్ మాత్రమే కాదు. కాపు టర్న్ తీసుకోవడంతో మరింత బూస్ట్ కూడా వచ్చింది. నిజానికి రాష్ట్రంలో అధికారాన్ని డిసైడ్ చేయగల పరిస్థితిలో కాపుల సంఖ్య ఉంది. అయితే వారు మూడు పార్టీల్లోనూ ఉండటం, రాష్ట్ర వ్యాప్తంగా వారిని ఒకే తాటిపై నడిపించే నాయకుడు లేకపోవడం, రాష్ట్రంలోని రెండు ప్రాంతీయ పార్టీలకు.. మరో రెండు బలమైన సామాజిక వర్గాలకు చెందిన నాయకులు నాయకత్వం వహిస్తుండటంతో ఈ కులం వారికి అవకాశం రావడం లేదు. అందుకే, రాష్ట్రంలో పూర్తి మెజార్టీ సాధించాల్సిన పనిలేదని తమకు బలంగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో మెజార్టీ సీట్లు తెచ్చుకుంటే రానున్న రోజుల్లో క్రియాశీల పాత్ర పోషించగల స్దాయిలో జనసేన ఉంటుందనే ఆలోచనలున్నాయి. అందుకే మొన్నటి వరకూ పొత్తులకు సంకేతాలు బలంగా ఇచ్చిన పవన్ కల్యాణ్.. ఈ సారి యాత్రలో ఆ సూచనలు ఇవ్వకపోవడం.. తనను ముఖ్యమంత్రిని చేయాలని అడుగుతుండటంతో ‘ప్రణాళిక’ లో ఏమైనా మార్పు వచ్చిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
వాడవల్లి శ్రీధర్
99898 55445
Also Read: సీఎం ప్రకటనకు భిన్నంగా క్షేత్ర స్థాయి పరిస్థితులు..