- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాలనలోనూ ప్రత్యేక పవనం
పవన్ కల్యాన్ సినిమాల జయాపజయాలకు సంబంధం లేకుండా దాదాపు మూడు దశాబ్దాలుగా తిరుగులేని కథానాయకుడు. కానీ 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో శాసనసభ్యునిగా పోటీ చేసిన రెండూ స్థానాల్లో ఓటమి. దీంతో సినిమాల్లో వేషాలేసుకునేవారికి రాజకీయాలు ఎందుకని కొందరు, రాజకీయాలు నడుపుతూ సినిమాలు ఎందుకని మరికొందరు.. మాటల తూటాలతో దాడిచేసినప్పటికీ, పట్టు వదలకుండా 2024 ఎన్నికల్లో పోటీచేసి దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు.
జనసేన పోటీచేసిన అన్ని స్థానాల్లో గెలిచి.. చంద్రబాబు రాజకీయ చతురతను, అనుభవాన్ని గౌరవిస్తూ పవన్ స్వయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్ర బాబు నాయుడు పేరును సవినయంగా ప్రతిపాదించారు. తదనంతరం ప్రస్తుతం డిప్యూటీ సీఎం హోదాలో పవన్ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి & తాగునీటి సరఫరా శాఖతో పాటు పర్యావరణ, అటవీశాఖ, సైన్స్ & అండ్ టెక్నాలజీ వంటి ప్రముఖ శాఖలకు మంత్రిగా కొనసాగుతున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు తనదైన పంథాలో ముందుకు సాగుతుండగా పవన్ తన మార్క్ రాజకీయాలతో, సినిమాలతో తన అడుగులు వేస్తున్నారు.
గాంధేయ మార్గంలో.. అంబేద్కర్ స్ఫూర్తితో..!
గ్రామాలే ఈ దేశపు పట్టుకొమ్మలు అన్న మహాత్ముడి మాటలను నమ్మి తన ఆలోచనలను, ఆదర్శాలను గ్రామస్థాయి నుంచి తీసుకువెళ్లాలనే దార్శనికతతో, పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే సామాన్యునికి సైతం సైన్స్ అండ్ టెక్నాలజీ అందాలనే లక్ష్యంతోనే పవన్ కీలకమైన మంత్రిత్వ శాఖలను బాధ్యతగా తీసుకున్నారు. మంత్రిగా గ్రామాల్లో మౌలిక సదుపాయాల కోసం ప్రత్యేక ప్రభుత్వ బడ్జెట్‌తో పాటు తన సొంత డబ్బులను ఖర్చుచేస్తున్నారు. అడవుల పరిరక్షణపై ప్రత్యేక కార్యక్రమాల కోసం వ్యూహా లు రచిస్తున్నారు. తప్పిపోయిన అమ్మాయిలను వారి కుటుంబాలకు చేరేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ముఖ్యంగా ఆడవారిపై ఇష్టాను సారంగా, బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న వారిపై, మాదకద్రవ్యాల సరఫరా, వినియోగంపై ఉక్కు పాదం మోపుతున్నారు. ఇక ఈ మధ్య కాకినాడ పోర్ట్‌లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై ఆయన నడత, నడక, మాట తీరు దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాయి.
మోడీ దృష్టిలో పవన్!
పవన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా ప్రధాన మంత్రి మోడీకి సన్నిహితుడైన వ్యక్తిగా కూడా దేశవ్యాప్తంగా వార్తల్లో నిలుస్తున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ పోషించిన పాత్రపై జాతీయ మీడియా ప్రత్యేకంగా ప్రశంసించింది. పవన్, మోడీ నాయకత్వాన్ని దశాబ్దంకు పైగా సంపూర్ణంగా సమర్థిస్తూ వస్తున్నారు. ఆయనలోని దేశభక్తి, నిరాండంబర జీవన విధానం, పేదప్రజల జీవితాల్లో మార్పు కోసం ఆయన పడే తాపత్రయం తదితర అంశాల వల్ల ఆయనంటే మోడీకి ప్రత్యేక అభిమానం. అందుకే నేటి దేశ రాజకీయాల్లో సంచలనంగా మారిన "సనాతన ధర్మం"అంశంపై పవన్ స్పందన జాతీయ మీడియాను సైతం ఆకర్షించింది. మా దేవాలయాలను కాపాడుకుంటూ, మా ధర్మాన్ని అనుసరిస్తూ జాతి సమగ్రతను కాపాడుతూ దేశ రాజ్యాంగాన్ని గౌరవిస్తామని పవన్ చేసిన ప్రసంగాలు నేటి ఆధునిక యువత ఆలోచనల్ని ప్రభావితం చేస్తున్నాయి.
రెండు రంగాల్లోనూ..
అప్పట్లో సినిమా రంగంలో అశేష ప్రజానీకం అభిమానం పొందుతూనే, తెలుగువారి ఆత్మగౌరవం పేరిట ఎన్‌టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించి దేశ రాజకీయాల్లో సంచలనంగా మారారు. అదే విధంగా సినిమాల్లో ‘చిరంజీవి’ స్థాయి వున్న సినీ హీరో అన్నీ వదిలేసి ప్రజాసేవకై జనసేన పార్టీని స్థాపించి ఎన్నో అవరోధాలను, అవమానాలను, అపజయాలను అధిగమించి నేడు డిప్యూటీ సీఎంగా వుంటూ దేశ రాజకీయాల్లో ప్రముఖంగా కనిపిస్తున్నారు. తెలంగాణలో కూడా బీజేపీతో కలిసి పవన్ జనసేనను ప్రజల్లోకి తీసుకెళ్తారని, త్వరలోనే కేంద్ర కేబినేట్‌లో కూడా చేరతారనే ఊహాగానాలు వివిధ ఆన్‌లైన్ మాధ్యమాల ద్వారా ప్రస్తుతం వినిపిస్తున్నాయి. అందరి హీరోల కన్నా పవన్ వ్యక్తిత్వం వేరు అంటారు ఆయన అభిమానులు.. అందుకేనేమో రెండు స్థానాల్లో ఓడించినప్పటికీ కోట్లు సంపాదించే తన విలువైన సమయాన్ని తనను ఓడించిన ప్రజల కోసమే కేటాయించారు. కొన్ని సందర్భాల్లో తన కుటుంబాన్ని సైతం వదిలేసి తన సంపాదనను సైతం రైతు కుటుంబాలకు విరాళంగా ఇచ్చారు.
ఆయన ప్రస్థానం ఎంతో ప్రేరణ..!
ఈ మధ్య డిప్యూటీ సీఎం హోదాలో వివిధ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ దేశ సైనికులు, శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు వంటి వారు నిజమైన హీరోలని, తామంతా కేవలం సినీహీరోలం మాత్రమే అనీ, యువత నిజమైన హీరోలను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన చెప్పిన తీరు ఆయనలోని సంస్కారానికి, దేశ భవిష్యత్తు పట్ల ఆయనకున్న నిబద్ధతకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం బాధ్యత గల పదవిలో వున్న పవన్ ప్రజాసేవలో రాష్ట్రం కోసం, 2047 వికసిత భారత్ కోసం ఎంతవరకు శ్రమిస్తారో, దేశ నిర్మాణంలో ఎలాంటి పాత్ర పోషిస్తారో వేచిచూద్దాం. ఏది ఏమైనా అధికారంతో సంబంధం లేకుండా 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణపు ఆలోచనలతో స్థాపించిన జనసేన ప్రస్థానం, ఆయన స్ఫూర్తి ప్రయాణం ఎంతోమందికి ప్రేరణగా నిలువాలని ఆశిద్దాం.
-ఫిజిక్స్ అరుణ్ కుమార్
ప్రయివేటు టీచింగ్ ఫ్యాకల్టీ
93947 49536