సంగీత, నృత్య నీరాజనం శివార్చన

by Ravi |   ( Updated:2025-02-25 00:46:11.0  )
సంగీత, నృత్య నీరాజనం శివార్చన
X

దక్షిణ కాశీ అని పిలిచే తెలంగాణలో అతిపెద్ద శైవ క్షేత్రమైన వేములవాడలో ప్రతి సంవత్సరం రెండు రోజుల పాటు అంగరంగ వైభవంగా శివార్చన పేరుతో దేవాదాయ శాఖ సహాయంతో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ రూపకల్పనలో సంగీత, నృత్య, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రదర్శనలో స్థానిక కళాకారుల నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయి కళాకారులు పాల్గొంటారు. గత తొమ్మిదేళ్లుగా వేములవాడ గుడి చెరువు ప్రాంగణంలో అత్యంత వైభవంగా నిర్వహించ బడుతుంది ఈ కార్యక్రమం.

మధ్యయుగ భారతదేశ చరిత్రలో భక్తి ఉద్యమానికి చాలా ప్రాధాన్యత ఉంది. నాటి భక్తి ఉద్యమకారులు భక్తిని వ్యక్తపరచడానికి అప్పటి వరకు ఉన్న పూజా, ఆరాధన పద్ధతులు కాకుండా కొత్త మార్గాలను ఉపదేశించారు. ఇవి పూర్తిగా సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా ప్రవేశపెట్టిన నూతన ధోరణులు.. ఈ పద్ధతులు పండితులను, పామరులను విశేషంగా ఆకర్షించాయి. ముఖ్యంగా అట్టడుగు వర్గాల వారిని హైందవ మతానికి మరింత దగ్గర చేయడంలో సఫలీకృతం అయ్యాయి. భక్తి ఉద్యమకారులది ఒక్కొక్కరిది ఒక్కో శైలి. కానీ అందరూ మోక్షానికి ముందు అలౌకిక ఆనందంతో కూడిన ఆధ్యాత్మిక భావనలో మునిగి తేలుతూ తమని తాము భగవంతునికి అర్పించుకునే అంశాలనే ప్రబోధించారు. అటువంటి వాటిలో ముఖ్యమైనవి నృత్యం, గానం. భక్తి ఉద్యమానికి ప్రధాన భూమిక ఈ రెండింటిలోనే ఉంది. ప్రాంతం, భాషా సంబంధం లేకుండా అందరినీ ఏకం చేయడంలో ఇవి ముఖ్యపాత్ర పోషించాయి. అలాగే ప్రతి హృదయానికి ఈ రెండు చేరువయ్యాయి.

భక్తి ఉద్యమంపై మరాఠా ప్రభావం

తెలంగాణతో సంబంధాలు ఉన్న మహారాష్ట్రలో జ్జానేశ్వరుడు, నామ్ దేవ్, ఏక్ నాథ్, తుకారాం వంటి వారు భక్తి ఉద్యమాన్ని విస్తృతంగా వ్యాప్తి చేశారు. వీరందరూ సామాన్య జన భాష అయిన మరాఠీ, హిందీలో భగవంతున్ని కీర్తిస్తూ రాసిన పాడిన భక్తి గేయాలు, పాటలు, కీర్తనలు ప్రజల నాలుకల యందు నిలి చిపోయాయి. ఈ ఉద్యమ ప్రభావం తెలంగాణలోనూ కనబడుతుంది. తెలంగాణ భక్తి ఉద్యమకారులలో ఎన్నదగిన వారు భక్త రామదాసు(కంచెర్ల గోపన్న). చాలా మంది భక్తులు కూడా భగవంతుడిని అర్పించడానికి, భక్తిని ప్రదర్శించడానికి పాటలు, గేయాలు, పద్యాలను ఎంచుకున్నారు. మరికొందరు లయబద్ధమైన నృత్యంను ఆశ్రయించారు. ప్రస్తుత భక్తి నివేదనలో ఇవే ప్రధానంగా ఉండటం మనం గమనించవచ్చు.

పేరిణి శివతాండవం

ఈ భక్తి కార్యక్రమంలో ఒగ్గు కథ మొదలుకుని ఒగ్గు డోలు వరకు, కోలాటం నుంచి కథక్ వరకు, డప్పు విన్యాసం నుండి ఘట విన్యాసం వరకు అర్థనారీశ్వరం నుంచి ఆహా వరకు అనేక నృత్య, సంగీత కార్యక్రమాలతో పాటు శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన పేరిణి శివతాండవం అత్యంత అద్భుతంగా ప్రదర్శించబడుతుంది. భరత నాట్యం, కూచిపూడి, శివోహం నృత్య మేళవింపుల సమాహారం శివార్చన. శివార్చనలో పాల్గొనే భక్తులు ఆనంద పారవశ్యంతో, తన్మయంలో మునిగి తేలుతారు. శివరాత్రి ముందు రోజు సాయంత్రం ఆరు గంటలకు శివార్చన కార్యక్రమాలు ప్రారంభమై శివరాత్రి రోజున ఉదయం మూడు గంటల వరకు కొనసాగుతాయి. తిరిగి సాయంత్రం ఆరు గంటలకు మొదలై తెల్లవారుజామున భక్తుల జాగారాలు పూర్తి చేసుకుని మొక్కులు చెల్లించే వరకు అంటే పదమూడు గంటలు నిరంతరాయంగా శివలీలలను కీర్తిస్తూ సంగీత, నృత్య కార్య క్రమాలు కొనసాగుతాయి.

కళాకారుల ప్రదర్శన

మొదటి రోజు పన్నెండు, పదమూడు కార్యక్రమాలు. రెండో రోజు ఇరవై, ఇరవై రెండు కార్యక్రమాలు మిరుమిట్లు గొలిపే దీప కాంతుల వెలుగులలో, రంగు రంగుల ఆహార్యాలతో లక్షలాది మంది భక్తులు శివ పంచాక్షరి జపిస్తున్న ఒక భక్తి, ఆధ్యాత్మిక వాతావరణంలో ఇవి ప్రదర్శించబడతాయి‌. ఈ రెండు రోజుల శివార్చన ప్రదర్శనల కోసం దేశ నలుమూలల నుంచి దాదాపు రెండు వేల మంది లబ్ద ప్రతిష్టులైన కళాకారులతో పాటు అప్పుడే ఓనమాలు దిద్దుకుంటున్న కళాకారులకు సైతం శివార్చన వేదిక అవుతుంది. దేవుడిని అర్చించడంలో అందరూ సమానులే అన్నట్లుగా ఈ కార్యక్రమం సాగుతోంది. ఇక్కడికి విచ్చేసిన ప్రతి కళాకారుడు అత్యంత భక్తి శ్రద్ధలతో దేవదేవుడిని అర్చించే శివార్చనలో ఆనందంగా భాగస్వాములౌతారు.

ఆలయ ప్రాంగణంలో భక్తి నీరాజనం

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇలా దేవాలయ ప్రాంగణంలో ఒక పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించే సంగీత, నృత్య ఆధ్యాత్మిక భక్తి నీరాజనం శివార్చన ఒక్కటే. ఇప్పుడిది తెలంగాణ మొత్తం ఒక భక్తి ఉద్యమంలా విస్తరిస్తుంది. వేములవాడ శివార్చనను అనుసరిస్తూ రాష్ట్రంలో మరో ఐదు, ఆరు ప్రధాన ఆలయాల్లో ఇలాంటి కార్యక్రమాలు రూపొందించి నిర్వహిస్తుండటం ఇందుకు తార్కాణం. దీనిని ఇలా నిర్వహించాలని సూచించి, రాష్ట్ర ప్రభుత్వాన్ని, దేవాదాయ శాఖను ఒప్పించిన ఘనత భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణకు చెందుతుంది. కావున భక్తులందరూ ఈ శివరాత్రి పర్వదినాన జాగారణ చేయాలనుకుంటే వేములవాడ శ్రీరాజరాజేశ్వర దివ్యక్షేత్రం‌ను సందర్శించి స్వామి వారిని దర్శించుకుని ఇంతటి గొప్ప ఆధ్యాత్మిక శివార్చనలో పాల్గొనవచ్చును. స్వామి వారి కరుణా కటాక్షాలను పొందవచ్చును.

(నేడు, రేపు వేములవాడలో శివార్చన నిర్వహణ సందర్భంగా)

డాక్టర్ సందెవేని తిరుపతి

చరిత్ర పరిరక్షణ సమితి

98496 18116

Next Story

Most Viewed