- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వెండితెర మీద.. అబద్ధపు జీవితం
ఆకలికీ, అన్నానికీ దూరం పెరిగింది. ఇది ఇప్పటి సమస్య కాదు. వ్యవస్థ పుట్టిన దగ్గర నుంచి ఆధునిక రాజ్యాలు అవతరించిన దగ్గరి నుండి ఈ ఆకలి మరీ పెరిగింది. ఆకలి మరీ విచిత్రమైనది. దానికోసం ఎన్ని యుద్ధాలు జరిగాయో. రాళ్ళు, ఎముకలు ఆయుధాలుగా చేసుకున్న దగ్గర మొదలై యుద్ధ విమానాలు, మోర్టార్లు, క్షిఫణులతో దాడులు చేసుకునే దాకా, నిన్న మొన్న జరిగిన, జరుగుతున్న ఉక్రెయిన్ , ఇజ్రాయిల్- గాజా దాకా జరిగిన మారణహోమాల వెనక ఆకలి ఉంది, స్వావలంబన ఉంది, కాళ్ళ కింద మాయం అవుతున్న నేల తల్లి క్షోభ ఉంది.
ఉన్నోళ్లను దోచి లేనోళ్లకి పెట్టి..
ఆకలి తీరింది, తర్వాత ఏమిటి? అది తీరితే ఐశ్వర్యం అంతస్తులూ పెరుగుతాయి. విషాదం ఏమిటి అంటే ఆ పెరిగే ఐశ్వర్యం వెనుక ఎండిన డొక్కలు ఉంటాయి. కొందరు ఆకలిని, కులాన్ని వంటి మీద గాయంలా దాచుకోవాలి అనుకుంటారు. మరికొందరు తమ కుల ప్రవరను, ఐశ్వర్యాన్ని నగలుగా ప్రదర్శన చేస్తారు. ఈ ఆకలికీ, అన్నానికీ మధ్య దూరం పెరుగుతున్న కొద్దీ పులివెందుల, బిట్రగుంట, దొంగ లింగాల, స్టువర్ట్ పురం, సీతారాంపురం (మంగళగిరి) లాంటి మన వంటి మీద కురుపులుగా మొదలై రాచపుండులా సలపరం పెడుతూ ఉంటాయి. లోతుగా పోతే రెండు వేల ఏళ్ల లోతైన ఘన చరిత్ర ఉంది.
దొంగల గురించి మాట్లాడడం అంటే మనకు సిగ్గు బిడియం. మన దృష్టిలో దొంగలు అంటే రోజువారీ పనుల్లో చైన్ స్నాచ్‌లూ చిన్న చిన్న దొంగతనాల గురించే వింటాము. పోలీసుల దృష్టి కూడా వేళ్ళ మీదనే ఉంటది. విషాదం ఏమిటి అంటే ఈ దొంగతనాల లోనూ పోలీసుల వాటా ఉంటది. అలా వ్యవస్థీకృత హింసకు మిగిలిన రాచపుండు ఆనవాళ్లు పులివెందుల, బిట్రగుంట, దొంగ లింగాల, స్టువర్ట్ పురం, సీతారాం పురం (మంగళగిరి). ఇందులో స్టువర్ట్‌పురం అనే ఊరు బాగా ప్రాచుర్యంలో ఉంది కానీ దాని కేంద్రంగా జరిగిన దొంగతనాలు ఉల్లిగడ్డ మీద పొట్టు అంత. వెంగల్ రెడ్డి, పండుగ సాయన్న, సర్వాయి పాపన్న, మీరే సాబు, బల్మూర్ కొండల్ రెడ్డి, బల్మూర్ బాలమ్మ(అద్దాల బాలమ్మ) హీరాబాయి కురుమయ్య, పాపిరెడ్డి వీళ్లంతా టైగర్ నాగేశ్వరరావు దొంగతనాలు మొదలు పెట్టక ముందే ఉన్నోల్లను దోచి లేనోళ్లకి పెట్టినోల్లు ప్రజలు వాళ్ళను తమ వీరగాధల్లో నిలుపుకొని ఈనాటికీ గానం చేస్తున్నారు. పోలీసులు వాళ్ళ పైత్యంతో వాళ్ళను ద్రోహులుగా, దొంగలుగా రికార్డులను పదిలం చేసి ఉంచారు.
సినిమా మాఫియా మూలన..
దొంగల గురించి, వేశ్యల గురించి సెక్సువల్ మైనారిటీల గురించి ఇలా బహిరంగంగా చర్చ చేయడం మన రోజువారీ చర్చల్లో అకడమిక్ వ్యవహారాల్లో అసలు ఉండదు కానీ పద్దెనిమిదో శతాబ్దపు చివరి భాగంలో లండన్ అమెరికా కేంద్రంగా మంచి అధ్యయనాలు జరిగాయి. 1969లో ఎరిక్ హాబ్స్ వామ్ లాంటి వాళ్లు ఈ అంశంపై సీరియస్ అధ్యయనం చేశారు.
నేను ఎన్నో రోజులుగా టైగర్ నాగేశ్వరరావు సినిమా కోసం చూశా. మా తమ్ముడు ఆ సినిమా మీద ఆంధ్రా హైకోర్ట్‌లో పిల్ వేసాడు. రోజూ ఆ సినిమాలో ఉన్న వికృతం గురించి చెప్పేవాడు. అన్నా మీరు సినిమా చూడండి అంటే నిన్న వెళ్ళా. పరమ దుర్మార్గమైన సినిమా. ఇది టైగర్ నాగేశ్వరరావు అలియాస్ గరిక నాగేశ్వరరావు అనే ఒక ఎరుకలి కథ. తాను పుట్టక ముందే తన పూర్వీకులను దొంగల జాబితాలో కల్పిన దొంగల కథ. ఆకలి తరిమితే పూర్వీకుల నుండి పుట్టు మచ్చగా సంక్రమించిన దొంగతనం అనే నేర ముద్రను పుట్టుమచ్చగా మిగుల్చుకున్న నాగేశ్వరరావు లాంటి వందలాది మంది కథ.
సినిమా మొదలు కావడమే టైగర్ నాగేశ్వరరావు క్రూరుడు అనీ, వ్యభిచారి అనీ భారత దేశ అంతర్గత ముప్పు అనే రీతిలో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ హెడ్ క్వార్టర్ కేంద్రంగా కథను నడిపారు. సినిమా అంతా అబద్దాల మయం. కల్పితం అని చెప్పి టైగర్ నాగేశ్వరరావు పేరు వేయడం మించిన ద్రోహం లేదు. కొన్ని కులాలను నూటా యాభై ఏళ్ల కింద బ్రిటిష్ పాలకులు ఉద్దేశపూర్వకంగా హత్యలు, దోపిడీలు, దొంగతనాలు చేసేవారు అని నేర జాబితాలో వేశారు. అదే పని ఈ కాలపు సినిమా మాఫియా కొనసాగిస్తోంది. పులివెందుల, బిట్రగుంట, దొంగ లింగాల, స్టువర్ట్ పురం, సీతారాం పురం కేంద్రంగా తయారు అయిన రాజకీయ లిక్కర్ పొలిటకల్ మాఫియా వెనుక టైగర్ నాగేశ్వరరావు ఆయన పూర్వీకులు త్యాగాలు లేవని మనం చెప్పగలమా?
ఆ నిజాలను తీయగలరా?
ఇంత చేసినా టైగర్ నాగేశ్వరరావు పోయాక స్మశానంలో కాసింత జాగా తన బార్య మణెమ్మకు చిన్న పాటి కొలువు తప్ప మిగిలింది ఏమీ లేదు. నిన్ననే ఒక పేపర్‌లో చూసా. గడిచిన తొమ్మిదేళ్లలో ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయల ప్రజల సొమ్ము అప్పనంగా తిని దర్జాగా బతుకుతున్న దొరల గురించి చదివా, ఆ దొరలు విదిల్చిన చిల్లర మీదనే స్టువర్ట్ పురం టైగర్ నాగేశ్వరరావు శీలం మీద సినిమా తీర్పు ఇవ్వాళ వెండితెర మీద తన అబద్దపు కాట్ వాక్ చేస్తోంది. టైగర్ నాగేశ్వరరావు మీద దొంగ దెబ్బ తీసాడు దర్శకుడు వంశీ చౌదరి. ఇందులో బలంగా తీయాల్సిన భాగం జాషువా బిడ్డ హేమలత మీద కూడా సరైన దృష్టి పెట్టలేదు. నేను ఆమెను అత్తా అనేవాణ్ణి. ఆమెను అలా తెరమీద చూడటం కొంచం భావోద్వేగానికి గురైనా. ఎందుకంటే ఆమె నాకు బాగా దగ్గర మనిషి.
టైగర్ నాగేశ్వరరావు బ్రతుకునీ చావునీ క్రూరంగా చూపిన దర్శకుడు. ఆయన పోయాక మూడు రోజులుపాటు ఆయన పార్థివ దేహాన్ని తన తమ గూడేలలో దండోరా వేసిన నిజాలు తీసే సాహసం చేయలేక పోయాడు. టైగర్ నాగేశ్వరరావు దిక్కారంలో కొందరు తిరుగుబాటుని చూశారు. మరికొందరు దొంగను, వ్యభిచారిని చూశారు.
నిన్న ఖమ్మంలో టైగర్ నాగేశ్వరరావు తెర మీద కనబడ్డ ప్రతిసారీ ఈలలు చప్పట్లు గమనించా. పాతికేళ్ళ లోపు ఎరుకలి పిల్లలు నాగేశ్వరరావు విజయాలను ఈలలు వేస్తూ, చావుని కన్నీళ్లతో చూడడం గమనించా. నిజాలు తెలిసిన నేను దర్శకుని అజ్ఞానాన్ని తిట్టుకుంటూ నిస్సహాయంగా బయటకు వచ్చా. ఏది ఏమైనా పాలకుల వంటి మీద రాచపుండు లాంటి టైగర్ నాగేశ్వరరావుని మరోసారి బహిరంగంగా ఎన్‌కౌంటర్ చేసారు అనిపించింది.
(టైగర్ నాగేశ్వరరావు సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో చూడండి)
- డా. గుఱ్ఱం సీతారాములు
కల్చరల్ క్రిటిక్
99516 61001