ప్రపంచాన నావిక్ సత్తా చాటాలి

by Ravi |   ( Updated:2022-09-03 15:09:55.0  )
ప్రపంచాన  నావిక్ సత్తా చాటాలి
X

జీపీఎస్ సులభంగా హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశం ఉంది. హ్యాకింగ్‌కు ఏ మాత్రం అవకాశం లేని నావిక్‌ను నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంకలో సేవలందించడం ద్వారా వాణిజ్యాన్ని విస్తృతపర్చుకోవచ్చు. క్యాబ్ డ్రైవర్లకు, ఆహార సరఫరా చేసే వారికే కాక, ఆయా దేశాల సైనిక దళాలకూ నావిక్ సేవలు ఉపయుక్తంగా ఉంటాయి. దక్షిణాసియా సైనికులకు బాగా సహాయపడతాయి. చైనాను కట్టడి చేసి, దక్షిణాసియాలో శాంతి సుస్థిరతలను నెలకొల్పడంలో ప్రశంసనీయ పాత్ర పోషించగలదు. నీటిపారుదల, సహజ వనరులు, పోలీస్, విద్యుత్తు, రవాణా తదితర శాఖలలో వినియోగించుకోవడం ద్వారా బహుళార్ధ ప్రయోజనాలను పొందవచ్చు.

వాయు, జల మార్గాలలో దిక్సూచి (Compass) పాత్ర ఎంతో కీలకం. దిక్సూచి ఆధారంగానే నావికులు, పైలట్‌లు తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు. ఉపరితల రవాణా విభాగంలో కూడా ఇది విరివిగా ఉపయోగించబడుతోంది. సాంకేతికాభివృద్ధి కారణంగా ప్రామాణిక స్థాన సేవలు (Standard Positioning Service) అందుబాటులోకి రావడంతో వివిధ ప్రాంతాల మధ్య ప్రయాణం సులభతరమైంది. ఈ విధానం ద్వారా ఒక ప్రదేశం, ఒకే ప్రాంతంలో ఒకే తరహా కార్యకలాపాలను నిర్వహించే సంస్థలు లేదా చిరునామా ఆధారంగా నివాసిత ప్రాంతాలను గుర్తించవచ్చు. నిర్దేశిత ప్రాంతానికి ఖచ్చితమైన మార్గాన్ని తెలియచేయడం, వాహనం జాడ తెలుసుకోవడం, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరుకోవడానికి పట్టే సమయం తెలుసుకోవడం సాధ్యమవుతుంది.

ఈ వ్యవస్థను వాహనంలో ఏర్పాటు చేస్తే వాహనచోదకుడికి తన గమ్యస్థానానికి చేరే దారి తెలియాల్సిన పని లేదు. తాను ఉన్న ప్రదేశం, గమ్యస్థానం వివరాలను నమోదు చేస్తే చాలు, ఈ వ్యవస్థ గమ్యస్థానానికి చేరే మార్గాన్ని ఖచ్చితత్వంతో తెలియచేస్తుంది. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం లేదా GPS (అమెరికా), గ్లోనాస్ (రష్యన్ ఫెడరేషన్), బేద్యూ (చైనా), గెలీలియో (ఐరోపా సమాజం), క్వాజై జెనిస్ శాటిలైట్ సిస్టం (QZSS - జపాన్) నావిక్ (భారత్) ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నాయి.

నావిక్ (NavIC) గురించి

చాలా మంది భారతీయులకు దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని తూలనాడడం, అమెరికాలాంటి అభివృద్ధి చెందిన దేశాల సాంకేతిక పరిజ్ఞానాన్ని మెచ్చుకోవడం అలవాటు. భారతదేశం అమెరికా కంటే మెరుగైన ఖచ్చితత్వంతో స్థాన, సమయ సేవలను అందిస్తుందని తెలిస్తే వారు అవాక్కవుతారు. 'ది ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం (IRNSS) 'నావిక్' (NavIC–Navigation with Indian Constellation) పేరుతో ఖచ్చితమైన స్థాన, సమయ సేవలను అందిస్తున్నది. ప్రస్తుతం ఇది భారత్‌ సహా 1,500 కి.మీ సరిహద్దు ప్రాంతాల పరిధితో పని చేస్తున్నది. ఎనిమిది ఉపగ్రహాల పుంజమి (Constellation) నావిక్ సేవలు, ఒక ఉపగ్రహం మెస్సేజింగ్ సేవలు అందిస్తున్నాయి.

2018 నుంచి ఈ వ్యవస్థ ద్వారా 'ప్రామాణిక స్థాన సేవలు' (Standard Positioning service), 'నిషేధిత సేవలు' (Restricted Service) అందుతున్నాయి. 'ప్రామాణిక స్థాన సేవలు' సామాన్య పౌరులకు 'నిషేధిత సేవలు' అధీకృత వినియోగదారులు, భారత సైన్యానికి చేరుతున్నాయి. GPS ఒకే ఒక ఎల్-బ్యాండ్ ద్వారా సేవలందిస్తుండగా, NavIC ఎస్-ఎల్ డ్యూయల్ బ్యాండ్లపై సేవలందిస్తుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులలో కూడా మెరుగైన సేవలందించగలుగుతుంది. మన దేశంలో AIS 140 ప్రామాణికతో కూడిన నావిక్‌ను వాణిజ్య వాహనాలలో 1 ఏప్రిల్ 2019 నుండి తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్న నిబంధనను భారత ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. 2020 నుంచి కొన్ని మొబైల్ ఫోన్‌లు దీనిని తమ ఉత్పత్తులలో ప్రత్యేకంగా చేర్చాయి.

ఆనాటి అనుభవంతోనే

పాకిస్తాన్ దొంగచాటుగా కార్గిల్‌లోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకుంది. తిరిగి ఆ ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడానికి మన దేశం మే 1999లో యుద్ధానికి తలపడింది. ఆ ప్రాంతం సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉండడమే కాక, కొండ ప్రాంతం కావడంతో ఎంతో శ్రమించవలసి వచ్చింది. అమెరికాను GPS సమాచారం అడిగితే నిరాకరించింది. మన సైనికుల వీరోచిత పోరాటంతో కార్గిల్ యుద్ధంలో విజయం సాధించారు. దాంతో 2005లో భారత్ ఐరోపా సమాజం (European Union) సహకారంతో ఈ వ్యవస్థ ఏర్పాటు చేయాలనుకున్నా చైనా కూడా ఆ కూటమిలో భాగస్వామి కావడంతో భద్రతాపర సమస్యలు తలెత్తుతాయని భావించి ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. తన స్వశక్తితో ఏర్పాటు చేయాలనుకుని 2013లో మొదటి ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపింది. ఇప్పుడు ఆ సంఖ్య ఎనిమిది చేరుకుని అవి భూఉపరితలం, సముద్రం, గగనతలానికి సంబంధించి నావిగేషన్, విపత్తు నివారణ, మ్యాప్ సేవలు అందిస్తున్నాయి. అమెరికా జీపీఎస్ కంటే కూడా ఇది మెరుగుగా ఉంది. నావిక్ అభివృద్ధికి ఇప్పటి వరకు భారత్ దాదాపు 189 మిలియన్ డాలర్లను ఖర్చు పెట్టింది.

వాణిజ్య అవసరాలకు కూడా

నావిక్ అత్యంత సమర్థవంతమైనదే అయినా భారత్ ఇంకా ఎందుకు జీపీఎస్ మీద ఆధారపడి ఉంది? ఢిల్లీలో జరిగిన 'నిర్భయ' ఉదంతం తరువాత అన్ని వాణిజ్య వాహనాలలో తప్పనిసరిగా నావిక్ వ్యవస్థను ఏర్పాటు చేసే నిబంధనను అమలులోకి తెచ్చారు. ఇప్పుడు రియల్ మీ, ఐక్యూ ఓ, రెడ్మీ, లాంటి మొబైల్ ఫోన్ కంపెనీలు నావిక్‌ను అదనపు సౌకర్యంగా పొందుపరుస్తున్నాయి. యాపిల్, ఆండ్రాయిడ్ ఫోన్‌లలో కొన్ని ఇన్ బిల్ట్ అప్లికేషన్‌లు ఉంటున్నాయి. నావిక్ మ్యాప్‌ను భారత్‌లో ఉత్పత్తి అయ్యే అన్ని మొబైల్ ఫోన్‌లలో ఇన్ బిల్ట్ అప్లికేషన్‌గా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. జీపీఎస్‌కు ప్రత్యామ్నాయంగా నావిక్ ప్రపంచంలో సత్తా చాటాలి. జీపీఎస్ సేవల గురించి అమెరికా ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదు. ఏ క్షణమైనా ఉపసంహరించుకోవచ్చు.

ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధానికి ఉపక్రమించినప్పుడు గూగుల్ ఉక్రెయిన్‌లో తాత్కాలికంగా తన సేవలను నిలిపివేసింది. అందుకు ప్రతిగా రష్యా తన దేశంలో జీపీఎస్‌ను నిరోధించింది. జీపీఎస్ సులభంగా హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశం ఉంది. హ్యాకింగ్‌కు ఏ మాత్రం అవకాశం లేని నావిక్‌ను నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంకలో సేవలందించడం ద్వారా వాణిజ్యాన్ని విస్తృతపర్చుకోవచ్చు. క్యాబ్ డ్రైవర్లకు, ఆహార సరఫరా చేసే వారికే కాక, ఆయా దేశాల సైనిక దళాలకూ నావిక్ సేవలు ఉపయుక్తంగా ఉంటాయి. దక్షిణాసియా సైనికులకు బాగా సహాయపడతాయి. చైనాను కట్టడి చేసి, దక్షిణాసియాలో శాంతి సుస్థిరతలను నెలకొల్పడంలో ప్రశంసనీయ పాత్ర పోషించగలదు. నీటిపారుదల, సహజ వనరులు, పోలీస్, విద్యుత్తు, రవాణా తదితర శాఖలలో వినియోగించుకోవడం ద్వారా బహుళార్ధ ప్రయోజనాలను పొందవచ్చు.

యేచన్ చంద్రశేఖర్

హైదరాబాద్

88850 50822

Advertisement

Next Story

Most Viewed