ప్రమాదాలకు రాచబాటలు...

by Ravi |   ( Updated:2023-05-18 23:15:50.0  )
ప్రమాదాలకు రాచబాటలు...
X

జాతి ప్రగతికి ప్రతీకలు, నాగరికతకు ప్రతిబింబాలైన భారతదేశ రహదారులు ప్రపంచంలోనే అతిపెద్ద రహదారి వ్యవస్థల్లో ఒకటి. జాతీయ రహదారుల విస్తరణ, అభివృద్ధి, నిర్వహణను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం 2008 డిసెంబర్ 08న జాతీయ రహదారుల రుసుముల సవరణ రూల్స్ -2008 కు అనుగుణంగా టోల్ ప్లాజా వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ప్రకారం ప్రతి వినియోగదారు టోల్ చార్జీలను చెల్లించాలి. అయితే టోల్ వసూల్ చేస్తున్నా, వినియోగదారులకు సౌకర్యాలు కల్పించాలనే విషయాన్ని మాత్రం జాతీయ రహదారి ప్రాధికార సంస్థ పూర్తిగా విస్మరించింది. కొన్ని ప్రాంతాల్లో రహదారుల నిర్వహణ బాగున్నా చాలా ప్రాంతాల్లో రహదారులు ప్రమాదాలకు నెలవుగా మారుతున్నాయి.

అమలు పరచడంలో నిర్లక్ష్యం

జాతీయ రహదారుల వార్షిక నివేదిక 2022-23 ప్రకారం దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు 1,44,955 కిలోమీటర్ల మేర ఉంది. దేశవ్యాప్తంగా 816 టోల్ ప్లాజాలు ఉండగా, తెలంగాణలో 30, ఆంధ్రప్రదేశ్‌లో 65 ఉన్నాయి. 2021 ఫిబ్రవరి 15 నుంచి ఫాస్ట్ ట్యాగ్ సిస్టం ప్రవేశపెట్టడం వల్ల టోల్ వసూల్‌లో పారదర్శకత మెరుగుపడింది. తాజాగా మరోసారి కేంద్రం 2023 ఏప్రిల్ ఒకటి నుంచి టోల్ చార్జీలను ఐదు శాతం మేర పెంచింది. దీంతో వాహనదారులకు అదనపు ఆర్థిక భారం పడింది. ఈ టోల్ టాక్స్ పెరగడం వల్ల సామాన్యుల బస్సు ప్రయాణం కూడా భారంగా మారడమే కాకుండా నిత్యావసర ధరలు మరింత పెరిగాయి. నిజానికి ప్రభుత్వ, ప్రైవేటు నిధులతో చేపట్టిన రహదారుల ప్రాజెక్టుపై మూలధన వ్యయం పూర్తిగా రికవరీ అయ్యాక టోల్ ప్లాజాలను ఎత్తివేయాలి. కానీ ఆ టోల్ ప్లాజాలను మూసివేసే ప్రసక్తే లేదని కేంద్రం ప్రకటించింది.

అయితే దేశంలోని కొన్ని టోల్ ప్లాజాల పరిధిలో నిర్వహణ బాగున్నా, చాలా వాటిల్లో పరిస్థితి దుర్భరంగా ఉంది. ముఖ్యంగా దేశంలోకెల్లా పొడవైన జాతీయ రహదారి 44 పై రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. జాతీయ రహదారుల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండడం, రాష్ట్ర రహదారులకు అనుసంధానం చేసే సరైన సర్వీస్ రోడ్లు లేకపోవడం వల్ల, అండర్ బ్రిడ్జిలు నిర్మించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ వార్షిక నివేదిక ప్రకారం 2021లో జాతీయ రహదారులపై 4,12,432 రోడ్డు ప్రమాదాలు జరగగా 1,53,973 మంది ప్రయాణికులు చనిపోయారు. దాదాపుగా 4.8 లక్షల మంది క్షతగాత్రులయ్యారు. ప్రపంచంలోనే అత్యధిక రోడ్డు ప్రమాదాలు ఇక్కడే జరుగుతున్నాయి. ప్రమాదాల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంటున్న వాటిని అమలుపరచడంలో అధికారులు విఫలమవుతున్నారు. అన్ని జాతీయ రహదారుల్లో రోడ్డు భద్రత ఆడిట్, థర్డ్ పార్టీ ఆడిట్ సరిగా జరగడం లేదు. రహదారి భద్రత వారోత్సవాలను నామమాత్రంగా నిర్వహిస్తున్నారు. రహదారుల వెంబడి తాగునీరు, బస్సు షెల్టర్ల వసతి కల్పించడం లేదు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలలో బ్లాక్ స్పాట్లు ఏర్పాటు చేయడం లేదు.

ప్రతి ఏటా క్రమం తప్పకుండా టోల్ చార్జీలను పెంచుతున్న కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులపై వాహనచోదకుల సురక్షిత ప్రయాణం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. తాగునీరు, మరుగుదొడ్ల మూత్రశాలల సౌకర్యం, రహదారులపై బస్టాండ్ల నిర్మాణం మొదలైన సౌకర్యాలు కల్పించాలి. టోల్ ప్లాజాల రహదారి నిర్వహణను జాతీయ రహదారుల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి. ప్రభుత్వం రహదారుల నిర్వహణపై దృష్టి సారించి రోడ్డు ప్రమాదాలను అరికట్టాలి. జాతీయ రహదారుల విభాగం నియమాలు-1997, జాతీయ రహదారుల రుసుముల రూల్స్-1997 ప్రకారము ప్రతి 90 కిలోమీటర్ల పరిధిలో ఒక ఉన్నతాధికారికి టోల్ ప్లాజాల పర్యవేక్షణ బాధ్యతను అప్పగించి రోడ్ల మన్నిక, రహదారులపై సౌకర్యాలు కల్పించే విధంగా పర్యవేక్షించే బాధ్యత అప్పగిస్తే కొంతవరకైనా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చు.

అంకం నరేష్

9603650799

Advertisement

Next Story