మేడే ఎన్నటికీ అజరామరమే

by Ravi |   ( Updated:2022-09-03 16:56:04.0  )
మేడే ఎన్నటికీ అజరామరమే
X

ప్రభుత్వ కార్మిక ,ఉద్యోగ వ్యతిరేక చర్యల వలన ఉద్యోగ, ఉపాధి అవకాశాలను దెబ్బతినే ప్రమాదం ఉన్నది. 2001-2002లో 1.3 మిలియన్‌లుగా ఉన్న కాంట్రాక్టు కార్మికులు, 2017-2018 నాటికి 4.45 మిలియన్‌లకు పెరిగారు. దేశంలో 58 శాతం సంపద కేవలం ఒక శాతంగా ఉన్న పెట్టుబడిదారుల చేతులలో పోగైంది. తాజాగా హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ నివేదికలో బిలియనీర్ల లిస్టులో భారత్ మూడో స్థానంలో ఉంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ,16 ,19, 21 స్ఫూర్తికి విరుద్ధంగా కార్మిక వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు.

'నేడే మేడేనోయీ! ఈనాడే మేడే నోయీ' అంటూ కార్మికవర్గం ఆనందంగా పాడుకునే రోజు ఇది. నేడు అనుభవిస్తున్న ఎనిమిది గంటల పనిదినం, ఎనిమిది గంటల సామాజిక జీవనం, ఎనిమిది గంటల విశ్రాంతికి మేడే సర్వనామం అయింది. అంతర్జాతీయంగా మేడే 1890లో అమలులోకి రాగా, భారత్‌లో 1945 నవంబర్ 27,28 తేదిలలో జరిగిన కార్మిక సదస్సు కర్మాగారాలలో వారానికి 48 గంటల పని దినాలను ఆమోదించింది. ప్రపంచవ్యాప్తంగా 2016 నాటికి ఐఎల్ఓ చెప్పిన లెక్కల ప్రకారం 52 దేశాలలో ఎనిమిది గంటల పని దినాలు అమలు అవుతున్నాయి. భారత్‌లో ఆర్థిక సంస్కరణలు 1991-92 ఆర్థిక సంవత్సరం నుండి ప్రారంభమయ్యాయి. 2014 ,2019లో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ పరిశ్రమల వాటాల విక్రయాన్ని వేగిరం చేసింది. 2021-22 లో 13,561 కోట్లు, 2022-23 లో రూ. 65,000 కోట్లు ప్రభుత్వ రంగ పరిశ్రమలలో వాటా ఉపసంహరణ ద్వారా సమకూర్చుకుంటామని ప్రకటించింది.

ఇప్పటికే 23 పరిశ్రమలను అమ్ముతామని ప్రకటించింది. బ్రిటిష్ వలస పాలనలో, స్వతంత్ర భారత్‌లో పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేయ పూనుకుంది. వేతన చెల్లింపు చట్టం 1936, కనీస వేతనాల చట్టం 1948 బోనస్ చెల్లింపు చట్టం-1965, సమాన పారితోషక చట్టం-1976 రద్దు చేసి వేతన చట్టం తీసుకువచ్చింది. ట్రేడ్ యూనియన్ చట్టం-1926, పారిశ్రామిక ఉపాధి చట్టం-1946, పారిశ్రామిక వివాదాల చట్టం-1947 రద్దు చేసి 'పారిశ్రామిక సంబంధాల చట్టం' తెచ్చింది. ఫ్యాక్టరీల చట్టం-1948, గనుల చట్టం-1952, కాంట్రాక్ట్ కార్మికుల (నియంత్రణ రద్దు) చట్టం-1970 లాంటి మొత్తం 13 చట్టాలను రద్దు చేసి 'వృత్తిపర భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల చట్టం' తెచ్చింది. ఉద్యోగ నష్ట పరిహార చట్టం-1923, ఉద్యోగ రాజ్య భీమా చట్టం 1948, ఉద్యోగ భవిష్య నిధి మిస్సి లెనిసీస్ చట్టం 1952, గ్రాట్యుటీ చెల్లింపు చట్టం-1972 ఇలా మొత్తంగా తొమ్మిది చట్టాలను రద్దు చేసి' 'సామాజిక భద్రత చట్టం' తెచ్చింది.

కార్మిక చట్టాలను పరిరక్షించుకోవాలి

ప్రభుత్వ కార్మిక ,ఉద్యోగ వ్యతిరేక చర్యల వలన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దెబ్బతినే ప్రమాదం ఉన్నది. 2001-2002లో 1.3 మిలియన్‌లుగా ఉన్న కాంట్రాక్టు కార్మికులు,2017-2018 నాటికి 4.45 మిలియన్‌లకు పెరిగారు. దేశంలో 58 శాతం సంపద కేవలం ఒక శాతంగా ఉన్న పెట్టుబడిదారుల చేతులలో పోగైంది. తాజాగా హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ నివేదికలో బిలియనీర్ల లిస్టులో భారత్ మూడో స్థానంలో ఉంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ,16 ,19, 21 స్ఫూర్తికి విరుద్ధంగా కార్మిక వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు. కార్మిక చట్టాలు, ప్రభుత్వ పరిశ్రమలను పరిరక్షించాలని కోరుతూ ఇప్పటివరకు 22 సార్లు సార్వత్రిక సమ్మెలు జరిగినవి. మార్చి 28, 29 తేదీలలో జరిగిన 72 గంటల సార్వత్రిక సమ్మె కూడా విజయవంతమైంది. అజరామరమైన మేడే స్ఫూర్తితో యావత్ కార్మికవర్గం దేశవ్యాప్త నిరవధిక సమ్మె చేసి ప్రభుత్వ పరిశ్రమలను, కార్మిక చట్టాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉన్నది.

మేరుగు రాజయ్య

కేంద్ర కార్యదర్శి

సింగరేణి ఏఐటీయూసీ

94414 40791

Advertisement

Next Story

Most Viewed