- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
24 ఫ్రేమ్స్ :మరాఠీ సినిమా 'ప్రాంతీయ' విజయం
ధూసర్' జోగ్వా, గంధ్, గబ్బారిచాపాస్, బాలగంధర్వ, కాక్ స్పర్ష్, సాలా, ఏక్ హజారీ నోట్, ఫాండ్రీ, ఖ్వాడా లాంటి సినిమాలు మరాఠీ సినిమాకు వన్నె తెచ్చాయి. నానా పటేకర్ నటించిన' నట సామ్రాట్' (మహేశ్ మంజ్రేకర్) విశేష ప్రాచుర్యం పొందింది. నిబద్ధత కలిగివున్నప్పుడు కొంచెం కష్టమయినా ప్రాంతీయ భాషా చిత్రాలు కూడా తలెత్తుకు నిలబడే వాతావరణం ఉందని మరాఠీ సినిమా నిరూపిస్తున్నది. అలాంటి స్ఫూర్తి తెలంగాణ సినిమా కూడా తీసుకోగలిగితే ప్రాంతీయ లక్షణాలతో నిలదొక్కు కునే అవకాశం ఉంది. ప్రభుత్వం సహకరించగలిగితే తెలంగాణ సినిమా ఎదిగి తీరుతుంది.
వందలాది కోట్ల పెట్టుబడులతో విశ్వవ్యాప్త ప్రచారమూ, వ్యాపారమూ ఉన్న హిందీ సినిమాకు సమాంతరంగా ముంబైలోనే తన ఉనికిని చాటుకుంటున్న మరాఠీ సినిమా మిగతా ప్రాంతీయ భాషా చిత్రాలకు గొప్ప ప్రేరణ. కొవిడ్ ఫలితంగా మరాఠీ సినిమా సహా పంజాబీ, బెంగాలీ సినిమా రంగాలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. సుమారు రూ.600 కోట్ల నష్టాన్ని చవిచూసాయి. అనేక సినిమాలు నిర్మాణ దశలోనే నిలిచిపోయాయి. నిజానికి మొదటి నుంచీ మరాఠీ సినిమా హిందీ నుంచి తీవ్ర పోటీని ఎదుర్కొంటూనే వుంది. 2019 మరాఠీలో 130 సినిమాలు విడుదలయితే రెండు అంకెలు దాటని సంఖ్యలో విజయం సాధించాయి. ఇటీవల వచ్చిన 'చంద్రముఖి' మంచి ఆర్థిక విజయాన్నే అందుకుంది. హిందీ తెలుగులోలాగా మరాఠీ సినిమా హీరోలకు ప్రేక్షకులలో ఆరాధనా భావం లేదు. నిర్మాతలు కూడా కార్పొరేట్ శక్తులు కావు. అయినా మరాఠీ సినిమా తన ఉనికి చాటుకుంటూనే వుంది.
భారతీయ సినిమా అంటే ముంబై కేంద్రంగా నిర్మాణమవుతున్న బాలీవుడ్ హిందీ సినిమానే అనేంతగా ప్రాచుర్యం ఉంది. సంఖ్యాపరంగానూ, ఆర్థిక పరంగానూ, వ్యాపార పరంగానూ హిందీ సినిమాకున్న విస్తృతి వలన అలాంటి భావన అనేక మందికి ఉంది. హిందీకి సమాంతరంగా ఎన్నో గొప్ప సినిమాలు బెంగాలీ, మలయాళీ, కన్నడ, మరాఠీ తదితర భాషలలో విశ్వవ్యాప్తంగా పేరు గడించాయి. నిజానికి హిందీ కంటే ఇతర భారతీయ భాషలలో నిర్మితమవుతున్న సినిమాలలోనే వైవిధ్యభరిత భారతీయ జీవితమూ, సంస్కృతీ ప్రతిబింస్తున్నాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో తీవ్ర ప్రభావానికి గురయిన సినిమా రంగం అధిక పెట్టుబడికీ, లాభనష్టాలు మాత్రమే పరిగణించే వ్యాపార సినిమాగా మారిపోయింది. అలాంటి స్థితిలో కొన్ని ప్రాంతీయ భాషా చిత్రాలలోనే కళలూ, విలువలూ మిగిలి ఉన్నాయి.
అంచెలంచెలుగా ఎదుగుతూ
ఇటీవలి కాలంలో మరాఠీ సినిమా ఎన్నో మంచి సినిమాలను అందించింది. జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకుంది. ఎన్నో సినిమాలు ఆర్థికంగా విజయవంతమయ్యాయి. మరాఠీ సినిమాకు ఈ స్థితి అంతా తొందరగా ఏమీ రాలేదు. చాలా ఏండ్లే పట్టింది. హిందీ, మరాఠీ సినిమాలు రెంటికీ నిర్మాణ కేంద్రం ముంబై మహానగరమే. మరాఠీ సినిమా అనేక దశాబ్దాల పాటు మర్రి వృక్షం కింది మొక్కలాగా హిందీ సినిమా ఛాయలో ఎదిగీ ఎదిగాకుండా ఉండిపోయింది. ప్రభుత్వాలు కూడా హిందీకే ప్రాధాన్యం, ప్రోత్సాహమూ ఇచ్చాయి.
ఎందుకంటే, మరాఠీ తెలిసినవారి సంఖ్య ఏడు శాతం ఉంటే, హిందీ తెలిసినవారి సంఖ్య 42 శాతానికి పైగా ఉండడమే.ప్రభుత్వాలకు ప్రాంతీయ భాషా కళల పట్ల అవగాహన లేకపోవడమూ, అవసరం గుర్తించక పోవడమూ కూడా కారణమే. అయినప్పటికీ మరాఠీ సినిమా తన ఉనికిని చాటుకుని నిలదొక్కుకుంది. మొదటి భారతీయ సినిమా 'రాజాహరిశ్చంద్ర' తీసిన ఫాల్కె మరాఠి వాడే. అనంతర కాలంలో దాదా కోన్‌డ్కే, అనంత్ మనేలాంటివారు హాస్యాన్ని ప్రధానం చేసుకుని సినిమాలు తీశారు. వాటికి సమాంతరంగా మరాఠీలో 'శాంతాత కోర్ట్ చాలూ అహే' (అరవింద్ దేశపాండే), ఉంబర్తా (జబ్బార్ పటేల్), సింహాసన్, పింజ్రా, స్మృతిచిత్రే, రావూసాహెబ్‌లాంటి అర్థవంత సినిమాలు తీశారు.
ఉనికిని చాలుకుంటూ
2004 తర్వాత మరాఠీ సినిమా రూపు రేఖలు మారిపోయాయనే చెప్పుకోవాలి. ఆ సంవత్సరం సందీప్ సావంత్ తీసిన 'శ్వాస్' జాతీయ ఉత్తమ చిత్రంగా స్వర్ణకమలం అందుకుంది. అప్పటి నుంచి నాలుగు సంవత్సరాలపాటు జాతీయ ఉత్తమ సినిమా అవార్డులు గెలుచుకుంది మరాఠీ సినిమా. 2011లో ఉమేశ్ వినాయక్ కులకర్ణి తీసిన 'దేఓల్' 2014లో చైతన్య తంహానే తీసిన 'కోర్ట్' 2016లో సుమిత్రా భావే, సునీల్ సుఖ్తంకర్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన 'కాసవ్' ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఇలా విలక్షణ సినిమాలను అందిస్తూ మరాఠీ సినిమా తన ప్రాంతీయ లక్షణాలను నిలుపుకుంటున్నది.
వీటి మధ్య ఉమేశ్ కులకర్ణి తీసిన మంగేశ్ హడవాలే, తింగియా, సచిన్ కుండాల్కర్, రెస్టారెంట్, చిత్రాపాలేకర్, మాటిమాయే, నిశికాంత్ కామత్, దోమ్బీవాలీ ఫాస్ట్' సుమిత్రా భావే, ఏక్ కప్ చాహే' అమోల్ పాలేకర్ ' ధూసర్' జోగ్వా, గంధ్, గబ్బారిచాపాస్, బాలగంధర్వ, కాక్ స్పర్ష్, సాలా, ఏక్ హజారీ నోట్, ఫాండ్రీ, ఖ్వాడా లాంటి సినిమాలు మరాఠీ సినిమాకు వన్నె తెచ్చాయి. నానా పటేకర్ నటించిన' నట సామ్రాట్' (మహేశ్ మంజ్రేకర్) విశేష ప్రాచుర్యం పొందింది. నిబద్ధత కలిగివున్నప్పుడు కొంచెం కష్టమయినా ప్రాంతీయ భాషా చిత్రాలు కూడా తలెత్తుకు నిలబడే వాతావరణం ఉందని మరాఠీ సినిమా నిరూపిస్తున్నది. అలాంటి స్ఫూర్తి తెలంగాణ సినిమా కూడా తీసుకోగలిగితే ప్రాంతీయ లక్షణాలతో నిలదొక్కుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం సహకరించగలిగితే తెలంగాణ సినిమా ఎదిగి తీరుతుంది.
వారాల ఆనంద్
94405 01281