పనికి విలువెంత... జీవితమంతా!

by Ravi |   ( Updated:2023-02-14 19:00:35.0  )
పనికి విలువెంత... జీవితమంతా!
X



ఓపిక, శక్తి ఉన్నప్పుడు పని చేయలేకపోవడం అంటే జీవితాన్ని కోల్పోవడమే. పని చేస్తూ ఉండడమే సక్సెస్. అదే నిజం. ఒక పని చేస్తున్నావంటే అందులో సక్సెస్ అవుతున్నట్లే కదా! ఎప్పుడైతే ఫెయిలవుతామో ఇక పని చేయలేం అన్న భావన కలుగుతుంది. కొందరు ఏ పనిలోనూ ఏడాది ఉండలేరు. ఏ ఉద్యోగంలోనూ రెండేండ్లు కొనసాగరు. దాన్ని బట్టి అక్కడా పని పట్ల ఆసక్తి సన్నగిల్లడమే కదా.. ఆ ఉద్యోగాన్ని వదిలేసి మరొకటి వెతుకుతున్నారంటే ఆసక్తి మారిందనే అర్థం. ఒకటి ఎక్కువ డబ్బు కావచ్చు. రెండోది హోదా కూడా కావచ్చు. ఈ రెండూ కాకుండా మూడోదైతే ఉండదు. ఒక పనిలో ఇమడలేకపోతున్నామంటే.. దాని గురించి అర్ధం చేసుకోలేకపోవడమే.

ఉన్నత స్థాయిలో ఉన్నోళ్లయినా, కార్మికుడైనా పని పట్ల ఆసక్తి ఉన్నప్పుడే సక్సెస్ కాగలం.... కొందరు ఎంత పని చేసినా సక్సెస్ వస్తలేదు. నాకు ఆ అదృష్టం ఇక లేదంటూ నిరాశ పడే వాళ్లున్నారు. అదృష్టం, దేవుడి దయ.. ఇలాంటివన్నీ ఫెయిల్యూర్ తర్వాత వినిపించే పదాలే. ముందు ఏ మాత్రం కాదు. అదే పని చేసేటప్పుడు శక్తివంచన లేకుండా చేస్తే ఆ పదాల అవసరం ఎంత వరకు ఉంటుంది? నేను పని చేస్తే సంస్థకే అధిక లాభం. నాకేం వస్తుంది అనుకునే ఉద్యోగులు కూడా ఉన్నారు. ఆ సంస్థ లాభాల బాటన నడిపించినప్పుడు ఆ అదృష్టం మీదే కావచ్చు. ఐతే అదృష్టం కొందరిని వరిస్తుండొచ్చు. కానీ అది కొంత వరకే పరిమితం. మనం పని చేయడం.. అది కూడా అర్ధవంతంగా పని చేయగలగడం అవసరం. జీవితానికి అదే అనివార్యం. ఎవరైనా పనిని, కష్టాన్ని నమ్ముకోవాలి. కానీ అదృష్టాన్ని కాదు.

నేను మొన్న బంధువుల పెళ్లికి వెళ్లాను. ఆ హడావిడి మధ్యన ఓ ఫోన్ కాల్ వచ్చింది. మైకు సౌండ్‌తో సరిగ్గా వినబడలేదు. కానీ ఓ పెద్దాయన.. అంటే వయసులో పెద్దగా పెద్దేం కాదు. ఓ ఉన్నత స్థాయి వ్యక్తి. కాసేపు మాట్లాడుకుందాం.. రాగలరా అన్నారు. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న అపాయింట్మెంట్ అతనే ఫోన్ చేసి ఆహ్వానిస్తే సంతోషమేసింది. మధ్యాహ్నం 2 గంటల వరకు వచ్చేస్తానన్నాను. అప్పటి వరకు నా కోసమే ఎదురుచూస్తానన్నారు. బొంగులూరు గేట్ కాడ నుంచి బైక్ మీదనే 30 కి.మీ. దూరం ప్రయాణం చేశాను. ఆ కార్పొరేట్ ఆఫీసులోకి వెళ్లగానే .. 'మీరేనా ప్రవీణ్' అని రిసెప్షనిస్టు అడిగింది. నేను అవుననడంతో 'సర్ మీ కోసమే ఎదురుచూస్తున్నారు. రండి' అంటూ రిసెప్షనిస్ట్ ఆహ్వానం పలికింది. ఎంతో గాంభీర్యంగా ఉంటారనుకున్నాను. కానీ చాలా సింపుల్‌గా ఉండడంతో ఇంత పెద్ద కంపెనీకి ఇతనేనా ఎండీ. కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న కంపెనీకి ఎండీనేనా లేక ఎంప్లాయా అన్న డౌట్ వచ్చింది. ఛాంబర్ లోకి వెళ్లగానే లేచి నిలబడి రిసీవ్ చేసుకున్నారు. ఇద్దరి మధ్య ఓ గంటకు పైగానే చర్చ సాగింది. ఆ గంట సమయంలోనే నాకు పని విలువ ఎంత? దీనికి వెల కట్టడానికి వీలవుతుందా? డబ్బుల్లో లెక్కిస్తే ఎంత? ప్రతి పని చోట కట్టే విలువ ఎంత అన్న లెక్కలు వేయాలనిపించింది. ఈ విషయాన్ని పంచుకోవాలనిపించింది.

ప్రతి ఒక్కరూ తాను చేసే పనితో సంపాదన లెక్కిస్తారు. కానీ ఆయనతో మాట్లాడిన తర్వాత పని విలువ ఓ జీవితమంత అని బోధపడింది. సంపాదనకు, సక్సెస్ కి, ఆదర్శానికి, పిల్లల పెంపకానికి, నిలబెట్టడానికి, నలుగురికి పని కల్పించడానికి, సమాజం గుర్తించేంతగా పని ప్రభావితం చేస్తుందనిపించింది. ఏ పని చేస్తున్నాం, ఎంత గొప్ప పని చేస్తున్నాం, ఏ హోదాలో చేస్తున్నాం అన్నది ప్రధానం కాదన్నదే నా అభిమతం. రూ.లక్షలు, రూ.కోట్లు సంపాదించడంలో తృప్తి పొందొచ్చు. కానీ చేసిన, చేస్తోన్న పని జీవితానికి సరిపోయేంతగా చేయాలి. అందుకే పనికి విలువ ఎంత అంటే జీవితమంతా.. జీవితం అంటే అది ఎన్ని కోట్లతో కొలమానం వేయగలం? అందుకే పని నిజంగా దైవమే.. అంతకు మించిందే!

ఆ పెద్దాయన తన గురించి కాసేపు చెప్పారు. నేను పదో తరగతి పూర్తి చేయగానే మా నాన్న చేస్తున్న వ్యాపారంలో అడుగు పెట్టాను. అంటే కుర్చీలో కూర్చోబెట్టలేదు. మేం చేసే వ్యాపారం స్టీలు అమ్మడం. లోడ్ రాగానే అన్ లోడ్ చేయించాలి. రాసుకోవాలి. ఎవరైనా కస్టమర్ వస్తే మళ్లీ కాంటా వేసి బిల్లు వేయాలి. సాయంత్రానికి నా చేతులు, కాళ్లు, ఒళ్లంతా తుప్పుతో నిండేది. మధ్యాహ్నం మా అమ్మ కట్టిన లంచ్ బాక్స్ కూడా నాతో పాటు పని చేసే కార్మికులతో పాటే కూర్చొని తినేవాడ్ని. ఇదే నా పని. రూ.లక్షల్లో టర్నోవర్ ఉండే మా నాన్న ఈ పని అప్పగించడం ఏంటి? ఏదో నెల రోజుల పాటు బిజినెస్ అర్ధం చేసుకోవడానికి అనుకునేవాడ్ని. కానీ 18 నెలల పాటు అదే పనిలో చేశాను. ఓ రోజు ఉన్నట్టుండి గదిలోకి రమ్మన్నారు. అప్పుడు తాళం గుత్తి చేతిలో పెట్టారు. తన కుర్చీలో కూర్చోమన్నారు. ఆశ్చర్యమేసింది. సడెన్‌గా తన కుర్చీలో కూర్చోవడమేంటి కాస్త భయపడ్డాను. ఏదైనా తప్పు చేశానేమో అనుకున్నాను. 'ఇప్పుడెందుకు నాన్న' అన్నాను. 'బిజినెస్ అప్పగించే రోజు వచ్చేసింది. ఇప్పుడు నువ్వు సక్సెస్ అవుతావన్న నమ్మకం కలిగిందన్నారు. మరి ఇన్ని రోజులు ఎందుకు అప్పగించలేదన్నాను. 'మనం చేస్తున్న పని గురించి పూర్తిగా తెలిసినప్పుడు సక్సెస్ కాగలం. మన దగ్గర పనిచేస్తున్న కార్మికుల కుటుంబాల గురించి నీకు తెలుసు. వాళ్లు పడుతున్న కష్టం గురించి నీకు అర్ధమైంది. అలాగే ఓ కార్మికుడు రాకపోయినా సొంతంగా నువ్వే దగ్గరుండి స్టీల్‌ని తూకం వేసి ఇవ్వగలవు. కాంటా సరిగ్గా లేకపోతే నువ్వు సరి చేసే అవగాహన వచ్చింది. పని వాళ్లను అర్ధం చేసుకోవాలంటే ఆ పని నీకు తెలిసి ఉండాలన్నారు. ఆ రోజు కుర్చీలో నన్ను కూర్చోబెట్టారు. ఇప్పటి దాకా నేను వదల్లేదు.

ఇలా ఒకటీ రెండు వ్యాపారాలు కాదు. ప్రతి బిజినెస్ లోనూ సక్సెస్ ని మా నాన్నకి చూపించాను. ఇప్పుడు నా లక్ష్యం రూ.వెయ్యి కోట్ల టర్నోవర్ కి తీసుకెళ్లడమే. ఏదో ఒక రోజు నేను ఆ స్థాయికి చేరుకుంటానన్న నమ్మకం నాకుంది. ప్రతి బిజినెస్‌కి ముందు అందులోని లోతు ఎంత అనేది తెలుసుకున్న తర్వాతే దిగుతున్నాను. అందుకే ఈ సక్సెస్ అని నేను నమ్ముతున్నా' అన్నారు. ఇదంతా ఆయన చెప్తుంటే ఇది కదా ఎవరైనా సక్సెస్ కావాలంటే తెలుసుకోవాల్సింది. చాలా గొప్ప వ్యక్తుల గురించి విని ఉండొచ్చు. కానీ పుస్తకాల్లోనూ రాసుండొచ్చు. కానీ ప్రస్తుతం కనిపిస్తున్న, చూస్తున్న వ్యక్తి ఎదుగుదలకు కారణాలేమిటో వినడం స్పూర్తిమంతమినిపించింది. ఇంతకీ ఆయనెవరో చెప్పాలనుంది. కానీ ఆయన అనుమతి లేదు. నలుగురికి తన గురించి చెప్పుకోవాలన్న కోరిక లేదు. కాకపోతే నేను ఆయనతో పని కోసం వెళ్లాను. అందుకే కాసేపు ముచ్చట పెట్టడంతో ఈ విషయాలు బయటపెట్టారు.

కొంత కాలం క్రితం మా బాబాయ్ దూర ప్రాంతం నుంచి వచ్చారు. పెళ్లిలో కలిశారు. ఏరా కొడకా.. ఏం చేస్తున్నావ్ అని అడిగారు. ఐతే ఆయన మంచి చమత్కారి. అందుకే ఆయన నోట ఏం వస్తుందో చూద్దామని.. ప్రస్తుతం ఖాళీగానే ఉన్నా బాబాయ్ అన్నాను. వెంటనే శభాష్ రా బిడ్డా.. పేరు నిలబెట్టావ్. గాడిద కూడా పని చేస్తుంది. మనం పని చేస్తే దాంతో సమానం అవుతాం కదా అన్నారు. అంత స్పాంటినియస్‌గా ఆయన గాడిదతో పోల్చే సరికి భయమేసింది. అలా ఏం కాదు బాబాయ్.. ప్రైవేటు స్కూల్లో టీచర్ గా చేస్తున్న, మరో వైపు రిపోర్టర్ గానూ పని చేస్తున్నా అని సర్దిచెప్పాను. పని విలువను ఎంత బాగా చెప్పారో అర్ధమైంది. ఓ గాడిద కూడా పని చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయొద్దన్న ఆయన భాషణం 20 ఏండ్ల తర్వాత కూడా చెప్పాలనిపించింది.

ఓపిక, శక్తి ఉన్నప్పుడు పని చేయలేకపోవడం అంటే జీవితాన్ని కోల్పోవడమే. పనిచేస్తూ ఉండడమే సక్సెస్. అదే నిజం. ఒక పని చేస్తున్నావంటే అందులో సక్సెస్ అవుతున్నట్లే కదా! ఎప్పుడైతే ఫెయిలవుతామో ఇక పని చేయలేం అన్న భావన కలుగుతుంది. కొందరు ఏ పనిలోనూ ఏడాది ఉండలేరు. ఏ ఉద్యోగంలోనూ రెండేండ్లు కొనసాగరు. దాన్ని బట్టి అక్కడా పని పట్ల ఆసక్తి సన్నగిల్లడమే కదా.. ఆ ఉద్యోగాన్ని వదిలేసి మరొకటి వెతుకుతున్నారంటే ఆసక్తి మారిందనే అర్ధం. ఒకటి ఎక్కువ డబ్బు కావచ్చు. రెండోది హోదా కూడా కావచ్చు. ఈ రెండూ కాకుండా మూడోదైతే ఉండదు. ఒక పనిలో ఇమడలేకపోతున్నామంటే.. దాని గురించి అర్ధం చేసుకోలేకపోవడమే. ఉన్నత స్థాయిలో ఉన్నోళ్లయినా, కార్మికుడైనా పని పట్ల ఆసక్తి ఉన్నప్పుడే సక్సెస్ కాగలం.

ఎవరైనా బిజినెస్ చేయాలంటే .. అంతకు ముందు మార్కెటింగ్ తెలిసి ఉండాలి. అది తెలియాలంటే వస్తు ఉత్పత్తిపైన కనీస అవగాహన ఉండాలి. అప్పుడే ఆ వస్తువును మార్కెటింగ్ చేయగలం. ఉదాహరణకు మగ్గం నేయగల నేర్పు కలిగిన చేనేత వస్త్ర వ్యాపారంలో సక్సెస్ కావడం అవకాశం ఎక్కువ. ఆ బట్ట తయారీ వెనుక ఎంత శ్రమ ఉంటుందో కస్టమర్‌కి వివరించగలరు. దానిపై అవగాహన లేని వ్యాపారులు నకిలీవి అంటగట్టి రూ. కోట్లు మూటగట్టుకునే వారు లేకపోలేదు. కానీ నిజమైన తృప్తి ఏదో వారికి తెలుస్తుంది. అలాగే సాహితీ వంటి రియల్ ఎస్టేట్ సంస్థలు ఈజీగా రూ.కోట్లు కూడబెట్టుకోవాలన్న కుట్రతో అబాసుపాలయ్యారు. వాళ్లు కూడా రూ.కోట్లు వెనుకేసుకోవచ్చు. కానీ వారి పనితో జీవితంలో మాయని మచ్చని వేసుకున్నారు. అదే నిర్మాణ రంగంపై పూర్తి అవగాహన కలిగిన అనేక మంది రూ.వందల కోట్ల టర్నోవర్‌తో రాణిస్తున్నారు. లోటుపాట్లను కస్టమర్లకు నచ్చజెప్పుకుంటూ ముందుకు సాగుతున్న వారున్నారు. వ్యాపారంలో మార్కెటింగ్, ఇన్వెస్ట్మెంట్ కంటే ముందుగా తెలుసుకోవాలన్న అంశాలను నిర్లక్ష్యం చేయడంతోనే అక్రమాల బాట పట్టిన సంస్థలు అంటూ మీడియాలో చదువుకోవాల్సి వస్తుంది. పని పట్ల నిబద్ధత లేనప్పుడు ఎందులోనూ సక్సెస్ కాలేరన్న వాస్తవాన్ని గ్రహించాలి. ఈజీ మనీకి అలవాటు పడ్డ వాళ్ళంతా ఏదో ఒక రోజు పని విలువెంతో తెలుసుకుంటారు. అప్పటికైనా తిరిగి రావాల్సిందే.

కొందరు ఎంత పని చేసినా సక్సెస్ వస్తలేదు. నాకు ఆ అదృష్టం ఇక లేదంటూ నిరాశ పడే వాళ్లున్నారు. అదృష్టం, దేవుడి దయ.. ఇలాంటివన్నీ ఫెయిల్యూర్ తర్వాత వినిపించే పదాలే. ముందు ఏ మాత్రం కాదు. అదే పని చేసేటప్పుడు శక్తివంచన లేకుండా చేస్తే ఆ పదాల అవసరం ఎంత వరకు ఉంటుంది? నేను పని చేస్తే సంస్థకే అధిక లాభం. నాకేం వస్తుంది అనుకునే ఉద్యోగులు కూడా ఉన్నారు. ఆ సంస్థ లాభాల బాటన నడిపించినప్పుడు ఆ అదృష్టం మీదే కావచ్చు. ఐతే అదృష్టం కొందరిని వరిస్తుండొచ్చు. కానీ అది కొంత వరకే పరిమితం. మనం పని చేయడం.. అది కూడా అర్ధవంతంగా పనిచేయగలగడం అవసరం. జీవితానికి అదే అనివార్యం. ఎవరైనా పనిని, కష్టాన్ని నమ్ముకోవాలి. కానీ అదృష్టాన్ని కాదు.

శిరందాస్ ప్రవీణ్ కుమార్

8096677450

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672

Advertisement

Next Story