- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేధార్‌నాథ్ నిర్మాతలు కోయరాజులేనా?
అక్టోబర్ 29, 30, 31 తేదీల్లో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్ర ప్రయోగ జిల్లాల్లో ఉన్న భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన హిమాలయాల్లోని కేదార్‌నాథ్ ఆలయం పూర్వ మూలాలపై సమ్మక్క, సారలమ్మ ఆర్కియాలజీ & ఇండిజినస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ , తెలంగాణ బృందం పరిశోధన చేయడం జరిగింది. భారతదేశ మూలం, పుట్టుక పూర్వ ద్రావిడులది అనేది పురావస్తు భాషా శాస్త్ర వేత్తల బలమైన వాదన. ఈ క్రమంలో ఉత్తర భారతదేశంలో కూడా పూర్వ మూలాలు అన్నీ ద్రావిడ మూలంలోని ఆదిమ లక్షణాలు కలిగిన కోయ సమాజానికి చెందిన మూలాలే అని నిర్ధారణ చేయడంతో పాటు కేదార్‌నాథ్ ఆలయాన్ని కోయ రాజులు నిర్మించారని శాస్త్రీయంగా నిర్దారణ చేయటం మా పరిశోధన ఉద్దేశం. అలాగే ఉత్తర భారతదేశాన్ని పాలించింది ఆర్యులు కాదు పూర్వ ద్రావిడులు అని నిరూపణ చేసే శాస్త్రీయ ఆధారాలు సేకరించటం.
తెలంగాణలోని గోదావరి పరివాహక ప్రాంతంలో ఇరువైపులా నివసించే కోయ తెగ అతి పురాతన తెగ. ఈ తెగ మూలమే భారతదేశ మొదటి జన్యువుగా పూర్వ చరిత్రను కలిగి ఉంది. కోయ సమాజంలో 3 నుండి 7 గట్లు జన్యుపరమైన విభజన మనకు కనిపిస్తుంది. అందులో మూడోగట్టు వంశంలోని బంగారు కొండ కాటూరయ్య ముఖ్యమైన వ్యక్తి. అతని పరిపాలన కాలంలో 36 కోయ రాజ్యాలు నెలకొల్పాడు. ఉత్తర భారతదేశంలో జన్యు మూలంపై నిర్దారణ కోసం మా పరిశోధన 14 రోజులు కొనసాగింది. అతని వంశమే ఈరోజు మూడవ గట్టు వంశంగా ఏర్పడిందని నిర్థారణ అయ్యింది.
నదులకు, కొండలకు పేర్లు పెట్టింది వీరే..
కోయరాజులు ఆ కాలంలో రాసిన పూర్వ తాళపత్రాలు ఆధారంగా మా ప్రయాణం ఉత్తరప్రదేశ్‌లోని హరిద్వార్ నుండి గౌరీకుండ్‌కి జరిగింది. గౌరికుండ్ నుండి కేదార్‌నాథ్‌కి 22 కిలోమీటర్ల దూరం. హిమాలయాలలో మైనస్ డిగ్రీ చలిలో కూడా రాత్రి సమయంలో దట్టమైన కొండల్లో శశి మందాకిని నది ఒడ్డు నుండి మా 17 మంది పరిశోధన బృందం కాలి నడకన మొదలై తెల్లవారి 9 గంటలకు అక్కడికి చేరుకున్నాం. శశి మందాకిని 6వ గట్టు బెరం బోయిన రాజు ఇష్టమైన చెల్లెలు కాబట్టి ఈ నదికి ఆ పేరు వచ్చింది. పూజలు చేసే సందర్భంలో మందాకిని ఈ నది నుండి నీటిని కుండలో తెచ్చి శివుడికి అభిషేకం చేసింది. కాబట్టి నదికి ఆమె పేరు వచ్చింది అంటే దేశంలో నదులకు, కొండలకు పేర్లు పెట్టింది ఆదివాసీలే అని అర్థం అవుతుంది.
బంగారు కొండగా హిమాలయం..!
ఎటు చూసినా ఎత్తైన కొండలు, పేరుకు పోయిన మంచులో మందపాటి స్వెట్టర్‌లతో మేం బృందంగా వెళ్లాం. పరిశోధన కేంద్రం సేకరించి ఉన్న తాళపత్రాలలో చూసినప్పుడు కేదార్‌నాథ్ ఆలయాన్ని కోయ రాజులు కట్టించినట్టు, ఇక్కడ మూడవ గట్టు వారు రాజ్యాలు నడిపినట్టు ఉంది. ఇక్కడ సూర్యుడు ఉదయించే సమయంలో సూర్యకిరణాలు హిమాలయ కొండలపై పడతాయి. దాన్ని చూస్తే బంగారం రంగులో త్రిభుజ ఆకారంలో కనిపిస్తుంది. 3వ గట్టు రాజు రాజ్యం బంగారు కొండ రూపంలో ఉంది కాబట్టి దానికి బంగారు కొండ కాటురయ్య అనే పేరు వచ్చింది. ఆ సూర్యోదయం వచ్చిన సందర్భంలో ఆ కొండ బంగారం రంగుతో ప్రతిబింబించడం మేము ప్రత్యక్షంగా చూశాం. ఒక పక్క మంచు పైన బంగారం రంగు ప్రతిఫలించడంతో కొండ మూలాన్ని నిర్ధారించాం.
ఎక్కడ చూసినా కోయల చిహ్నాలే...
ఈ గుడి మూడవ గట్టు వారిదని నిర్ధారణ కావడానికి గుడిలో చూసినప్పుడు శివలింగం ఎద్దు గోపురం ఆకా రంలో ఉంది. దానిపై కూడా స్పష్టంగా కోయ పూర్వ లిపి ఉంది. ఈ గుడి 3వ గట్టు రాజ్యాలు నడిచినప్పుడు కట్టించింది. తన తండ్రి కాటురుడు గుర్తుగా రెండవ కొడుకు పిడగా రాజు - ముగలమూయ కట్టించారు. బేరంబోయిన రాజు (6వ గట్టు) భార్య వరందేవిని కూడా ఇక్కడ పూజిస్తున్నారు. ఎందుకంటే మూడవ గొట్టుకి మొదటి బిడ్డను ఇచ్చినారు కాబట్టి, 6వ గట్టు వారి బొట్టు నెలవంక అందుకే వరం దేవి ఉన్న దగ్గర నెలవంక స్పష్టంగా ఉంది. గుడిలో ఎక్కడ చూసినా కోయ పూర్వ లిపి ఉంది. (గుడిలోపల ఫొటోలు తీయగూడదని నిషేధం ఉంది). గుడి పైన చూసినప్పుడు ఐదవ గొట్టును తెలియజేసే గొబ్బేను పోలిన 5 గుర్తులు, బండాని గోత్రం బొట్టు త్రిశూలం ఉంది. ఈ గుడిలో కోయ సమాజానికి ముఖ్య దేవతగా పేరు పొందిన సమ్మక్క తల్లి కూడా పూజలు అందుకుంటుంది అయిదవ గట్టు బొట్టు త్రిశూలం గుడి నిర్మాణం చూసినప్పుడు మూడవ గట్టు వారి గుర్తులతో నిర్మించబడి ఉంది, గుడి నిర్మాణానికి పేర్చిన రాయి కూడా 3 వరుసలు ఉన్నాయి, గుడి కూడా రాజ్యం గుర్తు త్రిభుజ ఆకారంలో ఉంటుంది.
దక్షిణాది దేవతల విగ్రహాలు..
అన్నిటికంటే ముఖ్యంగా కోయ గోండు రాజ్య సింబల్ ఏనుగుపై సింహం ఉంది అంటే ఇది కోయ రాజులు ఏర్పాటు చేసిందేనని అదే చెపుతుంది. దానికి పైన ఒక చిన్న గుడి ఉంది అక్కడ తుల్ మూతి, నాగులమ్మ, కాలభైరవుడు, వరం దేవి విగ్రహాలు ఉన్నాయి. పర్వతాల మీద కూడా లిపి ఉన్నట్టు నిర్ధారణ అయింది. అదే విధంగా ఇక్కడ చిత్ర లిపి రూపంలో ఆరవ గట్టు వంశం బెరంబోయిన రాజు వరాందేవి కొడుకులు పెదరాము( కొమరం) చినరాము(కట్టం), ఈదెల్ పురల్(సోలెం), మైసయ్యా (యెట్టి), దారెల్ రాజ్ (కారం)బంగారు పాపల్(పోడెం) స్పష్టంగా ఇక్కడ గుడి చిత్ర లిపి ఉన్నాయి. ఈ విధంగా కేదార్‌నాథ్ మూడవ గట్టు వారిది అని నిర్దారణ అయింది. ఇక్కడ ఉన్న ఆదివాసీలు కోయ వారే. కోటియ, బుక్ష జన్సరిస్, రాజిస్, తారస్, రంగ్ కాస్ పేర్లతో వీరు చలామణిలో ఉన్నారు. ఈ తెగలపై కూడా పరిశోధన జరగనుంది. ఈ హిమాలయ కొండల్లో అత్యంత అరుదైన ఔషధ మొక్కలు 1000 రకాలు ఉన్నట్టు గుర్తించాం.
అనాగరికులు కాదు.. నాగరికత నిర్మాతలు
ఆదివాసీలు అనాగరికులు కారని, నాగరికత నిర్మాతలు అని వీటిని బట్టి తెలుస్తోంది. ఈ దేశ భూభాగాన్ని 18 దిక్కులుగా ప్రకృతి వ్యవహరించే తీరుని బట్టి విభజన చేసి, ప్రకృతి ఆధారంగా 18 శక్తి పీఠాలు ఏర్పాటు చేసి పరిపాలన నడిపారు. పూర్వం ఈ దేశంలో 101 రాజ్యాలను కోయ గోండు రాజులు నడిపారు. ప్రస్తుత దేశంలో ఉన్న పురాతన కోటలు అన్ని కూడా కోయ రాజులు ఏర్పాటు చేసినవే, మగధ సామ్రాజ్యం నుండి మొదలుకొని గుప్తులు, మౌర్యులు, చోళులు, ఇక్ష్వాకులు, రాష్ట్ర కూటులు పరిపాలన చేసిన రాజ్యాలన్నీ పూర్వం కోయ రాజులు ఏర్పాటు చేసినవే. కాలక్రమంలో ఆర్యుల చేతిలో రాజ్యాలు కోల్పోయాక కోయలు తమ మూలా లను పట్టుకొని దట్టమైన గోదావరి లోయ అడవి ప్రాంతం లోకి వలస వచ్చి, బ్రిటిష్ కాలంలో తెగల గుర్తింపులో ఆదివాసీలుగా మారినారు. అందుకే నేడు గోదావరి పరివాహక ప్రాంతం వేల్పు జాతర పడిగ గుడ్డలో కోయ రాజుల చరిత్ర డోలీ మౌఖిక సాహిత్య రూపంలో చెప్పడం జరుగుతోంది. అది పుక్కిటి పురాణం కాదు. ఈ దేశ మూల చరిత్ర వైపుగా పరిశోధనలు జరిగిన రోజు ఇక్కడ ఇంకో వాస్తవ ఆదివాసీల చరిత్ర బయటపడి, ఈ దేశం ఆదివాసీలది అని గర్వంగా చెపుతుంది. ఆదివాసీలు అనాగరికులు కాదు చరిత్ర నిర్మాతలు అని నిర్ధారణ అవుతుంది.
నవ్య కాక, ఎంఏ ఆర్కియాలజీ
ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ, మధ్య ప్రదేశ్
93922 83453