త్యాగాల కుటుంబంపై ఇన్ని నిందలా?

by Ravi |
త్యాగాల కుటుంబంపై ఇన్ని నిందలా?
X

మీరే దేవత... మీ వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.. అంటూ ఆనాడు కుటుంబ సమేతంగా ఢిల్లీ వెళ్లి సోనియాగాంధీ కాళ్లమీద పడిన కేసీఆర్.. గంటల్లోనే మాట మార్చేశారు. దళితుడిని సీఎం చేస్తా.. అంటూ ప్లేటు ఫిరాయించారు. అందుకే కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు అది నోరా... మూసీలో కలిసే మోరా?.. అంటూ శాపనార్థాలు పెట్టారు. అధికారంలో ఉన్న పదేళ్లు అహంకారంతో విర్రవీగారు. తండ్రి సీఎం.. కొడుకు మంత్రి, బిడ్డ ఎంపీ, మేనల్లుడు మంత్రి. సడ్డకుని కొడుకు రాజ్యసభ ఎంపీ.. ఇలా కుటుంబంలో అరడజను పదవులు తీసుకున్నారు. కానీ దేశం కోసం ప్రాణాలను, పదవులను త్యాగం చేసిన గాంధీ కుటుంబాన్ని విమర్శిస్తున్నారు.

సచివాలయం ముందు రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని పెడితే జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన ప్రధాని అయ్యే టైంకు కేటీఆర్ వయసెంత?... ఆయన స్థానమేంటి?.. ఇప్పుడు తెలంగాణతో ఆయనకేం సంబంధమని విమర్శిస్తున్నారు. హైదరాబాద్‌లో హైటెక్ సిటీకి ఆద్యుడు రాజీవ్‌గాంధీయే అంటూ తన తండ్రి ఓపెన్‌గా చేసిన కామెంట్లను చూసైనా బుద్ధి తెచ్చుకోవాలి. రాష్ట్రాన్ని ఇస్తే చాలు... నాకు ఇంకేం అక్కర్లేదు... అంటూ కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీని వేనోళ్లతో కేసీఆర్ పొగిడిన మాటల్ని గుర్తుకు తెచ్చుకోవాలి. అధికారం పోగానే కాంగ్రెస్‌ను, గాంధీ కుటుంబాన్ని తిట్టడం మొదలు పెట్టారు. వారికి ఆ స్థాయి, అర్హత ఉన్నదా? ప్రధాని స్థాయిలో రాజీవ్‌గాంధీ ఐటీ టెక్నాలజీని దేశంలో ఎంకరేజ్ చేయకుంటే కేటీఆర్ ఐటీ మంత్రి అయ్యెటోడా?

త్యాగం... గాంధీ కుటుంబం డీఎన్ఏ!

దేశ స్వాతంత్ర్యం కోసం నెహ్రూ కుటుంబీకులు స్వంత ఆస్తుల్ని వదులుకున్నారు. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ రక్తాన్ని చిందించి ప్రాణాలను బలిపెట్టారు. రాజీవ్‌గాంధీ మరణం తర్వాత పదవులు తీసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నా గడ్డిపోచలాగా వదిలేసుకున్నారు. తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావుకు అవకాశం ఇచ్చారు. 1990వ దశకం నుంచీ సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలు పదవులకు దూరంగానే ఉన్నారు. త్యాగం అనేది గాంధీ కుటుంబం డీఎన్ఏ. అబద్ధాలు, మోసం, అవినీతి కేసీఆర్ ఫ్యామిలీ డీఎన్ఏ. గాంధీ కుటుంబాన్ని విమర్శించే స్థాయి ఈ కుటుంబానికెక్కడిది? దశాబ్దాల పాటు దేశాన్ని ఏలినా గాంధీ కుటుంబానికి సొంతిల్లే లేదు. పదేండ్లు రాష్ట్రంలో పవర్‌లో ఉన్న కేసీఆర్ కుటుంబానికి వందలాది ఎకరాల్లో ఫామ్ హౌజ్‌లు ఎట్లొచ్చాయి?

ఇవన్నీ రాజీవ్‌గాంధీ క్రెడిట్!

మహిళలకు స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్లు, 21వ శతాబ్దపు అవసరాలకు అనుగుణంగా ఐటీ రంగాన్ని ప్రోత్సహించడం, పంచాయతీరాజ్ చట్టాన్ని పటిష్టం చేసి గ్రామ పంచాయితీలకు నేరుగా నిధులు పొందేలా చట్టబద్ధత కల్పించడం, 18 సంవత్సరాల యువతకు ఓటు హక్కు కల్పించడం.. ఇవన్నీ రాజీవ్‌గాంధీ క్రెడిట్. దేశ సమగ్రత కోసం ప్రాణాలిచ్చాడు. అలాంటి మహనీయుడి విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠిస్తే తొలగిస్తామని, గాంధీభవన్‌కు పంపిస్తామని కేటీఆర్ అంటున్నాడు. ఆ విగ్రహాన్ని టచ్ చేసే దమ్ముందా? కేటీఆర్ లాగనే గులాబీ లీడర్లు కారుకూతలు కూస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులారా! తెలంగాణ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో మీ స్థాయి ఏంటో చూయించారు. పార్లమెంట్ ఎన్నికల్లో మీ ఔకాత్ (స్టేటస్) చూపించి కనీసం డిపాజిట్ కూడా రాకుండా చేసి గుండు సున్నా సీట్లు ఇచ్చారు. అయినా ఇంకా మీకు సిగ్గు రాలేదా?

ఆ నైతిక హక్కు మీకేది?

దళితుడే తొలి ముఖ్యమంత్రి అంటూ బీరాలు పలికి మొదటి రోజే మోసం చేసిన కేసీఆర్ పదేండ్లూ దానికే అలవాటుపడ్డారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీ లు, ఎమ్మెల్సీ.. ఇలా పదవులు పొంది రాష్ట్ర సంపదను నిలువునా దోచుకున్నారు. వేల కోట్ల రూపాయలు పోగేసుకున్నారు. వేలాది ఎకరాలను దిగమింగారు. వందలాది ఎకరాల్లో ఫామ్ హౌజ్‌లు కట్టుకున్నారు. రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టారు. భూమి లేని పేద దళిత కుటుంబాలకు మూడెకరాల సాగుభూమి అని మాట తప్పారు. పేదలకు ఇంది రమ్మ పంచిన లక్షల ఎకరాల అసైన్డ్ భూములనూ లాగేసుకున్నారు. రియల్టర్లకు క్విడ్ ప్రో క్రింద వాటిని అమ్ముకున్నారు. సాగునీటి ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్, ఆయన వంద మాగధులు, కొంతమంది అధికారులు కలిసి అవినీతికి పాల్పడ్డారు. ఇన్ని ఘోరాలకు పాల్పడి ఇప్పుడు ఇందిరాగాంధీ, రాజీవ్‌ గాంధీ కుటుంబాన్ని విమర్శించే నైతిక హక్కు వీరికి ఎక్కడిది?

అందుకే ప్రజలు గడ్డి పెట్టారు..

నిఖార్సయిన తెలంగాణ వాదులు, ఆస్తులు పదవులు త్యాగం చేసిన నాలాంటి వారినెంతో మందిని నడి మధ్యలోనే గొంతు కోసి రాజకీయాల నుంచి గెంటే శారు. నీ కుటుంబ సభ్యుల కాళ్లు పట్టి నీ బాంచెన్.. అన్నవాళ్లనే పట్టించుకున్నావ్. ఉద్యమకారుల్ని దూరం పెట్టావు. కేసీఆర్‌... అందుకే నీకు ఈ గతి పట్టింది. తెలంగాణను జాగీర్ అనుకున్నావ్.. ఇష్టారాజ్యంగా పాలన సాగించావ్... ఎల్లకాలం నీవు, నీ కుటుంబమే పాలిస్తామనుకొన్నావ్... హైదరాబాద్ ప్రగతి భవన్ గడీ మొదలు అన్ని జిల్లాల్లో ఎస్సీ/ఎస్టీల అసైన్డ్ ల్యాండ్స్‌తో సహా అన్ని ప్రభుత్వ భూములనూ కబ్జా చేసుకుని ఫామ్ హౌజ్‌లు నిర్మించుకున్నావ్... అధికారాన్ని నీ స్వార్థానికే వాడుకున్నావ్...

విగ్రహాన్ని టచ్ చేయి చూద్దాం!

రాజకీయాల్లో నేను నీకంటే సీనియర్‌ని. 1978లోనే నేను ఎంఎల్ఏను, ఆ తర్వాత మంత్రిని. మళ్లీ 1983లో నేను ఎమ్మెల్యేగా గెలిచాను. నువ్వేమో ఫుల్ వేవ్‌లో ఉన్న తెలుగుదేశం పార్టీ టికెట్ మీద పోటీచేసి ఓడిపోయావు. అప్పుడు నీ పరిస్థితి ఇప్పటి తరానికి తెలియకున్నా నాలాంటి చాలా మందికి తెలుసు. ఈ రోజు ఇన్ని లక్షల కోట్ల సొమ్ము, వేలాది ఎకరాల భూములు నీకెక్కడినుండి వచ్చాయి? ఉద్యమం తర్వాత దశాబ్దకాలంగా నాలాంటివాళ్లకు, ఉద్యమకారులకు నిద్రాహారాలు లేకుండా చేశావ్. ఇప్పుడు ఎన్నికల్లో ఓటమితో ఫామ్ హౌజ్‌కు పరిమితమయ్యావు. తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి మూడేండ్ల క్రితం బాధ్యతలు తీసుకున్ననాడే కేసీఆర్‌ను గద్దె దింపుతానంటూ గజ్వేల్ వేదికగా ఛాలెంజ్ చేశారు. రేవంత్ పీసీసీ చీఫ్ అయిననాడే కేసీఆర్‌కు సరైన మొనగాడు అని ఓపెన్‌గానే అన్నాను. ఇప్పుడు అదే నిజమైంది. దాన్ని 2023 డిసెంబరులో సాకారం చేశారు. రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని టచ్ చేస్తే కాంగ్రెస్ కార్యకర్తలే చూసుకుంటారంటూ తాజాగా హెచ్చరించారు. దీన్ని కేసీఆర్, కేటీఆర్ గమనంలోకి ఉంచుకుంటారనే ఆశిస్తున్నా..

రవీంద్ర నాయక్ ధారావత్

మాజీ ఎంపీ, మాజీ మంత్రి

83339 44944

Advertisement

Next Story

Most Viewed